Menu Close
భారతీయ తత్వశాస్త్ర వివేచన
- రాఘవ మాష్టారు కేదారి -

గత సంచిక తరువాయి..

అయితే బాధరాయుని (వ్యాసుని )వేదాంత సూత్రాలు, కపిలుని సాంఖ్యా సూత్రాలు, పతంజలి యోగ సూత్రాలు, కణాదుని వైశేషిక సూత్రాలు, గౌతముని న్యాయ సూత్రాలు, జైమిని మీమాంస సూత్రాలు ఈశ్వరుడు ఉన్నాడని చెబుతాయి. ఆయా సూత్రాల భాష్యకారుల తర్కాన్ని ఆధారంగా చేసుకొని, దేవుడున్నారని నిరూపిస్తారు. వారిలో వాత్సాయనుడు, ఉద్యోత కారుడు, ఉదయానచార్యుడు, కుమారిల బట్టు, ఈశ్వర కృష్ణుడు మొదలగు వారు భారతీయ చింతనారంగం, నాస్తిక భావాలతో నిండిపోయిందని భావించి, దాన్ని ప్రక్షాళనం చేయడానికి ఈశ్వర వాదాన్ని సమర్థిస్తూ, అనేక గ్రంథాలు, వార్తికల, భాష్యాల, కారికల, టీకల రూపంలో పుస్తకాలు వ్రాశారు.

అయితే నాస్తిక దర్శనాలు మరోరకంగా కృషి చేశాయి. వారు భగవంతుని ఉనికిని నిరాకరించారు. అసలు వేదoలో దేవుడు ఉన్నాడా? లేడా? ఉంటే ఎక్కడ ఉన్నాడు? ఎట్లా ఉన్నాడు? ఆయనను మనం ఎందుకు పూజించాలి? యముడు, ఇంద్రుడు, అగ్ని, వరుణుడు, కుబేరుడు, ఈశ్వరుడు మొదలగు దేవతల్లో మనం ఎవరిని ఆరాధించాలి? ఇలా అనేక ప్రశ్నలు లేవనెత్తినారు.

అయితే బుద్ధునికి పూర్వం ఉన్న తాత్వికుల్లో ఆజీవకులు, దేవుని ఉనికిని నిరాకరించారు. ఆలారకాముడు, ఉద్దక రామ పుత్రుడు, సంజయవేలత్తి పుత్రుడు, ఆజిత కంబళుడు, చార్వాక మహాముని, నిర్గంధనాధ పుత్రుడు మొదలగువారు ఈశ్వరుడు లేడని చాటిచెప్పారు.

తరువాత గౌతమ బుద్ధుడు కూడా దేవుని ఉనికిని నిరాకరించాడు. దేవుడు ఉన్నాడా? లేడా? అనే ప్రశ్నకు, ఆత్మ ఉన్నదా? లేదా? అనే ప్రశ్నకు బుద్ధుడు మౌనం వహించారని, కొందరు ఆయనకు అతి జఠినమైన ప్రశ్నకు సమాధానం అర్థం కాలేదని కొందరు అన్నారు. తర్వాత వచ్చిన బౌద్ధ ప్రముఖులు నాగార్జునుడు, చంద్ర కీర్తి, ధర్మ కీర్తి, నాగశేనుడు, దిగ్నాజుడు మొదలగు బౌద్ధ తాత్వికులంతా దేవుడు, ఆత్మ లేవని వాదించి చెప్పారు.

చివరకు క్రియావాదం, అక్రియ వాదం గురించి చర్చించారు. శరీరం ఒక పని ముట్టని, దానికి క్రియాశక్తి ఉందని, ఆలోచన శక్తి లేదని, ఆలోచనా శక్తియే ఆత్మని, కనుక కర్మఫలమంతా ఆత్మ భరించాల్సి ఉంటుందని చెప్పారు.

అయితే ఆత్మను అంగీకరిస్తూ, ఆత్మను కర్తగాను, భోక్తగాను అద్వైతం నిరాకరిస్తుంది. కానీ రామానుజ విశిష్టాద్వైతంలో నిజంగా ఆత్మ కర్త, భోక్తగా ఉంటుందని చెప్పారు.

అయితే మానవ మేధస్సుకు అందని ప్రశ్న ‘మోక్షం’ అని భావించారు. అయితే ఏదో ఒక విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఆశ్రయించి, ఈ ప్రశ్నకు సమాధానం పొందాలే గాని తరిచితరచి తర్కం ద్వారా తెలుసుకోలేము. అనుభవం ద్వారానే తేల్చుకోవాలని, తెలుసుకోవాలనిచెప్పారు.

మోక్షం అంటే ప్రకృతి పురుషుల గురించి వివేక జ్ఞానాన్ని కలిగి ఉండటమేనని.... సాంఖ్య దర్శనం చెబుతుంది.

నిర్వికల్ప సమాధిలో అసంప్రజ్ఞతా సమాధి స్థితిలో ఈశ్వర దర్శనం కోరడమే మోక్షమని యోగ దర్శనం చెబుతుంది.

నిత్య కర్మలు చేస్తూ నైమిత్తిక కర్మలు ఇచ్చే ఫలితాన్ని వదిలివేస్తూ, నిషిద్ధ కర్మలు చేయకుండా ఉండటమే మోక్షమని మీమాంస శాస్త్రం చెబుతుంది.

శైవ దర్శనంలో శివ సాయుజ్యం లభిస్తుంది. వైష్ణవ దర్శనంలో విష్ణు సాంగత్యం దొరుకుతుంది. శంకర అద్వైతంలో బ్రహ్మజ్ఞానానుభూతి కలుగుతుంది. రామానుజుని దర్శనంలో వైకుంఠం లభిస్తుంది. బౌద్ధంలో నిర్యాణం లభిస్తుంది. జైనoలో జినత్వం లభిస్తుంది. చార్వాకంలో ఈ శరీరం కాలిపోయి పిడికెడు బూడిద అవుతుంది. చివరకు మిగిలేది అదే అంటారు నాస్తికులు.

అంతా పరిశీలిస్తే భారతీయ తత్వ చింతన పరమావధి మోక్ష సాధనే అని తేలుతుంది. అది ఎలా సాధించాలన్నదే తత్వశాస్త్రాల వివరణ.

****సశేషం****

Posted in October 2024, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!