భుజానికి ట్రావెలింగ్ బేగ్ తగుల్చుకుని మెట్లెక్కి వస్తున్న జీవన్ కి ఎదురుగా వచ్చి ఆప్యాయంగా ఆహ్వానించారు మల్లెవాడ కరణం కామేశం గారు.
“రా బాబూ! రా, నీకోసమే ఎదురు చూస్తున్నా. నీ ఉత్తరం అందింది. కాని, మారుమూలనున్న పల్లెటూరేమో, సకాలంలో అందదు ఏ ఉత్తరం కూడా. నీ ఉత్తరం నిన్ననే అందడంతో జవాబిచ్చే వ్యవధి లేకపోయింది. ఏమీ అనుకోకు బాబూ!” అని జీవన్ తో అంటూ, ఆయన భార్యనుద్దేశించి, “ఓయ్! ఇదిగో! ఎవరొచ్చేరో చూడు” అంటూ కేక పెట్టేరు. వెంటనే సీతమ్మగారు లోపలనుండి వచ్చి జీవన్ ని పలకరించి, కుశలమడిగింది. జీవన్ కి ఎందుకోగాని ఆమె ముఖంలో మార్పు కనిపించింది. బాగా ఏడ్చిన వాటిలా ఉబ్బి, కాంతి విహీనంగా ఉన్నాయి ఆమె కళ్ళు. ఆమె నవ్వుతూ మాట్లాడాలని ప్రయత్నించిందన్న మాటేగాని, జీవన్ కి ఆ నవ్వు ఆమె ముఖ కవళికల్లో ఎక్కడా కనిపించలేదు. కరణoగారి మొహంలో కూడా దిగులు తాలూకు దోబూచులాట కనిపిస్తూనేవుంది. ఆ ఇంట్లో ఈమధ్య జరగరానిదేదో జరిగివుంటుoదని అర్ధం చేసుకున్నాడు జీవన్. సంకోచిస్తూనే వాళ్ళిద్దరివైపు అదోలా చూశాడు.
కరణoగారు ఆ చూపును అర్థం చేసుకున్నారు. “బాబూ! యాజులు చెపితే ఏమో అనుకున్నాగాని, నిన్ను కన్నతల్లి నిజంగా ధన్యురాలయ్యా! నీలాంటి ఉత్తముడిని నావాడనుకునే అదృష్టం నాకు లేదయ్యా. దేనికైనా పెట్టిపుట్టాలి కదా! అలా అని పైగుడ్డతో కళ్ళు తుడుచుకున్నారు ఆయన.
జీవన్ ఆయనవైపు ఆశ్చర్యంగా చూశాడు. ఏం జరిగింది ఈ ఇంట్లో? ఈ పెద్దవాళ్ళ బాధ ఏమిటి? కొoపదీసి జాహ్నవికి ఏమీ కాలేదు కదా? ఎందుకలా బాధపడుతున్నారు వీళ్ళు? - ఇలా ఎన్నో ప్రశ్నలు అతని మదిలో సుడి తిరగడం మొదలుపెట్టాయి.
“చూడు సీతా! అబ్బాయి వచ్చి చాలాసేపయ్యిoది. దూరప్రయాణం చేసి వచ్చాడు కదా, కాఫీ అయినా ఇచ్చావా? మల్లిగాడితో చెప్పు స్నానానికి నీళ్ళు తొరపమని” అన్నారు కరణo గారు.
సీతమ్మగారు అరచేత్తో తలకొట్టుకుని, “అయ్యో, నా మతిమరుపా” అనుకుంటూ కంగారుగా వంటగదిలోకి వెళ్ళారు కాఫీ తేవడానికి.
“జీవన్ బాబూ! కాఫీ తాగి, స్నానం చేసి విశ్రాంతి తీసుకో. నాకు అర్జంటు పనివుంది, బయటికి వెళ్ళాలి. తొందరగానే వచ్చేస్తాలే” అంటూ జవాబుకోసం ఆగకుండా వెళ్ళిపోయారు ఆయన. అంతలో సీతమ్మగారు కాఫీ తెచ్చింది.
కాఫీ అందుకుంటూ జీవన్ ఆమెను అడిగాడు, “అంతా కుశలమే కదూ, అమ్మా” అని.
ఆమె ఏమీ వినిపిoచనట్లుగా కాఫీగ్లాసు జీవన్ చేతికి ఇచ్చి మాటాడకుoడా అక్కడనుండి వెళ్ళిపోయింది. అంతలో స్నానానికి నీళ్ళు తొరిపాను, రమ్మంటూ వచ్చాడు మల్లేశు.
స్నానం చేస్తూండగా అనిపించింది జీవన్ కి, మల్లేశుని పిలిచి అక్కడ ఏమి జరిగిందో అడిగి తెలుసుకోవాలని. వెంటనే మళ్ళీ అది సభ్యత కాదని ఊరుకున్నాడు జీవన్.
అతని మనసు కీడు శంకిoచసాగింది. ఇదివరకు వచ్చినప్పుడు జాహ్నవి తనకు కనిపించకపోయినా, ఆమె ఉనికి తనకు ఏదో విధంగా తెలుస్తూనే ఉండేది. కాని ఈసారి ఇంట్లో ఆమె మాట వినిపించడం లేదు. పిల్లల జాడ కూడా కనిపించడం లేదు. ఆమెకే ఏదో అయ్యి ఉంటుంది, కరణoగారి మాటల్లోకూడా సూచనా ప్రాయంగా అదే ధ్వనిస్తోంది. ఏమయ్యిందో కరణంగారిని తనే అడిగి తెలుసుకోవాలి - అనుకున్నాడు జీవన్.
జీవన్ స్నానం ముగించి వచ్చేసరికి, బయటికి వెళ్ళిన కరణంగారు నాలుగేళ్ల మనుమరాలిని ఎత్తుకుని లోపలకు వచ్చారు. ఆ పిల్ల ఏడుస్తోంది. ఒళ్లంతా మట్టితో, మొగమంతా వ్యాపించి ఉన్న జుట్టుతో, ఏ సంరక్షణా, లేకుండా మట్టి కొట్టుకుపోయి ఉంది.
“సీతా! ఇది మట్టిలో కూర్చుని ఆడుతూ ఆ మట్టి తింటూ ఉంది. తీసుకు వచ్చేశానని ఏడుస్తోంది. ఆకలో ఏమో చూడు ... అంతా మన కర్మ! ఈ వయసులో మన మొహాన ఈ తిప్పలన్నీ పడమని రాసిపెట్టాడు ఆ బ్రహ్మ దేవుడు” అని విసుక్కుంటూ, పిల్లను భార్యకు అప్పగించి జీవన్ దగ్గరకు వచ్చారు ఆయన.
“మా అబ్బాయి లిద్దరూ పెరిగి పెద్దవాళ్ళైనాక, ఇక పిల్లలు కలగరనుకున్న వయసులో ఈ పిల్ల, జాహ్నవి అర్ధంతరంగా పుట్టి, ఆడపిల్ల ముచ్చట తీర్చింది - అనుకున్నాము. ఎంతో గారాబంగా పెంచాము. పెళ్లీడు వచ్చిందని పెళ్ళి చెయ్యాలనుకున్నాము. వాళ్ళ మాటల మాయలోపడి, ఒక త్వాష్ట్రుడి కిచ్చి పెళ్ళి చేశాము. అది మొదలు దానికి అన్నీ కష్టాలే! అది చాలక, అతడు పోయి, మళ్ళీ ఇలా ఇద్దరు బిడ్డలతో పుట్టింటికి తిరిగి వస్తుందని మేము కలలో కూడా అనుకో లేదు. అంతా దాని తలరాత! మనుష్యులు బిడ్డల్ని కంటారుగాని వాళ్ళ తలరాతల్ని కనలేరు కదా” అంటూ గాఢంగా నిట్టూర్చారు ఆయన.
ఇంతకీ జాహ్నవికి ఏమయ్యిందో తెలియలేదు జీవన్ కి. అది తెలుసుకోవాలని ఆత్రంగా ఉంది అతనికి. కామేశంగారు గొంతు సవరించుకుని మళ్ళీ చెప్పసాగారు...
“సరే! అయ్యిందేదో అయ్యింది. పైచదువులు చదివిస్తే ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ, దాని పిల్లల్ని అది పోషించుకుంటుందని చదువులో పెడితే, పరీక్షలన్నీ బాగానే పాసయ్యిoది గాని, బ్రతుకు పరీక్షలో మాత్రం ఓడిపోయింది. ఇంగ్లీషు కష్టంగా ఉంది నాన్నా- అంటే, సుధీరు, నా మిత్రుడి కొడుకు, ఈ ఊరిలోని జూనియర్ కాలేజీలో ఇంగిలీషు లెక్చరర్గా పనిచేసున్నాడు, అతని దగ్గరకు చదువుకోమని పంపించా. సుధీర్ ఇంత దుర్మార్గుడనుకోలేదు. వాడి మాయలోపడి ఇది కడుపు తెచ్చుకుని, ఈ వయసులో మా బతుకుల్ని వీధి కెక్కిoచింది. ఇకపై మాకు ఊళ్ళో తలెత్తుకు తిరిగే యోగ్యత పోగొట్టేసింది. ఈ మాట చెప్పడానికి సిగ్గౌతోంది” అంటూ బుజం మీదనున్న కండువాతో మొహం కప్పుకుని ఉసూరుమన్నారు కరణంగారు. కాసేపటిదాకా అక్కడ మౌనం రాజ్యమేలింది.
కొంచెంసేపు గడిచాక జీవన్ అన్నాడు, “ఇప్పుడు సుధీర్ గారు ఏమంటున్నారు? వాళ్ల కిద్దరికీ పెళ్ళి జరిపిస్తే సమస్య తీరిపోతుoది కదా! వాళ్ళని కనుక్కున్నారా?”
“ఆఁ! అదీ అయ్యింది. ఇద్దరు బిడ్డల తల్లిని కోడలిగా తెచ్చుకునేందుకు వాళ్ళ అమ్మా, నాన్నా ఇష్టపడటం లేదుట! ‘నేను వాళ్లకి ఒక్కగా నొక్క కొడుకుని, వాళ్ళు ఇష్టపడందే ఈ పెళ్ళి నేనెలా చేసుకోగలను’ అంటున్నాడు సుధీర్. అతడి మాటలు విన్న తరవాత జాహ్నవికి జీవితం మీద విరక్తి కలిగి, గన్నేరుపప్పులు నూరుకుని నీళ్ళలో కలుపుకుని తాగేసింది. ఇంకేముంది - ఆలగోల, బాలగోల! కన్నకడుపు కదా, చూస్తూ ఊరుకోలేక ఆసుపత్రిలో చేర్పిoచాము. రెండు రోజులయ్యిoది. మొత్తానికి బ్రతికించారు. బ్రతికిందన్న సంతోషం మాకు ఏకోశానా కనిపించడం లేదు. ఇక ముందు ఏంచెయ్యాలి అన్నది ఒక పెద్ద సమస్యగా ఉంది. ప్రస్తుతం ఆసుపత్రిలో అబ్జర్వేషన్లో ఉంచారు.”
“మీరు ఊర్లోని పెద్దమనుష్యులను తీసుకెళ్ళి సబవు చెప్పించవలసింది. ఇలాంటి విషయాల్లో తేలిగ్గా ఊరుకోకూడదు. ఇద్దరు కలిసి చేసిన తప్పుకు ఒకళ్ళకే శిక్ష పడడం న్యాయం కాదు” అన్నాడు జీవన్ ఆవేశంతో.
“అయ్యో! అదీ అయ్యింది బాబూ! మా సుబ్బడున్నాడు చూశావూ - వాడు జగమొండి, ఒకపట్టాన ఎవరికీ లొంగడు. అందరూ కలిసి ముక్కచివాట్లు పెట్టాక, ఎలాగైతేనేం జాహ్నవిని కోడలిగా చేసుకుంటానన్నాడు. కాని, ఒక కండిషన్ పెట్టాడు - పిల్లలు ఆమెతోపాటుగా వాళ్ళింటికి రాకూడదుట, ఎంత బాగుందో చూడు! తండ్రీ లేక తల్లీ లేక ఆ పిల్లలు ఏమైపోవాలి? అక్కడికీ జాహ్నవి అత్తవారి తరఫు వాళ్ళలో ఒకరు, దత్తత చేసుకుంటామని అడిగితే, వాడైనా అక్కడ గారాబంగా పెరుగుతాడని, పిల్లాడిని వాళ్లకు పెంపిచ్చేశాము. ఇక మిగిలింది పిల్ల.!ఆడపిల్ల! దీన్నెవరూ పెంచుకోరు.”
“మీ అబ్బాయిల్ని అడిగారా?”
“ఆహా! ఆ ముచ్చటా తీరింది. దీన్ని వాళ్ళూ పెంచుకోరుట! ‘చాలా కాలానికి కలిగిన ఆడపిల్ల అని జాహ్నవికి తెగ గారాబం చేశారు కదా, ఇప్పుడు అనుభవించం’ డని చెప్పారు. వాళ్ళు మాకు వేరే మాటలలో చెప్పినా దాని సారాంశం ఇదే. మాకు సాయపడే వాళ్ళెవరూ లేరు బాబూ! మేమూ డెబ్భయ్యవ పడిలో పడినవాళ్ళం! ఏ క్షణం లోనైనా రాలిపోయే పండుటాకుల్లాంటి వాళ్ళం, ఈ పసిపిల్ల బాధ్యతను మేమెన్నాళ్ళు మొయ్యగలము చెప్పు? చివరకు ఏమిరాసి ఉందో, ఏమో! తరతరాలుగా కూడబెట్టుకున్న మానమర్యాదలు ఇన్నాళ్ళ కిప్పుడు మంటలో కలిసిపోయాయి కదా!” కంటినుండి ఉబికిన కన్నీరు ఆయన చెంపల వెంట ధారలుకట్టిoది.
డబ్భై ఏళ్ళ వయసు దాటిన పెద్దమనిషి అలా దుఃఖిoచడం చూడలేకపోయాడు జీవన్. “మీరు అంతలా బాధపడకండి సార్! క్రమంగా అన్నీ సద్దుకుంటాయి. ప్రతి సమస్యకూ ఒక పరిష్కారం ఉంటుంది. ఏం చెయ్యాలో ఆలోచిద్దాం” అన్నాడు జీవన్.
“ఉండబట్టలేక అంతా నీకు చెప్పేశా. కాని, బాబూ! మా సమస్యలతో నీ బుర్ర పాడు చేసుకోవద్దు. అంత తేలికగా పరిష్కారమయ్యే సమస్య కాదిది. చిన్నవాడివి, నీకెందుకీ బాధలన్నీ! ప్రయాణంతో బడలి ఉన్నావు, కాసేపు విశ్రాంతి తీసుకో” అన్నారు కరణం గారు.
“రాత్రంతా బెర్తుమీద పడుకుని నిద్రపోయా, నాకేమీ బడలిక లేదు. ఒకసారి వెళ్ళి సుధీరుగారితో మాటాడి వస్తా. ఆయన తన మనసులో ఏమనుకుంటున్నారో మనం ముందుగా తెలుసుకోడం మంచిది కదా! ఆ పనికి మీరు వెళ్ళడం కంటే, మీ తరఫున నేను వెళ్ళడమే బాగుంటుంది. ఒకే వయసు వాళ్ళం కనక, మేమిద్దరం మనసు విప్పి మాటాడుకోగలము” అన్నాడు జీవన్.
“సరే! పోయేటందుకు ఇంకేముంది కనుక, అలాగే కానియ్” అన్నారు కామేశంగారు సగం అయిష్టంతోనే.
ఆయన మాట పుచ్చుకుని సుధీర్ని కలుసుకోడానికని బయలుదేరాడు జీవన్.
***
ఇదివరకు తెలిసిన చోటే కనుక నేరుగా సుబ్బరామయ్య గారి ఇంటికి వెళ్ళాడు జీవన్. పసుపు కుంకాలతో అలంకరించబడిన ఎత్తైన గడపను దాటి, ఇంట్లో ప్రవేశించాడు. ద్వారబంధానికి కట్టబడిన బంతిపూల దండలు ఆశీర్వదిస్తున్నవాటిలా జీవన్ శిరస్సును తాకాయి. వాటికి వినమ్రుడై తలవంచుకుని గడపదాటి లోనికి ప్రవేశించాడు జీవన్.
కచేరీ చావడిలో పడకకుర్చీలో కూర్చుని, ఏదో వేదాంత గ్రంధాన్ని చదువుకుంటున్న సుబ్బరామయ్య గారు జీవన్ని చూడగానే వికశించిన ముఖంతో లోనికి ఆహ్వానించారు.
“రా బాబూ! శాన్నాళ్లకు కనిపించావు. మళ్ళీ యాజులు పనిమీద వచ్చావా ఏమిటి! ఇలారా, వచ్చి కూర్చో” అంటూ దగ్గరలోనే ఉన్న కుర్చీని చూపించాడు పెద్దాయన.
ఆయన అడిగిన కుశల ప్రశ్నలన్నింటికీ జవాబులిచ్చి, ఆయన చూపించిన కుర్చీలో కూర్చున్నాడు జీవన్. కొంతసేపు ఆయనతో కబుర్లు చెప్పి, ఆ తరువాత అన్నాడు, “మీ అబ్బాయి ఇప్పుడు ఈ ఊరి జూనియర్ కాలేజిలోనే ఇంగిలీషు లెక్చరర్ గా పనిచేస్తున్నారుట కదా! క్రితం మాటు నేను వచ్చినప్పుడు ఆయన ఊరిలో లేకపోవడంతో కలుసుకోలేకపోయాను. ఈసారి ఆయనను కలుసుకుని వెళ్ళడానికి వచ్చా; ఒకసారి పిలుస్తారా.”
సుబ్బరామయ్య కొడుకుని పేరుపెట్టి పిలిచాడు. తండ్రి పిలుపు విని వచ్చిన సుధీర్, కొత్త వ్యక్తిని అక్కడ చూసి, తండ్రి కుర్చీ వెనకాల నిలబడ్డాడు.
“అన్నట్లు మీరిద్దరూ కలుసుకోడం ఇదే మొదటిసారి కదూ” అంటూ ఒకరినొకరికి పరిచయం చేశారు సుబ్బరామయ్య గారు. జీవన్ లేచి వెళ్లి సుధీర్ తో కరచాలనం చేశాడు.
పట్టుకున్న చెయ్యి విడవకుండా, “అసలు నేను వచ్చింది మీతో మాట్లాడిపోదామని. మీరు పెద్ద మనసు చేసుకుని, నా మాటలు విని, మంచి మనసుతో అర్ధం చేసుకోండి” అన్నాడు తాను వచ్చిన పనికి ఉపోద్ఘాతంగా జీవన్.
సుధీర్ ముఖంలో అతని అంతర్మధనం తాలూకు ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొహం పీక్కుపోయి, కళ్ళు లోతుకుపోయి, అతడు సర్వం కోల్పోయిన వాడిలా దీనంగా ఉన్నాడు. అది చూసి జీవన్ సంతోషించాడు. దానివల్ల సుధీర్ కి జాహ్నవి మీద ప్రేమ ఉందనీ, జరిగినదానికి అతడు పశ్చాత్తాప పడుతున్నాడనీ అర్ధమయ్యింది.
తండ్రినీ కొడుకునీ మార్చి మార్చి చూసి, ఆపై సుబ్బరామయ్యగారితో అన్నాడు జీవన్, “అయ్యా! నేను మీకంటే బాగా చిన్నవాడిని. మీకు చెప్పదగినవాడిని కాను. కానీ మీరు నన్ను క్షమించాలి, నాకు తోచిన మాట ఒకటి మీకు చెప్పకుండా ఉండలేకపోతున్నాను … నేను ఇక్కడకు వచ్చాక, జరిగినదంతా విన్నాను. విషయం ఈ స్థాయికి వచ్చాక, మీరుకాక మీ అబ్బాయి పరువును గురించీ, సుఖ సంతోషాలను గురించి ఇంకెవరు ఆలోచించాలి చెప్పండి! జాహ్నవిగారి పరిస్థితి మీకు తెలియనిది కాదుకదా! మీ అబ్బాయి … ”
సుబ్బరామయ్య గారికి జీవన్ మాటలు కోపం తెప్పించాయి. ఉక్రోషంతో గొంతెత్తి అన్నారు, “ఇదిగో అబ్బాయ్! నీకు కాని విషయాల్లో తలదూర్చి నిష్టూరపడకు. నువ్వు వచ్చిన పని ఏదో, అది నువ్వు సరి చూసుకుని వెళ్ళిపో. నువ్వీ ఊరివాడివైనా కావు, మా గొడవలు నీ కెందుకు? ప్రతి వాడిలోనూ మరొకడికి నీతులు చెప్పాలన్న ఉబలాటమే కనిపిస్తుంది. తనదాకా వస్తేగాని తెలియదు తగులాటం ఏమిటో!”
వెంటనే జవాబు చెప్పాడు జీవన్, “నీ కెందుకు” అన్నారు, బాగుంది. ఎందుకో చెపుతాను వినండి; అపార్ధం చేసుకోవద్దు. క్రితం మాటు నేను ఈ ఊరు వచ్చినప్పుడు కరణంగారి ఇంట్లో వారం రోజులు ఉండవలసి వచ్చింది. అప్పుడు విన్నా జాహ్నవి గారిని గురించి. అప్పుడే అనుకున్నా, ఆమెకు నేను చేయగలిగిన సాయం చెయ్యాలని. దానికీ ఒక కారణం ఉంది …
నేను పుట్టడానికి ఇంకా మూడునెలల కాల వ్యవధి ఉందనగా, మా నాన్నగారు ఒక ప్రమాదంలో చనిపోయారు. ఆ తరువాత నన్ను పెంచడానికి మా అమ్మ ఎంత కష్టపడిందో నాకు తెలుసు. కానీ, చిన్నవాడిని కావడంతో నేను మా అమ్మకి ఏ సాయం చేయలేకపోయా. నేను పుట్టకపోతే మా తాతయ్య మా అమ్మకి మరో పెళ్లి చేసి, కొత్త జీవితాన్ని ఇచ్చి ఉండేవాడు. కానీ, నా వల్ల అలా జరగలేదు. మా అమ్మపడ్డ కష్టాలకు కారణం నేనే నన్న అపరాధ భావం నాలో ఉండిపోయింది. నా మనసులోనుండి ఆ గిల్టీ ఫీలింగ్ పోవాలంటే కనీసం మా అమ్మలా కష్టాలపాలైన ఒక దైవోపహతురాలికి సాయపడి, ఆమెను ఆ కష్టాలనుండి గట్టెక్కించాలి అనుకున్నాను. ఆ తరువాత, నాకు - అలా కష్టాల కడలిలో ఈదులాడుతూ కనిపించిన మొదటి వ్యక్త్తి జాహ్నవి గారు. ఆమెను పెండ్లాడి, ఆ ఇద్దరు బిడ్డలకు తండ్రినై, మా అమ్మ ఋణం కొంతైనా తీర్చుకుందామని అప్పుడే అనుకున్నాను. కానీ అప్పుడు నేను నిరుద్యోగిని. పూటకు ఠికాణా లేని వాడిని. అందుకనే నా మనోభావాల్ని నా మనసులోనే దాచుకుని, నోరు మూసుకుని వెళ్ళిపోయా.
నేనిప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. ఇప్పుడు నాకు పెళ్లి చేసుకునే అర్హత వచ్చింది. నేనిప్పుడు వచ్చింది ఆ పనిమీదే! ఇక్కడి పరిస్థితులు అనుకూలంగా ఉంటే, నా మనసులోని మాట కరణం గారికి చెప్పాలని వచ్చాను. ఇక్కడకు వచ్చాక జరిగినదంతా తెలిసి, ఉండబట్టలేక, మీతో సబబు మాటాడాలని ఇటు వచ్చా. అప్పుడూ ఇప్పుడూ కూడా, ఆమెకు సాయపడాలన్న కోరిక తప్ప నాకు మారే దురూహలూ లేవు.”
గట్టిగా ఊపిరిపీల్చి, ధైర్యాన్ని కూడగట్టుకుని, నోరు విప్పాడు సుధీర్, “ఈ సమస్యను సృష్టించిన మహాపాపిని నేను! కానీ దీనినుండి బయటపడే దారేమిటో నాకు అంతు పట్టటంలేదు. నే నెవర్నీ ఒప్పించలేకుండా ఉన్నాను” అన్నాడు ఏడుపు గొంతుకతో.
“సుధీర్ గారూ! మీరేమీ ఇదవ్వకండి. అన్నీ సద్దుకుంటాయి. జీవితమన్నాక సమస్యలు ఉండకమానవు. సమస్యలతోపాటు సద్దుబాటులూ ఉంటాయి. వాటిని మనం వెతికి పట్టుకోవాలి. అంతేగాని మతిపోగొట్టుకుని బేజారయిపోకూడదు.”
ఆ తరవాత జీవన్ సుబ్బరామయ్యగారి వైపుకి తిరిగి, “బాబాయ్ గారూ! మీరు మీ బిడ్డలపై కొంచెం కనికరం చూపించాలి. జాహ్నవిగారు, ఆమె గర్భంలో జీవం పోసుకుంటున్న మీ వంశాంకురం ఘోర ప్రమాదంనుండి ఇప్పుడిప్పుడే బయట పడ్డారట! కాస్త కోలుకోగానే ఆమెకు అబార్షన్ చేయించాలనుకుంటున్నారు కామేశంగారు. పుట్టి ఉన్న బిడ్డలకే ఠికాణా లేదు, ఇక పుట్టబోయే బిడ్డని ఎవరు పెంచుతారు - అని అడుగుతున్నారు కామేశం గారు. మీ వంశాంకురం, మీ ఏకైక పుత్రుని తొలి సంతానం, తల్లి కడుపులో ఉండగానే కరకు కత్తులకు చిక్కి, తునా తునకలై చనిపోవడం మీకు సమ్మతమేనా? ఇప్పుడు ఈ భ్రూణ హత్యా పాపం ఎవరికి చెందుతుంది?”
జీవన్ ఆ ప్రశ్న వేసి, గుక్కతిప్పుకోడానికన్నట్లు మాటలు ఆపాడు.
ఆ ముగ్గురి మనసుల్లోనూ ఆ ప్రశ్న రేపిన భావోద్వేగంతో ఆ గదిలోని గాలి కంపించింది. ఆ గది నాలుగు గోడలూ “ఈ పాతకం ఎవరిదీ? ఎవరిదీ? ఎవరిదీ” అని ప్రతిధ్వనిస్తున్నట్లుగా తోచింది వాళ్లకు. సుధీర్ కళ్ళనుండి పట్టరాని దుఃఖం ప్రేరేపించగా కన్నీరు మున్నీరయ్యి, అతని చెంపలవెంటధారలు కట్టింది. సుధీర్ తండ్రి కుర్చీ వెనుక నిలబడి ఉండడంతో, ఆ కన్నీరు సుబ్బరామయ్యగారి బట్టతలపై పడి, గిలిగింతలు పెట్టి, తమ ఉనికిని ఆయనకు తెలియజేసి, క్రిందకు జారి, చెవులపక్కన ఉన్న కొద్దిపాటి జుట్టులోకి చేరి, ఇంకిపోయింది.
సుబ్బరామయ్యగారికి కొడుకు పరిస్థితి అర్ధమయ్యింది. కానీ, ఆయనలోని బింకం ఏమాత్రం సడలలేదు. “చాలు, ఇక చాలు గాని పెద్దమనిషీ! ప్రతి కుటుంబానికీ కొన్ని కొన్ని సాంప్రదాయాలు, చట్టుబండలూ ఉంటాయి కదా! నిప్పు కడిగి పొయ్యి ముట్టించేటంత ఆచారవంతులు మా వాళ్ళు. గొప్ప సాంప్రదాయిక వంశం మాది. అయినా, మా అబ్బాయి వల్ల తప్పు జరిగింది కనుక, అది సరిదిద్దుకోడం కోసం మేము జాహ్నవిని కోడలిగా చేసుకోడానికి అంగీకరించాము. అంతేకాదు, జాహ్నవి చిన్నప్పుడు ఎక్కువ భాగం మా ఇంట్లోనే ఆడుకునేది. ఆమె మీద మాకున్న వాత్సల్యంతో, అదెంత అనాచారమైనా సరే, ఆమెను కోడలిగా చేసుకోడానికి ఒప్పుకున్నాము. అది అలుసుగా చేసుకుని, మా కామిగాడు అంటాడూ - మాకు ఏమీకాని ఆ ఇద్దరుపిల్లల బాధ్యత కూడా మేమే తీసుకోవాలి - అంటున్నాడు. ఆ పిల్లలది మా గోత్రమా, మా ఇంటిపేరా! రేపు వాళ్ళు మా ఇంటిపిల్లల్లో ఎలా కలుస్తారు? ఇదేమీ మ్లేచ్ఛదేశం కాదు, “నీ పిల్లలూ, నా పిల్లలూ కలిసి మన పిల్లల్ని కొడుతున్నారు” అని సిగ్గులేకుండా చెప్పడానికి! ఇప్పటికే ఊరంతా పగలబడి నవ్వుతోంది. మనకి కొన్ని నియమాలు, నిష్టలూ ఉన్నాయి.” సుబ్బరామయ్యగారికి ఆయాసం వచ్చింది. అయినా ఆయన ఊరుకోలేదు. క్షణం ఆగి, ఊపిరి పీల్చుకుని, మళ్ళీ మొదలుపెట్టారు…
“ఈనాడు ఇలా జరిగిందంటే దానికి మూలకారణం మా కామిగాడే! బ్రతిమాలాను, మనమిద్దరమూ వియ్యమందుదామని, విన్నాడా? లేదే! ఏదో గొప్ప సంబంధం వచ్చిందంటూ మమ్మల్ని తోసి పారేశాడు. ఎలాగైనా నచ్చజెప్పాలని చూశా, అన్నింటికీ అన్నీ చెప్పాడు. గొప్ప సంబంధమున్న మోజులో మా కావుడికి కళ్ళు బైర్లుకమ్మాయి. అభం శుభం తెలియని కూతురు గొంతు నిలువునా కోసేశాడు. అంత దరిద్రపు సంబంధం మరొకటి లేదని, తరవాత తెలిసింది. ఆపై ఎంత ఏడ్చి ఏమిలాభం! అప్పుడే వీళ్ల పెళ్ళి జరిగి ఉంటే ఎంత బాగుండేదో కదా! ఇప్పుడు చెప్పు తప్పు ఎవరిదో! ఒక్కొక్కప్పుడు ఇలా పెద్దవాళ్ళు చేసిన తప్పులకు పిల్లలు బలైపోతూంటారు. ఇంత జరిగినా కూడా, ఇప్పటికీ జాహ్నవి మీద మాకున్న ప్రేమ తగ్గలేదు” అంటూ బాధగా నిట్టూర్చారు సుబ్బరామయ్యగారు.
“ఐతే ఇంకా ఆలస్యమెందుకండీ? వాళ్ళకి పెళ్లి జరిపించెయ్యండి” అన్నాడు జీవన్ సంతోషంగా.
“బలేగా చెప్పావురా అబ్బాయీ! అదంత తేలిక వ్యవహారమా ఏమిటి? మన సంస్కృతీ, సాంప్రదాయాము ఏమని చెపుతున్నాయి? ఇహపరాలు రెండింటికీ మనకు దక్షత కావలసినది సంతానమే కదా! ఇక ఆ పిల్లలమాట ఏమిటి? వాళ్ళని నేను నా మనుమలుగా ఒక్కనాటికి కూడా ఒప్పుకోలేను, వాళ్ళు మాకేమీ కారు.” కోపం ప్రకోపించి, ఆయన మొహం ఎర్రబడింది.
ఆకోపం చూసి జీవన్ గతుక్కు మన్నాడు. ఇక లాభం లేదు, మరోదారేదైనా దొరుకుతుందేమో- వెతకాలి - అనుకున్నాడు.
“ఇది మీకు తెలుసా? నిన్న, తండ్రి తరఫు వారొకరు, “మాకు పిల్లలు లేరు, వీడిని దత్తత చేసుకుని, మా కొడుకులా పెంచుకుంటా” మంటూ వచ్చారుట. వెంటనే మరో ఆలోచన లేకుండా పిల్లాడిని వారికిచ్చి పంపేశారుట. ఇక ఉన్నది పిల్ల మాత్రమే!” ఆడపిల్ల కదా! ఎక్కువరోజులు ఉండదు. ఆ పిల్లను కొన్నేళ్లు పెంచి, పెళ్లి చేస్తే చాలు - అత్తారింటికి వెళ్ళిపోతుంది. ఆ కన్యా దానఫలం మీకే దక్కుతుంది.” గొప్పగా చెప్పాననుకున్నాడు జీవన్.
“బలే చెప్పావురా అబ్బాయ్!” అంటూ సుబ్బరామయ్యగారు ఒక వెడనవ్వు నవ్వారు. “శాస్త్రం నీకేమి తెలుసనీ అలా మాట్లాడుతున్నావు? వధూవరులను పెళ్ళికి సిద్ధంచేస్తూ, వాళ్ళు ఏ యే వంశాలకు చెందిన వాళ్ళో, వాళ్ళ తాత తండ్రులెవరో - అన్నీ ఏకరువు పెడతారు పురోహితులు. అలా ఆ సమయంలో ఎవరి వంశం పేరు చెపుతారో వాళ్ళకే చెందుతుంది ఆ కన్యాదానఫలం. ఇక మనకు మిగిలేది, పెళ్ళికి చేసిన అప్పులు మాత్రమే!”
“మా సుబ్బడు మహా మొండివాడు, ఎంతకీ లొంగడు” అన్న కరణంగారి మాట గుర్తువచ్చింది జీవన్ కి. ఇంక ఇదికాదు పని, స్టేటజీ మార్చాలి - అనుకున్న జీవన్, సుధీర్ వైపు చూసి అడిగాడు, “అంతా విన్నారుకదా, ఇంక మీ అభిప్రాయమేమిటో చెప్పండి సార్!”
“నా అభిప్రాయమా! నేను బాగా అలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను. నేను నా తల్లిదండ్రులమాట కాదనలేను, జాహ్నవిని పెళ్లిచేసుకోను. అలాగని జాహ్నవిని మరచిపోనూలేను. నేనామెను చిన్నతనం నుండే ప్రేమించాను. ఇప్పుడు ఆమె నా భార్య అనుకున్నాను. కానీ, పెళ్లి చేసుకోడానికి తగని పరిస్థితి వచ్చింది. నా మనసు వేరే వనితను పెళ్లి చేసుకోడానికి ఇష్టపడదు. నేను జీవితాంతం పెళ్లి చేసుకోకుండానే ఉండిపోవాలి అనుకుంటున్నాను. అదే నేను ఆమెకు చేసిన ద్రోహానికి తగిన శిక్ష - అని, అనుకుంటున్నాను. అదే నా పాపానికి నిష్కృతి!” తలవంచుకుని తన స్థిరమైన అభిప్రాయాన్ని చెప్పేశాడు సుధీర్.
కొడుకు చెప్పిన మాటలు విని, నిర్ఘాంతపోయారు సుబ్బరామయ్యగారు. సుధీర్ జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఉండిపోవడమన్నది ఆయనకు నచ్చలేదు. ఆ మాట ఆయనకు ఆశనిపాతంలా తగిలింది. “బాగుందిరా నాయనా, నీ తీర్పు! నువ్వు మాకు ఒక్కగానొక్క కొడుకువు! నువ్వు పెళ్లి చేసుకోకపోతే మన వంశం ఏమైపోవాలి?” ఆక్రోశించినట్లుగా అన్నారు ఆయన.
సుధీర్ జవాబు చెప్పలేదు. మళ్ళీ సుబ్బరామయ్యగారే అన్నారు, “సుధీ! నువ్వలా మాట్లాడడం భావ్యం కాదు. మన వంశాన్ని నిలబెట్టే బాధ్యత నీ మీద ఉంది” అన్నారు.
“నన్నర్ధం చేసుకో నాన్నా! నేను మీ మాటా కాదనలేను, అలాగని జాహ్నవిని మరిచిపోనూ లేను. ఆమె నా మూలంగా ఆత్మహత్యా ప్రయత్నం చేసిందంటే, నేను భరించలేకపోతున్నాను. ఏమి చెయ్యాలో తెలియక ఉరేసుకొని చచ్చిపోవాలనిపిస్తోంది నాకు.”
“బాగుందిరా నీ బెదిరింపు. ఇలా నన్ను భయపెట్టి లొంగదీసుకోవాలన్న ప్రయత్నమా ఏమిటి? ఇప్పటికే నేను సగం దిగివచ్చి జాహ్నవిని కోడలిగా చేసుకోడానికి ఒప్పుకున్నా. ఇప్పుడు ఈ పిల్లనికూడా నెత్తిన పెట్టుకోవాలన్నమాట! ఏంచెయ్యను, పాలకోసం రాయిని మొయ్యాలి, తప్పదు” అన్నారు సుబ్బరామయ్యగారు కొడుకువైపు చురచురా చూస్తూ నిష్టూరంగా.
అక్కడితో ఊరుకోకుండా ఆయన తనలోతాను అనుకున్నారు, “మగపిల్లాడు కనుక దత్తత తీసుకున్నారు జాహ్నవి కొడుకుని. ఇక మిగిలింది ఆడపిల్ల! దీని నెవరూ పెంచుకుంటామనరు. ఈ పీడ నాకు తప్పదు. దాని ముఖం చూసినప్పుడల్లా నాకు పూర్వాపరాలన్నీ గుర్తుకు రాక మానవు. ఇది ఏనాడు చేసుకున్న పాపమో!”
దగ్గరలోనే కూర్చుని ఉన్న జీవన్ కి ఆయన మాటలు శుభ్రంగా వినిపించాయి. అతడు ఆ పసిపాపను తలుచుకుని బాధపడ్డాడు. ఆ పాప నా దుర్దశనుండి తప్పించడానికి ఏదైనా మార్గం ఉందా - అని ఆలోచించాడు. అతనికి ఒక మార్గం తోచింది.