Menu Close
హృదయగానం (ధారావాహిక)
నేడే విడుదల
-- కోసూరి ఉమాభారతి --

డా.అక్కినేని శతజయంతి సందర్భంగా 'సిరికోన-జొన్నలగడ్డ రాంభొట్లు, సరోజమ్మ స్మారక నవలా రచన పోటీలో ఉత్తమ నవల బహుమతి పొందిన రచన!

Uma-Bharathi-Kosuri

రచయిత్రి పరిచయం ..

Uma-Bharathi-Kosuri‘నాట్యభారతి’ ఉమాభారతి - నర్తకి, నాట్య గురువు, నటి, రచయిత్రి, దర్శక - నిర్మాత

కూచిపూడి, భరతనాట్యం నృత్యరీతుల్లో నిష్ణాతురాలు ఉమాభారతి. మేటి నర్తకిగా, గురువుగా అంతర్జాతీయ ఖ్యాతి గడించారు ఆమె. పద్నాలగవ యేట అఖిలభారత కూచిపూడి నృత్య పోటీలో మొదటి స్థానం గెలుపుతో మొదలయిన ఆమె కళాజీవన ప్రస్థానం విదేశీ పర్యటనలు, జాతీయ అంతర్జాతీయ అవార్డులు, సినీరంగ ప్రవేశంతో... బహుముఖ ప్రజ్ఞాశాలిగా కొనసాగింది.

'సుడిగుండాలు' చిత్రంలో బాలనటిగా పరిచయమయి, సాహిత్య అకాడమీ అవార్డు పొందిన 'చిల్లరదేవుళ్ళు' చిత్రంలో కథానాయకిగా, 'యమగోల' చిత్రంలో ఊర్వశిగా నర్తించిన ఉమాభారతి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో విద్యార్ధి దశలోనే ‘భారతీయ నృత్య రీతులు’ అనే డాక్యుమెంట్రీ, సింగపూర్, జోహన్నస్బర్గ్ టి.వి లకి ‘నర్తకి’ టెలి-ఫిలిం, ‘క్లాసికల్ డాన్సస్ ఆఫ్ ఇండియా’ అనే ఎడ్యుకేషనల్ వీడియో నిర్మించి నటించారు.

ఆమె స్థాపించిన 'అర్చన ఫైన్-ఆర్ట్స్ అకాడమీ' ద్వారా నిర్మించి, దర్శకత్వం వహించిన 'ఆలయనాదాలు' టెలి-ఫిలిం జెమినీ టీవీలో సీరియల్ గాను, అంజలి వీడియోస్ ద్వారా విదేశాల్లో నేరుగాను పంపిణీ చేయబడింది.

సౌతాఫ్రికా, మారిషస్, సింగపూర్, మలేషియా, అమెరికాలో నృత్య ప్రదర్శనల ద్వారా పెక్కు ఆలయ నిర్మాణ నిధులకు, తెలుగు భాషా-సంస్కృతి అభివృద్ధి కార్యక్రమాలకు, వరద బాధితుల నిధులకు, నేత్రదాన శిబిరాల నిర్వహణకు, పేద విద్యార్ధుల స్కాలర్షిపాపులకు, లైబ్రరీలకు  పలుమార్లు నిధులను అందించారామె.

గుర్తింపు: 1975 లో శ్రీ మంగళంపల్లి బాలమురళికృష్ణ గారి చేతుల మీదగా స్వరణకంకణంతో పాటు ‘నాట్యభారతి’ బిరుదును, '89 లో పాండుచేరి గవర్నర్ నుండి ‘రాజ్యలక్ష్మి అవార్డ్’, 1981 లో ‘వంశీ’ వారి ‘ఉత్తమ ప్రవాసాంధ్ర  కళాకారిణి’ పురస్కారం, 1991 లో ఆంధ్ర ప్రదేశ్ సినీ గోయర్స్ వారి నెహ్రు సెంటీనియల్, హౌస్టన్ లో 'ఏషియన్ విమెన్స్ వారి ‘వుమన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డులు, 2016 లో ఢిల్లీ తెలుగు సంఘం వారి ప్రవాసాంధ్ర కళాకారిణి గుర్తింపుని అందుకున్నారు ఉమాభారతి.

రచయిత్రిగా: ‘తానా’, ‘ఆటా’ వారి ఉత్తమ ప్రదర్శన అవార్డులు, సృజనాత్మకతకి గుర్తింపు పొందిన నృత్య నాటికలు - భరతముని భూలోక పర్యటన, దేవి స్తోత్ర మాలిక, కన్య, టెంపుల్ బెల్స్, గురువే నమః, పెళ్లి ముచ్చట, మానసపుత్రి, తెలుగు వెలుగు 2013 నుండి నృత్యేతర రచనల్లో వంగూరి ఫౌండేషన్ అఫ్ అమెరికా వారి 'ఉత్తమ రచన పురస్కారం' పొందినవి -  ముళ్ళ గులాబీ, తులసి, ఏమాయ చేసావో?, విదేశీ కోడలు, సరికొత్త వేకువ, 'ఉమాభారతి కథలు' - (కథలు*డయాస్పోరా కథానికలు* లేఖా సాహిత్యం) - కథా సంపుటిలు.

వేదిక, ఎగిరే పావురమా, నాట్యభారతీయం (నవలలు) ఇప్పటివరకు పుస్తక రూపంగా 'వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా' ప్రచురణలుగా వెలువడ్డాయి. ఉమ రాసిన ధారావాహికలు, కథానికలు, కవితలు, నృత్యనాటికలు ప్రముఖ పత్రికల్లోను, పలు అంతర్జాల  పత్రికల్లోను ప్రచురించబడ్డాయి.

తాజాగా..డా. అక్కినేని నాగేశ్వరావు శతజయంతి సందర్భంగా.. సిరికోన - జొన్నలగడ్డ రాంభొట్లు, సరోజమ్మ స్మారక నవలా రచన పోటీలో .. ఉమాభారతి రచన ‘హృదయగానం – నేడే విడుదల’ ఉత్తమ రచన అవార్డుని అందుకుంది.

ఇతర వ్యాపకాలు, కార్యక్రమాలు:

శ్రీ శారదా సత్యనారాయణ మెమోరియల్ ఛారిటీ సంస్థ స్థాపించి యేటా కధా - పద్య - కార్టూన్ ల పోటీలు నిర్వహిస్తూ, సమాజ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఉమాభారతి.

1982 లో అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ స్థాపించి ప్రవాసాంధ్రుల భావితరాలకి నృత్య శిక్షణనిస్తున్నారు.

ఉమాభారతి కుటుంబం:

మేజర్ సత్యనారాయణ, శ్రీమతి శారద: తల్లితండ్రులు, కోసూరి మురళి మోహన్ – భర్త, సత్యజిత్, శిల్ప- సంతానం.
కీ. శే. పద్మశ్రీ వెంపటి చిన్నసత్యం, కీ. శే. కళాప్రపూర్ణ వేదాంతం జగన్నాధ శర్మ –కూచిపూడి గురువులు.
కీ. శే. పద్మశ్రీ  ఫకీరుస్వామి పిళ్ళై,  కళైమామణి శ్రీ. టి.ఆర్. రాధాకృష్ణన్ – భరతనాట్యం గురువులు.

హృదయగానం నవల రచన వెనుక ప్రేరణలు..

ఓ జీవికి సహజంగా సంక్రమించే గుణగణాలు, సామర్ధ్యత, నేర్పు వంటివి ఆ జీవికే సొంతం. పువ్వు వికసించి పరిమళించాలన్నా, మనిషి ఎదిగి సమర్ధవంతంగా జీవించాలన్నా.. సానుకూలత ఎంతైనా అవసరం. సహకారం అందించి, సానుకూలత కల్పిస్తే.. పారలేని యేరు సెలయేరు కాగలదు. కదలిక ఎరుగని కొత్త లేడి పిల్ల లేచి పరుగులు తీయనూ కలదు.

ఒక్కోమారు రాళ్ళని చీల్చుకుని కూడా వికశించగల అపురూపమైన పుష్పం లాగా.. ప్రతికూల పరిస్థితులని సైతం అధిగమించి ఎందరో తామెంచుకున్న మార్గాల్లో రాణించి స్పూర్తిదాయకులు అవ్వగలరు.

ఆ వాస్తవాన్ని ఆధారంగా తీసుకుని రాసిన కథనమే ‘హృదయగానం’. సంగీత విధ్వాంసుల కుటుంబంలో జన్మించిన అమ్మాయి .. ఐదేళ్ల వరకు అమ్మ, అత్త అని కూడా పలుకలేని పరిస్థితి నుండి.. కృషితో, పట్టుదలతో, పెద్దవాళ్ళ సహకారాలతో ప్రఖ్యాత సంగీతకారిణిగా ఎదిగిన వైనమే ఇందులోని ఇతివృత్తం.

అలాగే తల్లితండ్రుల ఆశయాలని, ఆశలను తనవిగా సొంతం చేసుకుని జీవితంలో ముందుకు సాగడంలో తృప్తి, ఆనందం ఉంటాయని కూడా నాయకి తత్వంగా రాసినదే ఈ నవల.

నా మాట:

క్రమబద్దమైన జీవితాన్ని జీవించిన ఓ సామాన్య ఆడపిల్ల పరమేశ్వరి కధనం
ఆమె పథం “జన్మ సార్ధకత - జన్మ సాధికారికత”
శాస్త్రీయ సంగీత గాత్ర విద్వాంసుల కుటుంబంలో జన్మించిన పరమేశ్వరి...
ఐదేళ్ళు నిండినా గళం విప్పి పలుకలేని పసిది
ప్రతికూల వాతావరణంలోనూ వికసించే అరుదైన పుష్పం లాంటిదే ఆ చిన్నారి..
**
అయితే, ఆమె హృదయం చేసే గానం శ్రీరాగం లా గంభీరమైనది...
హృదయగానం ప్రేమ మధురిమలని కురిపిస్తుంది. మార్ధవంగా కారుణ్య రసం చిలికిస్తుంది.
సహన రాగం ఆలపిస్తుంది, విలపిస్తుంది, పరితపిస్తుంది కూడా.
అన్ని భావాలని సమపాళ్ళలో ఆస్వాదిస్తూ రాగాలాపన చేస్తుంది.
ఆమె సంగీత జీవన ప్రస్థానంలోనూ ఎన్నెన్నో మలుపులు... వింతలు, విశేషాలు, అద్భుతాలు.

ఇక నవలను మొదలు పెడతాను. చదివి మీ అభిప్రాయాలతో ఆశీర్వదించ మనవి – మీ ఉమా భారతి

హృదయగానం
…నేడే విడుదల…

మొదటి భాగం

1

hrudayagaanam-01

మూడేళ్ళ పరమేశ్వరి స్వరతంత్రుల పైన…ప్రత్యేక పరీక్షలు నిర్వహించింది డాక్టర్ మాలిని అబ్రహం. సన్నిహితులైన శాంతా, రామ్‌కుమార్‌ల కూతురవడంతో ఆ పాప పట్ల ఆమెది ప్రత్యేక శ్రద్ధ. అందుకే, ప్రఖ్యాత ‘ఢిల్లీ వాయిస్ క్లినిక్’ వారి సౌజన్యంతో పాప సమస్యకి పరిష్కార దిశగా సునిశితమైన వైద్యపరీక్షలు జరిపించి, రిపోర్ట్స్ కోసం ఎదురుచూస్తుంది డాక్టర్ మాలిని.

తన క్లినిక్ నుండి .. శాంత చేతి ‘అల్లం టీ’ తాగడానికి అప్పుడప్పుడు వాళ్ళింటికి వెళుతుంది డాక్టరమ్మ. మరోసారి ప్రసవించబోతున్న శాంతతో, గర్భిణీ స్త్రీల పోషకాహార అవసరాల గురించి ప్రస్తావించడమే కాకుండా… బిడ్డకి  మాట రాలేదన్న దిగులుతో… సతమతమయ్యే తల్లికి ధైర్యం చెబుతుంది.

**

తమ గారాలపట్టి పరమేశ్వరిని ప్రేమగా 'పారూ' అని పిలుచుకుంటారు శాంతా, రామ్‌కుమార్ లు, శాంతను పెంచి పెద్ద చేసిన పెద్దమ్మ… సీతమ్మ కూడా. మనమరాలు పారూ పట్ల ఆమెకు ఎనలేని ప్రేమాభిమానాలు.

పాప వయసుకి తగ్గట్టు మాట్లాడలేకపోవడం...కనీసం 'అమ్మా' , 'అత్తా' వంటి పదాలే కాదు... గుర్తించదగ్గ శబ్దాలేవీ పారూ నోటి వెంట రాకపోవడం... తల్లితండ్రులని నిత్యం కలవరపెట్టే విషయం.

అధైర్యపడవద్దని, దేవుని పై నమ్మకముంచమని వారికి చెబుతుంటారు సీతమ్మ.

**

రాత్రంతా నిద్రపట్టని శాంత తెల్లవారక ముందే... పెద్దమ్మకి ఫోన్ చేసింది. "హలో, పెద్దమ్మా… పరమేశ్వరి పేరిట అక్కడి ఆలయంలోనూ అర్చన చేయించండి. ఆ అమ్మవారు దయ తలిస్తే చాలు... పారూ సమస్య తీరిపోతుంది. తన వైద్య పరీక్షల రిపోర్ట్స్ సోమవారం వస్తాయి. కంగారుగా ఉందమ్మా." అంది దిగులుగా.

“నాకు గుర్తే తల్లీ. బాసర శారదాంబకి ఇవాళ మొగలిపూలతో మొదటి అర్చన మన పరమేశ్వరి పేరిటే జరిపించాను. మూడున్నరేళ్ళ పారూకి మాట రాలేదన్న దిగులు నీది. శారదాంబ కృపతో త్వరలోనే పిల్ల మాట్లాడుతుందన్న నమ్మకం నాది. వంశపారంపర్యంగా మన కుటుంబంలో స్త్రీలకి సంగీతం, గానం పుట్టుకతో అబ్బే కళ. కళామ్మతల్లి తన ముద్దుబిడ్డలని తప్పక ఆదుకుంటుంది, కాపాడుకుంటుంది. నీవు నిరాశపడకు." అన్నారు సీతమ్మ.

ఆమెతో మాట్లాడాక, శుక్రవారం కూడా కావడంతో.. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి, మందిరం ఎదురుగా నిలబడి చేతులు జోడించి ప్రార్థించసాగింది శాంత.

"అమ్మా.. మా బిడ్డని నీవు మాత్రమే బాగు చేయగలవు. పరమేశ్వరికి మాట్లాడగలిగే శక్తినివ్వు. దాని స్వరతంత్రులకి ఏ ఇబ్బందీ లేకుండా చూడు. చక్కని కూతురిని ఇచ్చావు. నీ ఆశీర్వాదంగా భావించి బిడ్డకి నీ పేరే పెట్టుకున్నాం. మా నమ్మకాన్ని వమ్ము చేయకు. దయ చూపు తల్లీ ..." అంటూ ఆర్ద్రతతో లలితా సహస్రనామ స్తోత్ర పఠనం చేసి... పూజ ముగిసాక కూడా అమ్మవారి మండపం ఎదురుగా గోడనానుకుని ధ్యానంలో కూర్చుండిపోయింది.

ఎప్పటికో, తన బుగ్గల మీద పారూ చేతి స్పర్శ తగలడంతో, మెల్లగా కళ్ళు తెరిచి చూసింది శాంత.

ఎదురుగా నీళ్లు నిండిన కళ్ళతో తల్లి వంకే చూస్తోంది పారూ. పాపని దగ్గరకు తీసుకుని, ముద్దు పెట్టుకుంది.

"చూసావా తల్లీ,  నీ గురించి అమ్మవారితో మాట్లాడుతూ నీ ఆకలి సంగతే మర్చిపోయాను. రెండు నిముషాల్లో నీకు ఇష్టమైన ఇడ్లీ పెడతాను..." అంటూ పాపనెత్తుకుని, వంటింట్లోకి నడిచింది శాంత.

**

సోమవారం పొద్దుటే రామ్‌కుమార్ దంపతులు డాక్టర్ మాలినితో సమావేశమయినప్పుడు... పరమేశ్వరి రిపోర్ట్స్ ని చదివి వినిపించిందామె.

తలెత్తి, "ఈ రిపోర్ట్‌ ఆధారంగా... పారూ గురించి భయపడవలసినదేమీ లేదు. పాథలాజికల్ లోపాలు ఏవీ లేవు. గొంతు కండరాలు, స్వరపేటిక ఫంక్షనాలిటీ ... అన్ని అంశాలు ఉండాల్సిన విధంగా ఉండవలసిన స్థాయిలోనే ఉన్నాయి." అని తెలియజేశారామె.

"మరి పాప ఎందుకు మాట్లాడలేకపోతుంది?" అని అడుగుతూ శాంత ఒక్కసారిగా భోరుమంది.

"చూడు శాంతా, కొన్ని ఘటనలు ఎందుకు జరుగుతాయో… మనకి తెలియదు. వాటి గురించి మనమేమీ చేయలేం. వేచి ఉండాల్సిందే. మాట విషయం కాసేపు పక్కన పెడితే, మిగతా అన్ని విషయాల్లో పాప ఆరోగ్యంగానే ఉన్నందుకు మనం సంతోషించాలి. కాదంటావా?" అడిగింది మాలిని.

ఆవిడ అభిప్రాయంతో ఏకీభవించాడు రామ్. మౌనంగా ఉండిపోయిన శాంత వంక చూసాడు.

"చూడు శాంతా... పారూకి నయమవుతుంది. నమ్మకముంచు. దిగులు పడకు.." అన్నాడు భార్య భుజం తడుతూ.

"రిపోర్ట్స్ అదే చెబుతున్నాయి కాబట్టి, ఆ దిగులు వీడి నీ ఆరోగ్యంతో పాటు కడుపులోని బిడ్డ ఆరోగ్యం మీద దృష్టి పెట్టు. సరిగ్గా మూడు నెలల్లో నీకు ప్రసవం అవుతుంది. ఈలోగా నీకెప్పుడు ఏం సహాయం కావాలన్నా నన్ను పిలువు. పగలైనా, రాత్రైనా ఓ ఫోన్ చేస్తే వచ్చేస్తాను." అంటూ ధైర్యం చెప్పింది మాలిని.

శాంత కళ్ళు తుడుచుకుంది. భార్యాభర్తలు డాక్టరమ్మ వద్ద సెలవు తీసుకుని ఇంటి దారి పట్టారు.

**

క్లినిక్ నుండి ఇల్లు చేరగానే సీతమ్మ గారికి ఫోన్ చేసి, మాట్లాడమని భార్య చేతికిచ్చాడు రామ్. కన్నీళ్లు తుడుచుకుంటూ… పారూ రిపోర్ట్స్ ప్రకారం లోపాలేవీ లేవని పెద్దమ్మకి తెలియజేసింది శాంత.

"నాకు నమ్మకం ఉందన్నానుగా తల్లీ... ‘జీవితం యొక్క ఉద్దేశం ప్రయోజనకరమైన జీవితమే’ అన్నాడు ఓ మేధావి. మన చిన్నారి పారూ విషయంలోనూ అలాగే అవ్వాలని అమ్మవారిని వేడుకుందాము. త్వరలో… నీవెంటే కూర్చుని శ్లోకాలు పలుకుంతుందేమో!.

అసలైనా నీ కూతురి వారసత్వం గుర్తుంచుకో. మీ అమ్మతో పాటు మీ నాన్న కూడా సంగీతంలో నిష్ణాతులు. పేరొందిన విద్వాంశులు. పారూకి అంతా సరయిపోతుంది. ప్రశాంతంగా ఉండండి. మా మితభాషి అల్లుడికి నా శుభాకాంక్షలు చెప్పు." అన్నారు సీతమ్మ ఆప్యాయంగా.

నిజానికి, స్వతహాగా రామ్‌కుమార్ మితభాషే. అయినా ఎన్నోసాధించగలడు అన్న పేరుందతనికి. అభ్యుదయ భావాలున్న మనిషి. విశిష్టమైన వ్యక్తిత్వం కలవాడు. సమాజంలోని విభిన్న సంస్కృతులు, వారసత్వాల పట్ల గౌరవం ఉన్న వ్యక్తి. అన్ని మతవిశ్వాసాలలోనూ మంచినే చూస్తాడు. ఎన్నో సేవాసంస్థలలో సభ్యుడిగా ఉన్నతన్ని ఇరుగుపొరుగు వారందరూ బాగా గౌరవిస్తారు. భర్త ఏ నిర్ణయం తీసుకున్నా, దానికి కట్టుబడి ఉండే తత్త్వం శాంతది.

**

కాకినాడ ప్రభుత్వ కళాశాలలో లెక్చరర్ గా పని చేస్తున్నాడు రామ్‌కుమార్‌. పెరుగుతున్న సంసార బాధ్యతల దృష్ట్యా ... కాలేజీ విద్యార్ధులకి శనివారాలు అదనపు తరగతులు నిర్వహిస్తున్నాడు.

ఆదివారాలు మాత్రం తప్పనిసరిగా పొద్దుటే భార్యాబిడ్డలతో కమ్యూనిటీ చర్చికి వెళ్లి అక్కడి సేవాకార్యక్రమాల్లో పాల్గొంటాడు. చర్చిలో పొద్దుటి సర్వీస్, ముగిశాక… డాక్టరమ్మ మాలిని, ఆమె భర్త జోసెఫ్ లతో కలిసి అల్పాహారం తీసుకుని, అక్కడి నుండి బయలుదేరుతారు.

వారి తరువాతి మజిలీ...ఊళ్లోని 'శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయం'. పరమేశ్వరి పేరిట అర్చన చేయించి, ఓ గంటసేపు అక్కడ జరిగే మ్యూజిక్ క్లాసులో చిన్నపిల్లల చేత శ్లోక పఠనం, సరిగమల సాధన చేయిస్తుంది శాంత. పక్కనే కూర్చుని ఏకాగ్రతతో అన్నీ వింటుంది పరమేశ్వరి.

ఆ గంటా, రెండు గంటల సమయంలో గుడి కార్యాలయంలోని కంప్యూటర్, లెడ్జర్ ఖాతాల పర్యవేక్షణ విషయాల్లో సాయం చేస్తాడు రామ్. శాంత క్లాసయ్యాక, ముగ్గురూ కలిసి గుడి కాంటీన్ లో భోంచేసి చీకటి పడే సమయానికి ఇల్లు చేరుకుంటారు.

**

నెల మొదటి వారంలో ... ఓ రోజు కాస్త పెందరాళే ఇంటికొచ్చిన రామ్, నెలవారీ జమాఖర్చులు చూసుకోసాగాడు. శాంతని పిలిచి, పక్కన కూర్చోమన్నాడు. చేతిలోని టీ కప్పు అతనికి అందించి, పక్కనే ఉన్న స్టూల్ మీద కూర్చుందామె. ఇకపై జీతంలో కొంత మొత్తం తగ్గుతుందని చెప్పాడు. పాప వైద్య పరీక్షల కోసం తీసుకున్న అడ్వాన్స్‌లో ప్రతీ నెలా కొంత చెల్లించాల్సి ఉంటుందని వివరించాడు.

“ఏదో విధంగా సర్దుకుందాం. లేదా శనివారాలు మరో మూడు గంటలు క్లాసులు నిర్వహిస్తాను." అంటూ శాంత కేసి చూసాడు.

ఒకింత ఉదాసీనంగా ఉన్న భర్త ముఖంలోకి చూస్తూ.. "కంగారు పడకండి. పారూ కడుపున పడినప్పటి నుండీ ప్రసవం అయ్యాక కూడా… అనారోగ్యం వల్ల…మ్యూజిక్ లెక్చరర్ కొలువు నుండి దీర్ఘకాల సెలవు తీసుకున్నాను. అప్పటి నుండీ కుటుంబ భారమంతా మీరే మోస్తున్నారు.

అందుకే ... నేను మళ్ళీ సంగీతం పాఠాలు చెప్పడం మొదలుపెడతాను. సాయంత్రాలు ఓ రెండు గంటల పాటు మనింట్లోనే. నా ఈ ఆలోచన మన పక్కింటి రేణుక గారితో ఇలా అన్నానో లేదో.. సంగీతం పట్ల ఆసక్తి ఉన్నవారు చిన్నా, పెద్దా ఇరవై మంది దాకా అప్పుడే కబురుపెట్టారు." అంది రామ్ చేతిని తన చేతుల్లోకి తీసుకుని.

క్షణంపాటు ఆశ్చర్యపోయడు రామ్. "ఏంటీ, నమ్మలేకపోతున్నాను. నువ్వు సంగీతం మీద దృష్టి పెట్టడం మంచిదే. కాని ఎలా? పారూ పరిస్థితి ఏంటి? పైగా నీకేమో నెలలు నిండుతున్నాయి. ఇంటి పని, పారు పనితో బాగా అలసిపోతావు." అన్నాడు భార్య భుజంపై చేయి వేసి.

"లేదులెండి. పారూ పనులతో కొంత, దానికి మాటెప్పుడు వస్తుందాని దిగులుతో మరికొంత … ఇన్నాళ్లూ స్తబ్దుగా ఉండిపోయాను. ఇప్పుడు... ఇంత కాలానికి దానికి మాట వస్తదన్న నమ్మకం ఏర్పడింది. నేనిక సంగీతంపై దృష్టి సారించాలి. ప్రస్తుతం ఇంటివద్దే సంగీత పాఠాలతో మొదలుపెట్టి, పిల్లలు కాస్త పెరిగాక ఉద్యోగం విషయం చూడవచ్చని ఆలోచన." అంది శాంత.

“సంగీత సాధన పై దృష్టి పెట్టడం మంచిదే. కానీ ఈ సమయంలో ఇరవైమందికి శిక్షణ ఇవ్వడం మాత్రం సరయిన ఆలోచన కాదు శాంతా. కావాలంటే ... మాలినితో, అత్తమ్మతో కూడా మాట్లాడు ..." అన్నాడు రామ్.

****సశేషం****

Posted in October 2024, కథలు

3 Comments

  1. ఉమాభారతి

    లక్ష్మి గారు.. సమయం తీసుకుని చదివి, కామెంట్ పెట్టిననదుకు మీక ధన్యవాదాలు. తప్పక పూర్తిగా చదువుతారని ఆశిస్తాను. ఊమాభారతి.

  2. సాహితీ రత్న ప్రసాదరావు రామాయణం

    శ్రీమతి ఉమా భారతిగారు ‘ కథ ‘ అన్నారు కానీ, ఇది కథ కాదు నిజ జీవితంలా అనిపిస్తూంది. మూడేళ్ళ వయసు వచ్చిన్నా మాటలు రాకపోవడం అనేది అరుదేమీ కాకపోయినా , అరుదైన రుగ్మతే. ఇదే రుగ్మత మాతమ్ముని మనుమరాలుకు వుంది పాప తలిదండ్రులు పడే ఆవేదనను ప్రతివాని గుండె తడుపుతుంది.
    దృఢమైన నమ్మకం దైవంలా పనిచేస్తుందని శాస్త్రజ్ఞులు చెబుతారు.
    అదే జరుగబోతుందని నా విశ్వాసం
    ఒక అరుదైన లోపాన్ని ఎన్నుకొని కథ నడిపిన తీరు అద్భుతం
    ఉమాభారతి గారు నాట్యభారతే కాదు కథా భారతి కూడా
    వారిని అభినందిస్తూ మరో భాగానికై ఎదురు చూస్తున్నాను

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!