Menu Close
Kadambam Page Title
ఏది నిజం???
పావని యనమండ్ర

ఓ మిత్రమా !!
ఏది కులం
ఏది మతం
నిన్ను ఆపిందా ఈ ప్రశ్న??

పుట్టగానే పెట్టె పేరులో ఉన్నదా నీ కులం?
నీ తల్లి పంచే రక్తం లో ఉన్నదా ఈ మతం?

ఒడిలో తల్లి చెప్పలేదే
సమాజం ఇది అని
బడిలో గురువు చూపించలేదే
ఇది కూడా ఒక మలుపు అని

నీకు తెలుసా బాల్యంలో నీ ఆశయం
నీముందు ఉన్నది నీ ప్రపంచమా
లేక నీకోసం సృష్టించిన ఒక చిత్రమా

బాల్యం ముగిసింది నీకు తెలియకుండానే
యవ్వనం నీ గురించి ఏమి దాచింది
ఉడుకు వయసులో చెప్పిన ఆ మాట నిజమై
ఎదిగి ఎదిగి చూపించింది ప్రగతి బాట
గమనించావా లేక ముందుకు సాగిపోయావా

సమాజం తలుపులు తీసిందా నీకు ఇప్పుడు
లేక ఇక సంకెళ్లు తెంచుకొని వచ్చావా ముందుకు
అధికారం చేతులో ఉన్నవాడిదే రాజ్యమా
లేక ఆ పట్టం నువ్వు ఇచ్చావా

ఆకలి అనకముందే అమ్మ అన్నం పెట్టింది
మరి అదే అమ్మ నువ్వు కృషి చెయ్యకుండా
ముద్ద నోటికి వస్తుందని చెప్పిందా?
చమట చిందించకుండా లేదు మన పయనం మిత్రమా
నిరుద్యోగం మనకి శాపం అని
అనుకున్న వారిలోని నిరాశను తరిమి కొట్టి
స్ఫూర్తిని నింపుతూ ముందుకు సాగు.

ఎవరో వచ్చి ఏదో సాయం చేస్తారు అన్నది లేదు
నీకు  నువ్వే ఒక సైన్యం అని గుర్తుపెట్టుకో
సమాజ ఒడిదుడుకులను గొంతెత్తి ప్రశ్నించు,
చేతిలో చెయ్యి కలుపు మానవత్వం పరిమళించేలా
జీవన యానంలో ముందుకు సాగిపో

నువ్వు శ్రామికుడిలా కృషి చెయ్యి
స్వార్థం నీ కళ్ళు  కప్పేయక ముందే మేలుకో
నిలబడి గొంతెత్తి సమాజాన్ని ప్రశ్నించు
నీ జీవిత గమనంలో ఎదురులేని
ఒక మనిషిలా నిలిచి ఉన్నత శిఖరాలను అధిరోహించు.
అదే నీ జీవితాశయం అవ్వాలని ఆకాంక్షించు!!!!

Posted in October 2024, కవితలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *