“లల్లీ వారం రోజులు సెలవులు వస్తున్నాయి. ఎక్కడికైనా ప్రోగ్రాం వెయ్యి. హాయిగా తిరిగి వద్దాం.” అంది వినీత.
“ఊటీ వెళదామా?” అడిగింది లలిత.
“వర్షాకాలంలో ఊటీ ఏమిటి?” అడిగింది మాధవి.
“ఏదైనా హిల్ స్టేషన్ కి వెళదామా?” అంది వినీత.
“వద్దే బాబూ, ఆ దారిలో వర్షానికి కొండచరియలు విరిగి పడితే కష్టం.” చెప్పింది లలిత.
“మరేం చేద్దాం?” అడిగింది వినీత.
“నేనొక ఐడియా చెప్తాను. కొత్తగా, సరదాగా ఉంటుంది.” అంది మాధవి. “మా ఊరు వెళ్దాం.”
“మీ ఊరా?” ఆశ్చర్యంగా అడిగారు వినీత, లలిత.
“మీరెప్పుడూ పల్లెటూరు వెళ్ళలేదు కదా, ఈ వర్షాకాలంలో పల్లెలు చాలా బాగుంటాయి. మీరు ఎంజాయ్ చెయ్యకపోతే అప్పుడు అడగండి.” చెప్పింది మాధవి.
“ఏం చెయ్యాలో చెప్పు.”
“మీకు ఏం కావాలో ఆ వస్తువులు, బట్టలు తెచ్చుకోండి చాలు” చెప్పింది మాధవి.
ఈసారి ఇలా ఎంజాయ్ చేద్దాం అనుకుంటూ బయలుదేరారు లలిత, వినీత.
************
బస్ దిగి ఒక కిలోమీటరు దూరం నడవాలి. అప్పుడొకటి ఇప్పుడొకటి ఆటోలు నడుస్తున్నా నడిచే వెళదామనుకున్నారు ముగ్గురూ. జీన్ ఫాంట్లు, టీ షర్టులు, వీపుమీద బ్యాగులు, కళ్ళజోళ్ళు, చెవిలో బ్లూ టూత్ లతో ఆధునికంగా మాధవితో దిగిన ఇద్దర్నీ ఆశ్చర్యంగా చూస్తూ, “మాధవీ, ఎవరే?” అన్నారు ఆసక్తిగా గ్రామస్తులు. “నా స్నేహితులు” అని మాధవి బదులిచ్చింది.
రోడ్ కి అటు ఇటు పొలాలు, కొన్ని దమ్ములు పట్టి, కొన్ని దున్ని ఉన్నాయి. కొన్నిటిలో నాట్లు పూర్తి అయ్యాయి. ప్రకృతి సహజమైన చల్లటి గాలిని ఎంజాయ్ చేస్తూ, కబుర్లు చెప్పుకుంటూ, దారిలో పలకరించిన వారికి సమాధానం ఇస్తూ మాధవి వాళ్ళ ఇల్లు చేరారు. ఇంట్లో ఉన్న అందరినీ పరిచయం చేసింది మాధవి. తాతయ్య, నాయనమ్మ, మాధవి తల్లి జయమ్మ, తండ్రి నారాయడు, అన్న శేఖర్, ఈమధ్యనే పెళ్లి అయ్యి కాపురానికి వచ్చిన వదిన సునీత అందరూ చనువుగా పలకరించారు లలిత, వినీతలను. మాధవి తన గదిలోకి తీసుకువెళ్లింది స్నేహితులను.
మాధవి వాళ్ళ వదిన సునీత వచ్చి అందరినీ టిఫిన్ చేయడానికి రమ్మని చెప్పింది. మాధవి, లలిత, వినీతలకు ప్రత్యేకంగా అల్లం, జీలకర్ర వేసి నేతితో కాల్చిన పెసరట్లు తీసుకువచ్చింది మాధవి అమ్మ జయ. ఇంట్లో మిగిలిన వారందరూ రాగిపిండితో చేసిన జావ లాంటి పదార్ధాన్ని గిన్నెలో వేసుకుని తాగుతున్నారు. మాధవి తాతయ్య గిన్నెలో ఉన్న జావను చేతితో తీసుకొని తాగుతున్నారు. రెండో చేతిలో బెల్లం ముక్కను పట్టుకొని అప్పుడప్పుడు కొరుకుతున్నారు. బయట వరండాలో నలుగురు పనివాళ్ళు కూడా అదే తింటున్నారు. లలితకు అర్ధం కాలేదు. “మాధవీ! మీ ఇంట్లో అందరూ తినేది లేదా తాగేది ఏమిటి?” అని అడిగింది.
“అది రాగి పిండితో చేసిన అంబలి. రాగిపిండినే చోడి పిండి అని కూడా అంటారు. పొలంలో పనిచేసేవాళ్లకు తగినంత శక్తిని ఇస్తుంది ఈ అంబలి. దానికి తోడు బెల్లం ఉండాలి.” చెప్పింది మాధవి.
“మీవి నాజూకు తిళ్ళు అమ్మా. మేం బలంగా తింటాం, కష్టించి పనిచేస్తాం. ఆ పనికి తగ్గ తిండి ఉంటేనే శక్తి వస్తుంది. మీరు మా తిండి తినలేరని మీకు పెసరట్లు పోసాను” చెప్పింది మాధవి అమ్మ.
“అయ్యో! మాకోసం ప్రత్యేకంగా చెయ్యొద్దు ఆంటీ. మీరు తినేవే పెట్టండి. మాకు కూడా కొత్తగా ఉంటుంది.” అంది వినీత.
ఉదయం ఫలహారాలు అయిన తర్వాత ఊరు చూడటానికి మాధవితో కలిసి బయలుదేరారు లలిత, వినీత. దారి పొడుగునా పలకరింపులు, పరిచయాలు చేసుకుంటూ, పొలాల దగ్గరకు వచ్చారు. రైతులు దుక్కి దున్నడాన్ని, స్త్రీలు నాట్లు వేయడాన్ని ఆసక్తిగా గమనించారు. కొందరు నడివయస్సు దాటిన స్త్రీలు చీరను కచ్చపోసి కట్టుకున్నారు. జాకెట్లు లేవు. కొందరు మామూలుగా చీర కట్టినా, పొలంలో బురద అవకుండా కుచ్చిళ్ళను వెనుకవైపుగా దోపుకున్నారు. ఒకరిద్దరు స్త్రీలు ఏదో పాట పాడుతూ నారు కట్టలను అందరికీ అందిస్తున్నారు. ఆ దృశ్యం చూడ ముచ్చటగా ఉంది. మరి కాస్త ముందుకు వెళ్ళి పొలం గట్లపై నడవబోయారు. కానీ వారి ఎత్తుజోళ్ళ మూలంగా జారి పడబోయారు లలిత, వినీత. ఎలాగో నిలదొక్కుకొని జాగ్రత్తగా ఇంటికి చేరారు.
మధ్యాహ్నం వంకాయ కూర, ఉలవచారు, పాలను కాచి, కుండలో తోడు పెట్టిన మీగడ పెరుగు, వాటికి తోడు తెలకపిండి వడియాలతో తామెప్పుడూ రుచి చూడని, ఊహకు అందని పదార్ధాలతో, వంటకాలతో భోజనం చేశారు.
“ఆంటీ! బ్లాక్ గా, రౌండ్ గా, కాస్త కారంగా ఉంది. పెరుగన్నంతో తిన్నాము. అదేమిటి?” అడిగింది వినీత.
“అది ఊరుబిండి లేదా తెలకపిండి వడియం. నువ్వులపప్పు నుంచి నూనె తీసిన తర్వాత పై పొట్టు అంతా అచ్చులుగా తయారవుతుంది. ఆ అచ్చులను ముక్కలు చేసి, ఒక రోజంతా నీటిలో నానబెట్టి ముద్ద చేస్తారు. ఆ ముద్దలో పచ్చిమిర్చి, వాము, వెల్లుల్లి, ఉప్పు బాగా దంచి కలుపుతారు. ఒకరోజు ఊరనిస్తారు. మర్నాడు కావాలిన సైజ్ లో బిళ్ళలుగా చేసి ఎండలో ఎండబెడతారు. అవే వడియాలు.” చెప్పింది జయమ్మ.
“వీటిలో బి విటమిన్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఉదయం తాగిన రాగి అంబలితో బెల్లం లో ఐరన్ ఉంటుంది. రక్తంలో ఐరన్ శాతం పెరిగితే ఆక్సిజన్ ని ఎక్కువగా గ్రహించగలుగుతుంది. అప్పుడు త్వరగా అలసిపోవడం జరగదు.” చెప్పింది మాధవి.
“ఓహ్ చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి మీ భోజనంలో” చెప్పారు లలిత, వినీత.
“ఇంకా ఉలవచారు కిడ్నీలో రాళ్లు చేరకుండా చేస్తుంది.” చెప్పింది సునీత. “అందుకే వారానికి ఒకసారైనా ఉలవచారుతో అన్నం తింటాం”
“సూపర్ సిస్టర్. ఇవన్నీ మేము ఫోటోలు తీసుకుంటాం” అని ఆ భోజన పదార్ధాల ఫోటోలు తీసి, తయారీ విధానం, వాటి ఉపయోగాలు కూడా తమ తమ సామాజిక మాధ్యమాలలో పంచుకున్నారు స్నేహితురాళ్లు.
సాయంత్రం వరకు కాసేపు కబుర్లు చెప్పుకొని, పల్లెటూరి ఆటలు ఆడి కాలక్షేపం చేశారు. ఆ రాత్రి భోజనాల సమయంలో మాధవి వాళ్ళ నాన్న “మర్నాడు తమ పొలంలో నాట్లు వేస్తున్నారు” అని చెప్పారు.
“త్వరగా లేచి వెళ్లి చూద్దామని“ మాధవి చెప్పింది. ఉదయం లేచి, తమ పద్దతులలో తయారై మాధవితో బయలుదేరారు లలిత, వినీత. పొలంలో నాట్లు వేయడం ముందురోజే చూసారు కాబట్టి, ఈరోజు కూడా కాసేపు పరిశీలించి, తాము కూడా వేస్తామన్నారు. జీన్ ఫాంట్లతో పొలాల్లోకి దిగితే బురద అయిపోతాయి కాబట్టి మాధవి ఒక ఉపాయం చెప్పింది. ఆ ప్రకారంగా ఇంటికి వెళ్లి, పల్లెకట్టు చీరలో దానికి తగిన అలంకరణలో తయారై పొలం వెళ్లారు లలిత, వినీత. పొలంలో నాట్లు వేశారు. పల్లె అందాలతో పాటు పల్లె పడుచులుగా తమ అందాలను కూడా ఫోటోలుగా భద్రపరచుకున్నారు.
మధ్యాహ్నం జయమ్మ, సునీత అందరికి అక్కడికే భోజనాలు తీసుకువచ్చారు. మిరప పళ్ళు, చింతపండు, ఉప్పు, బెల్లంతో చేసిన కొరివికారం, వేడి అన్నం, నెయ్యి, చారు, పెరుగు, ఆవకాయ లతో భోజనం చాలా నచ్చింది వారికి.
సాయంత్రం ఇంటికి వెళ్లేసరికి అలిసిపోయారు. త్వరగా భోజనాలు చేసి నిద్రపోయారు. మర్నాడు నిద్ర లేచేసరికి లలిత, వినీతలకు ఒళ్ళు నొప్పులుగా అనిపించాయి. “అలవాటు లేని పనులు, తిండి వలన అలా ఉందని, సాయంత్రానికి అన్నీ సర్దుకుంటాయని, ఆ రోజుకు ఇంట్లో విశ్రాంతి తీసుకోమని చెప్పి, జయమ్మ, సునీత లతో సహా అందరూ పొలానికి వెళ్లిపోయారు.
“తొలకరి వర్షం పడింది మొదలు, ఎండిన మడిలోకి స్వాభావిక ఎరువులను తోలడంతో రైతు పని మొదలవుతుంది. తర్వాత ఒక వర్షం పడగానే, ఒక మూల నారుమడి కోసం సిద్ధం చేసి, వరి విత్తనాలు జల్లుతారు. మొలకలు వచ్చిన పది, పన్నెండు రోజుల్లో, మిగతా పొలానికి నీరుపెట్టి, ఎడ్లు లేదా ట్రాక్టర్ తో దున్ని, నిన్న మీరు నాట్లు వేసినట్లు వేస్తారు. కొన్ని రోజులకు పంట మధ్యలో పెరిగే కలుపు మొక్కలు తీసివేస్తారు. పంటకు పురుగులు, తెగుళ్లు వచ్చాయేమో పరిశీలిస్తారు. నీరు సరిపోకపోతే మోటారు ద్వారా నీరు పెడతారు. ఎరువులు వేస్తారు.
చేనంతా కంకులు వేస్తుంది. పశువులు తినకుండా కాపలా కాయాలి. గింజల్లో పాలుపోసుకోవడం మొదలవుతుంది. పిట్టలు, మిడతలు రాకుండా చూసుకోవాలి. గింజ గట్టిపడి, పైరంతా బంగారు రంగులో మారుతుంది. మొత్తం పంట బాగా పండాక, కోత కోస్తారు. చిన్న చిన్న కుప్పలు పెడతారు. నాలుగురోజులు మడిలోనే ఉంచి, అప్పుడు కల్లంలో కుప్పలు వేస్తారు. అందరి కోతలు పూర్తి అయ్యాక, కుప్పల నుంచి కోసిన మొక్కలు బయటకు తీసి ఎడ్లు లేదా ట్రాక్టర్లుతో నూర్చుతారు. గింజలు, గడ్డి వేరువేరవుతాయి. గడ్డిని కుప్పలు వేసి, గింజలను చేటల్లో వేసి గాలిబోస్తారు. అప్పుడు గట్టిగింజలుఒక కుప్పగా మారి, పొల్లు అంతా బయటకు పోతాయి. ఆ గట్టి గింజలే ధాన్యం. ఇంట్లో వాడుకకు ఉంచుకొని, మిగతా ధాన్యాన్ని అమ్మేస్తారు. జూన్ మొదలు జనవరి వరకు రైతు కష్టపడితే మనం అందరం సంవత్సరం అంతా హాయిగా భోజనం చేస్తున్నాం. ప్రకృతి కూడా కరుణించాలి. కోతలు, నూర్పుల సమయంలో తుఫానులు రాకూడదు.” వివరంగా చెప్పింది మాధవి.
ఒక్కరోజు పని చేస్తేనే ఒళ్ళు నొప్పులు వచ్చాయి తమకు. చిన్న పిల్లల దగ్గర నుండి పండు ముసలి వరకు అందరూ పొలంలో కష్టపడటం చూసారు. వారి శ్రమకు చేతులెత్తి దండం పెట్టాలనిపించింది లలితకు, వినీతకు.
“పురుగులు, చీడలు, తెగుళ్లు వచ్చి పంట పాడైపోతుంది, ఒక్కో ఏడు వర్షాలు సరిగ్గా పడవు. ఒక్కో ఏడు తుఫాన్ చుట్టేసి పంట పాడైపోతుంది. ఒక్కోసారి కలుపు ఎక్కువ అవుతుంది, మరోసారి విత్తనాలు నాణ్యమైనవి రాకపోవడంతో సరిగ్గా పంట దిగుబడి రాదు. పెట్టిన పెట్టుబడి రాకపోగా అప్పులు ఎక్కువైపోతాయి. అందుకే చాలామంది అప్పులు తీర్చలేక భూములు అమ్ముకుంటున్నారు. కొందరు రియల్ ఎస్టేట్ కు ఇచ్చేస్తున్నారు. మరికొందరు వాణిజ్య పంటలు వేస్తున్నారు. రైతుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. చూడటానికి పల్లె పచ్చగా, తల్లిలా ఆదరిస్తుంది. దానివెనుక ఇక్కడి శ్రమజీవుల కష్టం ఉంది.” వివరించింది మాధవి.
“నిజమే” నన్నారు స్నేహితురాళ్లు. మాధవి చెప్పినట్లు గానే ఐదు రోజులు చాలా ఆనందంగా పచ్చని పల్లె తల్లి ఒడిలో సేద తీరి, ఎన్నో కొత్త రుచులు చవి చూసి, అనేక అనుభూతులు మూట కట్టుకొని స్వస్థలాలకు బయలుదేరారు లలిత, వినీత.
“పల్లెలు మన జాతి పట్టుగొమ్మలు. పల్లెలు, రైతులు, పంటలు లేకపోతే మన పరిస్థితి ఏమిటి? వీలైతే మీరు కూడా ఓసారి పల్లెకు వెళ్ళండి. మీకు చేతనైన చేయూత నివ్వండి” అంటూ సాంఘిక మాధ్యమాలలో లలిత, వినీత పంచిన చిత్రాలకు అనూహ్య స్పందన లభించింది.
రైతు కష్టము చూడగా ప్రజల కొరకు
పాడి పంటలు పెంచగా ఓడె బ్రతుకు
చల్లనైనటి పల్లెన శ్రమకు విలువ
చేతులెత్తి మొక్కగ తెలియు సేవ విలువ
చాలా చాలా ధన్యవాదాలండీ