అయ్యగారి వారి ఆణిముత్యాలు
(అయ్యగారి సూర్యనారాయణమూర్తి విరచిత పద్యశ్లోకాలు)
సస్యలాస్యము ఉ. దండిగఁ బండినట్టి వరిధాన్యపుకంకుల చెల్మి సేయఁగా మెండుగ, వాతపోతములు మెల్లన వీవఁగ స్వాగతంబుతో నిండిన గుండెలన్ బఱచి నిర్మలమైత్రితరంగవేదికన్ పండుగఁ జేసికొందమని పల్కరె సస్యసఖీజనం బహో! 148 నవగ్రహసీసము సీ. హరిగురుకరుణామృతావగ్రహంబున(1) సమకూరునే సిద్ధి సాధకులకు? ఆగ్రహంబు విచక్షణాంతకారకమగు, నాఱు దొంగల నిగ్రహంబుతోడ పాఱఁ ద్రోలిన జ్ఞానవైభవం బబ్బు, దై వానుగ్రహము గల్గు నహరహంబు; విగ్రహంబులు భక్తి వీడక ధ్యాస ని ల్పఁగ నాశ్రితాళికిఁ బ్రగ్రహములు(2) తే.గీ. పుణ్యకర్మ పరిగ్రహ(3)ముక్తి నొసఁగి సంగ్రహముఁ(4) గూర్చు; నది సేయ సకలజగతి భూగ్రహంబును మించున దే గ్రహంబు? ఈ నవగ్రహ(5)సీసార్థ మిదియె కాదె? 149 (1) అవగ్రహము = వానలేకపోవుట (2) ప్రగ్రహము = ఏర్పాటు (3) పరిగ్రహము = శాపము (4) సంగ్రహము = రక్షణ (5) అవగ్రహము, ఆగ్రహము, నిగ్రహము, అనుగ్రహము, విగ్రహము, ప్రగ్రహము, పరిగ్రహము, సంగ్రహము, గ్రహము శ్రీవల్లీదేవసేనాసుబ్రహ్మణ్యకల్యాణము – సుబ్రహ్మణ్యషష్ఠి శాంకరిప్రియ – స్వకల్పితవృత్తము శ్రీసుబ్రహ్మణ్యషష్ఠిన్ శ్రీకరంబౌ వివాహం బే సర్వప్రీతిపాత్రం బీ విధిన్ జేయ నిష్ఠన్ దాసత్రాణైకచిత్తుల్ తత్కృపన్ జూప నన్య వ్యాసంగాసంగబుద్ధిన్(1) బాల్గొనన్ బుణ్య మబ్బెన్ 150 (1) ఇతరమైన ఆసక్తుల పొత్తులేని బుద్ధి [ఛందోలక్షణము మరతతగా గణములతో నిరతం బష్టమయతిన్ సునిశ్చితగతి న క్షరములఁ బ్రాస నిడన్ ‘శాం కరిప్రియా’ వృత్తమగును గవివరుకృతులన్] కమలబాంధవ్యము మ.కో. ప్రాక్త్రయీతనుఁ గాంచి సారసబాల లెంతొ ముదంబుతో వక్త్రముల్ వికసింప నూఁగిరి వాతపోతము వీవఁగన్ దృక్త్రపాభినయంబు సేయుచు దీధితుల్ కవయంగ నే యోక్త్ర మివ్విధి నింగినేలల నొక్కచోఁ గలిపెన్ గదా 151 త్రయీతను = సూర్యుని, త్రపా = సిగ్గు, యోక్త్రము = త్రాడు భావము – తూర్పున ఉన్న సూర్యుని చూచి కమలములు అను బాలలు తమ ముఖములు విప్పారి, పిల్లగాలులు వీస్తూ ఉండగా, కన్నులతో (ప్రేమచేత కలిగిన) సిగ్గును వ్యక్తీకరిస్తూ, సూర్యకాంతులు క్రమ్ముకొంటూ ఉండగా, ఎంతో ఆనందముతో (సరస్సులలో) వెనక్కి, ముందుకి కదిలేరు. ఈ విధంగా సూర్యుడున్న ఆకాశాన్ని, కమలాలున్న భూమిని ఒకదగ్గర ఏ బంధమో కలిపిందికదా. పద్యరచన ఉ. పద్యము వ్రాయ గొప్పదగు ప్రక్రియ గాదు; పఠించువారికిన్ హృద్యము, వేద్యమై మనసు నెచ్చటికో కొనిపోవు సాహితీ సేద్యఫలంబుగా నిలిచి, చింతన సేయఁగ మాటిమాటికిన్ వాద్యము రీతి సుస్వరముఁ బల్కవలెన్ శ్రవణప్రహర్షమై 152