మనిషి జీవన విధానం, బాల్యంలో తను పెరిగిన వాతావరణ, సామాజిక, భౌగోళిక, ఆర్ధిక పరిస్థితులను అనుసరించి ఏర్పడిన ఆలోచనా విధానంతో ముడిపడి ఉంటుంది. అయితే అందుకు సామాజిక స్పృహ తోడైతే అంటే వివిధ ప్రదేశాల భౌగోళిక అంశాలు, స్థితిగతులు, జీవన అలవాట్లు తదితర విషయాల మీద అవగాహన ఏర్పడిన రోజు, స్వానుభవంతో అర్థం చేసుకున్నప్పుడు, మనిషి ఆలోచన విధానంలో అన్ని అంశాలను బేరీజు వేసుకునే పరిజ్ఞానం కలిగి తదనంతరం, తనను తాను ప్రశ్నించుకుంటూ తనలో ఆత్మ పరివర్తన కలిగి తద్వారా ఏర్పడే ఆత్మ పరిజ్ఞానం పూర్తి పరిపక్వత చెంది మనిషిని ముందుకు సజావుగా నడిపిస్తుంది. అందుకు ఏ గురువు అవసరం లేదు. తనకు తానే గురువు అయ్యే స్థాయికి మనిషి చేరుతాడు.
మనిషి ఆనందంగా, ఆరోగ్యంగా జీవన విధానాన్ని కొనసాగించడానికి తను నివసించే ప్రదేశం ఏదైనా అవచ్చు. తన ఆలోచనలు స్థిరంగా ఉన్నరోజు ఎక్కడ ఉన్ననూ, ఎవరితో ఉన్ననూ మనుషులు ఆనందంగా జీవించగలరు. కాలంతో పాటు మన సామాజిక స్థితిగతులు, ఆలోచనా సరళి మారుతుండటం సహజం. అలాగే తరాల మధ్యన ఏర్పడిన అంతరాలు కూడా మనతోపాటే ప్రయాణిస్తాయి. కాకుంటే కొంచెం విచక్షణతో విశ్లేషించి సర్దుకుపోయే మనస్తత్వం ముందుగా ముందు తరాల వారికి కలిగి దానిని గమనించి తరువాతి తరం తదనుగుణంగా నడుచుకుంటూ వెళితే అందరి జీవితాలు ఆనందకర మకరందాలే.
ఒక్కటి మాత్రం నిజం. మన పిల్లలు ఏదైనా ఒక విషయం మీద confusion లో, సందిగ్దావస్థకు లోనైనప్పుడు, ఒక స్నేహితుడిగా పెద్దవారు ఇచ్చే సలహాలు ఉండాలి. వాళ్ళు అన్ని విషయాలు పెద్దవారితో కూడా చర్చించే స్థాయిని పెద్దవారు కల్పించాలి.
మనసుని నియంత్రించలేని వారు ఎన్ని తీర్థయాత్రలు చేసినా ప్రయోజనం ఉండదు. నీ విధులను నీవు సక్రమంగా నిర్వహించడమే నీ కర్తవ్యం. ఎదుటివారి జీవనశైలి కూడా నీకు అనుగుణంగా ఉండాలని అనుకోవడం అంత మంచిది కాదు. మానసిక పరిపక్వత అనేది ఏ వయసులోనైనా కలగవచ్చు. వయస్సు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమె.
అటువంటి స్థిత ప్రజ్ఞత లభించడం సామాన్యులకు అంత సులువు కాదు. దానికి మరల సాధన, యోగ తృష్ట్న అవసరం. మనసును నియంత్రించడానికి కూడా సాధన అవసరం. అయితే అంత క్లిష్టమైనది మాత్రం కాదు.
మన శరీరం ఇస్తున్న సంకేతాలను, మన ఆత్మసాక్షి చెబుతున్న విషయాలు కష్టమైనను భరించి ఆచరించిన నాడు మనిషి ఎల్లప్పుడూ సుఖమయ జీవితాన్నే చవిచూస్తాడు. తన జీవన శైలిని వేరే వారితో పోల్చుకోకుండా ఒక విధమైన సమతుల్యంతో, తన ఆలోచనల విధానాన్ని అర్థం చేసుకున్న నాడు, ప్రతి జీవి ఆనందంగానే తన ప్రయాణాన్ని కొనసాగిస్తారు. అందుకు మన పూర్వీకులు అనుసరించిన సంప్రదాయ పద్దతులు పాటిస్తూనే, నేటి ఆధునిక శాస్త, సాంకేతిక, సౌలభ్యాల జీవన పద్దతులను కూడా అనుకరిస్తూ విధివిధానాలు రూపొందించుకుని తను సుఖంగా ఉండటమే కాకుండా తన చుట్టూ ఉన్న పదిమందికీ ఆనందమయ ఆరోగ్యకర జీవితాన్ని అందించగలరు. కనుక మన ఆరోగ్యం మన చేతిలోనే ఉన్నది.
ఒక స్థిరసంకల్పం సాక్షిగా 60 సంచికలలో నిరాఘాటంగా కొనసాగిన ఈ “మన ఆరోగ్యం మన చేతిలో..” శీర్షికకు తాత్కాలిక విరామం ప్రకటించి నా మస్తిష్కం లోని ఆలోచనల ప్రవాహ ధోరణి యొక్క దిశను మార్చి మరింత పటిష్టమైన భావజాలాన్ని ఆవిష్కరించి మరల మీ ముందుకు రావాలని అనుకుంటున్నాను. గత ఐదు సంవత్సరాలుగా ఈ శీర్షికను ఆదరించి చక్కటి సూచనలు, సలహాలతో (feedback) స్పందించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ ఈ శీర్షికను మరో రూపంలో త్వరలోనే మీ ముందుకు తీసుకుని వస్తానని మాట ఇస్తూ... మీ మధు బుడమగుంట.
‘సర్వే జనః సుఖినోభవంతు - స్వస్తి’
Nice to read your articles!
Annapurna.