Menu Close
Shabdavedhi pagetitle
-- గౌరాబత్తిన కుమార్ బాబు --

రాయ్ దర్శనం

Mn roy2

భారతదేశంలో విస్మృత మహనీయుల్లో ఎన్నదగిన వ్యక్తి మానబేంద్రనాథ్ రాయ్. సాయుధ విప్లవకారునిగా తన ప్రస్థానం మొదలుపెట్టి కమ్యూనిస్టుగా పరిణామం చెంది తుదకు మానవవాదిగా రూపాంతరం చెంది మానవాళికి 'నవ్య మానవవాదం' అనే సిద్ధాంతాన్ని అందించారు.

కొన్ని వేల సంవత్సరాల క్రితం మానవ సమాజం ఏర్పడి అనేక విధాలుగా రూపాంతరం చెందుతూ వస్తుంది. మార్పు తప్ప మరేదీ శాశ్వతం కాదని మానవ ప్రస్థానం నిరూపించింది. జంతువు నుండి మనిషిని వేరు చేసేవి విచక్షణ, వివేకం, విజ్ఞానం. ప్రకృతిని తనకు అనుకూలంగా వాడుకుని జీవించే శక్తి మానవునికి ఉంది. ప్రకృతిని, పరిసరాలను మార్చుకుని ముందుకు పోయే కొద్దీ మనిషి తానూ మారుతూ వస్తున్నాడు.

‘ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం. నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణం’ అన్నారు శ్రీ శ్రీ. ఉన్నతమైన మానవ సమాజమని మన భారతీయులు చెప్పుకునే కృత యుగంలో, అదీ సత్య హరిశ్చంద్రుని కాలంలో, బానిస వ్యవస్థ ఉన్నట్లు చదువుకున్నాం. విజ్ఞాన కుసుమాలు విరబూసిన నేడు కూడా బానిసత్వం ఏదో ఒక రూపంలో కొనసాగుతూనే ఉన్నది.

సర్వ మానవాళి శాంతి సంతోషాలతో జీవించగలిగేది ఎప్పుడు? అన్నమో రామచంద్ర అన్న ఆకలి కేకలు, అజీర్తి బాధలు ప్రక్కప్రక్కనే తాండవించే పరిస్థితులు మారేదెపుడు.

పారిశ్రామిక విప్లవం వచ్చిన తరువాత మానవ జాతి ప్రస్థానం కీలకమైన మలుపులు తీసుకున్నది. విజ్ఞాన శాస్త్రం ఉచ్ఛ దశను చేరుకున్నది. ప్రకృతి విధ్వంసం ఊపందుకున్నది. జనాభా ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయింది. కానీ అంతకు ముందున్న ధనికబీద తారతమ్యాలు, కుల మత ఛాందస వాదాలు, ఒకరిని ఒకరు చంపుకోవడాలు, నాగరికత విధ్వంసాలు కొనసాగుతూనే ఉన్నాయి.

భూస్వామ్య విధానం గావచ్చు,పెట్టుబడిదారీ విధానం కావచ్చు బీదరికాన్ని సృష్టించాయి, కొంత మంది దగ్గరే సంపద పోగుపడే విధంగా సమాజాన్ని నియంత్రించాయి. ఈ ధనిక, బీద తారతమ్యాలకు సొంత ఆస్తి కలిగి ఉండటమే కారణమని తలచి కార్ల్ మార్క్స్ మహాశయుడు పెట్టుబడిదారీ వ్యవస్థను కూలదోయడానికి కమ్యూనిస్టు ప్రణాళికను ప్రకటించాడు. పెట్టుబడిదారీ వ్యవస్థను గురించి విశ్లేషించిన మార్క్స్ క్యాపిటలిజం కూలిపోయి కమ్యూనిజం ఏర్పడిన తరువాత సమాజం ఏ విధమైన మార్గాన్ని అనుసరించాలో సూచించలేదు. అంతే కాకుండా శ్రామిక నియంతృత్వం పేరిట కమ్యూనిజం వెర్రి తలలు వేస్తూనే వున్నది. వ్యష్టికి ప్రాముఖ్యతనిస్తూ వ్యక్తి స్వేచ్ఛను కమ్యూనిజం విస్మరిస్తే, వ్యక్తి స్వార్ధాన్ని పెంపొందిస్తూ సమాజ శ్రేయస్సును క్యాపిటలిజం విస్మరిస్తోంది.

ఈ వైరుధ్యాన్ని సరిజేస్తూ స్వేచ్ఛ, సత్యాన్వేషణ, హేతుబద్ధ ఆలోచనల ప్రతిపాదికిన మానవాళి శాంతి సంతోషాల కోసం ఓ సమగ్ర సిద్ధాంతాన్ని రూపొంచే ప్రయత్నం చేశారు యం.యన్.రాయ్.

రాయ్ ఆలోచనల గురించి విపులంగా తెలుసుకోవడమే 'రాయ్ దర్శనం' అనే వ్యాస పరంపర యొక్క ఉద్దేశం.

***సర్వే భవంతు సుఖినహా***

Posted in October 2024, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!