Menu Close
C-Vasundhara Photo
తెలుగు సాహిత్య చంద్ర చంద్రికలు
డా.సి.వసుంధర
తొలి రాయల యుగం

గౌరన

ప్రాచీన తెలుగు సాహిత్యంలో నాటక రచన ఎవరూ చేయలేదు. కానీ నాటక రచనా సాంప్రదాయాన్ని నెలకొల్పిన వాడు తెలుగు జాతి గర్వింపదగిన వాడు ఒక కవి ఉన్నాడు. అతడే గౌరన అని అన్నాడు ఆరుద్ర.

గౌరన హరిశ్చంద్ర చరిత్ర, నవనాథ చరిత్రలను ద్విపద కావ్యాలుగా రచించాడు. ఇవి ద్విపదలైనప్పటికీ ఇందులో నాటక లక్షణాలు ఉన్నాయని ఆరుద్ర మాట.

గౌరన, తండ్రి, పెదనాన్న, గౌరనకు అన్నయైన ధరణి వీరంతా రాజాస్థానాలలో మంత్రులుగా ఉండడం వల్ల గౌరన తన రచనల లోని పాత్రలను సహజంగా తీర్చిదిద్ద గలిగాడు. రాజాస్థాన మర్యాదలు మొదలైనవి, సామాన్య ప్రజల జీవన విధానం బాగా గ్రహించిన గౌరన తన రెండు ద్విపద కావ్యాలను నాటకాల వలె రచించాడు.

గౌరన హరిశ్చంద్ర చరిత్ర ఆదిలో చెప్పిన పద్యం వల్ల ఇదంతా తెలుస్తున్నది. ‘ధరణి మంత్రికి కూర్మి తమ్ముడ ఘనుడ ...నని గౌరన చెప్పుకొన్నాడు.

గౌరన లక్షణ దీపిక అనే గ్రంథం వ్రాశాడు. దీనిలో గౌరన తెలుగు ఛందస్సును గూర్చి సంస్కృత భాషలో వ్రాయడం విశేషం. ఇది ప్రామాణిక మైన గ్రంథం. దీనికే గౌరణకు “లక్షణ చక్రవర్తి” అనే బిరుదు వచ్చింది. అని ఆరుద్ర తెల్పారు.

ఈ లక్షణ దీపిక రచించడానికి గౌరన దాదాపు యాభై ప్రామాణిక గ్రంథాలను పరిశీలించాడు. లక్షణ దీపికకు  రెండు విభిన్నమైన ప్రతులున్నాయి అని తెల్పి ఆరుద్ర, వాటి వివరాలను, గౌరన తన రచనకు పరిశీలించిన ప్రామాణిక గ్రంథాల వివరాలను ఒక పట్టికగా ఇచ్చారు. అవిగాక ఎనిమిది తెలుగు ఛందో గ్రంథాలను గౌరన తెల్పినట్లు చిలకూరి పాపయ్య శాస్త్రి గారు చెప్పారని ఆరుద్ర తెల్పాడు. (స.ఆం.సా. పేజి 817).

గౌరన రచనా విధానం:

గౌరనకు గల సంస్కృత భాషా పాండిత్యం, ఛందో శాస్త్రపరిజ్ఞానం అపారమైనది. అయినప్పటికీ గౌరన తన రచనలను ద్విపదలో రచించడం వల్ల గౌరనకు తెలుగు ప్రజల పట్ల గల ప్రేమాభిమానాలు, తెలుగు వారు తన రచనలను చదవాలన్న ఆశయం చాలా గొప్పది. శ్రీనాథుని వలె గాక తెనుగు భాషలో ఛందస్సుకు ప్రాధాన్యతని ఇచ్చాడని ఆరుద్ర అభిప్రాయ పడ్డారు.

గౌరన పండితులను గూడా గౌరవిస్తూ ఇలా తెల్పాడు. పండితులు తన రచనలోని కవితా ఛందస్సును చూచి హర్షించి కవులందరూ శిరః కంపనము సేయ పచరించి వీనుల విందుగాగ ఋగ్వేద ప్రసిద్ధుడైన హరిశ్చంద్రుని చరిత్ర నేను రచిస్తానని తెల్పాడు.

హరిశ్చంద్రుని చరిత్ర:

ఋగ్వేద కథకు ప్రచారంలో ఉన్న హరిశ్చంద్రుని కథకు పోలికే లేదని, వేద హరిశ్చంద్రుడు ఆడిన మాట తప్పాడు. తన కొడుకును బలి ఇస్తానని మాట తప్పి మరో బ్రాహ్మణ బాలుని బలి ఇచ్చాడని ఆరుద్ర తెల్పాడు. గౌరన మార్కండేయ, భాగవతాదులలో ఉన్న కథ గాక స్కాంద పురాణం లోని కథ తీసుకున్నాడని ఋగ్వేద కథ కాదని ఆరుద్ర తెల్పాడు. గౌరనది స్వేచ్చానువాదం.

గౌరన వ్రాసిన హరిశ్చంద్ర కావ్యాన్ని 1912 లో వేదం వెంకటరాయ శాస్త్రి గారు సటిప్పణంగా ప్రకటించి సాహిత్య సేవ చేశారు. అవతారికలో శాస్త్రి గారు వ్రాసిన దాని సారాంశం ఇలా ఉంది.

హృద్యంగా రాయగల గౌరన రెండు చోట్ల గొప్ప పొరపాట్లు చేయడం జరిగింది. అది ఏమనగా వసిష్ట విశ్వామిత్రులు నీచులవలె జగడమాడుట. ఆదిలో మానవ మూర్తులు గానూ, అంతంలో పక్షి మూర్తుల వలె జగడం ఆడడాన్ని ఇతర మతస్తులు చులకనగా తీసుకొని పరిహసించుచుండిరని అందుకు శాస్త్రి గారు పక్షి యుద్ధ భాగం ముద్రించలేదని తెల్పారని ఆరుద్ర తన రచనలో తెల్పారు. (స.ఆం.సా. పేజి 819).

అయితే ఈ కథ గౌరన సృష్టించినది కాదని అది భాగవత పురాణంలో ఉన్నదే గౌరన వ్రాసాడని ఆరుద్ర తెల్పారు. (ఈ కథ భాగ-9-192 లోది)

హరిశ్చంద్రుని కథను మార్కండేయ పురాణం అనువదించిన మారన అందులోని 144 గద్య పద్యాలలో హరిశ్చంద్రుని కథ అత్యంత రమణీయంగా వ్రాసినట్లు ఆరుద్ర తెల్పారు.

వారిద్దరి రచనలలో ఉన్న విషయాలను ఆరుద్ర చర్చించారు.

గౌరన తీర్చిదిద్దిన హరిశ్చంద్ర, కాలకౌశిక పాత్రలు వారి మధ్య సంభాషణను గౌరన వ్రాసిన తీరు పరమ కరుణరస భరితం.

నెలమి ధేనువు ..... అంటూ ప్రారంభించి
నా కులభూషణు నా కూర్మి పట్టి
నీ కొమారుని గొను మిచ్చెద నీకు
విలువ వేల వేల నిష్కములు....అంటూ హరిశ్చంద్రుడు తన కుమారునికి వెలగట్టి చెప్పడం వారిద్దరి మధ్య బేరసారాలు కడు కరుణరస భరితం. ఏ తండ్రికీ అలాంటి పరిస్థితి రాకూడదు. నిష్కములు అనేవి ఆనాటి నాణేలు కాబోలు.

పురోహితుడైన కాలకౌశుకుడు తాను ఎలా ధనం సంపాదించింది తెల్పిన ద్విపద వాక్యాలను (గౌరన వ్రాసిన) సురవరం ప్రతాపరెడ్డి గారు ఇలా వ్రాశారని ఆరుద్ర తెల్పారు.

‘..రోగులవల్ల కొంత లాగి, ప్రేతావహకుడై కొంత గడించి....’ ఇలా సాగిన కాలకౌశికుని సంపాదన వర్ణనతో గౌరణకు దొంగ పురోహితులన్నా, కుహనా జ్యోతిష్కులన్నా ఎంత అసహ్యమో తెలుస్తున్నది. నవనాథ చరిత్రలో కూడా ఒక వంచకపు పురోహితుణ్ణి ఎంత హేయంగా చిత్రించాలో అంత హేయంగా చిత్రించాడు” అని ఆరుద్ర తెల్పారు. దీనిని గూర్చి ఒక కథ కూడా నవనాథ చరిత్రలోది తెల్పాడు.

ఈ సందర్భంగా తప్పుచేసిన వాడు మిగతా వారితో ఈ సంగతి ఎవరితో చెప్పకండి అంటూ మేధినీ నాధుడు వింటే నన్ను ఇక్కడినుండి వెళ్ళగొట్టించు ‘మేనెల్ల కుక్కచ్చు లొత్తించు’ అని చెప్తాడు. కుక్కచ్చు లనగా ఆనాడు బ్రాహ్మణులకు వేసే గొప్ప శిక్ష. అని చెబుతూ ఆరుద్ర ఈ కుక్కచ్చు సంగతి కేతన తన విజ్ఞానేశ్వరం కూడా తెల్పాడని చెప్పారు. కుక్కచ్చు అంటే కుక్క పాదం లాగా ఉండే బొట్టు. ఇది ఎలా వేస్తారో గూడా కేతన తెల్పాడని చెప్తూ ఆ పద్యాన్ని విజ్ఞానేశ్వరం నుండి తీసుకొని తన సమగ్ర ఆంధ్ర సాహిత్య చరిత్రలో (పేజీ 843) కూడా పొందుపరిచాడు ఆరుద్ర. ఆ పద్యాన్ని ఇక్కడ వ్రాస్తున్నాను.

తల గొరిగించి కుక్కడుగు తప్పక ఫాలమునందు వ్రాసి ముం
గలధనమెల్ల బుచ్చుకొని గాడిద నెక్క గజేసి గ్రామమున్
వెలువడ ద్రోచిపుచ్చుటయు విప్రుని జంపుట క్షుద్రజంతులన్
జొలువన చంపు తప్పు గలచో దాగు చంపుట ధర్మమెమ్మెయిన్ (విజ్ఞాన 3-42)

**** సశేషం ****

Posted in August 2024, సమీక్షలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!