వివేక చూడామణి
భారతీయ తత్త్వ శాస్త్ర చరిత్రలో ఆదిశంకరాచార్యుల పేరు విశిష్టమైనది. ఉపనిషత్తుల సారాన్ని అద్వైత ధర్మం ప్రతిబింబిస్తుంది. అద్వైత ధర్మం మౌలికమైన బౌద్ధ ధర్మానికి సమాంతర ప్రత్యామ్నాయమే కాకుండా సరిజోడు కూడా. వ్యక్తిక దైవం పట్ల నమ్మకం, పౌరాణిక విశ్వాసాలు లేని ఆస్తికులు అనివార్యంగా అద్వైత ధర్మం వద్దకు చేరుతారు. అంతేకాకుండా క్వాంటమ్ ఫిజిక్స్ మీద పరిశోధన చేస్తున్న శాస్త్రవేత్తలు కూడా అద్వైత ధర్మం వద్దకే చేరుతున్నారని చదువుతున్నాను. అయినా శాస్త్రీయ అధ్యయనం లేకుండా ఆ విషయం గురించి మాట్లాడలేం.
లోకులందరికీ తెలిసిన గొప్ప అద్వైత బోధకుడు స్వామి వివేకానంద. వారు 1896లో లండన్లో ఉపన్యసిస్తూ ఆధునిక శాస్త్రజ్ఞులకు అద్వైత ధర్మంపై మిక్కిలి ఆధారం ఉన్నదని అన్నారు.
"బుద్ధుని హృదయం విశ్వమానవ కళ్యాణాత్మకం. ఆయన ఓరిమి మేర లేనిది. ఆయన బోధించినది జనసామాన్యానికి ఆచరణయోగ్యమైన, తేటతెల్లమైన మతం. శంకరాచార్యుని బుద్ధిపాటవం వర్ణనాతీతం. అతని తార్కిక శక్తి అత్యంత తీక్షణం.
విశ్వమానవ ప్రేమకారుణ్యాలతో పొంగారు బుద్ధుని హృదయం, తేజో దుర్నిరీక్ష్యమైన శంకరుని బుద్ధి నేడు వియ్యమందాలి. ఆ సంబంధం వల్ల అత్యున్నత తత్త్వ జ్ఞానం వెలువడగలదు. అపుడు భౌతిక శాస్త్రాలకు, ఆస్తిక ధర్మానికి వైరం నశించి సఖ్యం చేకూరగలదు. అది భావికాలపు మతం కాగలదు" అంటూ వివేకానందుల వారు మహోన్నతమైన సందేశం ఇచ్చారు.
ఇటువంటి అద్వైత ధర్మం గురించి తెలుసుకోవడానికి మనకు ఉపయోగపడే మంచి గ్రంథం ఆదిశంకరాచార్యులు రచించిన "వివేకా చూడామణి". వివేకా చూడామణిలోని అంశాలను సంక్షిప్తంగా తెలుసుకోవడమే ఈ వ్యాస ఉద్దేశం.
జీవుడు మనుష్య జన్మను పొంది సంసారమును విడిచి అంతటా పరిశుద్ధమగు భగవంతుని మాత్రమే చూస్తూ, జీవన్ముక్తుడై కైవల్యమును పొందుటే ఉత్తమసిద్ధి. ఈ స్థితి ఎన్నో జన్మల పుణ్యము లేనిదే లభింపజాలదని ఆదిశంకరాచార్యుల అభిప్రాయం.
విద్వాంసుడైనవాడు బహిరములైన భోగముల మీద కోర్కెను విడనాడి, సాధుపుంగవులైన గురువును ఆశ్రయించాలని శంకరులు సూచించారు.
బ్రహ్మము సత్యము (శాశ్వతము) అయినది. జగత్తు మిథ్య(అశాశ్వతము) అయినది అనునట్టి నిశ్చయ బుద్ధి కలుగుటయే 'నిత్యానిత్య వస్తు వివేకము' అనబడును.
దర్శనము, శ్రవణము మూలంగా అశాశ్వతములైన భోగ పదార్థముల యెడల ఏవగింపు జనించటమే వైరాగ్యము. అజ్ఞానము చేత కల్పించబడిన బంధములను పరిత్యజించిన వలెననన్న కోరికయే "మోక్షాపేక్ష".
ఉత్తమ సిద్ధిని పొందుటకు నాలుగు సాధనములున్నవి :- నిత్యానిత్యవస్తు వివేకము, సుఖ భోగాదులయందు విరక్తి కలుగుట అంటే వైరాగ్యము, షడ్గుణ సంపద - శమము, దమము, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానము, ముక్తి పట్ల కోరిక.
“శమము” అంటే విషయ సమూహములందు విరక్తిని ఏర్పరచుకుని తన మనసును ఉత్తమ సిద్ధి అనే గమ్యముపై నిలిపి ఉంచుట. “దమము” అంటే కర్మేంద్రియములను, జ్ఞానేంద్రియములను విషయముల నుండి వెనుకకు మరలించుట. చింతాశోకములకు లోబడక, ఎట్టి ప్రతీకార చర్యకు పాల్పడక, సర్వ విధ దుఃఖములను సహించుటే “తితిక్ష”.
శాస్త్రమునందు, గురు వాక్యమునందు సత్యబుద్ధి అన్న భావన కలిగియుండుట "శ్రద్ధ". "ఉపరతి" అంటే చిత్త వృత్తి బాహ్య విషయములను ఆశ్రయించకుండుట తద్వారా బుద్ధి సర్వవిధములా శుద్ధ బ్రహ్మమునందు స్థిరపరచుకుని యుండుటయే "సమాధానము".
అనిత్య వస్తువులందు అత్యంత వైరాగ్యము కలుగుటయే ఉత్తమ సిద్ధికి మొదటి మెట్టు. అనంతరం శమము, దమము, తితిక్ష, శ్రద్ధ, ఉపరతి, సమాధానము అలవరచుకుని శ్రవణము, మననము, ధ్యానము ద్వారా నిత్య సాధన చేస్తే ఇహమందు నిర్వికల్పావస్థను పొందగలము.
క్షణిక వైరాగ్యమునకు లోబడి మోక్షాపేక్షతో సాధన మొదలుపెట్టిన వారు మధ్యలోనే ఆశయమును వదలిపెడతారు. అంతఃకరణ శుద్ధితో ప్రయత్నించినవారే గమ్యాన్ని చేరగలరు.
అంతఃకరణ చతుష్టయము అంటే మనసు, బుద్ధి, అహంకారము మరియు చిత్తము. అంతఃకరణాన్ని సంకల్పవికల్పాలతో స్థిరముగా ఉండకున్న దశలో మనసు అంటారు, పదార్ధ నిశ్చయము చేయు దశలో బుద్ధి అంటారు, నేను నేను అని అనుకుంటున్న దశలో అహంకారము అంటారు, ఇష్ట వస్తువును చింతన చేయు దశలో చిత్తము అంటారు.
మట్టి యొక్క కార్యమైనను కడవ దాని కంటే భిన్నమైనది కాదు. అలానే ఈ విశ్వము బ్రహ్మ స్వరూపమేగానీ దానికంటే భిన్నమైనది కాదు.
ఉత్తమ సిద్ధిని కోరువారు “బ్రహ్మమే నేను” అని చిత్తములో చింతన చేయాలి. మనస్సు ఎంత యెంతగా అంతర్ముఖఃమగుచుండునో అంతగా అది బాహ్యవాసనలను విడనాడుచుండును. నిరంతరమూ ఆత్మయందే మనసును నిలిపితే చివరకు అది నశించును.
బాహ్య విషయముల చింతనను నిషేధించబడినపుడు మనస్సులో ఆనందం కలుగుతుంది. ఆ మానసికానందం తీవ్రమైనపుడు బ్రహ్మ సాక్షాత్కారం కలుగుతుంది. వాక్కును మనసునందు, మనసును బుద్ధియందు, బుద్ధిని ఆత్మయందు లయింపజేయాలి.
తత్వ శాస్త్రంలో భావ వాదం, భౌతిక వాదం పేరిట వాదోపవాదాలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. "తస్మాదేతద్బ్రహ్మమాత్రం హి విశ్వం" అంటుంది అథర్వణ వేదం అంటే ఈ విశ్వమంతయూ బ్రహ్మ స్వరూపమే. విశ్వం అనేది పదార్ధాన్ని సూచిస్తే బ్రహ్మం అన్నది చైతన్యాన్ని సూచిస్తుంది. ఈ రెండూ ఎల్లప్పుడూ పరస్పరాధారభూతంగా ఉంటాయన్న అవగాహనకు వస్తే ఈ వాదోపవాదాల నుండి బయటపడవచ్చు.
ఇక్కడ మిథ్య, మాయ అన్న పదాలకు అధిక విలువనివ్వడం వల్ల అద్వైత తత్వసారాన్ని అర్ధం చేసుకోవడంలో తప్పుదోవన పడతాం... The only thing unchanged is the change itself. ఈ విశ్వంలో ఉన్న ప్రతిదీ మారుతూ ఉంటుంది. నిరంతరమూ పరిణామం చెందే ఈ విశ్వమే శాశ్వతంగా ఉంటుంది. ఈ విశ్వంలో ఉండే చైతన్యమే బ్రహ్మం. అదే పరమాత్మగా పిలవబడుతుంది. ఈ విశ్వంలో అంతర్భాగమైన జీవంలో అదే చైతన్యం జీవాత్మగా భాసిస్తుంది.