Menu Close
జ్ఞానోదయం (కథ)
-- లింగంనేని సుజాత --

కారు అంతర్జాతీయ విమానాశ్రయం ముందు ఆగింది. గోపీ, అతని తల్లిదండ్రులు, చెల్లి, నాయనమ్మ కారు దిగారు.

గోపీ! నీవు అమెరికా వెళ్లిన వెంటనే ఫోను చేయి. నీకు డబ్బు కావలసి వస్తే మామయ్యను అడిగి తీసుకో. నీవు కష్టపడి చదివి ఎం.ఎస్. మంచి మార్కులతో పాసవ్వాలి. చదువే ఊపిరిగా బ్రతకాలి అని తండ్రి రాజు అన్నాడు.

అలాగే నాన్నా! అంటూ అందరికీ టాటా చెప్పి గోపీ విమానాశ్రయం లోనికి నడిచాడు.

విమానం ఆకాశంలో వెళుతుంటే గోపీ మనసు గతంలోకి వెళ్ళింది.

*******

గోపీ మీ రిజల్ట్స్ వచ్చాయి కదా! నీవు అన్ని సబ్జెక్టులు పాసయ్యావా? అని అడిగాడు రాజు.

లేదు నాన్నా! మొదటి సంవత్సరం లో లెక్కల పరీక్ష పాసవలేదు. రెండవ సంవత్సరం కోర్సులో ఒక సబ్జెక్టు పాసవలేదు.

ఏం? ఎందుకు పాసవలేదు? చదవకుండా ఏం చేస్తున్నావు?....

ఊరికే అరవకండి. నాకు లెక్కలు రావు. నేను ఇంజినీరింగు చదవను అని నేను మొదటే చెప్పాను. ఏదైనా డిగ్రీ కోర్సులో చేరి చదువుతానన్నాను. మీరే ఇంజినీరింగు చదవాల్సిందేనని పట్టుపట్టి నన్ను ఇంజినీరింగులో చేర్పించారు.

నాకు ఇష్టం లేని చదువు, నాకు రాని లెక్కలతో నేను బాధపడుతున్నాను. నేను చదువు మానేసి బిజినెస్ చేస్తాను. పెట్టుబడికి డబ్బు ఇవ్వు నాన్నా! ...

మతి ఉండే మాట్లాడుతున్నావా? నీవు ఇంజినీరింగు పాసయితే, అమెరికాలో ఉన్న మీ మేనమామ నిన్ను ఎం.ఎస్. చదివించి, ఉద్యోగం ఇప్పిస్తానన్నాడు. నీవు చదువు మానేసి బిజినెస్ చేస్తాను అంటావేమిటి?

ఆ... నీవూ, అమ్మ చదివి గవర్నమెంట్ ఉద్యోగాలు చేసి ఏం ఆస్తులు సంపాదించారు? మీ అన్న రామం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి కోట్లు సంపాదించాడు. నేనూ బిజినెస్ చేస్తాను...పెట్టుబడికి డబ్బు ఇవ్వు నాన్నా! మళ్ళీ అన్నాడు గోపి.

' నా దగ్గర డబ్బు లేదు '...

ఊరిలో ఉన్న పొలం అమ్మి డబ్బు ఇవ్వు.

అది నాది కాదు మా అమ్మ పొలం. నీకు నిండా ఇరవై సంవత్సరాల వయసు లేదు. నీవు బిజినెస్ చేస్తాను అంటే నిన్ను నమ్మి నేను డబ్బు పెట్టుబడి పెట్టలేను అన్నాడు రాజు.

నేను మర్యాదగా అడుగుతుంటే నా దగ్గర డబ్బు లేదు అంటున్నావు. ఆస్తిలో నా వాటా నాకు పంచి ఇవ్వు అన్నాడు గోపి తండ్రి వైపు కోపంగా చూస్తూ...

అప్పటి వరకు వాళ్ళ సంభాషణ వింటున్న రాజు తల్లి యశోదమ్మ లేచి మనుమడు దగ్గరకు వచ్చి, వాడి కళ్ళ లోకి చూస్తూ...ఇంతవరకు నీవు మీ నాన్నతో మాట్లాడిన మాటలు విన్నాను.

మీ అమ్మ నిన్ను అతి గారాబంగా పెంచడం వలన మనిషి ఆరడుగుల ఎత్తు పెరిగావు. కానీ బుద్ధి పెరగలేదు. మీ అమ్మా, నాన్నా కష్టపడి ఉద్యోగాలు చేసి, మిగిల్చిన డబ్బు లక్షల రూపాయలతో, నిన్ను ఇంజినీరింగు చదివిస్తున్నారు. అది చదివి పాసవ్వలేని వెధవవి, నీవు బిజినెస్ చేస్తావా?...

మీ నాన్న చిన్నతనంలో ఎంత కష్టపడి చదువుకున్నది నీకు చెప్పినట్టు లేదు. నేను చెపుతా విను...

నీవు చూసావుగా మన ఊరు. మీ నాన్న చిన్నతనంలో ఆ ఊరికి రోడ్డు కూడా సరిగా ఉండేది కాదు. మీ తాతకు కొంత పొలం ఉండేది. ఇంటిలో కోళ్ళు, గొర్రెలు, బర్రె గొడ్లు ఉండేవి. పొద్దున లేచి మీ తాత పొలం వెళితే, మీ నాన్న, మీ పెదనాన్న, తండ్రితో పాటు పొలం వెళ్లి, పచ్చగడ్డి తెచ్చేవారు.

నేను బర్రె గొడ్ల పాలు తీసి ఇస్తే, మీ పెద్ద నాయన పక్క ఊరికిపోయి, టీ అంగళ్ళకు పాలు పోసి వచ్చేవాడు. నేను ఇంటిలో ఉన్న కూరగాయ పాదులకు, మొక్కలకు, చెట్లకు, నీళ్ళు పోస్తుంటే, మీ నాన్న నా వెనకే తిరుగుతూ సాయం చేసేవాడు. కోళ్ళతో, గొఱ్ఱెలతో ఆడుకునేవాడు. నేను పెట్టిన చద్దన్నం తిని మీ పెదనాన్న, మీ నాన్న స్కూలుకు వెళ్ళేవారు. మరల సాయంత్రం స్కూలు నుండి వచ్చిన తర్వాత బర్రె గొడ్లు, గొర్రెలను మేపుతూ...తండ్రి చేసే పనుల్లో సాయం చేసేవాళ్ళు.

మీ పెదనాన్న రామం హైస్కూలు చదువు ముగించాడు. స్కూలుకు వేసవి సెలవలు ఇచ్చారు.

**********

నాన్నా! కాలేజీలు తెరవగానే, నేను కాలేజీలో చేరి చదువుకుంటాను. ఫీజు కట్టాలి. డబ్బు బాగా ఖర్చు అవుతుంది అన్నాడు రామం.

మనకు పొలం మీద వచ్చే ఆదాయం చాలదు. ప్రభాకర మామయ్య ఇటుక బట్టీలు పెట్టి, ఇటుకలు కాల్చి అమ్ముతున్నాడు గదా! ఆయన దగ్గరకు నిన్న వెళ్లి  వివరాలు తెలుసుకుని వచ్చాను. మనం కూడా ఇటుక బట్టీ పెట్టి డబ్బు సంపాదిద్దాము. దానికి పెట్టుబడికి డబ్బు ఇస్తావా? అన్నాడు రామం...

మీరు చదువుకుంటానంటే డబ్బు ఎంతైనా ఖర్చు పెడతాము. నా మెడలో బంగారు నగలు తీసి ఇస్తాను. ప్రస్తుతం అవి బ్యాంకులో పెట్టి, డబ్బు తెచ్చి మీ పని మొదలు పెట్టండి అంది యశోదమ్మ. ఆ విధంగా ఇటుకల బట్టీ పెట్టి, దాని మీద వచ్చిన ఆదాయంతో, రామం, రాజు చదువుకున్నారు.

రామం బి.ఏ. పాసయిన తర్వాత ఒక కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. అక్కడ జీతం తక్కువగా ఇస్తున్నారని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం మొదలు పెట్టాడు. అదృష్టం బాగుండి బాగా డబ్బు సంపాదించాడు.

రాజు బి.ఏ. పాసయిన తర్వాత ఎం.ఏ., ఆ తర్వాత బి.ఇడి. చదివి పాసై, ఒక ప్రైవేటు స్కూల్ లో ఉపాధ్యాయుడుగా ఉద్యోగంలో చేరాడు. అయినా ఇటుక బట్టీలు పెట్టి డబ్బు సంపాదించేవాడు. కొంత కాలానికి రాజుకు గవర్నమెంటు స్కూల్లో  మంచి ఉద్యోగం వచ్చింది. జీతం బాగా పెరిగింది.

***********

రాజు తనలాగే ఉద్యోగం చేసే అమ్మాయినే పెళ్ళి చేసుకోవాలనుకున్నాడు. కానీ మీ తాత, నేను మా కూతురు బిడ్డ నీలిమను పెళ్ళి చేసుకోమంటే, మా మాటను మన్నించి మీ అమ్మను పెళ్ళి చేసుకున్నాడు. ఆ తర్వాత మీ అమ్మను చదివించాడు. నీవు పుట్టిన తర్వాత...నన్ను మీ తాతను తీసుకు వచ్చి, తన ఇంటిలో ఉండి పొమ్మన్నాడు.

మీ నాన్న, నన్ను మీ తాతను ఎంతో గౌరవించేవాడు. ప్రతి రోజూ ఏదో ఒక పండు తెచ్చి, తినమని మాకు ఇచ్చేవాడు. ఇంత మంచి కొడుకును కన్నందుకు నేను మీ తాత ఆనందంతో పొంగి పోయేవారం. మీ తాత పోయిన తర్వాత నన్ను, మీ అమ్మా నాన్నా కంటికి రెప్పలా కాపాడుతున్నారు. అంత మంచి తల్లిదండ్రుల కడుపున నీవు ఎలా పుట్టావో నాకు అర్ధం కావడం లేదు. అమ్మా, నాన్న అంటే మన కళ్ళకు కనపడే దేవతలు.

మీ నాన్న నిన్ను ఎంతో ప్రేమతో పెంచితే, ఈ రోజు ఆయనకు ఎదురు తిరిగి, ఆస్తి పంచమని అడుగుతావా? ఊరిలో ఉన్న పొలం నా పేరు మీద ఉంది. ఆ పొలం నా తదనంతరం మీ పెద్ద నాన్న, మీ నాన్న తీసుకుంటారు. నీకు దాని మీద ఏ హక్కు లేదు.

నీకు లెక్కలు రాకపోతే, ట్యూషన్ చదువు. ఈ ఇంటిలో నేనే పెద్ద దానిని. నా మాట విను. మీ నాన్నను క్షమించమని అడుగు అంది యశోదమ్మ.

**********

నీలిమ కొడుకు చేతులు పట్టుకుని, గోపీ! మీ నాన్న మనసును సరిగా అర్థం చేసుకోకుండా... నాన్నకు ఎదురు తిరిగి మాటలాడుతావా?...నేను చెప్పేది కూడా విను.

నేను చాలాకాలం ప్రైవేటు స్కూల్ లో ఉద్యోగం చేశాను. అక్కడ జీతం తక్కువగా ఉండేది.ఎంతో కష్టపడి పైసా పైసా కూడబెట్టి, నా బంగారం అమ్మి లోను తీసుకుని ఈ ఇల్లు కట్టుకున్నాము. ఈ మధ్యనే నాకు గవర్నమెంటు స్కూల్లో ఉద్యోగం వచ్చింది. జీతం పెరిగింది. మెల్లగా అప్పులు తీరుస్తున్నాం. నీవు ఇంటర్ పాసైన తర్వాత మీ నాన్న నిన్ను డిగ్రీ లో చేర్పిస్తానన్నారు. ..

నేనే, మన గోపీని ఇంజినీరింగు చది విస్తే... అమెరికాలో ఉన్న నా తమ్ముడు శశిధర్, గోపీని అమెరికా తీసుకుని వెళ్లి ఎం.ఎస్. చదివిస్తానన్నాడు. .. గోపీని ఇంజినీరింగు చదివించాలని పట్టుబట్టాను.

మీ నాన్న లక్షల రూపాయలు ఖర్చుపెట్టి నిన్ను ఇంజినీరింగు చదివిస్తున్నారు. నీవు అడిగావని లక్ష రూపాయల మోటారు సైకిల్ కొని ఇచ్చారు. యాభై వేల రూపాయల కంప్యూటర్ కొని ఇచ్చారు. మీ నాన్నకు పదివేల రూపాయల ఫోను మాత్రమే ఉంది. కొడుకువనే ప్రేమతో నీకు ముప్ఫై వేల రూపాయల ఫోను కొని ఇచ్చారు.

నీవు ఫోనులో స్నేహితులతో కబుర్లు చెప్పుకుంటూ, కంప్యూటర్ లో ఆటలాడుకుంటూ, మోటారు సైకిలు మీద స్నేహితులతో షికార్లు కొడుతున్నావు. నాకు లెక్కలు రావు. నేను ఇంజినీరింగు చదవను అని నీవు మొదటే గట్టిగా చెప్పి ఉంటే, మేము నిన్ను ఇంజినీరింగు లో చేర్పించే వాళ్ళం కాదు. నీ కోసం ఇన్ని అప్పులు చేసేవాళ్ళం కాదు.

ఆస్తిలో నీ వాటా నీకు పంచి ఇవ్వమన్నావు. నీకు పంచి ఇవ్వడానికి మా దగ్గర ఆస్తి లేదు. అప్పులు మాత్రమే ఉన్నాయి. చదువు మానేసి నీవు ఏ పని చేసి ఈ అప్పులు తీరుస్తావో చెప్పు. నీవు చదివిన చదువుకు ఏం ఉద్యోగం వస్తుందో ఆలోచించు. మీ నాన్నను క్షమించమని అడుగు అంది నీలిమ.

అన్నయ్యా! నాన్న చూడు. తలవంచుకుని ఎలా బాధ పడుతున్నారో? అంది చెల్లెలు శాంత.

అందరి మాటలు విన్నాడు గోపి. కొంచెం సేపు ఆలోచించాడు. మెల్లగా తండ్రి దగ్గరకు వెళ్ళి, ఆయన చేతులు పట్టుకుని, నన్ను క్షమించు నాన్నా! అన్నాడు.

ఒక కుగ్రామంలో సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన మీరు ఎంతో పట్టుదలతో, కష్టపడి చదివి ఈ రోజు హైస్కూలు హెడ్మాస్టరుగా ఎదిగారు. నాకు అన్ని వసతులు కల్పించి, చదువుకోరా నాయనా...అంటే  చదువుకోవడానికి బద్దకించి, మీ మనసు బాధ పెట్టాను. నాయనమ్మ మాటలతో నాకు జ్ఞానోదయమైంది. ఇక మీదట శ్రద్ధగా చదువుకుంటాను అన్నాడు గోపి.

పట్టుదలతో, శ్రద్ధగా చదివి గోపి ఇంజినీరింగు పాసయ్యాడు. కుటుంబంలో అందరికీ ఆనందం కలిగించాడు. ఇప్పుడు ఎం.ఎస్. చదవడానికి అమెరికా వెళ్తున్నాడు.

****సమాప్తం****

Posted in November 2024, కథలు

1 Comment

  1. లింగంనేని సుజాత

    ఎడిటర్ గారికి…. నా కథను ప్రచురించినందుకు ధన్యవాదాలు.. నమస్సులు.

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!