సంఘమిత్ర
అశోకుడి-దేవి ల జ్యేష్ఠ పుత్రిక, మహీంద్ర చెల్లెలు అయిన ‘సంఘమిత్ర’ ఉజ్జయినిలో జన్మించింది. ఈమెకు 14 వ ఏట (క్రీ.పూ. 264లో) అశోకుడి మేనల్లుడు ‘అగ్రి-బ్రహ్మ’తో వివాహం జరిగింది. ఈ అగ్రి-బ్రహ్మ కాలక్రమేణా ఒక బౌద్ధ Arhat అయి బుద్ధుడి ధర్మప్రవచనములను ప్రజలకు ఇవ్వటం జరిగింది. ఈ నవ దంపతులకు ఒక పుత్రుడు కలిగాడు. అతని పేరు “సామనేర సుమన” (Saamanera Sumana). ఇతను కూడా కొన్నాళ్ళకు Arhat అయి మేనమామ మహీంద్ర వెంట సింహళ దేశం వెళ్లి అచ్చట బౌద్ధ ధర్మం బోధించాడు. పుత్రుడు జన్మించిన తరువాత సంఘమిత్ర తన 18 వ ఏట బౌద్ధ గురువు ‘ధర్మ పాల’ ఉపదేశంతో ‘తెరవాద బౌద్ధ’ (School of the Elders; గౌతమ బుద్ధ బోధించిన బౌద్ధ ధర్మం) ధర్మం స్వీకరించటం జరిగింది. అదే సమయంలో సోదరుడు మహీంద్ర కూడా బౌద్ధ ధర్మం స్వీకరించాడు. నిరంతర కృషితో ఆమె కొంత కాలానికి Arhant Theri (Woman Arhant) గా మౌర రాజ్యమంతా పేరొంది, చాలా కాలం పాటలీపుత్రలో నివసించింది.
సింహళ లో మహీంద్ర బౌద్ధ ధర్మ ప్రచారం విజయవంతంగా సాగుచున్నప్పుడు అయన సలహా మేరకు సింహళ రాజు ‘దేవనామప్రియ తిస్స’ ఇచ్చట స్త్రీలను భిక్షుణిలుగా నియమించడానికి సంఘమిత్రను తన దేశానికి పంపించమని అర్థిస్తూ ఒక లేఖ పంపించాడు. తన సోదరిని సింహళ కు పంపించమని రాజు తిస్స కోరికను మన్నించమని సలహా ఇస్తూ మహీంద్ర కూడా తన తండ్రికి ఒక లేఖ వ్రాశాడు.
ఈ లేఖలను చూసి అశోకుడు తన కుమార్తెను సింహళ పంపించటానికి చాలా సందేహించాడు. ఆమెను వదిలి ఉండవలసిన పరిస్థితిని గురించే ఆలోచిస్తూ మానిసిక వ్యధ అనుభవించాడు. కాని సంఘమిత్ర తన తండ్రికి తనను సింహళ పంపించమని వేడుకుంటూ “మహారాజా! తండ్రీ! నా సోదరుడు పంపించిన లేఖలో ఆ దేశంలో భిక్షుణిలుగా నియమించబడటానికి అనేకమంది మహిళలు సిద్ధంగా ఉన్నారు; ఈ కారణంగా బౌద్ధ ధర్మం మరింత ప్రాచుర్యం పొందటానికి నా సహకారం అత్యవసరం అని మహీంద్ర, రాజు తిస్స మీకు వివరించారు. ఈ కారణంగా నేను సింహళ దేశం వెళ్ళటం చాలా అవసరం” అంటూ తన కోరికను వెల్లడించింది. చివరకు తప్పని పరిస్థితిలో అశోకుడు 32 ఏళ్ల తన అనుంగ పుత్రిక సంఘమిత్రను సింహళ పంపించటానికి అంగీకరించాడు.
సంఘమిత్ర సింహళ ప్రయాణం, భిక్షుణి సంఘ
సంఘమిత్రను తీసుకువెళ్ళటానికి సింహళ రాయభారి, రాజకుమారుడు ‘అథిత’ (అతీత) పాటలీపుత్ర వచ్చారు. అశోకుడు సంఘమిత్ర వెంట అనుభవం ఉన్న 10 మంది భిక్షుణిలను (క్రీ.పూ. 246 లో) ఓడలో సింహళ పంపించటం జరిగింది. ఆమె పుత్రుడు ‘సామనేర సుమన’ అప్పటికే మేనమామ మహీంద్రతో కలిసి సింహళ లో బౌద్ధ ధర్మం ప్రచారంలో ఉన్నాడు.
భిక్షుణిలతో [ఉత్తర, హేమ, పశదపల (పాసాదేపాల), అగ్నిమిత్ర, దశిక, ఫెగ్గు, ప్రభాత, మత్త, మల్ల, ధర్మదాసి] పాటు 10 మంది మహిళా అర్చకులు, 8 మంది మౌర్య రాజవంశ స్త్రీలు (బోగుత, సుమిత్ర, సంగోత, దేవగోత, హిరుగోత, సిసిగోత, జతిందర), ఎనమండుగురు మంత్రుల కుటుంబాల స్త్రీలు, 8 మంది బ్రాహ్మణులు, మరో ఎనిమిది మంది వర్తకులు కూడా సంఘమిత్ర వెంట వెళ్లారు. వీరితోపాటు సివంగులు, పిచ్చుకలు, డేగలు, నాగజాతి పనివారు, నేతగాళ్ళు (weavers), కుమ్మరి వాళ్ళు (potters), అనేక ఇతర వృత్తులవారు కూడా వెళ్ళటం జరిగింది. అచ్చట ఆమెకు రాజు ‘తిస్స’ ఘన స్వాగతం పలికారు.
సింహళ రాజు మనవి మేరకు మహారాణి ‘అనుల’ (Anulā), మరియు రాజాస్థానంలోని కొంతమంది స్త్రీలను మహింద్ర బౌద్ధ ధర్మం లోకి ప్రవేశం కల్పించిన తరువాత సంఘమిత్ర వారిని సన్యాసినిలుగా (భిక్షుణిలుగా) నియమించింది.
కాలక్రమేణా సంఘమిత్ర అర్హత పొందిన అనేకమంది సింహళ స్త్రీలను భిక్షుణి సంఘంలో చేర్పించటం జరిగింది. తరువాత ఈ మౌర్య పుత్రిక కృషి వల్ల తెరవాద బౌద్ధ ధర్మంలో (Theravāda Buddhism) “బౌద్ధ స్త్రీ సన్యాసినుల శ్రేణి” చాలా ప్రాచుర్యం పొందింది.
గౌతమ బుద్ధ మరణానికి ముందు స్త్రీలు భిక్షణులుగా మారటానికి వీలుగా ‘భిక్షుణి సంఘం’ నెల కొల్పటం జరిగింది. దీనికి అనుబంధంగా సంఘమిత్ర సింహళలో ‘భిక్షుణి శాసన’ నెలకొల్పింది. ఆ సంస్థ ఆధిపత్యంలో వేలాదిమంది బుద్ధ ధర్మాన్ని ఆచరించే స్త్రీలు భిక్షుణిలుగా మారటం జరిగింది. సంఘ మిత్ర కృషి కొన్ని ఏళ్లకు బర్మా, చైనా, థాయిలాండ్, తదితర దేశాలలో కూడా ప్రతిధ్వనించి అచ్చట బౌద్ధ ధర్మం త్వరితగతిని వ్యాప్తి చెందింది.
సంఘమిత్ర నెలకొల్పిన ఈ సంఘం 1200 ఏళ్లకు పైగా వర్ధిల్లి క్రీ.శ. 1017లో కనుమరుగు అయిపోయింది. దీనికి ముఖ్య కారణం దక్షిణ భారతావనిని పరిపాలించే చోళ రాజులలో ఒకరైన ‘రాజేంద్ర చోళుడు.’ సనాతన ధర్మాన్ని ఆచరించే ఈ చోళ రాజు 1017లో సింహళ మీద దండెత్తి రాజధాని అనూరాధపుర ను స్వాధీనం చేసుకుని అప్పటికి ప్రాచుర్యంలో ఉన్న బౌద్ధ ధర్మ వ్యాప్తికి అడ్డుకట్ట వేయటం జరిగింది. అప్పటినుంచి చాలాకాలం సింహళలో వర్ధిల్లిన భిక్షుణి సంఘం అంతరించి పోయింది; ఫలితంగా భిక్షుణిలు కనపడలేదు.
కాని క్రీ.శ. 1753 లో సింహళ లో బౌద్ధ మహాసన్యాసి ‘Asarana Sarana Saranankara Maha Thera’ భిక్షుణి సంఘం పునఃప్రారంభించటం జరిగింది. ఈయన కృషి వల్లనే ఈ రోజున శ్రీలంకలో 400 మంది భిక్షుణిలు ఉన్నారు.
సింహళలో బోధి వృక్షం
గయలో ఉన్న మహా-బోధి వృక్షం కుడి-దక్షిణ భాగంలో ఉన్న కొమ్మ నుంచి ఒక పిలకను అశోకుడు (తన పాలనలో 22 వ ఏట) ఎంపిక చేసి దానిని సంఘమిత్రకు అందించాడు. యదార్ధానికి గౌతమ బుద్ధ తన మరణ సమయంలో బౌద్ధ భిక్షకులతో “నా మరణం తరవాత మహాబోధి వృక్షం నుంచి ఒక పిలకను వేరు చేసి దానిని సింహళ పంపించమని” కోరటం జరిగింది. ఆయన అప్పటి కోరిక ప్రకారమే సంఘ మిత్ర తన వెంట ఆ వృక్షపు పిలకను సింహళ తీసుకువెళ్ళింది. ఈ బోధి పిలకను ఒక బంగారు ఘటం లో ఉంచి సంఘమిత్ర మొదట పాటలీపుత్ర తీసుకువెళ్లి, కొద్దిరోజుల తరువాత బంగాళాఖాతం ఒడ్డున ఉన్న ‘తామ్రలిప్తి’ (Tamralipti) ఓడ రేవు చేరి అచ్చటనుంచి సముద్ర ప్రయాణం చేసి ఉత్తర సింహళ లోని ‘జంబుకోల’ [(Jambukola: అప్పటి ‘కొలొంబో’ గ్రామం’) (Colombogaon; ఇప్పటి కొలొంబో నగరం)] రేవు చేరింది. అచ్చట పైన నుడివినట్లు ఆమెకు రాజు ‘తిస్స’ ఘన స్వాగతం పలకటం జరిగింది.
తదుపరి సంఘమిత్ర, భిక్షుణిలను రాజు ‘తిస్స’, సింహళ ప్రజలు వారి వెంట ఉండి ఎంతో ఘనంగా మేళ తాళాలతో వేడుకగా అనురాధపుర ఉత్తర కోట గుమ్మం చేరారు. ఎంతో ఆర్భాటంతో బోధి పిలకను ‘మహా మేఘవన’ తోటలో ఒక మట్టి దిబ్బ మీద నాటటం జరిగింది. ఈ బోధి పిలకను నాటే కార్యక్రమం రాజు తిస్స ఆధ్వర్యంలో చాలా ఆర్భాటంగా జరిగింది. ఆయనతో పాటు ప్రముఖ రాజ కుటుంబీకులు ‘కాజర గామ’ (Kājaragāma), ‘చందనగామ’ (Candanagāma), ‘త్రివిక్ర’ (Tivakka/Trivikra) కూడా ఉన్నారు. వీరందరు ఈ కార్యక్రమాన్ని సంఘమిత్ర, మహీంద్ర సమక్షంలో నిర్వహించారు. బోధి వృక్ష పిలక నాటి నప్పుడే దాని సమీపంలో గౌతమ బుద్ధ విగ్రహం కూడా రాజు తిస్స నిర్మించటం జరిగింది.
కొన్ని నెలలలోనే ఈ పిలక 8 వ్రేళ్ళు వేసి పెద్దది అయి, పుష్పించి, కాయలు కాచి, చివరకు విత్త నాలు ఏర్పడ్డాయి. చిన్న మొక్కలను వేరు చేసి వాటిని కొలొంబో గ్రామం సమీపంలో ఉన్న ‘త్రివిక్ర’ గ్రామంలో నాటడం జరిగింది. మరికొన్ని మొక్కలు చైత్యగిరి (Caitiyagiri), కాజరాగ్రామం (Kājaragāma), చందనగ్రామం (Candanagāma) లలో నాటబడ్డాయి.
అనురాధపుర లో ఉన్న బోధి వృక్షాన్ని పోషించటంలో రాజ కుటుంబీకులు శతాబ్దాల పాటు అత్యంత జాగ్రత్తలు తీసుకోవటం జరిగింది. ఈ వృక్షానికి దగ్గరలోని కాలక్రమేణా ఒక గ్రామం ఏర్పడింది. ఈ గ్రామస్థులే దాని రోజువారీ సంరక్షణ నిర్వహిస్తారు. క్రీ.పూ. 245 లో భారతదేశంలోని ‘గయ’ పట్టణం లో ఉన్న బోధి వృక్షం నుంచి వేరుచేయబడి, నాటబడిన ఈ పిలక పెరగటం కోసం అనేక మంది తగిన జాగ్రత్తలు తీసుకున్నారు; అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఈ రోజుకూ!!
‘మహామేఘవన’ తోటలో నాటబడిన బోధి పిలక (క్రీ.శ.) 1907 లో 32 అడుగుల ఎత్తు పెరిగి, 8.17 అడుగుల చుట్టుకొలతతో దేదీప్యమానంగా విరాజిల్లింది. ఈ వృక్షం, అచ్చట నిర్మించబడిన పుణ్య క్షేత్రాన్ని పరిరక్షించటానికి చుట్టూ 61 అడుగులు పొడవు, 57 అడుగుల వెడల్పు, 21 అడుగుల ఎత్తు ఉన్న గోడ నిర్మించబడింది. ఈ ఆవరణలో ఈ బోధి వృక్షంతో పాటు, మరో 10 మర్రి జాతుల వృక్షాలు కూడా ఉన్నాయి. ఈ చారిత్రిక బోధి వృక్షం గురించి బ్రిటిష్ చరిత్రకారుడు H.G. Wells వ్యాఖ్యానం ఇలా ఉంది:
“ప్రపంచంలో అతి ప్రాచీనమైన వృక్షం ఈ రోజుకూ సింహళ (Ceylon) లో పెరుగుతూ ఉంది.” కాలక్రమేణా పెరిగి పెద్దదయిన ఈ బోధి వృక్షం ఈ రోజుకు కూడా (ఇప్పటికి 2,467 ఏళ్ళు) పర్యాటకులను కనులవిందు చేస్తూ ఉంది.”
సంఘమిత్ర మరణం
అశోకుడి గారాల పట్టి, 47 ఏళ్ల పాటు అనేకమంది స్త్రీలను భిక్షుణిలుగా మార్చి సింహళ లో బౌద్ధ ధర్మ వ్యాప్తికి ఎనలేని కృషి చేసిన సంఘమిత్ర క్రీ.పూ. 203 లో తన 79 వ ఏట ఈ లోకాన్ని వీడి వెళ్ళింది.
ఈ 47 ఏళ్లలో ఒక్కసారి కూడా తిరిగి పాటలీపుత్ర వెళ్ళలేదు, తనను ఎంతో ప్రేమించే తన తండ్రి అశోక మహారాజును దర్శించలేదు! ఆమె మరణం అప్పటి సింహళ రాజు ‘ఉత్తియ’ (Uttiya) పాలనా కాలంలో అనురాధపురలోని ఆమె స్వగృహంలో సంభవించింది. ఆమె ఉత్తర క్రియలు రాజు ఉత్తియ నిర్వహించటం జరిగింది. దహన కర్మకాండ ఆమె కోరున్నట్లుగానే బోధి వృక్షం ఎదురుగానే జరిగింది. వారం రోజులపాటు సింహళ ప్రజలు మౌనం పాటించారు. ఆమె అస్థికలు ఉంచిన చోట రాజు ఉత్తియ ఆమె స్థూపం నిర్మించటం జరిగింది.
అశోకుడి తరువాత పరిపాలించిన మౌర్య రాజుల గురించి వచ్చే సంచికలో తెలుసుకుందాము.
మీ అభిప్రాయాలు, స్పందన తెలియజేసేందుకు ఈ మెయిల్: dr_vs_rao@yahoo.com