Menu Close
తెలుగు పద్య రత్నాలు 39
-- ఆర్. శర్మ దంతుర్తి --

పదహారో శతాబ్దంలో జీవించిన ధూర్జటి అనే కవి రాసిన శ్రీకాళహస్తీశ్వర శతకం లోనిది ఈ నెల పద్యం. అసలు ధూర్జటి అంటే, ధూళి తో ఉన్న జటలు కలవాడు అని అర్ధం; అంటే ఇంకెవరు మన శివుడే. పురాణాల ప్రకారం శివుడు ఎటువంటివాడు అంటే ఒకసారి భక్తుడు శరణు వేడితే ఇంక వదిలేది లేదు. ఈ విషయం బలి చక్రవర్తి కొడుకైన బాణాసురిడి కధలో చూడవచ్చు. ఈ బాణాసురిడికి శివుడు వరం ఇస్తాడు తాను స్వయంగా వచ్చి యుద్ధం చేస్తాను కావాలిస్తే అని. చివరకి వాడు కృష్ణుడి చేతిలో చచ్చిపోయేస్థితిలో కూడా శివుడు దగ్గిరే ఉంటాడు. అదీ శివానుగ్రహం అంటే. కాశీలో చనిపోయేవారికి శివుడు చెవిలో తారకమంత్రం చెపుతాడన్నది చాలామందికి తెల్సిన విషయం. అయితే మనం భక్తులమా కాదా అనేది నిర్ణయించుకోవాల్సినది మనమే. భక్తి అంటే ఎలా ఉండాలి? నిర్మలమైన భక్తి ఉంటే చాలు. ఆయన గుడిలో ఉండే పుష్కరిణిలో నీరు చెంబుతో తీసి పోసి ఓం నమశ్శివాయ అంటే చాలు. అయితే ఈ భక్తి కొంతకాలం అన్నీ మనకి సజావుగా ఉన్నప్పుడు కుదిరి, ఏదైనా గండం వస్తే వీడి పోతూ ఉంటుంది. గండం గడిచాక, నేను నమ్ముకున్న దేవుడు నాకేమీ చేయలేదు అని నిందించడం మనకి అలవాటే. అటువంటప్పుడు ఆయన విలాసంగా నవ్వుకుంటూ ఉంటాడు మనల్ని, మన చంచలత్వం చూసి. ఈ పద్యంలో భగవంతుడి మీద భక్తి ఎలా ఉండాలో ధూర్జటి చెప్తున్నాడు.

మ.
నిను సేవింపగ నాపదల్పొడమనీ, నిత్యోత్సవంబబ్బనీ
జనమాత్రుండననీ, మహాత్ముడననీ, సంసారమోహంబు పై
కొననీ జ్ఞానముగల్గనీ, గ్రహగతుల్ కుందింపనీ, మేలు వ
చ్చిన రానీ యవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వరా! (శ్రీకాళహస్తీశ్వర శతకం ధూర్జటి 12)

కష్టమో నష్టమో అన్నీ అనవసరం. నిన్ను సేవించినప్పుడు కష్టాలు రానీగాక (ఆపదల్పొడమనీ), నిత్యమైన సుఖమైన వేడుకలు రానీ (నిత్యోత్సవంబబ్బనీ) , అనంతమైన జీవరాశిలో మామూలు మనిషినో మరో క్రిమి, కీటకాన్నో కానీ అవనీ (జనమాత్రుండననీ), గొప్పవాడిని అవనీ (మహాత్ముడననీ), సంసార మోహం నన్ను కప్పుకోనీ (సంసారమోహంబు పై కొననీ), లేకపోతే జ్ఞానం కలిగి బ్రహ్మవేత్తని అవనీయి (జ్ఞానముగల్గనీ), గ్రహాలు గతితప్పి నా మీద ప్రభావం చూపించనీయి (గ్రహగతుల్ కుందింపనీ) మంచి జరిగితే రానీయి (మేలు వచ్చిన రానీ), చెడు వస్తే వస్తుంది గాక. అలా వచ్చే వన్నీ నాకు అలంకారాలే (భూషణములే) అవుతాయి.

ఇదీ భగవంతుణ్ణి నమ్ముకునే దారి. నాకు ఇలా అయిందే? నేనెంతో మంచివాణ్ణి, ఎందరికో సహాయం చేసాను. అయినా దేవుడిలా చేసాడేమిటి? అనే ప్రశ్నే రాకూడదు. మన పని - భగవంతుడు కల్పించిన ఈ ప్రపంచంలో ఆయన ఎలా జరగాలని అనుకున్నాడో అలా – మనం చేయాలి. ఆ తర్వాత? ఆ పని చేయడం వల్ల వచ్చే ఫలితం మనది కాదు. అందువల్ల వచ్చే ఫలితం ఆయనది కనక మనం చేసిన పని, అది భగవంతుడి సేవగా ఎంచాక, దాని మూలాన ఏది వచ్చినా అది నాకు అలంకారమే అంటున్నాడు ధూర్జటి. అలా కర్మ చేసాక ఫలితం పట్టించుకోనప్పుడు మనని ఏ క్షణంలోనూ వదలకుడా ఉంటాడు భగవంతుడు. ఇదే శ్రీరామకృష్ణులు చెప్తారు. ఒకచేత్తో చేసే పని పట్టుకుని రెండోచేత్తో భగవంతుణ్ణి పట్టుకోండి. ఎప్పుడైతే పని పూర్తైందో అప్పుడు రెండు చేతులూ భగవంతుడికే జోడించండి.

భాగవతం అంబరీషోపాఖ్యానంలో ఇటువంటి సంగతే వస్తుంది. దుర్వాసుడు అంబరీషుడి మీదకి కృత్య అనే రాక్షసి పంపినపుడు, విష్ణువు అంబరీషుడికి రక్షగా ఇచ్చిన సుదర్శన చక్రం తరుముతూంటే ముల్లోకాలూ తిరుగుతాడు. కానీ అందరూ చెప్పేది ఒకటే – వెళ్ళి విష్ణువు కాళ్ళమీద పడు అని. అక్కడకి వెళ్ళాక విష్ణువు చెప్తాడు. నేనే తప్ప ఇతరమైనదేదీ వద్దు అనుకుని నా భక్తులు ఇల్లూ వాకిలీ అన్నీ వదులుకుంటారు (సన్యసించడం అంటే ఇదే, కాషాయ వస్త్రాలు ధరించడం కాదు). అలా అన్నీ వదులుకుని వచ్చినవార్ని ఎటువంటి పరిస్థితులలోనూ విడిచిపెట్టను. సాధారణంగా మనం భగవద్దర్శనం అయిన వారి సంగతి చూస్తే వారెన్ని కష్టాలు పడ్డారో తెలుస్తుంది. రామకృష్ణులూ, వివేకానందులూ కూడా అష్టకష్టాలు పడ్డా భగవంతుడి మీద నమ్మకం ఉంచుకుని ‘నేను కాదు నువ్వే’ అనే స్థితి అత్యంత కఠినమైన పర్తిస్థితుల్లో కూడా నిలుపోగలిగారు కనక వారికి బ్రహ్మజ్ఞానం కలిగింది కదా. మరో విషయం ఏమిటంటే, బ్రహ్మజ్ఞానం కావాలంటే అన్నీ వదులుకొవడానికి సిద్ధంగా ఉండాలి. మనం సిద్ధంగానే ఉన్నాం అని అనేసుకుని అవతలి వారితో చెప్పేస్తే చాలదు. కష్టాలు వచ్చినప్పుడు ఓర్చుకుని ఆ కష్టాలు ఓర్చుకోగలడా అని పరీక్ష చేసిన భగవంతుడుకి ‘ఇదిగో నేను ఓర్చుకున్నాను’ అని నిరూపించగలగాలి. లేకపోతే అత్యంత దుర్లభమైన బ్రహ్మజ్ఞానం మనకి ఊరికే ఎందుకు ఇవ్వాలి. ముందు అది సంపాదించడానికి అర్హత కోసమే ఈ పద్యంలో ధూర్జటి చెప్తున్నాడు – నాకు ఏమి వచ్చినా అవి అలంకారాలే కనక నీ సేవ విడవను అని.

ఇదే విషయం కూదా భగవద్గీతలో చూడవచ్చు. “కర్మణ్యే వ్యాధికారస్తే మా ఫలేషు కదాచన”. మన చేతిలో ఉన్న పని చేసుకుంటూ పోవడమే. మనం చేతైననంతలో సరిగ్గా చేసామా లేదా అనేది ఒకటే మనం చూసుకోవలసింది. ఇదే స్వామి వివేకానంద అంటారు. “ఒక విషయం తీసుకోండి. దాని గురించి మరే అడ్డంకులూ లేకుండా నిరంతరం ఆలోచిస్తూ అదే విషయం మీద వంద శాతం మనసు పెట్టి పనిచేయండి. కొన్ని అడ్డంకులు వచ్చినా చివరకి తప్పకుండా పని జరిగి తీరుతుంది ఎందుకంటే అలా ఒకే విషయం మీద దృష్టిపెట్టి పనిచేసినప్పుడు చరాచర విశ్వంలో శక్తులన్నీ మీ వెనక తోడై మీకు సహకరిస్తాయి ఆ పని పూర్తిచేయడానికి.” అడ్డంకులేమీ రాకుండా అసలు జీవితం లో ఎవరూ ఏ పనీ పూర్తి చేయలేరు కదా? అదే ‘నిను సేవింపగ నాపదల్పొడమనీ’ అనేదాని అర్ధం.

****సశేషం****

Posted in September 2024, వ్యాసాలు

1 Comment

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!