Menu Close
SirikonaKavithalu_pagetitle

•3•
నేను
త్రిలోకాధిపతిని
సువర్లోక ప్రజ్ఞని
భువర్లోక శక్తిని
భూలోక పదార్థాన్ని.
••
అలజడి చేయని మనసును
ఆజ్ఞను చేరిన చైతన్యాన్ని
తర్కానికి అందని సత్యాన్ని.
•••
కాను అజ్ఞానాన్ని
కాను అక్షరాలు దిద్దిన జ్ఞానాన్ని
కాను అరువు తెచ్చుకున్న విజ్ఞానాన్ని
అవును సత్యభాసుర ప్రజ్ఞానాన్ని.
••••
ఆదిముని మౌనానికి శబ్దించిన మరీచిని
విశ్వవీణియను శృతి కావించిన భృగువును
ధర్మస్మృతికి ఆకర మనువును
వారసత్వానికి వైవస్వతాన్ని.
•••••
సర్వమత పవిత్రగ్రంథ మాతృకను
ఆకాశిక వాణికి అనుసృజనాక్షరబ్రహ్మను
అక్షరలక్ష గణితప్రక్రియల వాల్మీకిని
నిశ్శబ్దతరంగ శబ్దశాస్త్ర ఖండికఋషిని
విగ్రహనిర్మాణ శిల్పశాస్త్ర కాశ్యపమునిని
వ్యంజనాదిపాక సూకశాస్త్ర సుకేశుడ్ని
పుష్ప మాలినీశాస్త్ర బుుష్యశృంగుడ్ని
విషశాస్త్ర ధాతుశాస్త్ర అశ్వినీకుమారుడ్ని
మార్మికరేఖావిలాస చిత్రకర్మశాస్త్ర భీముడ్ని
వ్యాయామ విద్యాలంకార మల్లశాస్త్ర మల్లుడ్ని
శుద్ధ రత్నతన రత్నపరీక్షా వాత్స్యాయనుడ్ని
భ్రమాన్విత మహేంద్రజాల వీరబాహుడ్ని
ధర్మబద్ధ సంపాదనా అర్థశాస్త్ర వ్యాసుడ్ని
అణువిచ్చేదనా శక్తితంత్ర అగస్త్యమునిని
సౌదామినీ అంతర్వీక్షణల మతంగఋషిని
మేఘశాస్త్ర ఉరుముల మెరుపుల అత్రిమునిని
కాలశాస్త్ర హస్తసాముద్రికశాస్త్ర కార్తికేయుడ్ని
యంత్రశాస్త్ర భరద్వాజుడ్ని అశ్వశాస్త్ర అగ్నివర్మను.

వాడి చేతులు దేవురిస్తుంటాయి
కళ్లేదో  వెతుకుతుంటాయి
కుళ్ళేదో కడగాలన్నట్టు
గుళ్ళో దేవుణ్ణి సైతం
గల్లాపట్టి నిలదీస్తున్నట్టు
గుంటల్లోనే నిక్కిచూస్తుంటాయి

ఎండినకడుపుల కేకలు
గుండెను పిండేలా వినిపిస్తున్నా
ఒడుపుగా తప్పుకుపోయేవాళ్ళే
ఎక్కువమంది
అడక్కుండా పుట్టించిన వాడొకడు
అడుక్కునే గతిపట్టించిన వాడింకొకడు
పుట్టించినవాడు పెట్టడు
గతిపట్టించిన వాడు
దొరికింది తిననివ్వడు
నిజమో నాటకమో తెలియక
మనకెందుకని మొహంచాటేస్తాడు
మూడోవాడు
తప్పెవరిది???
దానం చేసేవారెవరో
దాచుకు పోయేవారెవరో
ఇట్టే పట్టేస్తాడు
ఏ మెట్టు అదృష్టాన్నిస్తుందో
ఏ గట్టు దురదృష్టం తెస్తుందో
ఇట్టే చెప్పేస్తాడు

గతం తలుచుకుని క్రుంగిపోడు
భవిష్యత్తు మలచుకొని పొంగలేడు
వర్తమానాన్ని నమ్ముకున్న కర్మయోగి వాడు

ఆర్ద్రతకు అర్థం వాడు
అసమానతకు అసలైన చిహ్నం వాడు
దేశదారిద్ర్యానికి కనుముందురూపం వాడు

పిల్ల కోతిని చూసినప్పుడల్లా
చిల్లర పనులు చేసిన బాల్యం
నాకు గుర్తుకు వస్తుంది

నా నుండి నా బాల్యo
వేరుపడిన క్షణాలను బ్రతిమాలైనా
రెంటికి సంధి చేయాలి

కట్టేయని కుళాయిలా
వాన పిల్లకాలువలో
నే వదిలిన కాగితపు పడవకు
చప్పట్ల వీడ్కోలు చెప్పాలి

చందమామ పుస్తకంతో
తిరిగి స్నేహం కలపాలి
అక్షరాలకు రంగులద్ది
పొడుపు కథలు విప్పాలి

గట్టు మీద గతం లోకి
గమ్మత్తుగా నడుస్తూ
చెరువుచేసే ధ్యానాన్ని
చిలిపిగా నే చెరుస్తూ
చిల్ల పెంకులా మారి
చిత్రంగా గెంతాలి

జాతర లో తప్పి పోయిన బాల్యం
జాడ చెప్పమంటు చెక్కమిఠాయిని
ఒక్క తీరుగా బతిమాడాలి

తాటాకు పంకాకు
గాలి తోడునవ్వాలి
వేటాడే మేకలతో
పులిని గడిలో నిలపాలి
చిన్ననాటి చేష్టలతో
కొత్తగా చిగురించాలి

కట్టిన ఇసుక మిద్దె లో
విడదీసే గదులు లేవు
ఏటి ఒడ్డున గృహప్రవేశాలు
ఎప్పటికీ మరపు రావు

కాకి ఎంగిలితో పంచుకున్న
దోస్తానా లోని మధురిమను
దోచుకు పోయిందెవ్వరో
ఇప్పటికీ సముజవదు

ఆటలో అరటి పండని
అనునయించడం
గాయం చూసిన గారడి
పాట కాని కూ కూ కూతను
అనుకరించడం
గాలి రాసిన పేరడి

అందుకే బాల్యమెపుడూ
వృద్దాప్యానికి
చిరు నవ్వుల పునాది
పసితనమే పసరు మందు
నమ్మకంగా మనాదికి

అమ్మ ఒడి నుండి జారి పాకుతూ,
నాన్న భుజం పైకెక్కి స్వారి చేస్తూ,
అన్నతో  జతకట్టి పట్టిన కుస్తీలు,
అక్కతో  పెట్టిన పేచిల‌‌దృశ్యాలు నెమ్మదిగా మారాయి

బుడిబుడి రాగాలతో చేత సంచిలో
పలక బలపం పట్టిన అక్షరాలు
మొదలైన నడక సాగి, బడి మెట్లను ఎక్కుతూ
అప్పుడప్పుడు తొక్కిసలాటలతో చూసిన
చిత్రాలు హాస్యంగా నవ్వాయి

వేసవి సెలవలు ఆటలకు నెలవులై
ఆత్మీయుల రాకపోకలతో,
అల్లుళ్ల అలకలు, అరటిగెలల కోతల,
ఆవకాయల హాడావుడి పిండివంటల తయారి అన్నీ,
ఒక్కసారి గుమగుమలాడుతూ జిహ్వను తడిపేసాయి

వీపు విమానం మోతకు
అల్లరి పరుగులు మాని నడక నేర్చింది
పుస్తకాల బరువు పెరిగి తరగతులను మార్చి
బ్రతుకుబాటకు దారి చూపాయి.
ఆకతాయి స్నేహాలు విస్తరించి
చేతులు చాపి కరచాలనం చేసాయి
బాల్యపు తీగకు పూసిన పసి మొగ్గలు
వయసు కిరణ‍లకు విచ్చుకున్నాయి
(సశేషం)

ఇంత వరకూ అనుభవించిన నొప్పి
హుష్ కాకి
భారమై కదలలేనంటున్న దేహం
పక్షి ఈక

నిర్జీవమై ఏ భావాన్నీ ప్రకటించలేని
దేహం చుట్టూ ఎన్ని అనుబంధాల ప్రతిరూపాలో...

ఈ శాశ్వత దూరాన్ని భరించలేక
ఆ తర్వాత జీవితాన్ని ఊహించలేక
మునిగిపోతున్న జీవిత నావను
ఆవలి తీరానికెలా చేర్చాలో తేల్చుకోలేని
అభాగ్యుల విషాద గీతం

ఎప్పుడో తెగిపోయినవి కొన్ని
ఇప్పుడు మాత్రమే
ప్రేమ నదిలో ముంచేస్తూ

నిన్నటి దాకా తిట్టిన నోళ్ళే
ఇప్పుడు మాత్రం
పొగడ్తలను వర్షిస్తూ

అప్పిచ్చిన జలగలు
అన్నింటికీ తామవుతూ

ఎగవేతదారులు
కదలికలింకా ఏమైనా మిగిలున్నాయోమోనని
నిశితంగా పరిశీలిస్తూ...

ఎన్ని చిత్రవిచిత్రాలు
ప్రాణమున్నప్పుడు కనిపించనివెన్నో
ఇప్పుడు కనిపిస్తూ...

కాసింత కనికరమైనా చూపని మనుషులు
ఇప్పుడు కన్నీటి వరదవుతూ

దేహాన్నొదిలిన ఆత్మకు
విచిత్రానుభూతిని మిగులుస్తూ

వెల్లువెత్తే
శవ సంస్కార ఆర్భాటాలు
ఆ సమయం కోసం నిరీక్షించే
మందుబాబులు

సమయం వృధా అయిపోతుందంటూ
విసుక్కునే డబ్బు జనం

అంతా ఇంతే...
పుడకల్లో చేరేవరకేననే
సత్యాన్నెప్పటికీ గ్రహించలేక...!

Posted in September 2024, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!