కాలప్రవాహంలో ఆరు ఋతువులు
ఒకదాని వెంట మరొకటి
వీడ్కోలు చెబుతూ వెళుతుంటాయి…
మరలా మరలా పునరావృతం అవుతాయి..
ఋతువులు పలికే వీడ్కోలు,
కావు మనసుకు అలజడులు..
కలిగించవు మనలో బాధలు..
కారణం?
అవి ప్రకృతితో పాటు మమేకం అయ్యాయి..
కానీ, మనిషి జీవితంలో ఎన్నో
వీడ్కోళ్లు చూస్తుంటాం..
కొన్ని ఆనందానిచ్చేవి..
మరికొన్ని దుఃఖాన్ని మిగిల్చేవి…
అమ్మకు గారాలపట్టి ఆడపిల్ల..
తన మమతానురాగాలు కలబోసి
పెంచిన పాప ఆ ఆడపిల్ల..
పెళ్లయిన ఆడపిల్లకు,
అమ్మ ఇచ్చే అప్పగింతలు,
ఏ అమ్మకైనా వర్షించకుండా
వుండవు నయనాలు..
అది.. అమ్మ పిల్లకు ఇచ్చే
బాధాకరమైన వీడ్కోలు..
హృదయం ద్రవించే వీడ్కోలు..
అవి .. అమ్మకు, ఆడపిల్లకు వున్న
ఆత్మీయ అనుబంధాలు..
అమ్మకు కొడుకంటే ప్రాణం..
పిల్లవాడు ఎదగాలనే ఆరాటం..
ఉన్నత శిఖరాలు చేరాలనే ఆశయం..
ఎదిగిన వాడు రెక్కలొచ్చి
విదేశాలు వెళితే అమ్మ చెబుతుంది
ఆనందపు వీడ్కోలు..
అవి .. అమ్మకు, కొడుకు వున్న
మమతాను బంధాలు…
మన జీవన గమనంలో
ఎన్నో వీడ్కోళ్లు చూస్తుంటాం..
మనసులో అనుభూతులు
పెంచుకుంటాం..
జ్ఞాపకాలను నెమరు వేసుకుంటాం..
కానీ.. కరగి పోతున్న
ఈ కాలంలో..
అమ్మకు మాత్రం తప్పవు
తన పిల్లలతో వీడ్కోళ్ళు…