Menu Close
Abhiram Adoni
భళా సదాశివా..
అభిరామ్ ఆదోని (సదాశివ)

నీ జటలో గంగమ్మ
నా కంట గంగమ్మ
తేడా ఏందయా
అంతా నీ ఆటగదయ్యా....
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...

నీ సిగలో నెలవంక
నా తలలో తప్పు డొంక
తేడా ఏందయా
అంతా నీ ఆటగదయ్యా....
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...

నీకేమో మూడో కన్ను
నాకేమో మోహ మన్ను
తేడా ఏందయా
నీ ఆటలో అంతా బూడిదేనయా
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...

నీ గొంతున విషమంట
నా గుణమే విషమంట
ఈ బేధమేందయా
బాధేదైనా నీ ఆటకు హామ్‌ఫట్టయా
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...

శంకరుడివి నీవట
నీ కింకరుడిని నేనట
నీ కింకరుడి శంకతీర్చ శంకేదయా
శంకైనా శంఖమైనా శంకరా చక్కెరలెక్కయ్యా నీకు
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...

ఎందుకయ్యా ఈ ఆట
ఎందుకయ్యా ఈ మాట
ఎందుకయ్యా ఈ బాట
ఎందుకయ్యా ఈ వేట
మాటై బాటై వేటై నీ ఆటలో ముగియడానికా....
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...

ఎందుకయ్యా గంగను మోస్తావ్
ఎందుకయ్యా చంద్రుడిని ధరించావ్
ఎందుకయ్యా విషం తాగావ్
ఎందుకయ్యా కాట్లో ఉంటావ్
గంగలా పొంగి, చంద్రుడిలా తప్పు చేసి
విషమైన ఈ కట్టెను కాల్చడానికా
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...

ఎందుకయ్యా నీకు శూలం
ఎందుకయ్యా నీకు ఎద్దు
ఎందుకయ్యా నీకు పాము
ఎందుకయ్యా నీకు భూది
శూలంలా ఎదిగి, ఎద్దులా తిరుగుతూ
పాములా బుసకొడుతున్న నన్నే
భూదిగా పూసుకోవడానికా
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...

ఎందుకయ్యా నీకు ఇద్దరు సతులు
ఎందుకయ్యా నీకు మూడు కన్నులు
ఎందుకయ్యా నీకు నాలుగు చేతులు
ఎందుకయ్యా నీకు ఐదు మూఖాలు
రెండు బుద్ధుల్లో పొర్లే నన్ను
మూడు కళ్ళతో కరుణించి,
నాలుగు చేతులతో దండించి లాలించి,
ఐదు ముఖాలతో ఉద్దరించడానికా
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...

ఎందుకయ్యా నీకు తోలు బట్ట
ఎందుకయ్యా నీకు బిక్షాటన
ఎందుకయ్యా నీకు రుద్రరూపం
ఎందుకయ్యా నీకు ప్రమధగణం
ఈ తోలుతిత్తిలో బికారీతనమును,
రుద్ర గుణాలను తీసి
ప్రమధగణంలో చేర్చుకోడానిడా
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...

... సశేషం ....

Posted in May 2024, కవితలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!