Menu Close
C-Vasundhara Photo
తెలుగు సాహిత్య చంద్ర చంద్రికలు
డా.సి.వసుంధర
తొలి రాయల యుగం

గౌరన

ఈ విధంగా గౌరన హరిశ్చంద్రుని కథను ద్విపదలో రచించడమే కాకుండా ఆనాటి సాంఘీక రాజకీయ విషయాలను తెలిపాడు. అంతేగాక తెలుగులో నాటక రచనకు నాంది పలికాడు.

నవనాథ చరిత్ర

నవనాథ చరిత్రలో సారంగధరుని కథ ఉంది. ఇది తెలుగునాట ప్రసిద్ధమైన కథే. ఇది గౌరన రాసిందే. అయితే వాడుకలో ఉన్నట్లు ఈ సారంగధరుడు రాజమండ్రి నేలిన రాజరాజ కుమారుడు కాడు. మాళవ దేశంలో మాంధాత పురాన్ని ఏలిన రాజమహేంద్రుని కుమారుడు.

ఈ రాజమహేంద్రునికి రత్నాంగి అనే భార్య చిత్రాంగి అనే ఉంపుడుగత్తె ఉన్నారు. రాజు వేటకెళ్ళినప్పుడు సారంగధరుడు పావురాన్ని ఎగురవేస్తే అది చిత్రాంగి మేడపై వాలుతుంది. సారంగధరుడు వెళ్లి తెచ్చుకోబోగా వద్దని సుబుద్ధి అనేవాడు వారిస్తాడు. ఇదంతా గౌరన వ్రాసినదే అని అన్నారు ఆరుద్ర.

సారంగధరునికి చిత్రాంగి వల్ల శిక్ష పడడం ఆ కథంతా ఆరుద్ర తెల్పలేదు.నవనాథులు ఎలా వచ్చారో తెల్పే కథ చెబుతూ,  కాళ్ళు చేతులు తెగిపడి ఉన్న సారంగధరుని అడవిలో మీననాథుడు అనే సిద్ధుడు కాపాడి దీక్ష ఇచ్చి చౌరంగి అనే పేరు పెడతాడు. మీననాథునికి చౌరంగి మొదటి శిష్యుడు. తర్వాత మరో ఆరుగురిని అటు తర్వాత శివుడు, ఆదినాథుడు అనే ఇద్దరినీ శిష్యులుగా చేర్చుకొంటాడు. ఈ మొత్తం తొమ్మిదిమంది చరిత్రే నవనాథ చరిత్ర. ఇది శ్రీనాథుని కాలంలో బహుళ ప్రచారంలో ఉండేది.

శ్రీనాథుని చేత శివరాత్రి మహత్యం చెప్పించిన శాంతి భిక్షావృత్తి రాయడే గౌరన చేత నవనాథ చరిత్ర వ్రాయించాడు.

నవనాథ చరిత్ర గౌరనకు ముందే సంపూర్ణ కావ్యంగా శ్రీగిరికవి అనే కవి వ్రాశాడు. అయితే ద్విపదలో వ్రాయిస్తే ప్రజలు బాగా చదువుతారని ఆ పీఠాధిపతి శాంతి భిక్షావృత్తి రాయడు గౌరన చేత వ్రాయించాడు.

ఈ నవనాథ చరిత్రకు ప్రధానంగా మహారాష్ట్ర ప్రదేశం కనపడుతున్నట్లు కోరాడ రామకృష్ణయ్య గారు వ్రాశారని ఆరుద్ర తెల్పారు. అయితే ఈ నవనాథులకు తెలుగు దేశంలో సంబంధం ఉన్నట్లు తెలుస్తున్నది. గోకర్ణకనాథుడనే వాడు శ్రీశైలం కొండ మీద అల్లమ ప్రభువుతో వాదించి ఓడిపోయినట్లు తెలుస్తున్నది. అందువల్ల వీరికి తెలుగుదేశంతో సంబంధం ఉంది అన్నారు ఆరుద్ర.

ఈ సందర్భంగా అల్లమ ప్రభువుని గూర్చి తెలిపారు ఆరుద్ర. క్రీ.శ.1124 లో జన్మించిన బసవేశ్వరుడు వీరశైవ మతాన్ని స్థాపించాడు. బసవేశ్వరుడు “అనుభవ మండపం” అనే విద్యాపరిషత్ నెలకొల్పాడు. దాని అధ్యక్షుడు అల్లమ ప్రభువు. ఇతడు నిరాడంబరుడు. ఇతనిని ప్రభుదేవుడని కూడా పిలిచేవారు. కన్నడంలో ఇతడు రాసిన ‘వచనాలు’ ప్రసిద్ధం.

నవనాథులను గూర్చి తెల్పుతూ 12 వ శతాబ్ది లోనే గాక వీరు చాలా ప్రాచీనులని నాగార్జున నాథుని శిష్యుడు సిద్ధ నాగార్జుని చర్యలు కూడా తెలుగుదేశం లోనే జరిగాయని అన్నారు ఆరుద్ర.

సిద్ధ నాగార్జునుడు తన పేరు “తత్పర్వతస్థలి కీర్తులెనను గల్పించిన” ఏలేశ్వరం దర్శించి అక్కడే నివాసం ఏర్పరుచుకొన్నట్లు తెలుస్తున్నదని ఆరుద్ర చెప్పి పురావస్తు వారు త్రవ్విస్తే అక్కడ గౌరన చెప్పిన విజయపురి ఉండేదేమో అని దానికి సంబంధించిన ఒక పద్యం తెల్పాడు. కాని దురదృష్టవశాత్తూ ఆ పద్యం ముఖ్యమైన భాగం శిధిలమై పోయిందని ఆరుద్ర తెల్పారు.

ఈ ప్రాంతాన్ని సిద్ధ నాగార్జునుడు పూర్తిగా బంగారం చెయ్యాలనుకొంటే విష్ణువు అడ్డుపడ్డాడని దాని కారణాలను గూర్చి గౌరన నవనాథ చరిత్రలో పుటలు 210-247 లో ఉన్నట్లు తెల్పి ఆ ద్విపద భాగాలు ఆరుద్ర ఇచ్చారు.

దీనిని గూర్చి చెప్తూ సర్వమానవ సమానత్వం ఆర్థికంగా స్వశక్తి తో ఎదిగే సిద్ధులను ఆనాటి రాజులు చంపించేసేవారు అని దానికి సంబంధించిన వాస్తవాలను ఆరుద్ర వివరంగా వ్రాశారు. (స.ఆం.సా. పేజీ 828).

గౌరన రచన గూర్చి చెబుతూ ఆరుద్ర ఒక సామెతను గౌరన రచన నుండి తెల్పారు. అది చాలా చరిత్ర గల సామెతగా ఆరుద్ర అభివర్ణించారు.

ఆ సామెత “సాధురేగిన తల పొలానగాని ఆగదు” గౌరన ఈ సామెతను వాడిన సందర్భం.

తన భార్యను అమ్మి హరిశ్చంద్రుడు ఆ డబ్బు అప్పుకు చెల్లు వెయ్యమని చెప్పగా నక్షత్రకుడు దానిని (ఆ పైకాన్ని) తన భత్యానికి జమ కడతాడు అప్పుడు హరిశ్చంద్రుడు నక్షత్రకునితో తగవు పెట్టుకుని మాట్లాడినప్పుడు ఈ సామెత వాడాడు.

ఈ సామెత అర్థాన్ని గూర్చి చర్చిస్తూ ఆరుద్ర ‘సాదురేగి’ అన్న ప్రయోగం ప్రాచీన కావ్యాలలో ఉన్నదని అది సాధు పూర్వ రూపం ‘సాఁతు’ అయి ఉండవచ్చని చెప్పి పాల్కురికి సోమన పండితారాధ్య చరిత్రలో వాడాడని తెల్పాడు. సాధు అంటే గుంపు అని ‘తలపొలము’ అంటే పొలం చివర అని అర్థమని, గమ్యస్థానం అని తెల్పి “సాధు -గుంపులో తొక్కిసలాట జరిగితే అది చివర గానీ ఆగదు” అన్న అర్థం చెప్పారు ఆరుద్ర. ఇది హరిశ్చంద్రుని కోపం గూర్చిన సామెతగా చెప్పాడు గౌరన. గౌరన మీద పాల్కురికి సోమన ప్రభావం చాలా ఉందన్నారు ఆరుద్ర.

బసవ పురాణంలో పాల్కురికి సోమన చెప్పిన ముప్పైరెండు రాగాలను గౌరన తన హరిశ్చంద్ర రచనలో మాతంగ కన్యల చేత పాడించాడు. ప్రాచీనుల ప్రభావం గౌరన మీద ఉన్నట్లే గౌరన ప్రభావం అతని తర్వాత కవులపై చాలా ఉంది. చేమకూర వెంకట రాజు తన సారంగధర చరిత్ర లో గౌరనను మక్కికి మక్కి అనుకరించాడు. అంటే గౌరన గొప్పతనం తెలుస్తున్నది. వేమన కూడా కొన్ని పద్యాలలో గౌరన భావాలను అనుకరించాడని ఆరుద్ర తెల్పుతూ,

‘గౌరన ఆనాటి సమాజాన్ని సాకల్యంగా పరిశీలించిన వాడని, వర్గ, మనస్తత్వాలను ఆకళింపు చేసుకొన్నవాడని ఆరుద్ర చెప్తూ, తన రచనలను ద్విపదలో రచించి పాత్ర చిత్రణ, సంభాషణల ద్వారా నాటక లక్షణాలను తన రచనలో సమకూర్చి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టాడు.’ అని సెలవిచ్చారు.

ఆరుద్ర మాటలను ఆకళింపు చేసుకుని గౌరనను సాహిత్య ప్రియులు ఆదరించి ఆయన రచనలు చదవడమే గౌరనను గౌరవించడం అవుతుంది.

**** సశేషం ****

Posted in September 2024, సమీక్షలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!