Menu Close
GSS-Kalyani
నాన్నకిచ్చిన మాట! (కథ)
-- శ్రీ శేష కళ్యాణి గుండమరాజు --

అది తెలుగురాష్ట్రాలలోని ఒక కుగ్రామం. ఆ ఊళ్ళోని వారంతా కుమ్మరులు కావడం అక్కడి విశేషం. తరతరాలుగా వారికి తమ పూర్వీకులనుండి అందిన ఆస్తి ఆ కుమ్మరి వృత్తి. ఒకప్పుడు ఎన్నో కుటుంబాలతో కళకళలాడిన ఆ గ్రామం, ఇప్పుడు జనం లేక వెలవెలబోతోంది! ప్లాస్టిక్, లోహంవంటి పదార్ధాలతో తయారు చేసిన వంటింటి సామగ్రీ, గృహోపకారణాలూ రాజ్యమేలుతున్న ఈ కాలంలో మట్టిపాత్రలకు గిరాకి తగ్గి సరైన రాబడిలేక, ఆ ఊరికి చెందిన అనేక కుటుంబాలు పట్నాలకు వలస వెళ్లిపోయాయి. తమ వృత్తిని భగవంతుడిచ్చిన వరంగా భావిస్తూ, తమ ఊరిపట్ల మమకారం పెంచుకున్న కొందరు మాత్రం ఇంకా ఆ ఊళ్ళోనే మిగిలిపోయారు. అలాంటివారిలో నాగేశం ఒకడు. నాగేశం చేసే కుండలను కొనుక్కునేందుకు ఎక్కడెక్కడినుంచో జనం వస్తున్నారంటే కుండల తయారీలో అతడికున్న పనితనాన్నీ, నైపుణ్యాన్నీ అర్ధం చేసుకోవచ్చు.

ఒకరోజు నాగేశం, తను చేసిన కుండలను ఒకదాని మీద ఒకటి జాగ్రత్తగా పెడుతూ ఉండగా, పట్నంనుండి నాగేశం ఇంటికి వచ్చాడు నాగేశం సోదరుడు ఏడుకొండలు.

ఏడుకొండలు నాగేశం ఇంటి ఆవరణలోకి అడుగుపెడుతూనే, "ఏరా తమ్ముడూ! బాగున్నావా? వ్యాపారం బాగా సాగుతోందా? రాఘవ ఏం చేస్తున్నాడూ?" అంటూ నాగేశం పై ప్రశ్నలవర్షం కురిపించాడు.

నాగేశం ఏడుకొండలను చూసి చిరునవ్వు నవ్వుతూ, "అన్నయ్యా! నువ్వా?! మన ఊరికి ఎప్పుడొచ్చావ్? ఇదేనా రావడం? నేను బాగానే ఉన్నాను. వ్యాపారం కూడా ఎప్పటిలాగే నడుస్తోంది. రాఘవ ఆరో తరగతికొచ్చాడు!" అన్నాడు.

"మంచిది! మా మాధవ కూడా ఆరో తరగతికొచ్చాడు. వాడిని పట్నంలో ఒక మంచి ప్రైవేట్ స్కూల్లో చేర్పించాను. నా మాట విని నువ్వు కూడా ఈ ఊరు విడిచిపెట్టి నాతో పట్నానికొచ్చెయ్. నేను పని చేస్తున్న కంపెనీ ప్లాస్టిక్ వస్తువులను తయారుచేస్తుంది. మాకు బోలెడు లాభాలు వస్తూ ఉంటాయి. నీక్కూడా మా కంపెనీలో ఏదో ఒక ఉద్యోగం ఇప్పిస్తాను!" అన్నాడు ఏడుకొండలు.

"అన్నయ్యా! నేను ఈ ఊరినీ, మన వృత్తినీ వదిలిపెట్టి పట్నం రానని నీకు తెలుసు కదా!" అన్నాడు నాగేశం వినయంగా.

"నేను నిన్ను పట్నం రమ్మని అడుగుతున్నది నాకేదో నీమీద ప్రేమ ఉండటంవల్ల కాదురా తమ్ముడూ! అక్కడికొస్తే నీ కొడుకు రాఘవ బాగుపడతాడనీ నీకన్నా పెద్దవాడిగా నాకు తోచిన ఒక చిన్న సలహా చెబుతున్నా అంతే!" అని తను అడిగినదానికి నాగేశాన్ని ఒప్పించే ప్రయత్నం చేశాడు ఏడుకొండలు.

"అన్నయ్యా! నాన్న పోయేముందు మన దగ్గర ఒక మాట తీసుకున్నారు గుర్తుందా? ఆ మాటను నిలబెట్టుకోవడం నా కర్తవ్యం. అందుకే నేను ఇక్కడే ఉంటానని అంటున్నాను. రాఘవ ఇక్కడే చదువుకుంటాడు. వాడికి కూడా కుండలు తయారు చెయ్యడం నేర్పుతాను!" అన్నాడు నాగేశం.

"ఏంటోరా నీ పిచ్చి! చివరి రోజుల్లో నాన్నకు తీవ్రమైన అనారోగ్యం చేసింది. ప్రాణం పోయేముందు ఆయన మాట్లాడింది నాకైతే సరిగ్గా అర్ధం కాలేదు! నీకు ఏం అర్ధమైందో ఏమిటో!" అన్నాడు ఏడుకొండలు అసహనంగా.

"అదే! అమ్మను బాగా చూసుకుంటామని మాట ఇమ్మని నాన్న అడిగారు కదా.." అంటూ తమ తండ్రి తమ దగ్గర తీసుకున్న మాట గురించి చెప్పబోయాడు నాగేశం.

ఏడుకొండలు నాగేశాన్ని అడ్డుకుంటూ, "నువ్వీ మాట అంటావని నాకు ముందే తెలుసురా! మనకు ఊహ తెలిసేసరికే అమ్మ లేదు. మరి అమ్మను బాగా చూసుకోవడమేమిటీ? నాన్నకు మతి కాస్త చలించడంవల్ల ఆలా మాట్లాడినట్లున్నారు. అయినా, నీకు బాగుపడే యోగం లేకపోతే నేను మాత్రం ఏం చెయ్యగలనూ? నా సలహాను పాటించకపోతే తర్వాత నువ్వే బాధపడతావ్!" అన్నాడు కోపంగా.

"అది కాదు అన్నయ్యా. నేను చెప్పదల్చుకున్నది ఒక్కసారి విను!" అంటూ ఏడుకొండల్ని శాంతపరచబోయాడు నాగేశం.

కానీ ఏడుకొండలు నాగేశం మాటలు ఏమాత్రం పట్టించుకోకుండా, "నీ కర్మ నీదిరా! నాకు అవతల బోలెడు పనులున్నాయి. మళ్ళీ కలుస్తా!" అంటూ పట్నం వెళ్ళిపోయాడు.

చూస్తూండగా ఆరేళ్ళు గడిచిపోయాయి. రాఘవ, మాధవలు కాలేజీ చదువులకొచ్చారు. ఒక ఆదివారం నాగేశం దగ్గరకు కారులో వచ్చాడు ఏడుకొండలు.

చాలా ఏళ్ల తర్వాత తమ ఇంటికి వచ్చిన ఏడుకొండలను చూసి సంతోషించిన నాగేశం, "రా అన్నయ్యా! నిన్ను చూసి చాలా కాలమైంది. బాగున్నావా?" అంటూ ఆప్యాయంగా పలకరించాడు.

"నాకేం! నేను బాగానే ఉన్నాను. నువ్వేంటీ? ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లున్నావ్? అదే ఇల్లూ… అదే మట్టీ… ఎదుగూ బొదుగూ లేని కుండల వ్యాపారం…??!" చుట్టుపక్కల పరిసరాలను పరిశీలనగా చూస్తూ, కాస్త వెటకారంగా అన్నాడు ఏడుకొండలు.

"నేను చేస్తున్న పని నాకు తృప్తినిస్తోంది అన్నయ్యా! అంతకన్నా ఏం కావాలి?" అన్నాడు నాగేశం నవ్వుతూ.

"రాఘవ ఏం చదువుతున్నాడు?" అడిగాడు ఏడుకొండలు.

"వాడు వ్యవసాయానికి సంబంధించిన కోర్సును మన పక్క ఊళ్ళో చేస్తున్నాడు. పొద్దున్న వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చేస్తాడు. ఖాళీ సమయాల్లో నాతో కుండలు చేస్తున్నాడు" అంటూ వారికి కొద్దిదూరంలో అడుసు తొక్కుతున్న రాఘవను చూపించాడు నాగేశం.

ఏడుకొండలు నాగేశంవంక చులకనగా చూస్తూ, "వ్యవసాయమా?? నువ్వు రాఘవను ఎందుకూ పనికిరాని చదువు చదివిస్తున్నందుకు నాకు చాలా బాధగా ఉందిరా తమ్ముడూ. నా కొడుకు మాధవ సాఫ్ట్ వేర్ ఇంజినీరు కాబోతున్నాడు తెలుసా?! రేపీపాటికి వాడు లక్షలు సంపాదిస్తాడు! నువ్వారోజు నా సలహా కాదన్నావ్. ఇప్పుడు చూడు ఏమైందో! నీ కొడుకు మట్టి పిసుక్కుంటూ కూర్చున్నాడు! మిమ్మల్ని ఎవ్వడూ బాగుచెయ్యలేడు!" అన్నాడు.

ఆ మాటలు విన్న నాగేశం మనసు చివుక్కుమంది.

"వ్యవసాయమే లేకపోతే మనమేమి తిని బతుకుతాం అన్నయ్యా? అన్నీ తెలిసిన నువ్వు ఇలా మాట్లాడతావని అనుకోలేదు!" అన్నాడు నాగేశం బాధతో.

"నాకు ఎలా మాట్లాడాలో నేర్పించేటంత గొప్పవాడివయ్యావన్నమాట నువ్వు! ఇన్నేళ్లు గడిచాయి కాబట్టి నీలో కొంచెమైనా మార్పు కనపడుతుందేమోనని అనుకుంటూ ఇంతదాకా వచ్చాను. ఇంకా నువ్వేమీ మారలేదు! నే వెడుతున్నా. మళ్ళీ కలుద్దాం!" అంటూ కారెక్కి పట్నం వైపుకు వేగంగా వెళ్ళిపోయాడు ఏడుకొండలు.

మరి కొన్నేళ్లు గడిచాయి. రాఘవ, మాధవల చదువులు పూర్తయ్యి వాళ్లిద్దరూ ఉద్యోగాల్లో చేరారు. ఒకరోజు మాధ్యాహ్నం వేళలో, నాగేశం భోజనం ముగించి విశ్రాంతి తీసుకుంటూ ఉండగా, ఒక పెద్ద కారులో నాగేశం ఇంటికి వచ్చాడు ఏడుకొండలు.

"బాగున్నావా అన్నయ్యా?" అంటూ ఏడుకొండల్ని సాదరంగా తమ ఇంట్లోకి ఆహ్వానించాడు నాగేశం.

"నేనెప్పటిలాగే భేషుగ్గా ఉన్నాను. మా కంపెనీ యజమాని మన ఊరి పొలాల్లో కొత్త ఫ్యాక్టరీ కట్టబోతున్నాడు. దానికి నన్ను యజమానిని చేస్తాడట. మా మాధవకు పెద్ద జీతంతో పట్నంలోనే ఒక సంస్థలో ఉద్యోగమొచ్చేసింది. నేను తెచ్చిన కారు వాడే కొన్నాడు. ఈ చుట్టుపక్కల ఎన్ని పొలాలున్నాయో లెక్కెయ్యటానికి వచ్చాను. కానీ ఆ పొలాల్లో ఎవరో పనులు చేసుకుంటున్నారు. వాళ్ళ వివరాలేంటో కనుక్కోవాలి!" అన్నాడు ఏడుకొండలు.

"మన రాఘవ ఆ పొలాలను సారవంతం చేసి సాగు చెయ్యాలని అనుకుంటున్నాడన్నయ్యా! వాడి ఆధ్వర్యంలోనే ఆ పనులన్నీ జరుగుతున్నాయి" చెప్పాడు నాగేశం.

అందుకు ఏడుకొండలు బిగ్గరగా నవ్వుతూ, "ఏం చదువురా వాడిదీ? ఆ బీడు భూముల్లో పంటలు పండించాలని అనుకోవడం కన్నా మూర్ఖత్వం మరొకటి ఉండదు! మొత్తానికి వాణ్ణి కూడా నీలాగా చవటను చేశావన్నమాట! సరే అలాగే కానీ! నేను చెప్పినట్లుగా రాఘవను పట్నంలో చదివిస్తే రాఘవ కూడా మాధవలాగా ప్రయోజకుడై మన ఊరికి మంచి పేరును తెచ్చిపెట్టేవాడు!" అన్నాడు.

"అన్నయ్యా! నేను రాఘవను నా ఆశయాలకు తగ్గట్టుగా పెంచాను. నాన్నకిచ్చిన మాట నిలబెట్టుకోవడం నా ధర్మం. ఆ విషయంలో నా బిడ్డ నాకు సహాయపడుతున్నాడు. అంతకన్నా నాకేం కావాలి?" అన్నాడు నాగేశం.

"మాటిమాటికీ నాన్నకిచ్చినమాటా.. నాన్నకిచ్చినమాటా.. అంటావ్! నీ ఉద్దేశమేమిటో నాకు ఎప్పటికీ అర్ధం కాదు!" అని చిరాకుపడ్డాడు ఏడుకొండలు.

నాగేశం తన ఉద్దేశమేమిటో ఏడుకొండలకు వివరించబోయాడు. కానీ ఏడుకొండలు తనకేవో పనులున్నాయంటూ హడావుడిగా పట్నం వెళ్ళిపోయాడు.

కొంత కాలం గడిచింది. ఒకనాటి ఉదయం, చిన్న సంచితో, మాధవను వెంటబెట్టుకుని నాగేశం ఇంటికి కాలినడకన వచ్చాడు ఏడుకొండలు. ఏడుకొండల అవతారం చూసి అతడు విపరీతమైన కష్టాల్లో ఉన్నాడని ఇట్టే గ్రహించాడు నాగేశం.

"అన్నయ్యా! ఏమిటిదీ? ఏమైంది నీకూ?? ఆరోగ్యం బాగానే ఉంది కదా?" ఏడుకొండల్ని కంగారుగా అడిగాడు నాగేశం.

"తమ్ముడూ! మంచి మనసున్న నిన్ను నానామాటలూ అన్నందుకు ఆ భగవంతుడు నాకు తగిన శాస్తి చేశాడురా! నేనింతకాలం కూడబెట్టిన ఆస్తి మొత్తం ఒక్కసారిగా పోయింది!" అంటూ భోరున విలపించాడు ఏడుకొండలు.

"ఊరుకో అన్నయ్యా! ఊరుకో!" అంటూ ఏడుకొండలకు మంచినీళ్ళందించి, అతడిని కొంత ఓదార్చి, అసలు విషయమేమిటని అడిగాడు నాగేశం.

"మా కంపెనీ అనేక విషపూరితమైన రసాయనాలను విడుదల చేసి వాతావరణ కాలుష్యాన్ని తెగ పెంచేస్తోందట! అందుకని దానికున్న పరిమితులన్నీ రద్దు చేసి, కంపెనీ వెంటనే మూసేయాలని కోర్టు ఆదేశించింది. కంపెనీకి బోలెడు అప్పులున్నాయి. ఆ కంపెనీ యజమాని తన దగ్గర డబ్బుల్లేవని చేతులెత్తేశాడు. అతడి మీద నమ్మకంతో అతడు తీసుకున్న అప్పులన్నిటికీ నేను హామీని ఇస్తూ సంతకాలను పెట్టాను. దాంతో ఆ అప్పులన్నీ నన్ను తీర్చమని అన్నారు అప్పులిచ్చినవాళ్లు. మా కంపెనీ బాకీలన్నీ తీర్చేసరికి నేను సంపాదించిన డబ్బూ, మా మాధవ సంపాదనా, మొత్తం పోయిందిరా తమ్ముడూ! మా మాధవ పని చేస్తున్న సంస్థకు కొత్త ప్రాజెక్టులు రాక వాణ్ణి ఉద్యోగంలోంచి తీసేశారు! వాడు మానసికంగా కుంగిపోయి మాట్లాడటం పూర్తిగా మానేశాడు. దిక్కుతోచక ఇక్కడికొచ్చేశాను" దుఃఖాన్ని దిగమింగుతూ జరిగినదంతా చెప్పాడు ఏడుకొండలు.

"బాధపడకన్నయ్యా! మన రాఘవ మన ఊళ్ళోనే ఒక కొత్త పరిశ్రమను ఏర్పాటు చేశాడు. దానిద్వారా ఎంతో మందికి ఉపాధిని కల్పిస్తున్నాడు కూడా! మాధవకు అక్కడ ఏదో ఒక ఉద్యోగం ఇప్పిస్తాడులే!" అన్నాడు నాగేశం.

అది విని ఏడుకొండలు అమితాశ్చర్యంతో, "రాఘవ మన ఊళ్ళో కొత్త పరిశ్రమను ఏర్పాటు చేశాడా?? దాని గురించి కాస్త వివరంగా చెప్పు!" అన్నాడు.

"ప్లాస్టిక్ వంటి పదార్ధాలవల్ల పర్యావరణానికి జరుగుతున్న హానిని అరికట్టేందుకు ఇప్పుడు చాలాచోట్ల ప్లాస్టిక్ పై నిషేధాన్ని విధిస్తున్నారు కదా! ఆ ప్లాస్టిక్ స్థానంలో మట్టితోచేసిన పాత్రలను, ఉపకరణాలను వాడితే కలిగే మేలును ప్రచారం చేశాడు మన రాఘవ. వాడి ఆలోచనలు నచ్చిన పలు దిగ్గజ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. వాటి సహాయంతో మన ఊళ్ళోనే చిన్న పరిశ్రమను ఏర్పాటు చేసి, ఒకప్పుడు మన ఊరికి చెందిన వారిని తిరిగి ఇక్కడకు రప్పించి, వారి చేత ఇంతకాలం మూలపడిన చక్రాలను తిప్పించి, మట్టి పాత్రలను వారితో చేయించి, మనకు వంశపారంపర్యంగా వచ్చిన కుమ్మరి వృత్తికి ప్రాణం పోస్తున్నాడు రాఘవ!" అన్నాడు నాగేశం.

"నేను వస్తున్నప్పుడు ఎన్నో ఏళ్ళ క్రితంలా మన ఊళ్లోని ఇళ్ళ లోగిళ్లు జనంతో కళకళలాడుతూ ఉండటం చూసి ఆశ్చర్యపోయాను. ఇదన్నమాట సంగతి! రాఘవ మన ఇంటివాడు కావడం మనకు గర్వకారణం. నేను గమనించిన మరొక విషయం ఏమిటో తెలుసా? ఒకప్పుడు బీడు భూములైన మన ఊరి పొలాలన్నీ ఇప్పుడు పచ్చటి పైరులుగా మారి కనులవిందు చేస్తున్నాయి. రాఘవ వ్యవసాయంలో పొందిన పట్టా అందుకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. నిజమేనా?" అడిగాడు ఏడుకొండలు.

"అది నిజమే అన్నయ్యా! ఆ పంటలు ఇవాళ కనులవిందుగా ఉన్నాయి. రేపు విందు భోజనాలై మన కడుపులు నింపుతాయి. ఇదంతా నాన్నకిచ్చిన మాట నిలబెట్టుకోవడమే!" అన్నాడు నాగేశం.

“ఒరేయ్ తమ్ముడూ! ఇప్పటికైనా ఆ నాన్నకిచ్చిన మాటకు అర్ధం నాకు చెప్పరా!" అన్నాడు ఏడుకొండలు నాగేశాన్ని బతిమలాడుతూ.

"అన్నయ్యా! ప్రతిరోజూ నాన్న కుండలు తయారు చేయడానికన్నా ముందు మట్టికి దణ్ణం పెడుతూ 'అమ్మా! పుడమితల్లీ! ఈ మట్టి నువ్వు మాకిచ్చిన వరం. నువ్వు ఎప్పుడూ బాగుండాలి. నీవల్ల నీ పిల్లలమైన మేమంతా బాగుండాలి!' అని అనేవారు గుర్తుందా? పుడమితల్లి అంటే భూమి. నాన్న ఉద్దేశంలో ఈ భూమి మనకు అమ్మ. అంతేకాదు! నా ఆకలి తీరుస్తున్న నా వృత్తి నాకు అమ్మ! నన్ను ఎంతో ప్రేమగా పెంచి, ఈ రోజు నేను ఉండటానికి ఇంత చోటిచ్చిన ఈ ఊరు కూడా నాకు అమ్మే! మరి అమ్మను జాగ్రత్తగా చూసుకోవడమంటే ఈ భూమిని కాపాడుకుంటూ, నా వృత్తిని వదిలిపెట్టకుండా ఉంటూ, నన్ను కన్న ఈ ఊరి అభివృద్ధి కోసం నాకు తోచిన సహాయం నేను ఎంతోకొంత చెయ్యటమే కదా! భూమిని కాపాడటమంటే భూమిలో మానవులు సృష్టిస్తున్న కాలుష్యాన్ని నివారించడం అని నాకు అనిపించింది. ఈ కాలుష్యసమస్యకు మట్టిపాత్రల వాడకం చక్కటి పరిష్కారం. ఆ మట్టిపాత్రలను చెయ్యడమే కదా నా వృత్తి! అంటే మన పెద్దలు మనకు ఈ వృత్తి రూపంలో ఎంతో విలువైన ఆస్తిని ఇచ్చారు. ఆ ఆస్తితోనే మన ఊరు కోల్పోయిన శోభను తిరిగి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. నాన్నకిచ్చిన మాటను తీర్చడం నా ధర్మమని భావించాను. నా ధర్మాన్ని నేను ఆచరిస్తే అదే నన్ను రక్షిస్తుందనీ, అలా చేయడంవల్ల ప్రకృతి కూడా రక్షింపబడుతుందనీ నమ్మాను. నా నమ్మకం ఇవాళ నిజమైంది!" అన్నాడు నాగేశం.

నాగేశం మాటలు విన్న ఏడుకొండలు క్షణకాలంపాటూ నిశ్చేష్టుడయ్యాడు. అప్పుడు కాస్త తేరుకుని, "తమ్ముడూ! నాన్నకిచ్చిన మాటలో ఉన్న అంతరార్ధాన్ని చెప్పి నా కళ్ళు తెరిపించావు! ఇన్నాళ్లూ నేను నాన్న అడిగిన మాటను అర్ధంచేసుకోలేక హీనంగా ప్రవర్తించాను! నన్ను పోషిస్తున్న ఆ పుడమితల్లిని పూర్తిగా నిర్లక్ష్యం చేసి, ఆవిడకు హాని కలిగించే పనిని ప్రోత్సహిస్తూ, ఆవిడ బిడ్డలైన ప్రకృతిలోని ప్రాణులకు తీవ్ర నష్టాన్ని కలిగించాను. నా మనుగడకు కారణమైన ఈ మట్టి నా బిడ్డ కాలికి అంటకూడదని అనుకున్న అవివేకిని! నాదే సరైన నిర్ణయమని అనుకుంటూ నా కొడుకుని పట్నం తీసుకెళ్లి వాణ్ణి ప్రయోజకుడిని చేయాలని అనుకున్నాను. పట్నంలో డబ్బు సంపాదిస్తున్నానన్న గర్వంతో నిన్ను అనరాని మాటలని నీ మనసును చాలా బాధపెట్టాను. నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం లేదు! నా మార్గం తప్పనీ, నువ్వు ఎంచుకున్న మార్గమే సరైనదనీ ఇప్పుడు తెలుసుకున్నానురా! నువ్వు మెత్తటి మట్టిని దృఢమైన కుండలుగా మార్చినట్లు రాఘవ వ్యక్తిత్వాన్ని అద్భుతంగా మలిచావు! వాడిని మన ఊళ్ళోనే పెంచి, లోకమంతా మెచ్చుకునేటంత గొప్పవాడిని చేశావు. రాఘవ ద్వారా మన వృత్తిని బతికించి, తద్వారా ఎన్నో కుటుంబాలకు ఆసరాను ఏర్పాటు చేయించావు. భూమాతను రక్షించడంలో నీవంతు కృషిని నువ్వు చేస్తూ ధన్యుడివయ్యావు!" అంటూ భావోద్వేగంతో ఉబికివస్తున్న కన్నీటిని తుడుచుకుంటూ, నాగేశాన్ని ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు ఏడుకొండలు.

"అన్నయ్యా! చిన్నప్పటిలాగా మళ్ళీ మనం పోటీలుపడుతూ కలిసి కుండలు చేద్దాం. సరేనా?" ఏడుకొండల్ని మొహమాటపడుతూ అడిగాడు నాగేశం.

“ఓ..! అందుకు నేను సిద్ధంరా తమ్ముడూ! ఒరేయ్ తమ్ముడూ! ధర్మాన్ని ఆచరిస్తూ, నాన్నకిచ్చిన మాటను నిలబెట్టుకున్న నువ్వు, సాక్షాత్తూ ఆ శ్రీరామచంద్రమూర్తివిరా! వయసులో నాకన్నా చిన్నవాడివైనా నీనుండీ నేను నేర్చుకోవాల్సినది ఎంతో ఉంది! నువ్వు రాఘవకు నేర్పినట్లు నేను కూడా మాధవకు కుండల తయారీని నేర్పి, నా తప్పును కొంచెమైనా సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాను. మట్టిని పిసికితే మాధవ అనుభవిస్తున్న మానసిక ఒత్తిడి కొంతవరకూ తగ్గుతుంది. మన వృత్తిని ముందుతరాలకు అందించినట్లవుతుంది. నాన్నకిచ్చిన మాట నెరవేర్చుకుంటున్నానన్న తృప్తి నాక్కూడా కలుగుతుంది!” అంటూ పుడమితల్లికి నమస్కారం చేసి, మట్టిని తడిపేందుకు కావలసిన నీళ్లను బిందెతో తీసుకున్నాడు ఏడుకొండలు.

********

Posted in June 2024, కథలు

2 Comments

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!