Menu Close
mg
- మధు బుడమగుంట -
Song

తెలుగు జాతి మనది

తెలుగు భాష లోని వివిధ ప్రక్రియలు, మాండలీకాలు, వ్యవహారిక అనుకరులు ఇత్యాది వలెనే, తెలుగు వారికి కూడా ప్రాంతీయ పరమైన జీవన అలవాట్లు, సామాజిక వ్యత్యాసాలు, ఆహారపు అలవాట్లు ఇలా ఎన్నో తేడాలు గోచరిస్తుంటాయి. తెలంగాణా, రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలు, సర్కారు జిల్లాలు ఇలా వివిధ ప్రాంతాలను ఒకే తెలుగు భాష గొడుగు క్రింద మనం చూడగలము. అన్ని ప్రాంతాలను సమన్వయ పరుస్తూ వివిధ సాంస్కృతిక, రాజకీయ, ప్రభుత్వ రంగాలు కూడా సామాజిక బాధ్యతగా ‘భిన్నత్వంలో ఏకత్వం’ అని చెబుతూ మనందరం తెలుగు వారం, మనందరిదీ మధుర తేనియలూరు తెలుగు జాతి అని ప్రచారం చేయడం కూడా జరుతున్నది. ఈ సందర్భంగా మనం గుర్తుచేసుకోవలసినది, మన తెలుగు వారు గర్వించదగ్గ మనిషి, తెలుగు ఖ్యాతి, గౌరవాన్ని ఖండాంతరాలలో కూడా విస్తృతంగా ఇనుమడింపజేసిన నట రత్న నందమూరి తారక రామారావు గారు. ఆయన తన సినిమాలలో కూడా తెలుగు భాష ఔన్నత్యాన్ని అత్యంత గొప్పగా చూపేవారు. 1970 సంవత్సరంలో తను స్వయంగా దర్శకత్వం వహించి నటించిన ‘తల్లా-పెళ్ళామా’ సినిమాలో తెలుగు భాష గొప్పదనాన్ని, తెలుగు జాతి ఏకత్వాన్ని ఎత్తి చూపుతూ ఒక చక్కటి పాటను చిత్రీకరించారు. సి. నారాయణ రెడ్డి గారి కలం నుండి జాలువారిన ఈ గేయం, రాజు గారి స్వరకల్పనలో మరింత అందంగా తయారై ఘంటసాల గారి గాత్రంలో విరాజిల్లింది. నాడు ఎంతో ప్రాచుర్యం పొందిన ఆ  మధురమైన తెలుగు పాటను సిరిమల్లె వార్షిక సంచిక పురస్కరించుకుని మీకోసం అందిస్తున్నాము.

movie

తల్లా-పెళ్ళామా (1970)

music

సి. నారాయణ రెడ్డి

music

టీ.వీ. రాజు

microphone

ఘంటసాల బృందం

పల్లవి:

తెలుగు జాతి మనది …. నిండుగ వెలుగు జాతి మనది
తెలుగు జాతి మనది …. నిండుగ వెలుగు జాతి మనది
తెలంగాణ నాది … రాయలసీమ నాది … సర్కారు నాది … నెల్లూరు నాది ..
అన్నీ కలిసిన తెలుగునాడు … మనదే … మనదే … మనదేరా..
తెలుగు జాతి మనది …. నిండుగ వెలుగు జాతి మనది

ప్రాంతాలు వేరైనా మన అంతరంగమొకటేనన్నా
యాసలు వేరుగ ఉన్నా ..మన భాష తెలుగు భాషన్నా
వచ్చిండన్నా …. వచ్చాడన్నా … ఆ …..
వచ్చిండన్నా …. వచ్చాడన్నా వరాల తెలుగు ఒకటేనన్నా …
తెలుగు జాతి మనది …. నిండుగ వెలుగు జాతి మనది

చరణం 1:

మహాభారతం పుట్టింది రాణ్మహేంద్రవరంలో
భాగవతం వెలసింది ఏకశిలానగరంలో
ఈ రెంటిలోన ఏది కాదన్న
ఈ రెంటిలోన ఏది కాదన్న ఇన్నాళ్ళ సంస్కృతి నిండుసున్నా
తెలుగు జాతి మనది …. నిండుగ వెలుగు జాతి మనది

చరణం 2:

పోచంపాడు ఎవరిది …నాగార్జున సాగరమెవరిది
పోచంపాడు ఎవరిది …నాగార్జున సాగరమెవరిది
మూడు కొండలు కలిపి దున్నినా ముక్కారు పంటలు బండ్లకెత్తినా
అన్నపూర్ణమ్మ కన్నబిడ్డలం . ఐదు కోట్ల తెలుగువారిది
తెలుగు జాతి మనది …. నిండుగ వెలుగు జాతి మనది

సిపాయి కలహం విజృంభించ నరసింహాలై గర్జించాము
స్వతంత్ర భారత్ కి జై
గాంధీ, నెహ్రూల పిలుపునందుకుని సత్యాగ్రహాలు చేసాము
వందేమాతరం .. వందేమాతరం
స్వరాజ్య సిద్ధి జరిగిన పిమ్మట స్వరాష్ట్రమును సాధించాము
జై విశాలాంధ్ర
దేశభక్తిలో తెలుగువారికి దీటే లేదనిపించాము
తెలుగు జాతి మనది …. నిండుగ వెలుగు జాతి మనది

చరణం 3:

ఇంటిలోన అరమరికలు ఉంటే ఇల్లెక్కి చాటాలా
కంటిలో నలక తీయాలంటే కనుగ్రుడ్డు పెరికి వేయాలా
పాలుపొంగు మన తెలుగుగడ్డను పగలగొట్టవద్దు
పాలుపొంగు మన తెలుగుగడ్డను పగలగొట్టవద్దు
నలుగురిలో మనజాతిపేరును నవ్వులపాలు చెయ్యెద్దు
తెలుగు జాతి మనది …. నిండుగ వెలుగు జాతి మనది
తెలుగు జాతి మనది …. నిండుగ వెలుగు జాతి మనది
తెలంగాణ నాది … రాయలసీమ నాది … సర్కారు నాది … నెల్లూరు నాది ..
అన్నీ కలిసిన తెలుగునాడు … మనదే … మనదే … మనదేరా..
తెలుగు జాతి మనది …. నిండుగ వెలుగు జాతి మనది

Posted in August 2024, పాటలు