Menu Close
భారతీయ తత్వశాస్త్ర వివేచన
- రాఘవ మాష్టారు కేదారి -

గత సంచిక తరువాయి..

అయితే భారతీయ సాంప్రదాయం నాలుగు రకాలైన పురుషార్ధాలను గుర్తించింది. పురుషుడు అంటే ఆడ మగ అని అర్థం.

పురుషార్ధాలు

  1. ధర్మం (నీతిగా ఎవరికీ హాని లేకుండా జీవించడం)
  2. అర్థం (డబ్బును న్యాయబద్ధంగా సంపాదించడం)
  3. కామం (కోరికలను ధర్మబద్ధంగా తీర్చుకోవడం)
  4. మోక్షం (చివరకు దేవునిలో కలిసిపోవడం)

చార్వాకం, నాస్తికులు తప్ప అందరూ ఈ నాలుగు అంశాలు అంగీకరించారు. చార్వాకం మాత్రం అర్ధాన్ని, కామాన్ని మాత్రమే అంగీకరిస్తుంది. ప్రస్తుత ప్రపంచమంతా ఈ కామార్థాలకు లోబడి నాశనమవుతున్నది.

ఇక శంకరాచార్యులు, బౌద్ధము మోక్షానికి, నిర్వాణానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాయి. శంకరుని దృష్టిలో ఈ ప్రపంచమంతా మాయ మోహితం, కాబట్టి ఆ మాయ మోహము నుండి బయటపడడమే మోక్షం అన్నారు.

ఇక ఈ జగమంతా కోరికల వలన దుఃఖసాగరమైనది. కనుక కోరికల నుండి బయటపడడమే నిర్వాణం (మోక్షం) అని బుద్ధుడు అన్నాడు.

సూక్ష్మంగా చెప్పాలంటే చరిత్రకందని వాంగ్మయం లేని ప్రాచీన కాలంలో, ప్రపంచంలోని అధిక ప్రాంతం అజ్ఞానాంధకారంలో ఉన్నప్పుడు, భారతదేశం ఆధ్యాత్మిక ప్రకాశంతో వెలిగిపోయింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. పుట్టుక చావుల చక్రము నుండి తప్పించుకునేందుకు, చావుకి దూరం కావడానికి, మానవునికి ఉన్న ఒకే ఒక మార్గం, సమస్త అంధకారానికి అతీతమైన సూర్యకాంతితో ప్రకాశించే పరబ్రహ్మను! (పరమాత్మను) సాక్షాత్కరించుకోవడమే "ముక్తి" అని ఋషులు చాటారు.

ఈ ఆలోచన నుండి ఆత్మ చింతల నుండి వెలువడినవే ప్రస్థాన త్రయాలు. అవే ఉపనిషత్తులు భగవద్గీత, బ్రహ్మ సూత్రాలు. వీటికి మూలాధారం వేదాలు. అసలు భారతీయ దర్శనంలో ముఖ్యమైనవి వేదాలు ఏమి చెబుతున్నాయో ఒకసారి పరిశీలిద్దాం. వేదాలు నాలుగు అవి

  1. ఋగ్వేదం 2. సామవేదం 3. యజుర్వేదం 4. అధర్వణ వేదం. వీటికి ఉపవేదాలు గాంధర్వవేదం, అర్థవేదం, ధనుర్వేదం, ఆయుర్వేదాలు.

ఈ వేదాలలో అత్యంత విలువైన ధ్యానసంపద ఉన్నది. సమస్త విషయాలు, వాటి పరిష్కారాలు వివరించబడినాయి.

  1. ఋగ్వేదంలో దేవతల గుణగణాలు, దేవతా స్తోత్రాలు, మానవ మనుగడకు కావలసిన ఖగోళ శాస్త్ర విషయాలు ఉన్నాయి. ఇందులో 1017 శ్లోకాలు 10580 మంత్రాలు ఉన్నాయి. వీటిలో ఉండే మంత్రాలను ఋక్కులు, ఋతములు, సత్యాలు అంటారు.
  2. యజుర్వేదంలో మానవులు చేయవలసిన యజ్ఞయాగాదులతో పాటు, జ్యోతిష్య, వాణిజ్య, వ్యవసాయ, వాస్తు శాస్త్ర రహస్యాలను వివరించారు. ఇందులో 1975 పద్య గద్యాలు ఉన్నాయి. 2198 మంత్రాలు ఉన్నాయి.
  3. సామవేదంలో మానసిక ఉల్లాసాన్ని కలిగించే కళలైన సంగీత, సాహిత్య, నృత్య శాస్త్రాలను వర్ణించారు. ఇందులో 1875 మంత్రాలున్నాయి. వీటిలో 1504 ఋగ్వేద మంత్రాలే. ఇవి శాంతి మంత్రాలు.
  4. అధర్వణ వేదంలో వైద్య, సామాజిక, రాజకీయ వ్యవస్థలు, మూలికా వైద్యం, మంత్ర తంత్రాలు, జంతు, వృక్ష శాస్త్రాల అంశాలు ఉన్నాయి. వీటిలో 5977 మంత్రాలు ఉన్నాయి.

వేదం కేవలం బ్రతకడానికే గాక, జీవించడాన్ని కూడా నేర్పింది. సమాజ జీవనాన్ని ప్రతిపాదించి ఐక్యమత్యానికి తోడ్పడింది.

మన వేదాలలో మానవుని మనోచింతనలో ఉన్న అనేక సందేహాలకు చక్కని పరిష్కారాలు, సుఖ జీవనానికి సోపానాలు ఉన్నాయి. వాటిని ఆరాధించడం కాదు, ఆచరణలో పెట్టాలి, నేడు ధర్మ ప్రచారం ఎక్కువైనది కానీ ధర్మాచరణ తక్కువైనది. అందుకే నేడు సమాజంలో వివిధ రుగ్మతలు, అసమానతలు, అహంకారాలు, ఆధిపత్య ధోరణితో మానవుని మనుగడలో గందరగోళం చోటుచేసుకున్నది.

అయితే వేదాలలో, వాటి ధర్మాలలో, మనుస్మృతిలో కొన్ని మానవ సమసమాజ ప్రగతికి అడ్డంకులుగా కొన్ని మంత్రాలు ఉన్నాయనటంలో ఎలాంటి సందేహం లేదు. వేదాల వలన వర్ణాశ్రమం ఏర్పడినదని, శూద్రులు ఏర్పడ్డారని, అనేక కులాలు ఏర్పడ్డాయని అనేకమంది హేతువాదులు, నాస్తికులు ఇప్పటికీ కూడా విమర్శిస్తూనే ఉన్నారు. అయితే గురువింద ఎంత అందంగా ఉన్నా దానికి నలుపు ఉంటుంది. అలాగే ఎంత మంచి వారిలో కూడా ఏదో ఒకచోట కొద్దిగా చెడు ఉంటుంది కదా, కనుక మనము వేదాలలో ఉన్న మంచిని గ్రహించి, వేదాలలో అస్పృశ్యతకు కారణమైన, అనాగరకమైన మూఢ నమ్మకాలకు, మూఢాచారాలకు సంబంధించిన అంశాలను త్రోసిపుచ్చవచ్చును. వ్యతిరేకించవచ్చును. వాటిని మినహాయించి మనకి అనుకూలమైన, ప్రజా శ్రేయస్సుకు సౌలభ్యంగా ఉండే అంశాలను మనము లెక్కలోనికి తీసుకోవడంలో ఎలాంటి ఇబ్బంది ఉండదని నా అభిప్రాయం.

ఇప్పటికీ ఎక్కువమంది అనేక విధాలుగా వేదాలలోను, మనుస్మృతిలోను వర్ణ వ్యవస్థకు చెందిన కొన్ని జుగుప్సాకరమైన సంస్కృతిని శూద్రులకు, ఇతరులకు ఆపాదించారని చెబుతున్నారు. నిజమే కాదనము. అది ముమ్మాటికీ తప్పే, మూర్ఖమే, అనాగరికతే. కానీ ఇది ఒకప్పటి మాట, స్వాతంత్రానికి ముందు పురాతన కాలంలో అవి జరిగి ఉండవచ్చు. వాటిని నేడు కూడా మనం ఖండించవచ్చు. అయితే నేటి ఆధునిక కాలంలో పట్టణాలలో నగరాలలో అందరూ కలిసి పోతున్నారు. ఎక్కడో కొద్దిగా పల్లెల్లో ఇప్పటికీ ఆ సంస్కృతి ఉన్నది. దానిని ఖండించవలసినదే.

అనేకమంది సంఘసంస్కర్తల ఉద్యమాల కారణంగా, అనేక ఇతర వ్యతిరేక ఉద్యమాల కారణంగా, ముఖ్యంగా అంబేద్కర్ మహనీయుడు రాజ్యాంగం వ్రాసి, దళితులకు, బహుజనులకు ఓటు హక్కు, స్త్రీలకు రక్షణ కల్పించి, అనేక హక్కులను ఆపాదించినారు. కనుక ప్రస్తుతం, గతంతో పోల్చుకున్నట్లయితే ఎక్కడో అడపాదడపా కొన్ని సంఘటనలు తప్ప ఎక్కడా ఎక్కువగా కుల వ్యవస్థ, కుల వృత్తులు కొనసాగడం లేదు అని చెప్పవచ్చు. ఇంకా అంతగా మనస్మృతిని అంగీకరిస్తున్న వారు నేడు చాలా తక్కువ మంది ఉండి ఉండవచ్చు.

****సశేషం****

Posted in November 2024, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!