Menu Close
SirikonaKavithalu_pagetitle

నేను అంటూ ప్రారంభిస్తానే కానీ
రాసేదంతా నీ గురించే
అల్లుకున్న కవితలన్నీ
ఆనందవలయాలు కావాలంటే
కేంద్రబిందువు నువ్వయితేనే
కించిత్తైనా సాధ్య మయ్యేది

నిదురించే సూర్యుడిలో
నీ అలసట పలవరిస్తుంది
కరుణించే మబ్బుల్లో
నీ పెద్దరికం ప్రతిఫలిస్తుంది
మిణుగురు పురుగుకదలికలో
నీ కంటిచూపు వెలుగు లీనుతుంది
తనువును తాకే ప్రతిమారుతంలోనూ
నీ కరాంగుళుల సోకు
వర్తమానాన్ని తట్టి లేపుతుంది

నేనేదో రాస్తూనే ఉంటాను గానీ
నువ్వు ధ్రువీకరిస్తేనే
ప్రతిపదమూ ఒక క్రొన్నన
జానపదంలోనూ
వేదనాదం వినిపిస్తున్నా
నువ్వు అవునంటేనే మన్నన
నిన్ను వల్లెవేస్తేనే
నిలువెత్తు కంబంలా నిశ్చలమననం
నువ్వు ముల్లె కడితేనే
రహదారిలోనూ రసమయజీవనం

నేనేదో అనుకుంటూ వుంటాను గానీ
నువ్వు తలూపితేనే
నా గుండె ఆగకుండా ఆడగలిగేది
నువ్వు దరహసిస్తేనే
నా మాట ప్రవాహమై పరవళ్ళు త్రొక్కేది
చెలిమిమొగసాల ముందు
రంగవల్లిగా నువ్వు నిలిస్తేనే
నువ్వూ నేనూ ఒక్కటిగా లీనమయ్యేది

మత్తు మందును సేవించిన మగత నిద్దుర
కంటికి దూరంగా
ఒంటికి భారంగా
అక్కడెక్కడో జోగుతోంది

కలల అలల తాకిడికై
ఎదురు చూసీ చూసీ అలసిన కనులు
కుంకుమను తాగి ఎర్రబడ్డాయి

ఉండుండీ ఏ పిలుపు కోసమో
కొట్టుకుంటున్న ప్రాణం
ఏకాంతానికి మరి కొంచెం ఎరువు వేసి
ఏపుగా పెంచుకుంటోంది

రాలి పడుతున్న
తోకచుక్క చివరకు అంటుకుని
ఏ ఎదురు చూపులూ తిరిగి రాలేదని
ఆశ నిరాశ ఒడిలో చేరి
వెక్కి వెక్కి ఏడుస్తోంది...

మనిషికి మనిషికి ఎడం జరిగిన మాట
మౌనంగా తల వంచుకుని
మూడు కోతుల ముచ్చట్లను
ముసి ముసిగా తలచుకుంటోంది
అంతిమ ఘడియల కాలం ఆసన్నమైనదని
తనకై తానే దుఃఖపడుతోంది.....

ఆటపాటల యవ్వనం
క్లబ్ పబ్స్ సంస్కృతిలో
దహనమైపోతూ
విష సంకేతాల విశ్వానికి రూపునిస్తుంది !

విజ్ఞాన వీచికల్ని పెంచే విద్య
కార్పోరేట్ కబందహస్తాల్లో
నిర్భంధమైపోతూ
ధన అహంకార తిమిరానికి ఆశ్రయమిస్తుంది !

అష్ట దిక్పాలికై కంప్యూటర్ వ్యాధి
యువ హార్మోనుల్లో విస్తరిస్తూ
నాలుగు గోడల మధ్య
బాల్య వృద్ధుల్ని తయారుచేస్తుంది!

నవనిర్మాణ యువత
అంతర్జాల ఇంద్రజాల మాయకు
అతుక్కుపోతూ
నిర్వీర్య భవిష్యత్తుకు కారణమౌతుంది !

సవరించే చర్యలు చేయకపోతే
క్రమశిక్షణతో సమయాన్ని
విభజించకపోతే
జీవన ప్రాధాన్యతల్ని
విస్మరిస్తే...

అతిచేరువలోనే
శూన్యులమైపోతాం
జ్ఞానమున్నా అజ్ఞానులుగా మిగిలిపోతాం !

అమ్మల గన్న యమ్మరా
ఆది పరాశక్తి రా
జన్మ నిచ్చెడి జననిరా
పాలు పట్టెడి పావనిరా

ప్రేమ జూపెడి దేవతరా
జోల పాడెడి జానకిరా
లాల పోసెడి లక్ష్మిరా
కడుపు నింపెడి అన్నపూర్ణరా

ఇల్లు కాపాడేటి గృహలక్ష్మిరా
చల్లగ జూసేటి కల్పవల్లిరా
అక్కయై ఆదుకొనునురా
చెల్లి యై చెంత నిలుచురా

మమతల సమతల వెల్లువరా
నిష్కల్మష మనసుల తల్లులురా
చదువుల తల్లికి సరిసాటిరా
ఆకాశం లో సగ భాగం వీరేరా

దుష్ట చూపులు చూడకు
చేతులెత్తి దండం పెట్టు
అమ్మ చెల్లి అక్క భార్య
ఎవరైనా నీ బాగు కోరేవారే

ఏటి కోసారి వందనం సరిపోదు
నిత్య జీవితం లో నీ దృష్టి మార్చు
సింధు గోదావరు లే నీ ఆదర్శం
గంగా యమునలే నీ సర్వం

సృష్టి అంతా స్త్రీ రూపమే
కొండలు బండలు తప్ప
ఉప్పు సముద్రం తప్ప
పువ్వే రా స్త్రీ, నవ్వే రా స్త్రీ

సర్వ మానవ కళ్యాణం
జరగాలని కోరుకుంటూ
స్త్రీ ని పూజించే సంప్రదాయం
తిరిగి రావాలని ఆకాంక్షిస్తూ...

వెలుపై వేల్పుగ వ్రేలినావు కనులన్ బేటన్ మఱిన్ గోటలన్
వలపై వాల్పుగ వ్రాలినావు మలలన్ బాటన్ మఱిన్ దోటలన్
తలపై తాల్పుగ దాల్చినావు నుడులన్ దాటిన్ మఱిన్ బాటలన్
శిలపై శిల్పము! ఆత్మకూరునిలయా శ్రీ రాజ రాజేశ్వరీ!

భావము :- అమ్మా శ్రీరాజరాజేశ్వరీ ! నీవు దేవతగా విశాలమగు రూపముతోడ మా కన్నులందును గ్రామములందును కోటలందును విగ్రహమై నిలచియున్నావు. నీవు మాపైన ప్రేమకలుగునప్పుడు కొండలపైనను వాని బాటలందును తోటలందును విగ్రహమై నిలిచి యున్నావు. నీ తలంపునకు రాగా మా మాటలందును పాటలందును ఆ పాటల దాటులందును నిలచితివి. కాని శిలపైన గల నీ శిల్ప రూపమే అద్భుత సౌందర్య కళాత్మిమై యున్నది.

Posted in November 2024, సాహిత్యం

1 Comment

  1. దాసరాజు రామారావు

    ఎన్ని వైవిధ్యమైన శీర్షికలో, ఎంత సాహిత్య లోతులో కాక విషయ, జ్ఞాన విశ్లేషణలో, ఎంతటి నియమ బద్ద సమయ పాలనో, ముఖ్యంగా కంకణ బద్ద కార్యదీక్షనో
    వెరసి ఏ పత్రికకు సరిపోలని సిరిమల్లె నిరంతర సువాసనల విరజిమ్ముతుండటం తెలుగు భాషకు తలమానికం.
    నిర్వాహకులకు, పాలు పంచుకుంటున్ననరచయితలకు అభినందన చందనాలు.

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!