ఎలా అవుతాడు?
- పారనంది శాంతకుమారి
తల్లితండ్రుల ఋణం తీర్చుకోలేనివాడు
తత్వదర్శి ఎలా అవుతాడు?
స్వజనంతో కలిసుండలేనివాడు
సంఘసంస్కర్త ఎలా అవుతాడు?
అర్ధాంగిని ఆదరించలేనివాడు
ఆదర్శవాది ఎలా అవుతాడు?
సమైక్యాన్ని ప్రదర్శించలేనివాడు
సమతావాది ఎలా అవుతాడు?
శాంతాన్ని దర్శించలేని వాడు
శాయిభక్తుడు ఎలా అవుతాడు? (వటపత్ర శాయి)
ప్రేమతత్వాన్ని ప్రతిబింబించని వాడు
ప్రవచన కారుడెలా అవుతాడు?
సున్నితత్వాన్ని ప్రదర్శించని వాడు
సౌమ్యవాది ఎలా అవుతాడు?
ఆద్యంతాలు తెలియని వాడు
అవతార పురుషుడెలా అవుతాడు?