అది తిరుమల
ఆనంద వైకుంఠ కోవెల
కలియుగ రాయుడి ఇల
క్షేత్రపాలకుడిగా తమరెలా...
మీరు మీరు ఒకటేనా...
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...
కనబడదా కలియుగ రాయుడి లీలా
ఎటుపాయే ప్రసాదం గోలా
కాపాలదారుడివి నువ్వే కదయ్యా
నీ కాపాలాలోను కల్తీ ఉన్నదా...
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...
నమ్మకము ఓ పక్క
నటన ఓ పక్క
పూజ ఓ పక్క
పూజా ప్రసాదానికే కల్తీ పువ్వు ఓ పక్క
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...
కమ్ముకునే పుకార్లు
చిత్తం లేని చిత్తుమాటల చికార్లు
నాలుకపై కదిలిన కల్తీ కబుర్లు
అపచారమని ఖంగుతిన్న మనసులు
అంతా మాయనా...
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...
కలియుగం చెడ్డని
పిలువకపోయినా వచ్చి నిలువునామంతో నిలబడ్డాడు ఆయన...
నిలువు నామానికి తోడు అడ్డనామాల నీవు తోడున...
మీ నామాలకే నామాలు పెట్టే నకిలీ భక్తులు పెరిగెదరు ఎందుకన్నా
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...
సనాతనపు చెట్టుకే పళ్ళు
సనాతనపు చెట్టుకే రాళ్ళు
రాళ్ళేసి పళ్ళుతినే నోళ్ళపైనే
కరుణ చూపిస్తున్నాయా నీ మూడు కళ్ళు
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...
అది ఆది అనాదిగా ఉన్న చెట్టు
ఆ చెట్టుకు విత్తు ఎవడు వేసేనో
ఆ చెట్టును ఎవడు పెంచెనో
ఆ చెట్టు చిగుళ్ళను చిదిమి వేళ్ళుతీసామని
చిందులేసే చిల్లర మనసులను చూసి
చిరునవ్వు నవ్వుతున్నావా...
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...
మనిషి కల్తీ మనసు కల్తీ
ఏది ముట్టుకున్న దాని మూలమాయే కల్తీ
ఆఖరికి మనిషి మొక్కే దేవుడి పూజా కూడా కల్తీ
ఈ కల్తీ పద్మవ్యూహంలో దేవుడు శ్రేష్ఠుడేనా...?
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...
నూతన ధర్మాలు
అధునాతన ధర్మాలు
నూతిలో నీరులా ఊరే సనాతనధర్మాన్ని చూసి
లోలోన కన్నీరు ఒలికెనయ్య...
ఈ ఒలుకు ఉలుకు పలుకులు నీ ఆటేనా
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...
దేవుడిని నమ్మనివాడు
దేవుడిని నమ్మేవాడు
దేవుడి సంపదకే ఎసరు పెడుతుంటే
ఆ దేవుడు ఏం చేస్తున్నాడయ్య...
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...