Menu Close
రెండు తప్పులు (కథ)
-- కర్లపాలెం హనుమంతరావు --

అద్దంలో చూసుకొంది వీల్ చైర్లో కూర్చున్న ప్రతిబింబాన్ని సుందరమ్మ. జుట్టు నెరిసినా చర్మం ముడతలు పడిపోయినా కళ్ళు ఇప్పటికీ మునుపటికి మల్లేనే అమావాస్య తారకలు మల్లే తళతళా మెరుస్తూనే వున్నాయి.

ఆయనగారికీ కళ్ళంటే ఎంత ఇష్టమో! 'నీ అందమంతా నీ కళ్ళలోనే ఉంది సుందూ!' అని మురిపించే మురళి గుర్తుకొచ్చాడు. వెంటనే కళ్ళు చెమ్మగిల్లాయి.

మొహం మతాబులా వెలిగిపోయింది భర్త తలపుల ముప్పిరిగొనటంతో. ఆ మురిపెం ఒక్క క్షణమే! తిరిగి ఈ లోకంలోకి వచ్చి పడింది సుందరమ్మ. 'ఇంకెంత కాలం ఈ ఊహల స్వర్గంలో వుయ్యాలాటలు! ఈ రోజుతో తన ప్రేమకథ సుఖాంతం కావాలి. ఈ రాత్రే తనకు చివరి రాత్రి అయితీరాలి'

అద్దంలో ఆఖరి సారి తనను తృప్తిగా చూసుకొంది. ఇంత కాలం తన వంటరితనాన్ని ప్రేమగా పాలుపంచుకొన్న గది చుట్టూతా కలియ తిరిగింది. గోడ మీద మురళి పటంలో నుంచి నవ్వుతూ పలకరించాడు. పరవశించింది సుందరమ్మ. పదో ఫ్లోర్ ఫ్లాట్ నుంచి బైటికొచ్చింది.

మరో మూడు ఫ్లోర్ల పై కెళితే టెర్రాస్. వీల్ చైర్ చక్రాలను చేతులతో తోసుకొంటూ లిప్ట్ లోకి వెళ్ళి గ్రిల్ వేసి పదమూడో నెంబర్ నొక్కింది సుందరమ్మ.

ఆత్మహత్యకు వయసుతో సంబంధం ఏముంది? తనేమన్నా సరదాగా ప్రాణాలు తీసుకొంటుందా? చిన్నప్పుడే పోలియో ప్రసాదించి చక్రాల కుర్చీకి అంకితం చేసాడు; ముసలితనంలో వంటరితనం మిగిల్చి మిగతా సుఖాన్నీ లాగేసుకొన్నాడా దేవుడు. వాడి ఆటలను ఇహ పై సాగనీయ కూడదు. 'తనో . .  వాడో .. తేల్చుకోవలసిన క్షణమొచ్చేసింది. అన్ని విధాలా తన కన్యాయం చేసిన భగవంతుణ్ణి ఎలాంటి పరిస్థితుల్లోనూ గెలిపించే ప్రశ్నేలేదు. ఈ జీవన్మరణ పోరాటంలో ముమ్మాటికీ తనే జయించాలి. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన మురళిని చేరటానికైనా తెల్లారేలోగా ఈ లోకానికి వీడ్కోలివ్వాలి. దృఢ నిశ్చయంతో సుందరమ్మ లిఫ్ట్లో టాప్ మోస్ట్ ఫ్లోర్ చేరుకుంది.

ఆ పదమూడో ఫ్లోర్ పైనే టెర్రాస్. టెర్రాస్ ఎంట్రీ డోర్ వారగా తెరిచివుంది. ద్వారానికి ఆవల వినీలాకాశం. తలుపును బార్లా తెరిచి చక్రాల బండిని బైటికి నెట్టుకొచ్చింది సుందరమ్మ. బంగారు రంగు చందమామ నింగిలోకి రమ్మని ఆహ్వానం పలుకుతోంది. తమ లోకంలోకి ఎంత తొందరగా తెచ్చి కలుపుకొందామా అన్నట్లు మిణుకు మిణుకు మంటూన్నాయి తారకలు అక్కడక్కడా.

ఆ పచ్చపువ్వు వెన్నెల్లో టెర్రాసుకు పెట్టిన వడ్రాణంలా పిట్టగోడ కనిపించింది. ‘గోడ ఎత్తు కొద్దిపాటిదే. అయినా వీల్ ఛైర్ మీద నుంచి దూకేందుకు పెద్ద ఇబ్బందేమీ ఉండదులే' అనుకొంది సుందరమ్మ. 'చైనావాలైనా నా చావు నిర్ణయం ముందు చాలా చిన్నది. ఆఫ్ట్రాల్, ఈ పిట్టగోడ ఎంత!'. వీల్ ఛైర్ చక్రాలను తోసుకుంటూ పిట్టగోడ దగ్గరి కొచ్చి ఆగింది సుందరమ్మ.

అప్పుడు వినిపించిందా శబ్దం! సన్నగా .. చిన్నగా .. ఆగి ఆగి . . వెక్కుతూ వెక్కుతూ . . ఏడుస్తున్న శబ్దం . .! ఆ పీల గొంతు ఎవరిదో ఆడమనిషిదే! !

ఎవరీ అర్థరాత్రి వేళ ఇక్కడ.. ఇలా ఏడుస్తున్నదీ?! ఒక్కసారి వళ్ళు జలదరించింది సుందరమ్మకు. మరోసారి అయితే ఇట్లాంటి పరిస్థితిలో భయంతో వణికిపోయేదే. గబగబా ఇంట్లోకి పారిపోయి తలుపు గడియ బిగించేసుకుని దేవుడి గదిలో దూరిపోయేదే ప్రాణభీతితో! కానీ, ఇప్పుడున్న పరిస్థితి వేరు.

సుందరమ్మ చుట్టూతా పరికించి చూసింది పరీక్షగా. పిండార బోసినట్లున్న ఆ పున్నమి వెన్నెల్లో ఆమె కెవరూ కనిపించారు కాదు.

తానున్న చోటు నుంచి లిఫ్ట్ వెనక భాగం కనిపించదు కానీ దాని నీడ ఫ్లోర్ గచ్చు మీద పడి కనిపిస్తుంది. లిఫ్ట్ వెనక గోడకూ పిట్టగోడకూ మధ్య సరిగ్గా ఒక మనిషి నిలబడే స్థలం మాత్రమే ఉంటుంది. అక్కణ్ణుంచే ఏడుపు స్వరం వినిపిస్తోందిప్పుడు.

సుందరమ్మ ఒక్క ఉదుటున బండి చక్రాలు గట్టిగా తోసి ఆ నీడలోకి వచ్చి ఆగింది. ఊపిరి బిగపట్టి తొంగి చూసింది. ఒక అమ్మాయెవరో పిట్టగోడ మీద నిలబడి కనిపించింది. ఇంకో క్షణంలోనో అరక్షణంలోనో ఆ పిల్ల కిందకు దూకబోతుందని అర్థమయింది సుందరమ్మకు.

ఆమెను చూస్తే నిండా ఇరవై ఏళ్ళయినా నిండినట్లు లేవు. ఆ పండు వెన్నెల వెలుగులో పాలిపోయిన ముఖం, చెదిరి కిందికి జారిన పొడుగాటి జడ పాయలు! వంటి మీది ఎర్రటి స్కర్ట్ గాలి విసురుకి ఎడా పెడా కొట్టుకొంటున్నా పట్టించుకోనే స్థితిలో లేనట్లుందామె. తలెత్తి ఆకాశం వంక దీక్షగా చూస్తూ ఏడుస్తోంది చిన్నగా. తను నిలబడ్డ చోటు కాస్తంత విశాలంగా ఉండటంతో మరో అడుగు ముందుకు పడితేనే ఆమె కిందకు దూకగలిగేది.

ఊహించని ఆ దృశ్యాన్ని చూసి నివ్వెరపోయింది సుందరమ్మ. క్షణంలో తేరుకొని 'అయ్యో! అయ్యయ్యో ! అదేం పని? ఆగమ్మాయ్!' అని బిగ్గరగా కేకేసింది.

ఉలిక్కిపడి గిరుక్కని పక్కకు తిరిగి చూసిందా అమ్మాయి. ఏడ్చి ఏడ్చి ఉబ్బిన ఆ పిల్ల మొహం అంత దుఖంలోనో ఎంతో అందంగా ఉంది, తన ఆఖరి క్షణాల ఏకాంత విషాదాన్ని ఆటంక పరిచే మరో జీవి ఆ వేళ అక్కడ అనూహ్యంగా ప్రత్యక్షమవటంతో నిర్ఘాంతపోయిందామె ఒక్క క్షణం. మరుక్షణంలోనే తేరుకొని మొహం తిప్పేసుకొని  నిలబడ్డ చోటు నుంచి అడుగు ముందుకేసేందుకన్నట్లు కుడికాలు రవ్వంత పైకెత్తింది.

ఉన్న శక్తినంతా కూడదీసుకొంటూ ఆ పిల్లనక్కణ్ణుంచి వెనక్కు లాగేయాలన్న ఆత్రంలో అప్రయత్నంగా కుర్చీలో నుంచి పైకి లేచింది సుందరమ్మ. బరువైన దేహాన్ని మోసే శక్తి లేని పోలియో కాళ్ళు తడబడటంతో ముసలమ్మ బొక్కబోర్లా పడిపోయింది. మొహం గచ్చును గుద్ది ముక్కు చిట్లింది. చక్రాల కుర్చీ విసురుగా వెన్ను మీదపడటంతో భరించలేని నొప్పి. అంత బాధలోనూ బావురుమంటూనే తలెత్తి పిట్టగోడ వంక చూసింది సుందరమ్మ. ఆ పిల్ల లేదక్కడ!

ముసలమ్మ షాక్. జరిగింది అర్థమై వజవజా వణికి పోయిందామె. తన్నుకొచ్చే ఆ దుఃఖం వంటి మీది గాయాల వల్ల కాదు. కంటి ముందు జరిగే దారుణాన్ని అడ్డగించే శక్తి లేనందు వల్ల.

కొన్ని క్షణాల కిందట తానూ అదే దారిలో జీవితం ముగించాలనుకొంది. కానీ కంటి ముందు ఇప్పుడు అదే దారుణం జరిగిపోయింది. ఎంత విచిత్రం !

భావోద్వేగాల సుడిగుండంలో పడి విలువయిన జీవితాన్ని వృథా చేయటం ఎంత తప్పో ఇప్పుడు సుందరమ్మకు తెలిసివచ్చింది. పడ్డ మనిషి లేచే ప్రయత్నమైనా చేయకుండా కళ్ళు మూసుకొని నిశ్శబ్దంగా రోదించటం మొదలుపెట్టింది.

మీద పడ్డ వీల్ ఛైర్ ని ఎవరో నెమ్మదిగా పైకి తీసినట్లూ మృదువైన చేతులేవో తనని తిరిగి చక్రాల కుర్చీలోకి ఎక్కించినట్లూ అనిపించింది సుందరమ్మకు! ప్రత్యక్షంగా చూస్తూ కూడా ఒక ప్రాణ దీపం ఆరిపోకుండా అడ్డుకోలేక పోయానన్న అపరాధ భావన ఆమెను నిలువు నిలువునా క్రుంగదీస్తోంది. కళ్ళు తెరిచి చూసే సాహసం చేయలేక పోతోంది. 'నాకు తెలీదు. . నాకేం తెలీదు.. వూరికే నేను  పైకి వచ్చా.. తనే కావాలని కిందకు దూకేసింది .. దాంతో నాకే సంబంధం లేదు .. నన్ను నమ్మండి! ప్లీజ్ .. నన్ను నమ్మండి!' తనను ఆదుకొన్న ఆ మృదువైన చేతులను గట్టిగా పట్టుకొని అందులో మొహం దాచుకొని బావురుమంది సుందరమ్మ.

తన పట్టు నుంచి సున్నితంగా విడిపించుకొన్నట్లనిపించి ఆ చేతుల వంక కళ్ళు తెరిచి చూసింది సుందరమ్మ. ఎదురుగా ఆ అమ్మాయి!

సుందరమ్మ గట్టిగా వూపిరి తీసుకొంది. అయితే ఆ అమ్మాయి కిందికి దూకనే లేదన్న మాట! నిస్సహాయ స్థితిలో వున్న ఓ పెద్దమ్మను ఆదుకోవాలన్న ఆత్రుతలో తన ఆత్మాహుతి ప్రయత్నాన్ని విరమించుకొందన్నమాట! సుందరమ్మ హృదయంలో ఒక ఆత్మీయ భావన మొలకెత్తింది. వెళ్ళే ప్రయత్నంలో వున్న ఆమె రెండు చేతులనూ ఆప్యాయంగా పట్టుకొంది. చెక్కిళ్ళ మీదుగా జారే కన్నీటి ధారను తుడుచుకొంటూ ఆ పిల్ల వైపు దీక్షగా చూసి అడిగింది 'నీ పేరేంటి తల్లీ?'

ఆ అమ్మాయి బదులు చెప్పలేదు. పెద్దావిడ పట్టునుంచి చేతిని విడిపించుకొనే ప్రయత్నం చేస్తోంది. జీవితమంతా వీల్ చైర్ చక్రాలను తిప్పుకుంటూ తిరిగిన పెద్దామె చేతి పట్టు నుంచి విడిపించుకోవటం అంత సులువు కాదు. సుకుమారమైన ఆ పిల్లకిక పోరాడే శక్తి సన్నగిల్లటంతో నిస్సహాయంగా వంగి సుందరమ్మ వడిలో తలపెట్టి భోరుమనేసింది.

వృద్దాప్యం .. యవ్వనం .. ఆ వెన్నెల వెలుగు చీకట్లలో ఎంతసేపు అలా పెనవేసుకొని ఉండిపోయాయో!

ప్రియ ఆమె పేరు.. గుండె బరువు తీరేలా ఏడుస్తూనే . . బలవన్మరణానికి పురికొల్పిన తన విషాదగాధను వివరంగా పెద్దావిడతో చెప్పుకొచ్చింది. సుందరమ్మా అనునయంగా ఆమె కథను ఆసాంతం విన్నది. తనూ తన దుఃఖమయ జీవితాన్ని ఆ లేత యువతి ముందు మనసు విప్పి మరీ పరిచింది.

బాల్యంలోనే ఎలా అవిటితనం పాలయిందీ, అదృష్టం కొద్దీ తన జీవితంలో మురళి ఎలా ఎంటరయిందీ, కడుపున పుట్టిన పుత్తడి బొమ్మ ప్రేమ వంకన ఎలా దూరమయిందీ, పువ్వుల్లో పెట్టి చూసుకొనే భర్త కేన్సరుతో తనను ఎలా వంటరి చేసిపోయిందీ . . ఏదీ దాచకుండా తన బతుకు పుస్తకంలోని పుటలన్నీ వినిపించింది. ఆసరికి తూర్పు దిక్కున బాలభానుడు ఉదయించే వేళయింది.

'తల్లీ! జరిగిందేదో జరిగిపోయింది. ప్రయాణంలో ఎంత అప్రమత్తంగా ఉన్నా మన ప్రమేయం లేకుండానే కొన్ని సార్లు ప్రమాదాలు ఎదురవుతాయి. మన పాత్ర లేని దుస్సంఘటనలకు మనల్ని మనమే బాధ్యుల్ని చేసుకోవటం .. చేయని తప్పులకు స్వయంగా శిక్షలు వేసుకోవటం నీలాంటి బుద్ధిమంతులు చేయదగ్గ పనులు కాదు. నీకు ముందు ముందు ఎంతో జీవితం ఉంది కదా! నిన్ను కని ప్రేమగా పెంచిన వారి పట్ల నీకు మాత్రం బాధ్యత వుండదా? తెల్లవారబోతోందిరా. ఇంట్లో నువ్వు లేకపోవడం చూసి మీ అమ్మానాన్నలు ఆందోళన పడక ముందే బుద్ధిగా వెళ్ళి రాత్రి నువ్వు దిగివచ్చిన పడక మీదకు వెళ్ళి బబ్బో తల్లీ!' అంది సుందరమ్మ తనకు దూరమయిన బిడ్డను ఆ అమ్మాయిలో చూసుకొంటూ.

తలూపి బుద్ధిగా లేచి నిలబడింది ప్రియ. పెద్దావిడ వీల్ చైర్ ని లిఫ్ట్ లోకి నెట్టుకొచ్చి గ్రిల్ వేస్తూ అడిగింది 'పెద్దమ్మా! వేళ కాని వేళలో ఈ టెర్రాస్ దాకా అంత కష్టపడి నువ్వు ఈ వీల్ చైర్ నెట్టుకొంటూ ఎందుకొచ్చినట్లూ?!'

అప్పటికే పదోనెంబర్ ఫ్లోరు కు లిఫ్ట్ వచ్చి ఆగింది. వీల్ ఛైర్ నెట్టుకొని బైటికి వచ్చేస్తూ ప్రియ బుగ్గను  ప్రేమగా ముద్దాడి అంది సుందరమ్మ 'రెండు తప్పులు జరగకుండా తప్పించేందుకురా తల్లీ!'

********

Posted in August 2024, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!