Menu Close
వీక్షణం-140 వ సాహితీ సమావేశం
-- ప్రసాదరావు రామాయణం --
vikshanam-140

వీక్షణం సాహితీ గవాక్షం 140వ అంతర్జాల సమావేశం ఏప్రిల్ 12వ తేదీ 2024న అత్యంత ఆసక్తిదాయకంగా జరిగింది. ఈ సమావేశం క్రోధి నామసంవత్సర ఉగాది కవిసమ్మేళన ప్రత్యేక సమావేశంగా జరిగింది. ఈ నాటి సమావేశానికి ముఖ్యఅతిథిగా అమెరికా మొట్టమొదటి ద్విశతావధాని శ్రీ శ్రీచరణ్ పాలడుగు గారు, కవిసమ్మేళనం అధ్యక్షులుగా శ్రీ మధు ప్రఖ్యా గారు, శ్రీ గుండ్లపల్లి రాజేంద్ర ప్రసాద్ గార్లు విచ్చేశారు. తెలుగు వారికి వత్సరానికి ఒక్కసారి ఉగాది అయితే, మన వీక్షణం కవి కుటుంబానికి ప్రతి నెలా ఉగాదే! అంత సంబరం మనందరికీ వీక్షణం కవిసమ్మేళనమంటే! పన్నెండేళ్లుగా ఎన్నో కష్ట నష్టాలకోర్చి నిరంతరాయంగా ప్రతి నెలా సభలు జరుపుతున్న వేదిక ప్రపంచంలో బహుశా: మన వీక్షణం ఒక్కటే కావచ్చు. వ్యవస్థాపక అధ్యక్షురాలు డా.గీతామాధవి గారి కృషి, పట్టుదల అనన్యం, అసమాన్యం, అపురూపం! నిత్య సాహితీ కార్మికురాలైన వారికి కవి లోకం జేజేలు పలుకుతుంది! దాదాపు 6 గం.లకు ప్రారంభమైన సభ ఉద్దండులైన కవుల/ కవయిత్రుల కవితాగానంతో సుమారు మూడున్నర గం. పాటు కొనసాగింది, సభికులు కవిత్వ ఆనందంతో మైమరచి పోయారు. అందరికీ మూడున్నర గంటలు అప్పుడే అయిపోయాయా అనిపించింది.

ముందుగా వీక్షణం రథసారథి డా.కె.గీతామాధవి గారు ఈనాటి ముఖ్య అతిధి శ్రీయుతులు పాలడుగు శ్రీ చరణ్ గారికి, కవి సమ్మేళనానికి అధ్యక్షత వహించిన శ్రీ మధు ప్రఖ్యా, గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ గార్లకు స్వాగతం పలుకుతూ సభకు వారిని పరిచయం చేశారు.

ముందుగా శ్రీ పాలడుగు శ్రీ చరణ్ గారు క్రోధి నామసంవత్సర ఉగాది విశేషాంశాల్ని పద్యగానంతో, చక్కగా వివరించారు.

తదుపరి కవిసమ్మేళనం ప్రారంభమైంది. అధ్యక్షులు శ్రీ మధు ప్రఖ్యాగారు ప్రతి కవితనూ విశ్లేషిస్తూ, తీయని వాచకంతో సభను నిర్వహించిన తీరు అందరి ప్రసంశలనూ అందుకుంది. గుండ్లపల్లి వారు కూడా తనదైన శైలిలో సభను అద్భుతంగా నడిపించారు.

ఇక అర్ధ శతంపై మరిద్దరు కవికోకిలలు గానించిన అన్ని కవితలూ అమృత గుళికలే! ఎవరిని ఉటంకించనూ? ఎవరిని విస్మరించనూ? ఉగాది అంటే కోకిల గానాలూ, మావిరెమ్మలూ, వేప పూతలూ, షడ్రుచులే కదా !

అందులో కొన్ని:-

మొదటిగా నాళేశ్వరం శంకరంగారి కవితాగానంలో, పాలడుగు వారు ఉగాదిని స్వాగతిస్తూ చేసిన పద్య గానంలో భావం, భాష అత్యుత్తమం. తదుపరి గీతామాధవి గారు" తెల్లారి నిద్ర లేవగానే కిటికీ తెరుచుకుంటుంది/ఫేస్బుక్, ఇన్స్టా గ్రామ్  అంతరిక్ష గవాక్షంలో నిలిచి పోతున్నా/కిటికీలు లేని ప్రపంచం ఉంటే ఎంత బావుణ్ణు" అంటూ భావుకతను గుప్పిస్తూ ఆమె మరోప్రపంచాన్ని ఆశించిన తీరు అద్భుతం. కందుకూరి శ్రీరాములు గారు "పుట్టుకతోనే క్రోధి అంటూ" ఉగాదిని ఆహ్వానించిన వైనం శ్రోతలను ఆకట్టుకుంది. నీహారిణి "తలపులకు తలుపులుండవు కదా క్రొత్త కోయిలను ఆహ్వానిద్దాం" అన్నారు. తల్లాప్రగడ రావుగారు శ్రీరాముని స్తుతిస్తూ అద్భుతంగా గజల్ గానం చేశారు.ఇక వసీరా గారి కవితలు పనసతొనలే. వేపచెట్టు లోని ప్రాకృతిక మార్పులను వచిస్తూ "నా జోలిలో అన్ని కవితలు పోసి వెళ్ళింది వేపచెట్టు" అంటూ ముగించారు. సాధనాల వెంకటస్వామి నాయుడు గారు "కరెంటు కోతలను మోసుకొచ్చి దోమలను మాపై తరుముతావెందుకు ఉగాదీ" అంటూ హాస్యస్ఫోరకమైన కవిత అందరినీ అలరించింది.

గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ గారు సహజ కవి. అలతి పదాలతో,కొండంత భావుకతో "నా గుప్పెట్లో రహస్యాలు లేవు" అంటూ గంభీర స్వరంతో గానించారు. తదుపరి మధు ప్రఖ్యాగారు "నిశ్శబ్దం మాట్లాడుతుంది" అని చదివిన కవిత ఒక స్వరఝరి. హిమాలయం పైనుండి జాలువారిన గంగా జలపాతం.! శ్యామసుందర్ గారు "పేరులో ఏముంది? ఎందరు శాంతలు గయ్యాళిలు కారు? అందరూ రాముళ్ళూ ఒకేలా ఉన్నారా" అంటూ క్రోధి అనగానే భయం అవసరంలేదు అంటూ అభయం యిచ్చారు. అరుణ కోదాటి గారు రామునిపై చక్కని జానపద పాట పాడారు. ప్రసాదరావు రామాయణం "అట్టడుగు మనిషిలో గూడుకట్టిన నైరాశ్యం అసహనమై, అంగారమై ఈ సామాజిక రాజకీయ వ్యవస్థలపైతిరుగుబాటును కోరుకుంటున్నారు" అంటూ అగ్నిని కురిపించారు.

సాయి జ్యోతిగారు "కారాదు మాతృభాష మృతభాష" అంటూ తల్లిభాషపై వారి మక్కువను చూపారు. మందా వీరాస్వామి గారు "వృద్దాప్యంలోని బాధలను వివరిస్తూ నాలాంటి వారికి కొన్ని సూచనలు కూడా చేశారు." ప్రభాకర్ గారు యువత ఎలా చెడిపోతూందో తన కవితలో వివరిస్తూ "గంజాయి వనంలో అడుగిడితే తులసీవనం ఎండిపోదా?" అని ఆలోచనా స్ఫోరకంగా అన్నారు. బాలాజీ గారు చెట్టుయొక్క ప్రాధాన్యతను తన కవితలో అందంగా చెప్పారు. కాదు శ్రావ్యంగా పాడారు.

ఈ సభలో నాళేశ్వరం శంకరం, డా||కె.గీతామాధవి, కందుకూరి శ్రీరాములు, నీహారిణి కొండపల్లి, తాటిపర్తి బాలకృష్ణారెడ్డి, వసీరా, రావు తల్లాప్రగడ, పిల్లలమఱ్ఱి కృష్ణకుమార్, సాధనాల వెంకటస్వామి నాయుడు, స్వాతి ఆచంట, సుమలత మాజేటి, గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, శ్యామ్ సుందర్ పుల్లెల, భవాని ముప్పల, సంధ్యారాణి కొండబత్తిని, ఘంటా మనోహరరెడ్డి, కిలపర్తి దాలినాయుడు, దేవులపల్లి పద్మజ, సునీత పోతూరి, రామక్రిష్ణ చంద్రమౌళి, రాధా కుసుమ, మోటూరి నారాయణరావు, అవధానం అమృతవల్లి, కోదాటి అరుణ, లింగుంట్ల వెంకటేశ్వర్లు, వీరరాఘవులు చిట్టాబత్తిన, సావిత్రి రంజోల్కర్, ఎం ఎన్ బృందా, పిళ్ళా వెంకట రమణమూర్తి, ఆచార్య అయ్యల సోమయాజుల ప్రసాద్, రామాయణం ప్రసాదరావు, గౌరీపతి శాస్త్రి కె వి జి ఎస్, కందెపి రాణిప్రసాద్, గంటి జానకి, యు వి రత్నం, నాగేంద్రమ్మ పరుచూరి, బంతికట్ల నాగేశ్వరరెడ్డి, చీదెళ్ళ సీతాలక్ష్మి, పరిమి వెంకట సత్యమూర్తి, రాము లగిశెట్టి, పద్మశ్రీ చెన్నోజ్వల, దేవి గాయత్రి, శ్యామరాధిక, మేడిసెట్టి యోగేశ్వరరావు, సాయి జ్యోతి, ఉష భాస్కర్, మంద వీరాస్వామి, నాయకంటి నరసింహశర్మ, వేము వందనం, మండికరి బాలాజీ, మన్నె లలిత, అరుణకుమారి మందపాక, ఆలపాటిగారి అమ్మాయి, రావినూతల జగదీశ్వరి, సత్యవీణ ముండ్రేటి, మల్కని విజయలక్ష్మి, ధనమ్మ పి, గుర్రం మల్లేశం, పొడిచేటి పద్మావతి, జె వి కుమార్, అర్వా రవీంద్రబాబు, రమాదేవి సరికొండ, గంటి జానకి, సావిత్రి ఎ, వైరాగ్యం ప్రభాకర్, ప్రభాకరరావు కె వి, రత్నలక్ష్మి. ఎస్, ఉమామహేశ్వరరావు భోగెల, కృష్ణ దాస్ మొ.న కవులు పాల్గొని కవితాగానం చేసారు. ఇంకా సుభాష్ పెద్దు గారు, ప్రసాద్ నల్లమోతు గారు మొ.న సాహిత్యాభిలాషులు ఎందరో సభకు హాజరయ్యారు.

చివరగా గీతగారి మలిపలుకులతో సభ విజయవంతంగా ముగిసింది. ఈ సమావేశంలో అమెరికా, భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సాహిత్యాభిలాషులు , సాహిత్యకారులు అనేకులు ఆసక్తిగా పాల్గొన్నారు.

అత్యంత ఆసక్తికరంగా జరిగిన ఈ సమావేశ వీడియోని ఇక్కడ చూడవచ్చు.

Posted in May 2024, వీక్షణం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!