Menu Close
Sarva Mangala Gowri
శుచి -శుభ్రం (కథ)
-- మంగళ గౌరి --

"ఏమోయ్ మేడ మీద కొంచెం సూర్యుడు కనిపిస్తున్నట్టున్నాడు చూసుకో…" పెరట్లోకి ఒక్క కేక వేశారు పరంధామయ్య.

సుభద్రమ్మ మొహం విప్పారింది. మనసులోనే ఆదిత్య హృదయం చదువుకుంటూ వీధి గుమ్మంలోకి వచ్చింది సుభద్రమ్మ.

ఆరోజు రథసప్తమి.

ఆవు పిడకల మీద పాలు కాచి పాయసం వండి ప్రత్యక్ష నారాయణమూర్తికి నైవేద్యం పెట్టడం ఆవిడకి ఎన్నో ఏళ్ల నుంచి అలవాటు.

ఆరోజు పాలు కాగి పాయసం కాచేసరికి సూర్యుడు మబ్బుల చాటుకెళ్ళిపోయాడు. ఏమిటో కాలాలు తీరులు మారిపోతున్నాయి ఇప్పుడు ఎలాగా అని దిగులుగా అనుకుంది.

ఇంతలో భర్త పరంధామయ్య పిలుపు వినిపించి బయటకు వచ్చింది. వీధి గుమ్మం దాటుతూ ఉంటే పక్కింటి శిరీష కొడుకు ధ్రువ ఏడుపు వినిపించింది గట్టిగా.

'అయ్యో పిల్లాడు ఇంత గట్టిగా ఏడుస్తున్నాడేంటి శిరీష ఏం చేస్తోంది' అనుకుంటూ పక్క గుమ్మంలోకి తొంగి చూసింది. తెల్లటి ధ్రువ మొహం కందగడ్డ లాగా ఎర్రగా అయిపోయింది.

తెల్లటి స్వెటర్ లో బొద్దుగా ముద్దుగా ఉన్నాడు.

సుభద్రమ్మ ఒక్క క్షణం తటపాటయించింది. వాణ్ణి ఎత్తుకోవటానికి "మడి కట్టుకొని ఉన్నాను కదా' అనుకుంటూ.

"శిరీషా అమ్మ శిరీషా" అని గట్టిగా కేకేసింది.

శిరీష అయిపు లేదు. అప్పుడు చూసింది సుభద్రమ్మ. ధ్రువ తొడ మీద నల్ల గండుచీమ కూర్చుని ఉంది.

ఇంక ఆగలేక పోయింది ఆవిడ.

మడి కట్టుకొని ఉన్నాను అన్న సంగతే మర్చిపోయి గబగబా లోపలికి అడుగు పెట్టి పిల్లవాడిని ఎత్తుకుని తొడ మీద ఉన్న గండు చీమని పీకి పారేసింది.

అసలే తెల్లటి వాడేమో ఎర్రగా కందిపోయింది తొడ.

"నా తండ్రి నా బుజ్జి ఊరుకో నాన్న" అంటూ తడి చీర కొంగును వాడి తొడ మీద ఒత్తుగా పెట్టింది. కుడి చేతిలో చిన్న గిన్నెలో ఉన్న పాయసాన్ని వాడి నోట్లో పెట్టింది.

చల్లగా ఉందేమో వాడు కొంచెం ఏడుపు ఆపి తియ్యటి పాయసాన్ని చప్పరించి బోసి నవ్వు నవ్వాడు.

సుభద్రమ్మ గారు పులకరించి పోయారు. గట్టిగా వాడిని హత్తుకున్నారు.

ఆవిడ తడి చీర వాడికి ఇంకా, గిలిగింతలు పెట్టిందేమో కిలకిల నవ్వాడు.

అదిగో అప్పుడు వచ్చింది శిరీష చేతిలో సెల్ఫోన్తో. ఎదుటి దృశ్యం చూసి ఒక్కసారిగా చిరాకు పడింది.

జారుముడితో ఉన్న తడి పొడి జుట్టు. రోజు పిండి ఆరి వేసుకుంటుందేమో నీర్కావి పట్టిన చీర…హడావిడిగా రాసుకుందేమో అక్కడక్కడ ఒత్తుగా పల్చగా ఉన్న మొహం మీద పసుపు. కొద్దిగా చెదిరిన కుంకుమ బొట్టు.

పిల్లవాడిని గట్టిగా హత్తుకోవడం వల్ల ఆ పసుపు బొట్టు తెల్లటి వాడి స్వెటర్ మీద పడ్డాయి.

తడి చీర వల్ల వాడి స్వెటర్ కొంచెం చెమ్మగిల్లింది.

వాడు మాత్రం అదేదీ పట్టనట్టు చూపుడువేలుతో సుభద్రమ్మ గారి నుదుటిమీద బొట్టుతో ఆడుకుంటున్నాడు.

"ఛి ఛి ధ్రువ వాట్ ఈజ్ దిస్" అంటూ వచ్చి ఒక్కసారి విసురుగా సుభద్రమ్మ చేతుల్లో నుంచి పిల్లాడిని లాగేసుకుంది.

కొంచెం ఉలిక్కిపడిన సుభద్రమ్మ "పిల్లవాడు గట్టిగా ఏడుస్తుంటేను…." అంది.

"ఇంతసేపు ఇక్కడే ఉన్నానండి. మా ఫ్రెండ్ ఫోన్ వస్తే సిగ్నల్ అందక అలా బాల్కనీలోకి వెళ్లాను. ఇంత లోపల ఏం ముంచుకొచ్చిందో వీడికి" అంది కోపాన్ని పళ్ళ బిగువున ఆపుకున్నా మొహం లో చిరాకుని ప్రకటిస్తూ….

"నన్ను పిలవాల్సింది పిన్ని గారు చూడండి. వాడి స్వెట్టరు అన్ని ఎలా డర్టీ గా అయిపోయాయో.."

"మీకు తెలుసు కదా నేనెప్పుడూ ఇల్లు, ఒళ్ళు, పిల్లలు, అన్నీ శుభ్రంగా ఉండాలని కోరుకుంటాను."

"మరి మనసో"... మనసులో వచ్చిన ఆలోచనని మరుగుపరుచుకుంటూ తన ఇంటి వైపు వెళ్లిపోయింది సుభద్రమ్మ.

"ఉదయ సూర్యుడికి నైవేద్యం అయిపోయిందండి".

ప్రశ్నార్ధకంగా చూస్తున్న భర్తకి చిరునవ్వుతో మనస్ఫూర్తిగా జవాబు చెప్పి, వంటింట్లోకి వెళ్లిపోయింది భర్తకి భోజనం సిద్ధం చేయటానికి.

$$$$

మర్నాడు సుభద్రమ్మ బాల్కనీలో కనిపించినా పొడిపొడి గా మాట్లాడటం ప్రారంభించింది శిరీష. సుభద్రమ్మ కి చివుక్కుమనిపించినా ఊరుకున్నారు.

రెండు రోజుల తర్వాత…

ఉదయం వరండాలో కూర్చుని కాఫీ తాగుతున్న సుభద్రమ్మ దంపతులకి ధ్రువ ఏడుపు వినిపించింది. నాలుగైదు నిమిషాలైనా వాడు ఏడుస్తూనే ఉన్నాడు.

"ఇదిగో వెళ్లి చూడు" అన్నాడు పరంధామయ్య.

సుభద్రమ్మ కి వెళ్లాలని ఉన్నా ఇంతకు ముందటి అనుభవం తలుచుకుని తట పటాయించింది. భర్త వెళ్ళు అనంగానే ఒక్క ఉదుటన పక్క వాటాలోకి వెళ్ళింది.

అదేమిటి తలుపు తీసే ఉంది. శిరీష మొగుడు తెల్లవారు ఝామున ఊరెళ్ళాడు అప్పటినుంచి ఇలాగే ఉందా??? అనుమానిస్తూ సంకోచo గానే లోపలికి…. బెడ్ రూమ్ లోకి వెళ్ళింది.

శిరీష కళ్ళు మూసుకుని గాఢంగా నిద్రపోతున్నట్టు ఉంది. పక్కనే ఆమె పొట్ట మీద బోర్లా పడుకుని ఏడుస్తూ ఉన్నాడు ధ్రువ.

పొద్దున్నే డైపర్ మార్చి ఇంకో డైపర్ వేయలేదేమో ఒకటి రెండు అన్ని చేసేసి ఆకలికో ఏంటో ఏడుస్తున్నాడు.

పిల్లడు అలా ఏడుస్తూ ఉంటే ఈ పిల్ల ఎలా నిద్రపోతోందీ….అనుకుంటూ మంచం దగ్గరికి వెళ్ళింది.

అమ్మ శిరీషా అంటూ లేపబోయిన ఆవిడ చేతికి వేడిగా తగిలి ఉలిక్కి పడింది. చేయి వెనక్కి లాక్కుంది.

'అయ్యో దేవుడా ఈ పిల్ల ఒళ్ళు కాలిపోతోంది. జ్వరానికి శోష వచ్చినట్టు పడుకుంది. నిద్ర కాదు.'

సుభద్రమ్మ గారికి జాలి ముంచుకొచ్చింది.

ఇంకేమీ సంకోచించలేదు సుభద్రమ్మ.

ధ్రువని ఎత్తుకొని బాత్రూంలోకి తీసుకెళ్లి చొక్కా స్వెటర్ విప్పేసి శుభ్రంగా కడిగి ఒత్తుగా టర్కీ టవల్ చుట్టింది.

వంటింట్లో పిల్లాడి బాటిల్ కడిగిపెట్టి ఉంది. గోరువెచ్చగా పాలు కాచి బాటిల్లో పోసి…

"ఒకసారి ఇలా వస్తారా వరండా దాకా" అని భర్తని కేకేసింది.

“ఆ చేతితోనే ఒక జ్వరం మాత్ర తెండి”…అంది.

వరండా దాకా వచ్చిన భర్తకి ధ్రువనిచ్చి పాలుపట్టమని చెప్పి లోపలికి వెళ్ళింది.

శిరీష కి మాత్ర వేసి ఆమె చీర, పక్క డెటాల్ నీళ్లతో శుభ్రం చేసింది..

మంచం పక్కనే కుర్చీ వేసుకుని కూర్చుంది.

ఓ అరగంటయ్యాక ఒళ్లంతా చెమటలు పట్టి జ్వరం తగ్గటంతో శిరీష మెల్లిగా కళ్ళు తెరిచింది.

ఎదురుగా సుభద్రమ్మ గారు "అమ్మ లేచావా అమ్మాయ్ కొంచెం కూర్చోగలవా. గోరువెచ్చగా కాఫీ తాగుదుగాని కొంచెం ఓపిక వస్తుంది." అంది ఆప్యాయంగా

శిరీషకి ఒక్క నిమిషం అర్థం కాలేదు అర్థం అయ్యాక పశ్చాత్తాపంలాంటి భావం కలిగింది.

సుభద్రమ్మ గారిచ్చిన కాఫీ తాగి తన అక్క నెంబరు ఆవిడకి ఇచ్చింది ఫోన్ చేయమని వచ్చి సాయం చేస్తుందని.

"అలాగే అమ్మాయ్ పిల్లాడి బట్టలు ఎక్కడున్నాయో చెప్పు వాడికి వేస్తాను" అంటూ ఆ పని కానిచ్చి..

"ధ్రువ మాతో ఆడుకుంటాడులే మీ అక్క వచ్చేవరకు" అంటూ తన వాటా లోకి వచ్చేసింది.

నాలుగు రోజుల తర్వాత……

స్నానం చేసి వచ్చి ముక్కాల పీఠం మీద కాలు పెట్టి పసుపు రాసుకోబోతున్న సుభద్రమ్మ రెండు లేత చేతులు తన కాళ్ళ మీద పారాడుతుంటే ఆశ్చర్యంగా తలెత్తింది.

శిరీష…

తలవంచుకొని సుభద్రమ్మ గారి కాళ్లు పట్టుకుని ఉంది. కళ్ళనిండా నిండిన నీళ్లు ఆవిడ పాదాలు మీద చుక్కలు చుక్కలు గా పడ్డాయి.

"అరెరే ఇదేంటి లే లే పిచ్చి పిల్ల" అంటూ భుజాలు పట్టి లేపింది సుభద్రమ్మ.

"శుభ్రం శుభ్రం అంటూ పాకులాడే నేను మనసును మాత్రం కలుషితంగా ఉంచుకున్నాను పిన్ని గారు.

మీ మనోనైర్మల్యం ముందు నా శుభ్రత ఓడిపోయింది.

మళ్లీ పాదాల మీదకు వంగబోతున్న శిరీషను పట్టుకుని అక్కున చేర్చుకుంది సుభద్రమ్మ.

********

Posted in July 2024, కథలు

2 Comments

  1. Tadimeti Sri Devi

    Nice Story. మనః సౌందర్యం ముందు శుచి,శుభ్రత ఏ పాటివి?

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!