Menu Close
Kasi Viswanatham
పలుకుబడి కథలు
-- కాశీ విశ్వనాథం పట్రాయుడు --
అప్పులో అప్పు అల్లుడికో ఉంగరం

Appulo-appu-katha

శ్రీరాంపురం గ్రామంలో నారాయణ మూర్తి, రాధ దంపతులు నివసిస్తూ ఉండేవారు. వారికి ముగ్గురు ఆడపిల్లలు. వారసత్వంగా వచ్చిన కొద్దిపాటి భూమిని సాగుచేసుకుంటూ జీవనం సాగించేవారు.

చాలీచాలని సంపాదనతో కుటుంబం గడవడం కష్టంగా ఉండేది. కొన్నాళ్ళకి ముగ్గురు పిల్లలూ పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు. రోజు రోజుకూ నారాయణ మూర్తి బాధ్యతలు పెరుగుతున్నాయే తప్ప తరగడం లేదు.

"ఈడొచ్చిన పిల్లకు పెళ్లి చెయ్యడం నీ బాధ్యత. ఎప్పుడైనా వాళ్ళు నీకు ‘గుండెలమీద కుంపటే" అని ఇరుగు పొరుగు వారు అనడంతో పెద్ద కూతురికి పెళ్ళి చెయ్యడానికి సిద్ధపడ్డాడు నారాయణ మూర్తి.

చేతిలో చిల్లి గవ్వ లేదు. 'దంచిన దానికి బుక్కిందె కూలి' అన్నట్లు వచ్చిన ఆదాయం కుటుంబ అవసరాలకే సరిపోయేది.

నారాయణ మూర్తి పిల్లలు బుద్ధి మంతులు, పనిమంతులు కావడంతో కోడలిగా చేసుకోవడానికి చాలామంది ముందుకు వచ్చారు. వాటిలో మంచి సంబంధాన్ని చూసి పెద్దకూతురికి పెళ్లి చేయ నిశ్చయించారు నారాయణ మూర్తి దంపతులు.

పెళ్లి సమయం దగ్గర పడుతోంది ఏమీ పాలుపోక దిగాలుగా కూర్చున్నాడు నారాయణమూర్తి. ఇది గమనించిన అతని భార్య దగ్గరగా వచ్చి “ఏంటి మావా అలా ఉన్నావు?" అని అడిగింది.

“పెళ్లి ఎలా చెయ్యాలో అర్ధం కాలేదే” అన్నాడు భారంగా.

“పొలం తాకట్టు పెట్టి పిల్ల పెళ్లి చేద్దాం. తర్వాత కష్టపడి కూలీనాలీ చేసి రూక, రూక కూడబెట్టి పొలం అప్పు తీర్చేద్దాం.” అంది రాధ.

'సరే' నని పొలం తాకట్టు పెట్టి మాఘమాసంలో పిల్ల పెళ్లి అంగరంగ వైభవంగా చేశాడు. కొన్నాళ్ళకి కూతురు నెల తప్పింది. ఏడో నెల వచ్చాక వియ్యాలవారికి సూడిదలు ఇచ్చి కూతురుని పురిటికి తీసుకువచ్చారు.

కొన్నాళ్ళకు పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అప్పు మీద అప్పు చేసి పురిటి ఖర్చులు ఒడ్డెక్కించాడు నారాయణ మూర్తి. ఒకరోజు సాయంత్రం తుండు గుడ్డ తలకింద పెట్టుకుని వాకిట్లో పడుకున్నాడు నారాయణ మూర్తి.

“ఏమయ్యా అలా పడుక్కున్నావ్!” అని అడిగింది భార్య.

“ఏముంది రాధా! మరో ఇరవై రోజుల్లో సంక్రాంతి వస్తోంది. తొలి ఏడాది వియ్యాలవారికి, కూతురు అల్లుడు, మనవడికి బట్టలు పెట్టాలి. అల్లుడికి ఉంగరం కొనాలి. మరో నెలరోజుల్లో బారసాల ఉంది.” అని నిట్టూర్చాడు.

“ఆ ఏముంది మావా ‘అప్పులో అప్పు అల్లుడికో ఉంగరం’.” అంది రాధ.

“అంటే”

“ఏముంది మావా మన దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా ఈ ఖర్చులు తప్పవు, అప్పు చెయ్యక తప్పదు. కష్టపడి ఎలాగోలాగ తీర్చేద్దాం” అంది రాధ.

'సరే' నని అప్పు మీద అప్పు చేసి పండగ లాంఛనం, బారసాల చేశాడు నారాయణ మూర్తి.

చేతిలో నయాపైసా లేనప్పటికీ తప్పనిసరిగా ఖర్చు పెట్టాల్సి వచ్చినప్పుడు, వాటికోసం అప్పు చేసే సందర్భంలో వాడే జాతీయం ఇది.

రచయిత పరిచయం

Kasi Viswanathamనా పేరు కాశీ విశ్వనాథం పట్రాయుడు. నేను వృత్తి రీత్యా ఉపాధ్యాయుడను. ప్రవృత్తి రీత్యా రచయితను. 300 కవితలు, 200 బాలగేయాలు, 50 సాంఘిక కథలు, 250 బాలల కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. పిల్లలతో గడపడం, వారికి కథలు చెప్పడం, వారికి నచ్చిన కథలు రాయడం నాకు ఎంతో ఇష్టం. తెలుగు భాష పట్ల ఆసక్తి కలిగించడానికి, తెలుగు భాష గొప్పతనం, జాతీయాలు, నుడికారాలు, సామెతలు గురించి నేటి తరం పిల్లలకు తెలియచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఇదే ఉద్దేశ్యంతో కొంతమంది రచయితలు ఇంతకు ముందు జాతీయాలు, సామెతలు వాటి పుట్టు పూర్వోత్తరాల గురించి రాశారు. అయితే నేను భాషోపాధ్యాయుల కోరిక మేరకు ఆ సామెతలను, జాతీయాలను ఏ సందర్భంలో ఉపయోగించారు అనే విషయాన్ని కథల రూపంలో అందిస్తున్నాను. వీటిని తరగతి గదుల్లో బోధించడానికి, ఉదాహరణలుగా చెప్పడానికి, జాతీయాలు, సామెతలు పిల్లల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోవడానికి ఎంతగానో ఉపయోగ పడతాయి. నన్ను ప్రోత్సహించి, నా రచనలు విద్యార్థులకు, తెలుగు భాషాభిమానులకు చేరువయ్యేలా కృషి చేయాలని సంకల్పించిన సిరిమల్లె పత్రిక సంపాదకులు మధు బుడమగుంట గారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు. మీ అభిప్రాయాలను క్రింది బాక్స్ లో కామెంట్స్ రూపంలో తెలుప మనవి. – కాశీ విశ్వనాథం.

Posted in October 2024, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!