అష్టాదశోధ్యాయం
(అమ్మవారి సమగ్ర రూపం వర్ణన, ఫలశృతి)
శ్లోకాలు: 167/2-183, సహస్రనామాలు: 901-1000
938. ఓం ప్రగల్భాయై నమః
మహత్తర చాతుర్యాన్ని సృష్టి, స్థితి సంహారాలలో ప్రదర్శించగల మాతకు వందనాలు.
939. ఓం పరమోదారాయై నమః
ప్రాణికోటియందు, భక్తజనులయందు విశేషమైన ఔదార్యాన్ని చూపు తల్లికి వందనాలు.
940. ఓం పరమోదాయై నమః
మహత్తరమైన -- ఆమోదం ఆనందం--ప్రసాదించగల మాతకు వందనాలు.
941. ఓం మనోమయ్యై నమః
మనోమయ రూపిణికి నమోవాకాలు.
942. ఓం వోమకేశ్యై నమః
అంబర పర్యంతం వ్యాపించిన కేశపాశం కలది -- అంబరమే కేశపాశంగా గల విరాడ్రూపిణికి నమోవాకాలు.
943. ఓం విమానస్ధాయై నమః
దివ్య విమాన విరాజమానయై విహరించు తల్లికి ప్రణామాలు.
944. ఓం వజ్రిణ్యై నమః
వజ్రహస్తుడైన ఇంద్రపత్నియైన శచీదేవి స్వరూపంలో స్వర్గరాజ్యలక్ష్మియై భాసిల్లునట్టి వజ్రహస్తకు వందనాలు.
945. ఓం వామకేశ్వర్యై నమః
వామకేశ్వరుడయిన--శివుడు అట్టి శివపత్నియైన వామకేశ్వరీ దేవికి వందనాలు.
946. ఓం పంచయజ్ఞ ప్రియాయై నమః
అగ్నిహోత్ర, దర్శ పూర్ణమాస, చాతుర్మాస, పశుసోమాలకు-- పంచయజ్ఞాలని పిలువబడతాయి. ఈ పంచయజ్ఞాలయందు ప్రీతిగల మాతకు వందనాలు.
947. ఓం పంచప్రేత మంచాధిశ్యాయిన్యై నమః
బ్రహ్మ, విష్ణు, రుద్ర ఈశ్వరులు--నాలుగు మంచం కోళ్ళుగాను, సదాశివుడు ఫలకస్థానంలో విరాజిల్లునట్టి మంచంమీద శయనించు మహేశ్వరికి వందనాలు.
948. ఓం పంచమ్యై నమః
పంచమీ తిథి దేవతా రూపిణికి ప్రణామాలు.
949. ఓం పంచభూతేశ్యై నమః
పంచ మహాభూతాలకూ అధీశ్వరి అయిన మాతకు వందనాలు.
950. ఓం పంచసంఖ్యోపచారిణ్యై నమః
ధూప, దీపం, పుష్ప, గంధ నైవేద్యాలు-- ఇవి ఐదూ పంచోపచారాలు. వీటిచే ఆరాధింపబడు మాతకు వందనాలు.
951. ఓం శాశ్వత్యై నమః
నిత్యమై, సత్యమై శాశ్వతంగా భాసిల్లు మహేశ్వరికి ప్రణామాలు.
952. ఓం శాశ్వతైశ్వర్యాయై నమః
అఖండమై, అపారమై, శాశ్వతమైన మహత్తరైశ్వర్యం కల మాతకు ప్రణామాలు.
953. ఓం శర్మదాయై నమః
సుఖ, సంతోషాదులను ప్రసాదించు తల్లికి వందనాలు.
954. ఓం శంభుమోహిన్యై నమః
వైరాగ్యమూర్తీ, వైరాగ్యోపదేశకుడూ అయిన శంకరుని కూడ మోహంలో ముంచివేసిన మహత్తర సౌందర్య లావణ్యమూర్తియైన మోహనమూర్తికి నమోవాకాలు.
955. ఓం ధరాయై నమః
సర్వులనూ ధరించునట్టి --భూస్వరూపిణికి ప్రణామాలు.
956. ఓం ధరసుతాయ నమః
ధరసుత అంటే భూసుత -- అంటే సీతాస్వరూపిణియై తేజరిల్లిన అమ్మకు నమస్కారాలు.
957. ఓం ధన్యాయై నమః
ధన్యమూర్తియై, ధనవర్ధిణియై ప్రకాశించు మాతకు వందనాలు.
958. ఓం ధర్మిణ్యై నమః
ధర్మ స్వరూపిణికి ప్రణామాలు.
959. ఓం ధర్మవర్థిన్యై నమః
ధర్మాన్ని వర్థిల్లజేయునట్టి మాతకు ప్రణామాలు.
960. ఓం లోకాతీతాయ నమః
నిఖిల లోకాలనూ అతిక్రమించిన లోకాతీత స్వరూపిణికి వందనాలు.
961. ఓం గుణాతీతాయై నమః
సమస్త గుణాలను అధిగమించిన అతీతగుణ స్వరూపిణికి ప్రణామాలు.
962. ఓం సర్వాతీతాయై నమః
సర్వాన్నీ మించినట్టి సర్వాతీతమూర్తికి ప్రణామాలు.
963. ఓం శమాత్మికాయై నమః
శమాన్ని_శాంతిని కలిగించడమే ఆత్మస్వరూపంగా సహజ లక్షణంగా గల జననికి ప్రణామాలు.
964. ఓం బంధూక కుసుమ ప్రఖ్యాయై నమః
బంధూకపుష్పంతో సమానమైన కాంతితో భాసిల్లు మాతకు వందనాలు.
965. ఓం బాలాయై నమః
బాలా స్వరూపిణియై భాసిల్లిపోవు బాలామతల్లికి వినయాంజలులు.
966. ఓం లీలావినోదిన్యై నమః
లీలచేసిచూసి అందులో వినోదాన్ని పొందునట్టి మాతకు నమస్కారాలు.
967. ఓం సుమంగళ్యై నమః
శుభకరమైన మంగళ స్వరూపిణికి వందనాలు.
968. ఓం సుఖకర్యై నమః
సుఖాలను చేయునట్టి--ప్రసాదించునట్టి మాతృదేవతకు వందనాలు.
969. ఓం సువేషాఢ్యాయై నమః
సుందరమైన మనోహర వేషంగల తల్లికి వందనాలు.
970. ఓం సువాసిన్యై నమః
నిత్య సువాసినీమూర్తియై భాసిల్లు మాతృమూర్తికి ప్రణామాలు.