Menu Close
రాధికారుచిరం
-- రాధిక నోరి --

ముందుమాట

Radhika-Noriసిరిమల్లె పాఠకులందరికీ రాధిక నోరి వినమ్ర ప్రణామాలు. నా కథల ద్వారా మీ అందరికీ ఇంతకుముందే నేను పరిచయమున్నా, ఆ పరిచయాన్ని ఇంకొంచెం గట్టిపరుచుకోవాలన్న ఆశ ఏదో గాఢంగా నన్ను చుట్టుముట్టింది. అంతేకాకుండా కథల పరిచయమిదివరకే అయిపోయింది కాబట్టి, ఈసారి ఏదైనా వేరే విధంగా మీ ముందుకు రావాలని ఆ ఆశ కాస్తా ఒక పేరాశ లాగా మారిపోయింది. అంతటితో ఆగకుండా, అంటే, కేవలం మీ అందరి ముందుకి రావటం మాత్రమే కాకుండా మీ అందరి మనసుల్లో గాఢమైన తిష్ఠ కూడా వేయాలని ఆ పేరాశ కాస్తా ఇంకో దురాశ లాగా కూడా మారిపోయింది. సరే, ఆశో, పేరాశో, దురాశో, ఏదైతే ఏం, ఒక కోరికన్నది మనసులో పుట్టినప్పుడు ఇంక అది తీరేదాకా మనసులో అలజడే కదా! అందుకని ఆ అలజడిని శాంతపరుచుకోవటం కోసం ప్రతి నెలా మీతో కబుర్లాడదామని నిర్ణయించుకున్నాను. అయితే దేని గురించి కబుర్లు అని సంకోచపడుతున్నారేమో కదూ! అబ్బ, మరీ అంత అనుమానమా? కబుర్లు అన్న తర్వాత బోలెడన్ని విషయాలు దొరుకుతాయి మనకు. మనందరి జీవితాలలో బోలెడన్ని మలుపులు. నిత్యం మనందరం ఎదుర్కొనే అనేక అవరోధాలు. అనుక్షణమూ మనకు తారసపడే ఎన్నో అనుకోని సమస్యలు. ఏదో మనకు తోచినట్లు వాటిని పరిష్కరించుకోవడానికి మనం పడే రకరకాల తిప్పలు. ఇదే కదా జీవితం అంటే! వీటన్నిటి గురించే కబుర్లాడుకుందాం. సరేనా? ఏమో! యధాలాపంగా మనం చెప్పుకునే ఆ కబుర్లలోనే ఏవైనా తియ్యటి, రుచికరమైన, తేలికైన పరిష్కారాలు మనకు దొరుకుతాయేమో! సరే, ప్రయత్నించి చూడటంలో తప్పు లేదు కదా! అవునా? మరి ఇంక ఆలస్యం ఎందుకు? నాతో మీరు, మీతో నేను, కలిసి చేద్దాం మనం ఈ ప్రయాణాన్ని. పదండి మరి.

ఈనాటి నా మొట్టమొదటి రుచిరం - "సందిగ్ధం"

సరే, కబుర్లయితే చెప్తానని పెద్ద ధీమాగా అనేశాను కానీ దేని గురించి చెప్పాలో, అసలు ఎలా మొదలుపెట్టాలో తెలియటంలేదు. మొట్టమొదటిసారిగా ఈ రీతిలో మీ అందరి ముందుకు వస్తున్నాను. మీకు నచ్చే విధంగా మంచి మంచి కబుర్లు చెప్పి మీ అందరినీ ఒప్పించి, మెప్పించాలని వుంది. కానీ ఏ విషయం తో మొదలుపెట్టాలి అన్న నిర్ణయం ఇంకా తీసుకోలేదు నేను. మెదడులో రకరకాల విషయాలు బోలెడన్ని, మెదులుతున్నాయి. వాటిల్లోంచి దేనిని ఎన్నుకోవాలో, దేనిని వదులుకోవాలో తెలియటంలేదు. ఈ నిర్ణయం కొంచెం జటిలమైనదే! ఇలాగే చాలామందికి జీవితంలో ఏదో రకమైన సందిగ్ధం తరచుగా ఎదురవుతూనే వుంటుంది. అది yellow లో ఆగాలా లేక దూసుకుని వెళ్ళిపోవాలా కావచ్చు, ముందుకి రావటానికి పక్కవాడిని దారి యివ్వాలా లేక మనమే ముందు వెళ్ళిపోవాలా కావచ్చు, ఈ రెండు చొక్కాలలో ఏది ఇవాళ వేసుకోవాలి కావచ్చు, లేక ఇంకొంచెం పెద్దవి కావచ్చు, ఏ మోడల్ కారు కొనాలి, ఎలాంటి ఇంట్లో వుండాలి, ఏ ఊళ్ళో సెటిల్ అవ్వాలి, ఏం చదువు చదవాలి, ఎలాంటి వుద్యోగం చెయ్యాలి, ఎవరిని పెళ్ళాడాలి లాంటివి చాలా పెద్ద సందిగ్ధాలు. ఇలా ఆలోచిస్తే మన జీవితం అంతా, పెద్దవో, చిన్నవో, ఏవైనా సరే, అనేక రకరకాల సందిగ్ధాలతో నిండివుంది. ఈ ప్రపంచంలో ప్రతీవాళ్ళూ ప్రతి నిముషం ఎదుర్కొనే సమస్యే ఈ సందిగ్ధం అన్న సమస్య.

చైనాలో ఒక సామెత వుంది, నీ భూతకాలం గురించి తెలుసుకోవాలంటే నీ వర్తమానంలోని పరిస్థితులను గమనించు. నీ భవిష్యత్తు గురించి తెలుసుకోవాలంటే నీ వర్తమానంలోని నిర్ణయాలను గమనించు అని. అంటే భూతకాలమైనా, భవిష్యత్తు అయినా, దేనిగురించి తెలుసుకోవాలన్నా ముందు వర్తమానం గురించి సంపూర్తిగా తెలుసుకోవటం చాలా ముఖ్యమని మనందరికీ తెలిసిపోతోంది. అంతేకాదు వర్తమానంలోని నిర్ణయాలు చాలా ముఖ్యమని కూడా మనకి ఎవ్వరూ చెప్పకనే తెలిసిపోతోంది. మరి అంత అతి ప్రాముఖ్యమైన నిర్ణయాలు ఎటువంటి సందిగ్ధం లేకుండా చక్కగా, సరి అయినవిగా వుండటం, తప్పులు లేకుండా వుండటం చాలా అవసరం కదా! అందుకనే ఈ సందిగ్ధం అన్నది చాలా హానికరమైనది అంటాను నేను. కానీ ... కానీ ... ఒకొక్కసారి, వద్దనుకున్నా కూడా, ……  తప్పదు మరి, ఇప్పుడు నేను వున్న పరిస్థితిలాగా. అలాంటప్పుడు ఆ సందిగ్ధాన్ని ఎదుర్కోక తప్పదు మరి. ఏం చేస్తాం? అసలు అంతా మన చేతిలోనే వున్నదని, మన వల్లనే అంతా నడుస్తోందని మనం అనుకుని మురిసిపోతాం, గర్వపడతాం, కానీ ఎక్కడో మన అంతరంగాల అడుగులలో మనందరికీ తెలుసు, ఏదీ మన చేతిలో లేదు, మన సందిగ్దాలు మనతో ఎప్పుడూ వుండనే వున్నాయి. మనల్ని వెనక్కి లాగడానికి ప్రయత్నిస్తూనే వుంటాయి. కానీ కొంతమంది మాత్రం, ఈ అనిశ్చతని, అంటే uncertainty ని, ఎందుకనో మరి, తోసిరాజని తీసిపారేస్తూ వుంటారు. కానీ నాకు మాత్రం అది అంత తెలివైన పని కాదేమో అని అనిపిస్తూ వుంటుంది.

సందిగ్ధాలు ఎలాంటివైనా సరే, వచ్చినపుడు, వాటిని ఎలా ఎదుర్కొనాలో తెలియనివారు చాలామంది నిర్ణయాలు తీసుకోవటం వాయిదా వేస్తూ వుంటారు. అంటే సందిగ్ధాన్ని ఎదుర్కోవటానికి వారికి ఒక్క ఆ మార్గమే తెలుసు. కానీ దానివలన ఆ సందిగ్ధం ఏమి తీరదు. ఏదో, కొంచెం సమయం మాత్రం లభిస్తుంది, అంతే! దీనివలన తాత్కాలికంగా కొంచెం రిలీఫ్ దొరికినా అసలు సమస్య తీరనే తీరదు, అలాగే వుంటుంది. కానీ దాని వలన ఎన్ని అవకాశాలు చేజారిపోయాయో, తమ పురోగతికి ఎంత అవరోధం కలిగిందో వారికి బహుశా ఆ నిముషంలో నిజంగా తెలియదు. తెలిస్తే ఆ సందిగ్ధం లోంచి బయటకు రావటానికి వాళ్ళు మొదట్లోనే తప్పకుండా కృషి చేసేవారు.

ఒక్కొక్కసారి సందిగ్ధాలు అనుకోకుండా వచ్చి మీద పడతాయి. అందులోను అప్పుడప్పుడు ఒకటి కాకుండా ఒకేసారి బోలెడు కుప్పలుగా వచ్చి పడతాయి కూడాను. సరే, ఇంక అప్పుడేం చెయ్యాలి? ఏది ముందో, ఏది వెనుకో, ఏది అత్యవసరమో, ఏది కొంచెం తక్కువ ప్రాధాన్యమో, ఏది ఆగలేమో, ఏది కాస్త ఆలస్యం అయినా ఫరవాలేదో, ఇవన్నీ ఆలోచించుకుని దాని ప్రకారం నిర్ణయించుకోవాలి మరి. అలా ఒక్కటొక్కటిగా, మెల్లమెల్లగా సందిగ్ధాలన్నిటిని తీర్చుకోవాలి. కానీ ఒక్క విషయం గుర్తు పెట్టుకోవాలి. ఏ సందిగ్ధాన్ని మొదటగా తీర్చుకున్నా, దాని నిర్ణయం ఏదైనా, వాటికన్నిటికీ తగిన పరిణామాలు వుంటాయి. మంచో, చెడో, అవి మనకి నచ్చినా, నచ్చకపోయినా కూడా భరించక తప్పదు, దానికి సిద్ధమయ్యే వుండాలి.

అసలు choice లు ఎక్కువగా వున్నప్పుడే ఈ సందిగ్ధాలు కూడా ఎక్కువగా ఉత్పన్నమవుతాయి. అసలు choice అన్నదే లేకపోతే ఇంక సందిగ్ధానికి చోటెక్కడ? అంతేకాక మనముందు చాలా విషయాలు వున్నా,  మనకు వాటన్నిటి మీద సరిసమానమైన విజ్ఞత లేకపోతే కూడా ఈ సందిగ్ధం వుండదు. ఎందుకంటే కావాలనుకున్నా కూడా మనం అన్ని విషయాల గురించి చక్కగా మాట్లాడలేము కదా! అందుకని ఏ విషయం గురించి మనకు బాగా తెలుసో, దాని గురించి బాగా చెప్పగలమని మనమీద మనకు పూర్తి విశ్వాసం వుందో కేవలం దాన్నే ఎంచుకుంటాము. అవునా? అప్పుడింక ఏ ఈ సందిగ్ధమూ వుండదు. అలాగే మనిషికి మానసిక ఒత్తిడి ఎక్కువయినప్పుడు, ఏదో తెలీని గందరగోళంలో చిక్కుకుపోయానని అనిపిస్తున్నప్పుడు, చికాకుగా వున్నప్పుడు ఏం చెయ్యాలో తెలీని చిత్రమైన సందిగ్ధం కలుగుతూ వుంటుంది. అటువంటి సందిగ్ధాలలో కాస్సేపు కొట్టుమిట్టాడినా ఫరవాలేదు, కాస్సేపు మాత్రం, ఆ అయోమయం లోంచి బయటపడే దాకా ఏ నిర్ణయమూ తీసికోకపోతేనే మంచిది. అలాగే చిన్నప్పుడు నిరంకుశత్వంలో పెరిగిన పిల్లలు పెద్దయిన తర్వాత ప్రతి చిన్న విషయానికి కూడా చాలా సందిగ్ధాలలో చిక్కుకుంటారట. ఎందుకంటే వారు ఏం చేసినా అది తప్పని, అది సరైన నిర్ణయం కాదని, దానివలన వారు అనేక చిక్కుల్లో ఇరుక్కునే ప్రమాదం వుందని వారి మనసు, మెదడు, రెండు కూడా బాగా శిక్షణ పొందబడతాయి. చిన్నప్పటి నుండి వారలాగే పెరుగుతారు, వారికలాగే శిక్షణ ఇవ్వబడుతుంది. అందుకనే వారు ఏం చిన్న పని చెయ్యాలన్నా విపరీతమైన సందిగ్ధానికి లోనవుతూ వుంటారు. పాపం, వారికి తగిన ఆత్మవిశ్వాసం లేకపోవటమే దీనికి కారణం. అలాగే ఎప్పుడూ నకారాత్మకంగా ఆలోచించేవారిలో కూడా ఈ సందిగ్ధాన్ని మనం ఎక్కువగా చూస్తూవుంటాము. ఎందుకంటే ఏం చేసినా అది చెడు ఫలితాలనే ఇస్తుందని వారి నమ్మకం. అందుకని అది చెయ్యాలా, వద్దా అన్న సందిగ్ధం, చేస్తే ఏం చెడు పరిణామాలు ఎదుర్కోవలసివస్తుందో అన్న భయం, అలా వారు అనుక్షణం బాధపడుతూనే వుంటారు.

ఇంకొంతమంది వుంటారు. వీళ్ళకి  పాపం, ఎప్పుడూ నిత్య శంకే! ప్రతిదానికీ అనుమానమే! ఇంక ధైర్యంగా అడుగు ముందుకెలా వేస్తారు? వీరికి ఎప్పుడూ సందిగ్ధమే! అలాగే ఇంకొంతమందికి ఏ పని చెయ్యాలన్నా ఒకవేళ అది అనుకున్నట్లుగా కాకపొతే అందరు తమనే వేలెత్తి  చూపిస్తారేమో, నెపం తమ మీద వేస్తారేమో అని భయం, సంకోచం. ఆ భయానికి ప్రతిదానికి సందిగ్ధానికి లోనవుతూనే వుంటారు. వ్యక్తిత్వ వికాసం లోపిస్తే ఇలాంటి సందిగ్ధాలు వస్తూనే వుంటాయి. ఇంకొంతమంది వుంటారు. వీళ్ళకి perfection పిచ్చి. ఏపని చేసినా perfect గా వుండాలన్న తాపత్రయంలో అస్తమానం ఆ సందిగ్ధంలో వూగిసలాడుతూ అసలు ఏ పనీ చెయ్యరు. చెయ్యలేరు. ఎలా చేస్తారు? ఏ పని చేస్తే ఏ తప్పులు వస్తాయో అన్న అనుమాన పిశాచం అనుక్షణం పట్టి పీడిస్తూవుంటే? వేరొక రకం వుంటారు. వీరికి ఋజువులు, సాక్ష్యాల పిచ్చి. ఏ పని చెయ్యాలన్నా గతంలో ఆ పని ఎవరైనా చేసారా, ఏవిధంగా చేస్తే విజయవంతమైంది, అసలు ఈ విషయంలో ఏదన్నా రీసెర్చ్ వుందా, దాని ఫలితాలు ఏం సూచిస్తున్నాయి, ఇలా వీరి సందిగ్ధాలకి ఇంక అంతే వుండదు. ఇలాగే మా చుట్టాలొకరు ఇల్లు కొందామని ఏళ్ళకి ఏళ్ళు ప్రయత్నించి, అర్ధం పర్థం లేని సందిగ్ధాలతో తెగించి ఏ నిర్ణయమూ తీసుకోలేక చివరికి ఏ ఇల్లు కొనకుండానే కన్నుమూశారు.  చూసారా, ఏమైందో! ఇంకొక చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే, జీవితంలో మనం నిత్యం ఎదుర్కొనే అనేక విషయాలలో ఇది మంచి, ఇది చెడు అని ఖచ్చితంగా, objective గా చెప్పలేని సందర్భాలు అనేకం వుంటాయి. ఒకసారి విజయవంతమైంది ఇంకోసారి కాదు. ఒకరి విషయంలో అయినది వేరొకరి విషయంలో అవదు, అన్ని సమయాలలోను, అందరికీ  పనికి వచ్చే సామూహిక నియమం అంటూ ఏది లేదు. అందుకని ఇలాంటి సందిగ్ధాలు పెట్టుకోవటం అనవసరం. దాని వలన ఏమీ లాభం వుండదు. ఆ సమయానికి తగినది అని మనకి అనిపించిన నిర్ణయాన్ని తీసుకోవటమే సమంజసం. అంతేకాక అస్తమాను సరైన ఎంపికే చెయ్యాలని రూలేమీ లేదు. ఒక్కొక్కసారి ఎంత ప్రయత్నించినా, ఎంత కష్టపడినా, మనం అనుకున్నట్లు అవదు. ఒక్కసారి ఏమిటి, చాలాసార్లు పనులు అనుకున్న రీతిలో అవవు, నాకు అనేకసార్లు అలా జరిగింది. అలా అని అసలు ఏ పని చెయ్యకుండా వుండాలంటే ఎలా? అప్పుడసలు ఖచ్చితంగా ఏ  పని అవదు. అందుకే మన ప్రయత్నాల్ని మనం ఎప్పుడూ ఆపకూడదు. అసలు విజయవంతమైనవారి చరిత్ర చూస్తే వారు మొదట్లో పొందిన అపజయాలు అనేకం. ఈ జయాపజయాల సందిగ్ధంలో మునిగిపోతే ఇంక వాళ్ళు ఏమీ సాధించలేకపోయేవారు. అందుకే మనం మన సందిగ్ధాల వలలోంచి బయటపడి, అపజయాల సంకెళ్ళని ఛేధించుకుని ముందుకు సాగిపోవాలి.

కనుక ఇలా ఈ సందిగ్ధాల వలన ఏమీ లాభం లేదు కాబట్టి మెల్లిగా వాటిల్ని వదిలించుకోవడానికి ప్రయత్నం చెయ్యాలని మనందరికీ తెలిసిపోయింది కదా! అన్నిటికంటే ముందు మనసు ప్రశాంతంగా వుంచుకోవాలి. అలజడి నిండిన మనసు సరిగ్గా ఆలోచించలేదు. సందిగ్ధంలోంచి బయటపడి సరైన నిర్ణయాలు తీసుకోలేదు. అందుకని ప్రశాంతత చాలా అవసరం. ఆతర్వాత వీలైనంతగా objective గా ఆలోచించాలి. మనసుపై నుండి emotion ల పొరలను  తీసేయాలి. అప్పుడే సత్యాన్ని సరిగ్గా చూడగలం. ఇంకో విషయం ఏమిటంటే, ఒకొక్కసారి మరీ ఎక్కువగా ఆలోచించటం వలన కూడా సందిగ్ధాలలోంచి బయటపడలేము. ప్రతిరోజూ మన మెదడు కొన్ని వేల సందిగ్ధాలని పరిష్కరిస్తుందిట. పాపం, అధికమైన పని చేయటం వలన మెదడు కూడా బాగా అలసిపోతుంది కదా! అందుకనే అప్పుడప్పుడు ఏదైనా సందిగ్ధం వస్తే చప్పున ఒక నిర్ణయాన్ని తీసుకోలేదు. అందుకని మెదడుకి కూడా కొంచెం విరామం కావాలి. అలసిపోయినప్పుడు కానీ, లేదా ఏదన్నా ఒత్తిడిలో వున్నప్పుడు కానీ తీసుకున్న నిర్ణయాలు సరిగ్గా లేకపోవటానికి చాలా అవకాశం వుంది. అలాగే, మనం ముందే చెప్పుకున్నట్లు, రకరకాల ఛాయిస్ లు వుంటే కూడా మనం confuse అయిపోతాం. అందుకే ఛాయిస్ లని పరిమితం చేసుకుంటే కొంతలో కొంత మెరుగు. ఇంకో విషయం. సందిగ్ధంలోంచి బయటకు రావాలని తొందరపడి తప్పు నిర్ణయాలు తీసుకుంటే ఇంక ఆ తర్వాత వాటిని సవరించుకోలేము. అందుకే తొందరపాటు కూడా మంచిది కాదు. ఒక రెస్టారెంట్ లో ఏదన్నా ఆర్డర్ ఇచ్చిన తర్వాత దాన్నిఇంక మార్చలేము కదా! పక్కవాళ్ళ ప్లేటులో చూసి నాక్కూడా అదే కావాలని కోరుకున్నా ఏమీ ఫలితం వుండదు. కాకపోతే మరోసారి ఆ తప్పును సవరించుకుని కావాల్సినదానికి ఆర్దరు ఇవ్వచ్చు. అంటే ఈసారి ఆ సందిగ్ధం రాకుండా, ఆ తప్పు జరగకుండా చూసుకోవచ్చు. ఒక్కొక్కసారి ఆ అవకాశం కూడా వుండదు. పెళ్ళి, వుద్యోగంలాంటి విషయాలలో ఒకసారి ఒక నిర్ణయం తీసుకుంటే ఇంక దాన్ని మార్చటానికి భూమ్యాకాశాలు ఏకం చేయాలి. అందుకనే సందిగ్ధాలని తెలివిగా, వివేకంతో తేల్చుకోవాలి. ఆలా చేయాలంటే అసలు ముందు మనకు ఏం కావాలో, ఏది అక్కరలేదో మనకు స్పష్టంగా తెలియాలి. అప్పుడే సందిగ్ధంలోంచి మనం తేలికగా బయటపడగలం. అలాగే ఒక్కొక్కసారి నిర్ణయాలు పెద్దవైనప్పుడు సౌలభ్యం కోసం వాటిల్ని చిన్నచిన్నవిగా విభజిస్తే కూడా సందిగ్ధాలు సులువవుతాయి. అలాగే మరీ ఆలస్యం కాకుండా కొంచెంసేపు, అంటే కనీసం అయిదు నిముషాలపాటు నిదానంగా ఆలోచిస్తే కూడా సందిగ్ధంలోంచి ఏది ఎన్నుకోవాలో తప్పకుండా మెదడుకి తడుతుంది. ఇంకో పధ్ధతి ఏమిటంటే మనకు లభ్యమైన choice లలో ప్రతిదాని లాభనష్టాలు విపులంగా బేరీజు వేసుకుంటే కూడా ఈ సందిగ్ధాలను తేలికగా భేదించగలం. మన సందిగ్ధ పరిష్కారాలని ఒక్కసారి కళ్ళు మూసుకుని visualize చెయ్యటానికి ప్రయత్నిస్తే అప్పుడు కూడా మనకు మంచి అవగాహన ఏర్పడే అవకాశం వుంటుంది.

అన్నట్టు నాకు హఠాత్తుగా గుర్తొచ్చింది. ఇందాకటినుండీ ఏదేదో చెప్పేస్తున్నాను కదూ! కానీ ఇప్పటికీ వ్యాసం దేని గురించి రాయాలా అన్న నా సందిగ్ధం మాత్రం అలాగే వుంది సుమా! పోనీ ఒక పని చేద్దాం. మీరు ఇప్పటిదాకా నేను చెప్పినదంతా శ్రద్ధగా చదివారుగా! పోనీ ఈసారికి దీనితో సరిపెట్టేసుకుంటారా మరి? ఈ కబుర్లన్నీ మీకు నచ్చాయని ఆశిస్తున్నాను. మళ్ళీ ఇంకోసారి వేరే ఇంకేదైనా విషయం మీద కబుర్లాడుకుందాం. అప్పుడు ఇంకో రుచికరమైన కబురుని వెంటపెట్టుకొని మీముందుకు వస్తాను. సరేనా?  అప్పటిదాకా సెలవు.  - మీ రాధిక నోరి.

****సశేషం****

Posted in August 2024, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!