Menu Close
Shyama-Sundara-Rao
తెలుగు తేజాలు
అంబడిపూడి శ్యామసుందర రావు

హాస్య సాహితీ మూర్తి పుచ్చా పూర్ణానందం గారు

Puccha-Poornanandam

పుచ్చపువ్వులా పరుచుకున్న వెన్నెల లాంటి హాయిదనము, పుచ్చకాయ రసపు చల్లదనము రెండు మేళవించిన హాస్య రచయిత పుచ్చా పూర్ణానందం గారు అంటే సార్థక నామధేయుడు. ఆయన ఇంటిపేరు పుచ్చా కనుకనేమో హాస్య రచయిత అయ్యారు.

‘సంతోషమే సగం బలం కాదు అసలు బలము’ అని వాదిస్తారు ఆయన. అది ఆయన సిద్ధాంతం. పూర్ణానందం గారి లైఫ్ ఫిలాసఫియే హాస్యం. తాను నవ్వుతూ, తన వారిని, చుట్టుపక్కలవారిని ఎప్పుడు నవ్విస్తూ వుండేవారు. పుట్టడమే నవ్వుతూ పుట్టారట. వృత్తి రీత్యా వకీలు గిరి కానీ సంపాదించినది బోలెడు హాస్యపు సిరి. ఈయన రచయితే కాదు నటుడు కూడా. ఈయన గుంటూరు జిల్లా పెద్ద కొండూరు గ్రామంలో 1910 ఆగస్టు 10 న జన్మించారు. దుగ్గిరాలలో SSLC వరకు చదివి రాజమండ్రిలో బిఎ, బెనారస్ హిందూ విశ్వ విద్యాలయంలో మదన్ మోహన్ మాలవ్య వైస్ ఛాన్సలర్ గా ఉండగా ఎమ్.ఏ, ఎల్.ఎల్.బి చదివారు. ఇతడు మొదట తెనాలిలో ప్లీడర్‍గా ఖ్యాతిపొంది, త్రిపురనేని రామస్వామి చౌదరికి సన్నిహితుడిగా త్రిపురనేని గోపీచంద్ సహధ్యాయి గా ఉన్నాడు.

1944లో విజయవాడకు వచ్చి లాయర్‌గా ప్రాక్టీసు కొనసాగించాడు. అయన ఆంధ్ర మహాసభ ఉద్యమంలో పాల్గొన్నాడు. టంగుటూరి ప్రకాశం పంతులు గారితో స్నేహం ఏర్పడింది. వీర సావర్కర్ అంటే ఉండే గౌరవాభిమానాలతో గాంధేయవాది సిద్ధాంతాలకు కొంత దూరంగా నడిచేవాడు. భమిడిపాటి కామేశ్వరరావు గారితో రాజమండ్రిలో పరిచయం ఏర్పడగా ఆయన వ్రాసిన నాటకాలలో పాత్రలు వేసేవారు. భమిడిపాటి ఆయన కోసం కొన్ని పాత్రలు కూడా సృష్టించాడు కూడా.

ఎప్పటికైనా ఈ దేశంలో ఇంగ్లిష్ పోయేదే కనుక నాలుగు కాలాలపాటు ఉండే తెలుగులో రచనలు చేయమని భమిడిపాటి ఇచ్చిన సలహా వల్ల అప్పటివరకు ఇంగ్లిష్ లో రచనలు చేస్తున్న పూర్ణానందం గారు తెలుగులో రచనలు చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు దేశంలో (తెలుగునాట) తెలుగు పోయే రోజులు దాపురిస్తున్నా ఆయన వెలిగించిన హాస్యము తనదైన మాటకారి తనాన్ని నిలుపుకుంది.

“నీ జీవితం కామెడీయో, ట్రాజడీయో నీకు తెలియదు. ఎందుకంటే రచయితవి నీవు కాదు కాబట్టి. అయితే నీ కల్పన, నీ రచన, నీ చేతిలో పని కాబట్టి హెచ్చుగా కామెడీలే రాసి నవ్వుతూ, నలుగురికీ ఆ నవ్వులు పంచిపెడితే మంచిదని” అని సందేశమిస్తారు అయన.

“పెక్కు దుఃఖమొస్తే ఫక్కున నవ్వాలి” అని ఆయన తల్లిగారనేవారట ఆనంద స్వరూపుడైన దైవాన్ని దర్శించడానికి, ఉపాసించడానికి “హాస్యమే దగ్గర దారి” అని అంటారు. అసలు మనిషి అంటేనే హాస్య పదార్థం అనీ, భగవంతునికి నవ్వాలనిపించి సృష్టింపబడిన మానవుడు-ఆయన. హాస్యరస గ్రహణ పారీణత ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. తిట్టు, దూషణ, మోటుతనం లేని నాజూకైన మృదు హాస్య రచనలే ఆయనవి! ఔచితి, సభ్యత, రమ్యత, నాగరికత, నైశిత్యం, గాంభీర్యం, సహృదయత గల హాస్యం వారిది. ఆయన హాస్య రచనా వస్తువులు అచ్చ తెలుగు మధ్య తరగతి జీవితాల్లోనివి “నేను ప్రొఫెషనల్ రైటర్ ని కాదు. కమర్షియల్ రచయితని కాను, అంచేత నా కాంట్రిబ్యూషన్ అల్పం” అని వినయంగా అంటుండేవారు.

ఆయన భోజన ప్రియత్వం గొప్పది. ఎనభై ఏళ్ళ పైబడిన వయస్సు లోనూ, చారు అన్నంలో ఇంత వెన్నముద్ద నంచుకుతినడం ఆయన ప్రత్యేకత. ఈయన ఏ అంశం తీసుకున్నా చెరుకు బండి వాడు పూర్తిగా చెరకు రసము తీసినట్లుగా హాస్య రసాన్ని మొత్తము తీసి గాని వదిలేవాడు కాదు. ఒకసారి చెప్పిన అంశం అయినా అందులో నుండి కొత్త సొబగులతో సంపూర్ణ సారం పిండేవారు.

పూర్ణానందము గారి పేరు చెప్పగానే ఎవరికైనా గుర్తుకు వచ్చేది "ఆవకాయ అమరత్వము" అనే హాస్య రచన. “ఊరుగాయలరాణి, రుచుల కాణాచి, తెనుగోడి తుర్ఫు ఆసు, ఆంధ్ర మహిళల గారాల కూచి, ఆవకాయ అవతరించటం జాతి అదృష్టం” అని “ఆవకాయ-అమరత్వం” లో ఆవకాయ పెట్టే క్రియను, యజ్ఞంగా అభివర్ణించి తెలుగు వారు మరువలేని హాస్యం పుట్టించారు.

అలాగే "మీసాల సొగసు"అనే గ్రంథం ఆలస్యం అవడం గురించి "రెండేళ్ల క్రిందటనే వచ్చేది. అసలు నేను అచ్చు వేయించకపోతే ఆలశ్యం అనే క్వశ్చన్ లేదు” అని చమత్కరిస్తారు “మీసాలు సొగసులు” గ్రంథానికి ఆయన రాసిన మున్నుడిలో పూర్ణానందం గారు చేసిన హాస్యరస విశ్లేషణ, ఓ సిద్ధాంత గ్రంథ సారమంతటిది. “మీసాల సొగసులు” లో మీసం పెంచేవారికి ఆత్మవిశ్వాసం ముదిరి ఎంతటి వారినైనా ఢీకొని “మీ సములు” అని ఆటోమెటిగ్గా అనగల్గుతారట. తన మీసాలు మాత్రం పూర్ణానందము గారి స్ఫూర్తితో పెంచానని ప్రభుత్వ విశ్రాంత ప్రిన్సిపల్ కార్యదర్శి జె.రాంబాబుగారు (పూర్ణానందము గారి మేనల్లుడు) స్వయంగా చెప్పారు.

అలాగే – చేతి గడియారం గురించి “రిస్ట్ వాచ్” అని కాక, “రిస్ట్ క్లాక్” అనడంలోనే ఆయన చమత్కారం తెలుస్తుంది. దానికి సరిపోయే స్ట్రాప్ లు దొరక్క “నవారు” కట్టాల్సి వచ్చిందట. ఏ విషయం గురించి చెప్పినా తన రచనలో నవ్వుల కుప్ప పోస్తారాయన.

“నల్లకోటు” అనే రచనలోనే లాయర్ల గురించి, న్యాయవాద వృత్తి గురించి – డెబ్బై అయిదుకు పైగా జోకులు దొరుకుతాయి. ఆయన తన రచనల్లో సృష్టించిన హాస్యం, పాత్రలు, అనేక సినిమాలకు ఆయనకు తెలియకనే తర్వాత ఎక్కి ఎందరెందరినో అలరించాయి. “ఆషాడపట్టి” గా ఆయనకు మామగారు సిరా కలం ఇచ్చారు. బాల్‍పెన్‍లు, రీఫిల్ పెన్నులు తప్ప ఫౌంటెన్ పెన్నులు, వూటకలాలు నేటి తరానికేం తెలుసు! ఆ ఇంకు పెన్ను గురించి, దానితో ఆయన పడ్డ అవస్థల గురించీ వివరించిన తీరు. అత్యల్ప మనుకునే వస్తువు నుండి అనల్ప హాస్యం పిండగలమనడానికి దాఖలా! పెద్ద సైజు ఆ కలం. ఇలా ఇంకు పోసుకునే కలం అడుగు భాగం గురించి ఆయన అల్లిన అతిశయోక్తులు అన్నీ ఇన్నీ కావు. కాకి గురించి, పిల్లి గురించీ కూడా పసందైన హాస్యం రాశారు. “పూర్వజన్మ కృతం పాపమ్ పూటకలం రూపేణ పీడితం” అంటూ రకరకాలుగా ఆ సిరా కలం గురించి వివరించే తీరు, ఆ రోజుల అనుభవాలను ఆనందకందళితంగా చిత్రించి చూపుతుంది. సగం సిరా జేబు త్రాగేది. నా అవతారం చూసి ఆకు పచ్చ సిరా, వైలెట్ సిరా వాడుతున్న రోజుల్లో ఓ ల్యాండ్ లేడీ నన్ను పెయింటర్ అనుకుని తన యింటికి రంగులేయమని కోరింది. ఎర్రసిరా వాడుతున్న రోజుల్లో ఓ రోజు మా గృహిణి (త్రిపుర సుందరి) గాభరాపడి తడి గుడ్డ తీసుకువచ్చింది. చేతికి కట్టు కడతానని. "సంసారంలో టపాకాయలు”లో దాంపత్య సరసంను వివరించారు. పూర్ణానందం గారు “కొంపాన్వేషణ”లో చుట్టమీద “నఫ్రీమేళం” లో తిండి మీద పద్యాలు కూడ అల్లారాయన. హాస్య కవిత్వమూ ఎడనెడ గుప్పించారు. పూర్ణానందంగారన్నట్లు “నవ్వు సంపూర్ణమే. ఎందరు నవ్వులు పెంచినా, ఎందరు నవ్వులు పంచుకున్నా, నవ్వులన్నీ టోటల్ చేసి, నవ్వులోంచి సబ్స్ ట్రాక్ట్ చేసినా, శేషం పరిపూర్ణహాసమే! నవ్వులోంచి ఒక నవ్విక, ఒక ముక్క విడదీసి చూచినా అదీ నిండు నవ్వే! ఎంచేతంటే నవ్వే దైవం. ఓం పూర్ణమిదః పూర్ణమిదం -పూర్ణాత్ పూర్ణముదచ్యతే-పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమే వాచ శిష్యతే.

పూర్ణానందం గారు పద్య నాటకాలు ఎక్కువ వేయలేదు కానీ ద్రౌపదీ వస్త్రాపహరణం లో భీష్ముడిగా వేశారు. అనార్కలి నాటకంలో సలీం, వాపస్, ఆడది, పుట్ట, సంభవామి యుగే యుగే, టీకప్పులో తుఫాను, దంతవేదాంతం వంటి రంగస్థల నాటకాల్లో వేశారు. ప్రాచుర్యం పొందిన చిలకమర్తి రేడియో నాటకం “గణపతి”లో ఉపాధ్యాయునిగా, ఇంకా కంఠాభరణం, వయోలిన్ మాస్టారు, ఇంటి నెంబర్, మృచ్ఛకటికం వంటి రేడియో నాటకాల్లో నటించాడు. బందా కనక లింగేశ్వర రావు, కాశ్యప, విన్నకోట రామన్న పంతులు, బళ్లారి రాఘవ, స్థానం నరసింహారావు వంటి వారితో పరమ ఆప్తుడిగా, ఆత్మీయుడిగా మసిలాడు.

1942లో ఆయనకు హీరోగా సినిమా రంగంలో హీరోగా అవకాశం వచ్చినా కాదని తన లాయర్ వృత్తి లోనే కొనసాగారు. కానీ జంధ్యాల పట్టుబట్టగా ఆనందభైరవి, రెండు రెళ్ళు ఆరు, శ్రీవారి శోభనం, మదన గోపాలుడు, హై హై నాయకా మొదలైన చిత్రాల్లో నటించాడు మరణించే వరకు కూడా హాస్య రచయితగా, నటుడిగా, ప్రసిద్ధ లాయరుగా రాణించాడు. చివరకు తన హాస్య రచనల ప్రస్థానాన్ని 1993లో కీర్తి శేషులు అవటంతో ముగించారు. అక్టోబర్ 2010 ఒకటో తేదీ విజయవాడలో అభిరుచి సంస్థ పుచ్చా బుచ్చిబాబు, చాణక్య శర్మ, రామకృష్ణ ఆయన కుమారులు. అల్లుడు జె.వి.నారాయణ మూర్తి తో భట్టు పట్టుతో, పి. పాండురంగారావు, కృష్ణాజీ, మాడుగుల రామకృష్ణల సారధ్యంలో శతజయంతి సమాపన మహోత్సవం నిర్వహించి ఆయనను సముచితంగా స్మరించింది.

********

Posted in September 2024, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!