Menu Close
తెలుగు పద్య రత్నాలు 41
-- ఆర్. శర్మ దంతుర్తి --

భగవద్గీత విభూతి యోగం లో అర్జునుడు కృష్ణుణ్ణి ‘నువ్వెక్కడ ఉంటావో, నీ పరిపూర్ణత్వం తెలుసుకోవడం ఎలా?’ అడిగినప్పుడు చెప్తాడు. ఈ విశ్వంలో నా విభూతికి అంతు అనేది లేదు; నా ఒక్క చిన్న అంశంచేత మాత్రమే ఈ ప్రపంచం పుట్టి లయమౌతూ ఉంటుంది అని. కానీ భగవంతుణ్ణి గుర్తించడానికీ, తెలుసుకోవడానికీ కొన్ని ఉదాహరణలు చెప్తాడు. అందులో కొన్ని “ఆదిత్యానమహం విష్ణు (10-21), రుద్రాణాం శంకరశ్చాస్మి.. మేరుఃశిఖరిణామహం (23), సరసామస్మి సాగరః (24), సర్పాణామస్మి వాసుకిః (28).” వీటికి అర్ధాలు ఏమిటంటే ద్వాదశాదిత్యులలో విష్ణువు భగవంతుడు, అలాగే ఏకాదశ రుద్రులలో శంకరుడు, పర్వతాలలో మేరువు, సరస్సులలో సముద్రం, సర్పాలలో వాసుకి. ఇటువంటివి కొంతమేరకి భగవతుడు ఇలా ఉంటాడు అని చెప్పడానికి సహాయం చేస్తాయి. అయితే నిజంగా భగవంతుడెలా ఉంటాడు? ఇలా ఉంటాడు అని చెప్పాలంటే మనం వర్ణించగలగాలి కదా? అలా వర్ణించడం మన మనసు బుద్ధి మీద ఆధారపడి ఉంది కనక, మన బుద్ధి, మనసులకి పరిధులు ఉన్నాయి కనక అవి అనంతం, అక్షయం, అవ్యయం కాదు అని వప్పుకోవాల్సిందే. ఏది అనంతం, అక్షయం, అవ్యయం కాదో అది భగవంతుడు కాదనేది నిర్వివాదాంశం. అందుకే శ్రీరామకృష్ణులు అంటారు – నేను భగవంతుణ్ణి చూసాను అనే ఎవరూ కూడా చూసినట్టు కాదు అని. భగవంతుణ్ణి చూడ్డం అంటే ఉప్పు బొమ్మతో సముద్రం లోతు కొలవడం వంటిది అంటారాయన. ఆ బొమ్మ సముద్రంలోకి వెళ్లగానే అందులో లీనమవడమే తప్ప ఇంక చెప్పడానికేమీ లేదు. అందుకే కృష్ణుడు గీతలో ఈ విశ్వం అంతా నాలో ఒక్క అంశం వల్లే పుడుతుంది, కానీ మొత్తం అర్ధం చేసుకోలేరు అంటాడు.

దేవదానవులు పాలసముద్రం చిలుకుతున్నారు – దేవతలు ఒకవైపు, రాక్షసులు ఒకవైపు ఉండి. చిలకడానికి కవ్వం, తాడూ అమరాయి. కవ్వం కుదురు లేక కిందపడిపోయినప్పుడు భగవంతుడు కూర్మావతారం ఎత్తి దాన్ని ఎత్తి పట్టుకున్నాడు. దీనిమీద ఇప్పుడు భాగవతంలో పోతన రాసిన పద్యం చూద్దాం.

క.
తరిగాండ్రలోన నొకఁడట
తరి గడవకుఁ గుదురు నాఁక త్రాడఁట చేరుల్;
దరి గవ్వంబును దా నఁట
హరిహరి! హరిచిత్రలీల హరియే యెఱుఁగున్ [భాగవతం 8-205]

విష్ణువు దేవతలతో పాటు పాలసముద్రం చిలికే వాడిగా తానొక వైపు పట్టుకున్నాడు వాసుకి అనే సర్పాన్ని. అందువల్ల ఆయన చిలికేవారిలో (తరిగాండ్రలోన) హరి ఒకడు (నొకడట). తరి (చిలికే) కడవకు (సముద్రానికి) కుదురు (కూర్మం) కూడా హరి, నాక (సర్పపు) త్రాడట (వాసుకి) కూడా ఆయనే. అయితే అక్కడ చేరిన వారు (చేరుల్) వాడే చిలికే కవ్వం (తరి కవ్వంబు – అంటే మందర పర్వతం) కూడా ఆయనే (తానట). ఆహాహా (హరి హరి), ఈ చిత్రమైన భగవంతుడి (హరి) విషయాలన్నీ (చిత్రలీల) భగవంతుడికే తెలుస్తాయి (హరియే యెరుగున్). పద్యంలో కవ్వం మందర పర్వతం; అదే భగవద్గీతలో విభూతి యోగం ప్రకారం ‘మేరుఃశిఖరిణామహం.’ అలాగే కవ్వపు తాడు వాసుకి కూడా ‘సర్పాణామస్మి వాసుకిః.’ ఇంక చిలికేవాళ్లలో దేవత ‘ఆదిత్యానామహం విష్ణుః’; ఆ తర్వాత అందులోంచి పుట్టిన హాలాహలం ఆరగించిన వాడు ‘రుద్రాణాం శంకరశ్చాస్మి’; అదే విధంగా పాల సముద్రం కూడా ‘సరసామస్మి సాగరః’ హరి అనే పదాన్ని పోతన ఎలా వాడేడో చూశారా?

ఈ పద్యంలో చెప్పిన విచిత్రం సంగతి ఏమిటంటే, చిలికేవాడు, చిలికించేవాడూ విష్ణువే. పాల సముద్రం కూడా విష్ణువే. ఇంకా విచిత్రం ఏమిటంటే పాల సముద్రంలోంచి బయటకి వచ్చేవి కూడా భగవంతుడే. అది కూడా భగవద్గీతలో చూడవచ్చు. ‘ఉఛ్ఛైశ్రవస మశ్వానాం’ – పాలసముద్రంలో పుట్టిన ఉఛ్ఛైశ్రవం అనే గుర్రం, ‘ఐరావతం గజేంద్రాణాం’ – ఐరావతం అనే తెల్లటి ఏనుగు (10-27). ఇలా అన్నీ భగవంతుడే అని చెప్పే పద్యం భాగవతంలో మరోచోట చూడవచ్చు.

క.
హరిమయము విశ్వమంతయు
హరి విశ్వమయుండు సంశయము పనిలేదా
హరిమయముగాని ద్రవ్యము
పరమాణువు లేదు వంశపావన వింటే [భాగవతం 2-17]

దీనినే మంత్రపుష్పంలో/నారాయణోపనిషత్ లో కూడా చూడవచ్చు.

నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం
నారాయణ పరోజ్యోతిరాత్మా నారాయణః పరః
నారాయణ పరం బ్రహ్మ తత్త్వం నారాయణః పరః
నారాయణ పరోధ్యాతా ధ్యానం నారయణః పరః

అందుకే ప్రపంచం అంటే భగవంతుడు తప్ప మరోటి కాదు అంటారు. ఇప్పుడీ దేవదానవ యుద్ధం అంటే ఏమిటో చూద్దాం. మనలో జరిగే మంచి చెడు లక్షణాల మధ్య నిరంతరం జరిగే యుద్ధమే ఈ దేవదానవ యుద్ధం అంటే. బ్రహ్మ జ్ఞానం కోసం ధ్యానం చేయడం మొదలుపెట్టి ఓ స్థాయి చేరాక కోరికలు గుర్రాలలాగా బయటకి వస్తాయి కనక ‘ఉఛ్ఛైశ్రవసమశ్వానాం’. అలా రోజురోజుకీ బయటకి వచ్చే వాటిని వదుల్చుకుంటూ మనసుని సానబెడితే చివరకి అందులో ఉన్న కల్మషం అంతా విషం లాగ బయటకి చిమ్ముతుంది. అది మననీ, ప్రపంచంలో మరొకరినీ నాశనం చేయకుండా మనం పట్టుకోలేము కనక భగవంతుడిని శరణు వేడడం. అంటే శంకరుడి దగ్గిరకి వెళ్ళి నా మనసులో ఉన్న ఈ విషం తీసుకో అనడం. కాలకూటమనే విషాన్ని భగవంతుడు తీసుకున్నాడు కనక ఇక్కడ రుద్రాణాం శంకరశ్చాస్మి. పాల సముద్రంలోంచి లక్ష్మీ దేవి బయటకి రావడం అంటే అష్ట అణిమా సిద్ధులు కలగడం. వాటిని తీసుకుంటే అదంతా అధోగతికి కారణం అవుతుంది, బ్రహ్మజ్ఞానం కలగదు. కాలకూటాన్ని భగవంతుడికి ఇచ్చినట్టూ ఈ సిద్ధులని కూడా భగవంతుడి ఇచ్చేయాలి (అదే నిజంగా సన్యసించడం అంటే). అది కూడా భగవంతుడు తీసుకున్నాక - లక్ష్మి ఇప్పుడు విష్ణువు దగ్గిరకి వెళ్ళింది కనక ఆదిత్యానామహం విష్ణుః చివరకి బయటకి వచ్చేది అమృతం. అయితే ఈ అమృతం బయటకి రావాలంటే మోక్షం కావాలి అనే కోరిక (అది కూడా ఒక రకమైన కోరికే కాబట్టి) కూడా వదుల్చుకుంటే మిగిలేది మోక్ష సన్యాసం.

అమృతం – అంటే జనన మరణాల నుంచి విముక్తి కూడా వెంఠనే వచ్చేయదు. ఆ అమృతం భగవంతుడు తీసుకుని మనకి కావాల్సినంత ఇస్తాడు. ఇదే మోహినీ అవతారం అంటే. ఆ మోహినీ అనేటువంటి కోరికని కూడా వదిలి కుదురుగా కూర్చోగలగాలి భగవంతుడు ఇచ్చే అమృతం తీసుకోవడానికి. అందుకే శ్రీరామకృష్ణులు లాంటి యోగులు ఏమంటారంటే ఎవరికి ముక్తి కలుగుతుందో భగవంతుడు నిర్ణయిస్తాడు. మనం ఎంత కష్టపడి ధ్యానం చేసినా ముక్తి కలగకపోవచ్చు, కానీ ఒక్కసారి భగవంతుడి అనుగ్రహం కలిగితే చీకటి గదిలోకి తలుపు తీయగానే ఒక్కసారి వెల్తురు వచ్చినట్టూ, బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. దీనికి అతి సులభమైన మార్గం భక్తితో శరణువేడడం. అప్పుడు చివరిగా కలిగేది బ్రహ్మజ్ఞానం; దాని వల్ల జీవన్మరణాల లోంచి ముక్తి. ఇదే దేవదానవ యుద్ధం అంటే.

****సశేషం****

Posted in November 2024, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!