Menu Close
తెలుగు పద్య రత్నాలు 35
-- ఆర్. శర్మ దంతుర్తి --

యుగాలబట్టీ భగవంతుణ్ణి అనేక పేర్లతో పిలవడం, అందులో రెండక్షరాల మన రాముణ్ణి తల్చుకోవడం అందరూ ఎరిగినదే. ‘రా,’ ‘మ’ అనే రెండు అక్షరాలు కూడా వరసలో పలకలేకపోతే వాటిని తిరగేసి ‘మ,’ ‘రా,’ అంటూ జపం చేసిన వాల్మీకి సిద్ధి పొందాక అందించినదే కదా రామాయణం? అందువల్ల ఏ పేరు పెట్టి పిల్చినా భగవంతుడు పలుకుతాడనేది సుస్పష్టం. త్యాగరాజు తన కీర్తనలలో రాముణ్ణి, ‘పరమశాంత చిత్త జనకజాధిప వరదాఖిల జగదానందకారకా’ అంటాడు. అయితే భగవంతుడెటివంటి వాడు అసలు? ఇలా ఉంటాడు అని చెప్పినవాళ్ళెవరూ ఆయనని చూసినవాళ్ళు కాదు అంటారు శ్రీరామకృష్ణులు. మరెలా ఆయనని పిలవాలి? ఉత్తి రాముడు అంటే చాలా? పరంధాముడు అంటే చాలా?  అదే ఈ నెల పద్యంలో రాఘవ సమక్షం అనే పద్యాలు రాసిన కొండపల్లి రామచంద్రరావు గారు అంటున్నారు.

రాముడవందునొ యఘవిరాముడ వందునొ భక్త హృత్తమ
స్సోముడవందునొ నృపతి సోముడవందునొ జానకీ మనః
కాముడవందునొ, విగత కాముడ వందునొ గాక యాపరం
ధాముడవందునొ నుజన ధాముడవందునొ నిన్ను రాఘవా (రాఘవ సమక్షం – 90)

నువ్వు రఘువంశంలో జన్మించావు కనక రాఘవుడివి కదా (రాఘవా)? అయితే రాఘవుడైన నిన్ను రాముడు అనమంటావా (రాముడవందునో?) పాపాలు నాశనం చేసేవాడివి అనాలా? (అఘము – పాపం, విరాముడు – హరించేవాడు), భక్తుల హృదయంలో ఉండే చందమామలాంటివాడివి అనాలా? (భక్త హృత్తమ సోముడవందునో) రాజుల్లో చంద్రుడంతటివాడివి అనాలా? (నృపతి – రాజులలో, సోముడు – చంద్రుడు), జానకి మనసు దోచినవాడివా? (జానకీ మనఃకాముడవందునో?) లేకపోతే కోరికలు లేకుండా చేసేవాడివి అనాలా? (విగత కాముడవందునో) లేకపోతే ఆ పరబ్రహ్మమే నువ్వు అనాలా? (కాక యా పరంధాముడవందునో?) లేకపోతే మంచి వారిని ఉద్ధరించేవాడివి అనాలా? (నుజన ధాముడవందునో)?

పాపాలు నాశనం చేయడం సంగతి రామాయణంలో చెప్పారు – అహల్య శాపవిమోచనం అనేటువంటి సంగతులలో. భక్తుల హృదయంలో ఉండేవాడివి అనేదాని గురించి త్యాగరాజు పంచరత్న కీర్తనలో అంటున్నాడు చూడండి - చందురు వర్ణుని యంద చందమును హృదయార విందమునఁ జూచి బ్రహ్మానంద మనుభవించు వారెందరో మహానుభావులు. భగవంతుణ్ణి, అంటే బ్రహ్మాన్ని దర్శించినవారు హృదయంలో రాముడి/లేదా తన మనసులో ఉన్న భగవంతుడి రూపైన అందచందాలు చూస్తూ బ్రహ్మానందం అనుభవించేవారు.  రాముడు రాజులలో చంద్రుడంతటివాడు అనేది తెల్సిన విషయమే. ఎందుకంటే ఎప్పుడూ, ఎవరి విషయంలో అయినా సరే ధర్మం తప్పకుండా పాలించేవాడు కనక. ఈ ధర్మం సంగతి ఓ చిన్న కధలో చెప్పుకుందాం. రాముడు సభ చేసేచోట బయట ఒక గంట కట్టించాడుట. ఎవరైనా సరే వచ్చి గంట కొడితే రాముడొచ్చి కనుక్కుంటాడు సంగతి. ఓ రోజు వంటినిండా దెబ్బలతో వచ్చిన ఒక కుక్క గంట లాగింది. రాముడొచ్చి విచారించాడు. ఫలానా ఆయన నన్ను కొట్టాడు అని ఆ కుక్క చెపితే ఆయన్ని పిల్చి అడిగాడు. ఆయన కూడ వప్పుకున్నాడు కుక్కని కొట్టినట్టూ. శిక్ష ఏమి వేయమంటావు అని అడిగితే కుక్క చెప్పిందిట – ఈయనకి మంచి జీతం ఇచ్చి గుడిలో ధర్మకర్తగా వేయించు అని. రాముడు ఆశ్చర్యంతో అడిగాట్ట – ఇదేం శిక్ష అని. దానికి కుక్క చెప్పిన సమాధానం ఏమిటంటే – ఆ కుక్క క్రితం జన్మలో ధర్మ కర్తగా పనిచేసి ఈ జన్మలో కుక్కగా పుట్టి వీడి చేత కొట్టబడింది. ఆ ధర్మకర్తగా డబ్బులూ అవీ కొట్టేసిన పాపాలకి తనకి కుక్క జన్మ వచ్చింది కనక వీడు – ఇప్పుడు ధర్మ కర్త అయితే, వచ్చే జన్మలో కుక్కగా పుట్టి అష్టకష్టాలు పడతాడు. అలా అందరి పట్లా ధర్మం నెరవేర్చేవాడు రాముడు.

విగతకాముడి సంగతి. సాధన చేస్తూ ఉంటే ఓ స్థాయి చేరాక భక్తుడు భగవంతుడి గురించి తప్ప మరే విషయం మాట్లాడడానికీ ఆసక్తి చూపించడు అంటారు రామకృష్ణులు. వెనకి తిరిగిన మనసు ఎప్పుడైతే ఆత్మలోకి చూడడం మొదలుపెడుతుందో అప్పుడు మిగతా కోరికలన్నీ అవే ఒక్కోటిగా తగ్గుతూ చివరకి అంతమౌతాయి. ఈ ఆత్మ స్వరూపమే భగవంతుడు కదా, అందువల్ల ఈ కోరికలు (కామము అంటే ఇక్కడ శారీరకమైనవి మాత్రమే కాదు అన్ని రకాల కోరికలూ అని చెప్పుకోవచ్చు) నశింపచేసేవాడు కూడా రాముడే. అలా కోరికలు తగ్గగానే మనసు భగవంతుడిమీదకి మరింతగా మరల్తుంది. ఎప్పుడైతే ఆ కోరికలు తీరాయో అప్పుడు మనసు ఆత్మలో లీనమవగానే కలిగేది బ్రహ్మానుభూతి. అందువల్ల భగవంతుడు విగత కాముడు.

ఆఖరి విషయం పరంధాముడవందునో అనేది. మనలో ఉండే సర్వ సాక్షీభూతమైన ఆత్మ ఒకటే చరాచర ప్రపంచంలో ఉండే చైతన్యం కదా? దానినే చూసినవాళ్ళు అనేక విధాలుగా చెప్తున్నారు అనుకున్నాం (ఏకం సత్ విప్రా బహుధా వదంతి). అందువల్ల ఈ చైతన్యమే బ్రహ్మం/భగవంతుడు. ఇదే శక్తి స్వరూపం అంటూ మనకి పాఠశాల పుస్తకాలలో నేర్పేది కూడా. శక్తి అనేది ఒకటే; అది ఒక రూపంలోంచి మరోరూపంలోకి మారుతుంది కానీ దానినెవరూ నాశనం చేయలేరు; కొత్తగా సృష్టించనూ లేరు. ఇదే ఈశావాశ్యోనిషత్ లో చెప్పిన శ్లోకం నిర్ధారిస్తూ ఉంది - ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణాస్య పూర్ణమాదాయ పూర్ణమేవావ శిష్యతే. అది – అంటే మనకి కనిపించని భగవంతుడు పూర్తిగా బ్రహ్మం (పూర్ణమదః), ఇది – అంటే చరాచర ప్రపంచంలో ఉండే చైతన్యం, మనకి కనిపించేది – కూడా బ్రహ్మమే (పూర్ణమిదం). ఈ బ్రహ్మాన్ని అందులో కలిపినా, అందులోంచి దీన్ని తీసేసినా మిగిలేది కూడా బ్రహ్మమే.  మరింత సులభంగా అర్ధమవడానికి ఈ బ్రహ్మాన్ని అగ్నితో పోల్చుకోవచ్చు. చిన్నపాటి నిప్పుతో ఎంతటి మంటనైనా చేసి నాశనం చేయగలిగినట్టే పెద్దదైన అగ్నితో కూడా చేయవచ్చు. ఒక అగ్ని మరో దానితో కలిపినా, ఒక దానిలోంచి మరొకటి తీసుకొచ్చినా అగ్ని/నిప్పు ఒకటే కదా? అదే హరిమయము విశ్వమంతయు అని చెప్పిన విషయం కూడా. దీనినే మనలో ఉన్న అంతర్యామి, సర్వసాక్షీ అయిన పరంధాముడు అంటున్నారు పద్యంలో.

****సశేషం****

Posted in May 2024, వ్యాసాలు

1 Comment

  1. అయ్యగారి మూర్తి

    పద్యం నాలుగు పాదాలలోనూ మొదటిసారి వచ్చినది వందునో అని ఉండాలి. వందునొ అని కాదు. రెండవ సారి వందునొ అనే ఉండాలి, ఉంది కూడా.

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!