Menu Close
తెలుగు భాష భవితవ్యం 8
- మధు బుడమగుంట

గత సంచికలో భరతఖండం బయట నివాసముంటూ, వృత్తి రీత్యా మాతృభూమి ని వదిలిననూ మన మూలాలను, మాతృభాష పై మమకారాన్ని, సంస్కృతీ సంప్రదాయ విలువలను మరిచిపోకుండా తమ వంతు బాధ్యతగా నిబద్దతతో సేవా కార్యక్రమాలను చేస్తున్న కొంతమంది భాషా పండితుల గురించి నాకు తెలిసిన వివరాలు అందించాను. ఈ సంచికలో ప్రత్యక్షంగా నేను నా శ్రీమతి ఉమప్రియ తో కలిసి చేస్తున్న మరో భాషాసేవా యజ్ఞాన్ని వివరించి ఈ సంచికతో ఈ శీర్షికకు ముగింపు పలుకుతాను.

సరళమైన తేటతెనుగు తెలుగువారి మమకార భాషగా మారి అందరూ తెలుగులోనే తెలుగు మాటలతోనే సంభాషణలు కొనసాగించాలనే తపనతో, ‘మన తెలుగు మధురానుభూతుల వెలుగు’ అనే సూత్రంతో 2015 ఆగష్టు నుండి నా శ్రీమతి సహకారంతో “సిరిమల్లె” అనే అంతర్జాల మాస పత్రికను నడుపుతున్నాను. ఈ రోజు మీ ముందు మాట్లాడటానికి నాకున్న అర్హత ఈ పత్రికను నిరాఘాటంగా వీలైనంత వరకు మంచి సాహితీ విలువలతో నేటికి 108 సంచికలను ప్రచురించడమే. అందుకు నాకున్న బలం, నా శ్రీమతి ఉమప్రియ మరియు నా చుట్టుప్రక్కల ఉన్న ఎంతో మంది సాహితీవేత్తల ఆశీర్వచనాలు. బలహీనత నేను మాత్రమే. కొన్ని శీర్షికలు నేను వ్రాయగలను అనే ఒక్క ఇసుమంత ధైర్యం తప్ప.

ఒక పత్రికను 9 సంవత్సరాలు నిరాఘాటంగా నడపడానికి కొంచెం సంపాదకీయం గురించి తెలిసివుండాలి కదా. మరి సంపాదకీయం గురించి మాట్లాడమంటే ఇక్కడ నా అనుభవాలు, ఆలోచనలు మీతో పంచుకోవడం తప్ప నైపుణ్యంతో మీకు సలహాలు ఇచ్చే స్థాయి నాకు లేదు. రాదు కూడా. ఎందుకంటే తాపి ధర్మారావు, నార్ల వెంకటేశ్వరరావు, నండూరి రామమోహనరావు, గురజాడ అప్పారావు మొదలు నేడు వస్తున్న ఎన్నో సాహితీ పత్రికల సంపాదకుల వరకూ ఎందఱో మేధావులు తమ సృజనాత్మక పాండిత్యంతో పత్రికల విలువలనూ పెంచుతూ వచ్చారు. ఒకప్పుడు సంపాదకుడు అంటే మార్పులు, చేర్పులు, కూర్పులు తదితర ధర్మాలను పరిగణలోకి తీసుకొని తమ వృత్తి ధర్మాన్ని తప్పక పాటించేవారు. కానీ సంపాదకీయం అనే పదానికి కాలానుగుణంగా అర్థం కూడా మారుతూ వస్తున్నది. సంపాదకుడు అంటే ‘సంపాదన మీదే దృష్టి పెట్టి అందుకు సదా కృషి సల్పేవాడు’ అనే వారు లేకపోలేదు.

నాకు తెలిసినంతవరకు సంపాదకునికి ఉండవలసినది భాషా పరిజ్ఞానాన్ని ఇనుమడింపజేసే సృజనాత్మకత. సూర్య కాంతి అందరికీ సుపరిచితమే. కానీ కాంతి తరంగ ధైర్ఘ్యాన్ని మార్చి అందులో నుండి అందమైన వివిధ రంగులను సృష్టించవచ్చు. అలాగే విషయం పాతదే అవచ్చు కానీ దానిని విభిన్నంగా చూపించి అందులో కొత్తదనం నింపే బాధ్యత కూర్పరిదే.

వినూత్న రచనా ప్రక్రియతో పాఠకులను ఆకర్షిస్తే ఆ పిమ్మట వారికి భాషమీద ఆసక్తి కలిగి సాహితీ ప్రియులుగా మారి  మన పంథాలో నడుస్తారు. ఆ విషయంలో సంపాదకునిదే ముఖ్య పాత్ర అవుతుంది. పై విషయాలను ఆకళింపు చేసుకుని నా వంతు కార్యాన్ని నా సామర్ధ్యమేర నిర్వర్తిస్తున్నాను.

మన తెలుగు భాష సంస్కృత భాషతో ముడిపడివుంది. కనుక గ్రాంధిక భాషలో వ్యాకరణ శుద్ధితో రచనలు చేయాలంటే సంస్కృత పరిజ్ఞానం కూడా ఎంతో అవసరం.

ఇందులో నాకు ఆత్మ సంతృప్తినిచ్చే అంశాలు:

నేను సంగ్రహించిన విషయాలను నా మదిలో రేగే భావాలకు అనుగుణంగా అక్షరరూపం కల్పిస్తూ సులభతరమైన భాషలో అందించడం.

తమ మదిలో పొంగుతున్న ఎన్నో భావాలను బయటికి తీసుకురావాలని ఉవ్విళ్ళూరుతున్న వ్యాకరణ పరిజ్ఞానం లేని సామాన్య సాహితీ ప్రియులకు నా వంతు సహకారం అందించి వారి రచనలు ప్రచురించినపుడు వారు పొందుతున్న ఆనందం, అవధులు లేని ఆత్మసంతృప్తి నాకు ఎంతో ముఖ్యం.

నేటి సమాజ జీవన శైలికి అనుగుణంగా ఉన్న ఆరోగ్య విషయాలను, శాస్త్రీయ పరిజ్ఞానాన్ని మాతృభాషలో ఆంగ్ల భాష రాని తెలుగువారికి అందుబాటులో ఉంచాలన్నదే నా అభిలాష.

ఇక రచనలు చేసే, చేయాలనే తపన ఉన్న వారికి నాదొక చిన్న సలహా:

కవి అనే మాటకు నాకు ఒక అర్థం స్ఫురించింది. కడు జాగ్రత్తగా సనాతన ధర్మాలను స్థిరీకరిస్తూ, కాలానుగుణంగా  వితరణతో ఆలోచనల భావజాలాలకు అక్షరక్రమం కల్పించే వారు కవి. ఆ మాటకు లింగ బేధము లేదని నా భావన.

మీ రచనలలో ఎదో ఒక సామాజిక అంశాన్ని పరిగణలోకి తీసుకోండి. పదదోషాలు లేకుండా పది మందికి మీ అంతరంగ భావం అర్థమయ్యే రీతిలో మీ కలాన్ని కాలానుగుణంగా కదిలించండి.

మాటలు, చేతలు మాత్రమే కాక మౌనం కూడా కొన్నిసార్లు మనలను చైతన్య వంతులుగా మార్చుతుందని నాకు ఈ సాహితీ స్వానుభవం తెలిపింది.

సంపాదకుడికి ముందు స్థిరత్వం ఉండాలి అప్పుడే రచయితలకు కూడా నమ్మకం ఏర్పడుతుంది.

కొత్త నీరు వస్తే పాత నీరు పోతుందంటారు. కానీ సాంద్రత ఆధారంగా ఇంకా కొంత ఉండిపోతుంది. అదేవిధంగా కొత్త కొత్త ప్రక్రియలు ఎన్ని వచ్చినను వాటికి మూలాధారమైన పాత ప్రక్రియలు కనుమరుగు కాకూడదు. అప్పుడే భాష బతుకుతుంది. భాషకు ఆధారం ప్రాచీనత. నిజం చెప్పాలంటే వైన్ ఎన్ని సంవత్సరాలు ఎక్కువ నిలువచేస్తే అంత ఖరీదు చేస్తుంది. భాష కూడా అంతే.

మరో విషయం. భాషాసేవ చేయాలనే సంకల్పం బలంగా ఉండాలి అంతేకానీ అందరూ నేను చేస్తున్న పనిని మెచ్చుకుని నన్ను కీర్తించాలి, నాకు గుర్తింపు రావాలి అని అనుకుంటే నీ సంకల్పం బలహీనమైపోతుంది. నీకు రావాల్సిన గుర్తింపు నీ సంకల్పం సిద్ధించిన రోజు తప్పకుండా లభిస్తుంది. దానికోసం వేచి చూస్తూ అనవసరమైన అసహనాలతో అసలు కార్యాన్ని మరిచిపోకూడదు. ఇదే సూత్రాన్ని నేను నిస్సందేహంగా పాటిస్తున్నాను.

ఇకపోతే, తెలుగు భాషను భావి తరాలకు అందించే విధానం గురించి మాట్లాడాలంటే, నాటికలు, రూపకాలు, సుందరమైన పద ప్రయోగాలతో పిల్లలను ముందుగా తెలుగు పైన ఆసక్తి కలిగేటట్లు చేయాలి. ప్రారంభంలోనే అత్యంత క్లిష్టమైన పదాలను, పోతన పద్యాలను, వ్యాకరణ శుద్ధితో మొదలుపెడితే వారు భయపడి  మొక్కుబడిగా నేర్చుకోవడం మొదలుపెడతారు. పట్టాను పొంది అయిపోయిందని భావిస్తారు. మాతృభాష అనేది నిరంతరం సాగే జీవన ప్రక్రియ అనే భావన వారికి కలిగినరోజు మన తెలుగు సజీవమై విరాజిల్లుతుంది.

ఈ ఆలోచనతోనే నేనే స్వయంగా కొన్ని సందేశాత్మక నాటికలను రచించి ఇక్కడి తెలుగు పిల్లలచేత, తెలుగు సాంస్కృతిక కార్యక్రమాలలో ప్రదర్శింపజేశాను. దానికి పూర్తి దర్శక బాధ్యతలు స్వీకరించి ప్రదర్శన తరువాత ప్రేక్షకుల నుండి పొందిన మన్నన ఒక మరిచిపోలేని అనుభూతి.

నేటి సమాజపోకడను అంశంగా తీసుకుని ఒక సందేశాత్మక ఆలోచనతో నేను స్వయంగా రచించిన రూపకాలను, నాటికలను ఇక్కడి తెలుగువారి చేత ప్రదర్శింపజేసిన నాడు నాకు ఎంతో ఆత్మసంతృప్తి కలిగింది. పిల్లలు, పెద్దవారు అనే బేధం లేకుండా అందరిచేత నాటికలు వేయించడం అనేది నాకు దక్కిన ఒక చక్కటి వరం అని భావిస్తాను. రెండు నెలల క్రితం కూడా ‘నిరుపమానమైన తెలుగు-అక్షర నీరాజనం’ అనే నాటికను ఇక్కడి తెలుగు భాషమీద పట్టు ఉన్నవారిని పాత్రధారులుగా చేసి ప్రదర్శించడం నిజంగా అదో విలువకట్టలేని ఆత్మసంతృప్తి. మన తెలుగు వారు ఎక్కడ ఉన్ననూ అందరికీ అర్థమయ్యే రీతిలో ఆసక్తిని కలిగించి మన సనాతన ధర్మాలను, భాషా విలువలను వివరిస్తే, అటుపిమ్మట అందరికీ సరైన విధంగా ప్రదర్శించే అవకాశాన్ని కలిగిస్తే మన మాతృభాష మనతోనే విలసిల్లుతుంది.

ఆంగ్ల పదాలు లేకుండా అతి సరళమైన అమ్మ భాషను మనం మాట్లాడిన రోజు అంతా మంచే జరుగుతుంది. మన సిరిమల్లె పత్రికలో నేను పాటిస్తున్న/ప్రయత్నిస్తున్న విధానం అదే.

గ్రాంధిక భాషకు, వాడుక భాషకు మధ్య ఏర్పడిన అత్యంత సున్నితమైన పొరను తొలగించవలసిన బాధ్యత కూడా మనందరిపైన వుంది. తెలుగు భాష లోని మాధుర్యాన్ని అందరికీ రుచి చూపించాలి.

అమ్మ నుడి అంటే మనతో ఉండే కుటుంబ ప్రేమ, మనలో చెలరేగే భావావేశాల ప్రవాహ ధార కావాలి.

అమ్మ ప్రేమ వలన మన జీవన విధానంలో ఒక మహత్తరమైన శైలి అలవరుతుంది అలాగే మాతృభాష లో మనం వ్యక్తపరిచే భావాలు అందరికీ అర్థమై, సజీవమై ఆనందాన్ని అందిస్తాయి.

గమ్మత్తులు నేడు మనం చేస్తున్న టైపింగ్ లో జరుగుతుంటాయి. ‘వస్తున్నాను’ అని వ్రాస్తే అది ‘వేస్తున్నాను’ అని వచ్చింది. అది గమనించకపోతే అర్థమే మారిపోయి అపార్థాలకు దారి తీస్తుంది.

ప్రకృతి ప్రసాదిస్తున్న సహజ వనరులకు, ఆధునిక వైద్య పరిజ్ఞానాన్ని జోడించి సరైన రీతిలో వాడుకొన్న రోజు మన ఆరోగ్యం మన చేతిలో ఉంటుంది. అలాగే, అంతులేని సాహిత్య విజ్ఞానాన్ని, సనాతన సాహితీ పోకడలను అందించిన స్ఫూర్తి దాతల భాషా సంపదను సరిగా అర్థం చేసుకొని నేటి సామాజిక పరిస్థితులను బేరీజు వేసుకుంటూ సమతుల్యంతో సాహిత్య సేవను కొనసాగిస్తే మన సాహిత్యం మన చేతిలోనే ఉంటుంది.

చివరగా,

ఈ సాహిత్య సేవ, సమాజ సేవ చేస్తే మనకేంటి లాభం అనే వారు లేకపోలేదు. మనిషిగా జన్మించి మనకు లభించిన ఆ చిన్ని మెదడుతో ఎన్నో ఆవిష్కరణలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పొంది జీవిస్తున్న మనం ఎంతో అదృష్టవంతులం. మనకు లభించాల్సిన సౌఖ్యాలన్నీ దొరికాయి. కనుక, మనవంతు బాధ్యతగా మనం సాహిత్య సేవను వివిధరూపాలలో అందిస్తూ ముందుకు సాగాలి.

మనం చేసే సేవ అనేది నిజం చెప్పాలంటే సేవ కాదు. మనకు లభించిన ఈ వరాలన్నింటినీ మరో రూపంలో తిరిగి ఇచ్చేస్తూ ఆ రుణాన్ని తగ్గించుకుంటూ వెళుతున్నాము. అందులో మరో సౌకర్యం కూడా ఉంది. అదనపు బహుమానాలు లభిస్తాయి. అవి ఏంటంటే మనం చేస్తున్న పనులకు లభించే స్పందన, తద్వారా మనలో కలిగే ఆనందకర ఆత్మసంతృప్తి, అది అందించే మానసిక ధైర్యం, తద్వారా చైతన్యమౌతున్న మన భౌతిక ఆరోగ్యం. ఇవన్నీ కూడా అంగట్లో వస్తువులు కాదు కొనుక్కొని అనుభవించడానికి. మనం కొనుక్కోగలిగినవి అన్ని ఫార్మసీ లలో దొరికే వందల కొలది మందు బిళ్ళలు మాత్రమె. వాటి అవసరం లేకుండా సహజంగా లభించే ఈ పద్దతిని మనం ఎందుకు అవలంబించకూడదు? కావలసినది కేవలం నిబద్ధత, నిర్విఘ్నంగా కొనసాగించాలనే సంకల్పం. ఇంతటి సామాజిక స్పృహ కలిగిన మనందరికీ అదేమంత పెద్ద కష్టం కాదు.

కవిత్రయం మొదలు, నన్నెచోడుడు, సోమనాథుడు, ధూర్జటి, మామిడి సింగన, పోతన, శ్రీనాథుడు, ఇలా చెప్పుకుంటూ పోతుంటే వేలమంది తెలుగు సాహిత్యానికి వన్నెను అద్ది అంతులేని సంపదను భావి తరాలకు అందించారు. వారు జీవించడానికి సాహిత్యాన్ని నమ్ముకొని, స్వయం కృషితో, సృజనాత్మక సాహిత్య విలువల కొరకై నిబద్ధతతో పనిచేసారు కనుకనే ఆనాటి రాజులు వారిని ఆదరించి పోషించారు. నేడు మనమందరం స్వయం పోషకులము కనుక సాహిత్యాన్ని మనదైన రీతిలో ఆదరించి పోషించే స్థోమత స్థాయి మనకు ఉంది. ఆ వాస్తవాన్ని అందరం జీర్ణించుకుని కార్యసాధకులుగా మారితే అంతా శుభకరమైన భాషా చైతన్యం విస్తరిస్తుంది.

మాతృభాష మాధుర్యాన్ని మనందరం ఆస్వాదిస్తూ ఆనందిద్దాం. భాషా ప్రగతి పురోగమనానికి పాటుపడదాం. సాహితీ విలువలతో కూడిన సంప్రదాయబద్ద సమాజాన్ని భావితరాలకు అందిద్దాం.

సర్వేజనః సుఖినోభవంతు
మన సాహిత్యం, భాషా పరిరక్షణ మన చేతిలో... స్వస్తి.

Posted in August 2024, ఆరోగ్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!