Menu Close

Adarshamoorthulu

డా. వింజమూరి (అవసారల) అనసూయ
-- విద్యార్థి

Dr. Vinjamuri Anasuyaవింజమూరి (అవసారల) అనసూయ గానం శాస్త్రీయ, లలిత, జానపద సంగీతాల త్రివేణి సంగమం. గురువుల దగ్గర నేర్చిన శాస్త్రీయ సంగీతం స్వచ్ఛ గంగ. వారి తల్లి దండ్రులు వెంకట రత్నమ్మ, వెంకట లక్ష్మీ నరసింహారావుగారు. ఇద్దరూ సాహితీపరులే. వారి మేనమామ కృష్ణ శాస్త్రి. ఈ భావకవితా సాహితీ క్షేత్రంలో అనసూయమ్మ స్వేచ్ఛగా, రమణీయంగా సంగీతం కూర్చి పాడుకున్న గేయాలు యమున. భావా సంగీతం లేక లలిత సంగీతం మొదలుపెట్టిన వారిలో అగ్రశ్రేణిలో ఉన్నవారు అనసూయమ్మ. జానపదం సరస్వతి, అంతర్వాహిని. కాల కాలాల నుండి సామాన్య ప్రజలలో ఉన్నదే. ఆ జానపద సరస్వతిని అనసూయమ్మ సభలలో వినిపించారు. అనసూయమ్మ శాస్త్రీయ సంగీత విదుషీమణి. చిన్నతనంలో కచ్చేరీలు చాలా చేశారు. ఆ తరువాత భావ సంగీతం ప్రాచుర్యం పొందుతున్నప్పుడు కొన్ని వందల కచ్చేరీలు చేశారు. అయితే, ఆవిడ జీవితాన్ని అంకితం చేసుకున్నది జానపద సంగీతం కోసం. ఈ ఆదర్శమూర్తుల స్మరణికలో అనసూయమ్మ శాస్త్రీయ సంగీతం గురించి లిప్తముగా, భావ సంగీతం గురించి క్లుప్తముగా, జానపద సంగీతం గురించి విపులముగా తలుచుకుందాము.

అనసూయమ్మ జననం  మే 12, 1920. అయితే, గత ఆరు సంవత్సరాలుగా మాత్రమే ఆవిడ నాకు పరిచయం. మంచి స్నేహితులమయ్యాము. ప్రతి మాతృ దినోత్సవం నాడూ, నేను ఆవిడకి ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పేవాడిని. "నీ ఫోన్ కోసమే ఎదురు చూస్తున్నానయ్యా, ఇంకా చెప్పలేదేమిటి" అని అనేవారు. ఈ సంవత్సరం ఆవిడకు ఫోన్ చేసే అవకాశం లేదు. మార్చి 23, 2019న అనంత లోకాలకు భావ, జానపద సంగీతాలు వినిపించటానికి వెళ్లారు. ఈ స్మరణికతో ఆ తల్లిని ‘మాతృ దినోత్సవం’ నాడు తలుచుకుందాం.

మా మొదటి పరిచయం నాటికి ఆవిడ 93 సంవత్సరాల యువతి. ఆవిడే తలుపు తీశారు. నమస్కరించి ఒక చిన్న పళ్ల బుట్ట అందిస్తే కూర్చోబెట్టి గంట సేపు రసజ్ఞతతో కూడిన చర్చ నడిపారు. ఉన్నట్లుండి సవరల భాషలోని జానపద గీతం “రంగీబోయ్ రంగీబోయ్ కింతాబోయ్ రంగీబోయ్, జాగాబోయ్ అకింబా .. " (వెన్నల రాజా, వెన్నల రాజా, వెళ్లేదెక్కడికి) అందుకుని, "ఊపిరి ఇదివరకటలాగా అందటంలేదయ్యా, ఉండు" అంటూ నెమ్మదిగా వాకర్ తోసుకుంటూ, ఆవిడ మనమరాలి పియానో దగ్గరకు వెళ్లి ఆ సవరల పాటని పియానో మీద వినిపించారు. "సవరల పాటలలో గతి లయలు చాలా అందంగా ఉంటాయయ్యా" అని అన్నారు.

ఇన్ని విశేషాలు చెపుతున్నారు, మీరు ఇవన్నీ ఎక్కడన్నా పొందుపరిచారా అని అడిగితే, "లలిత, జానపద గేయాలని స్వరాలతో పొందు పరిచి, ఏడు పుస్తకాలలో వ్రాశాను, ఇంకో రెండు పుస్తకాలు కూడా వ్రాశాను" అని అన్నారు. మరి మీరు ఇంకా ఏం చేయదలుచుకున్నారు అంటే, "నా ఆత్మ కథ వ్రాయాలని ఉంది, ఆనాటి విషయాలు చాలా ఉన్నాయి, కానీ వినేవాళ్లెవరూ? కానీ సహకరించేవారెవరూ? “Silicon Valley is a soulless intellectual dessert. Everyone is thinking of computers, software only” అన్నారు. ఎందుకో నాకు కొంచెం చీమ కుట్టినట్లయ్యి, "నేను చేసిపెడతాను" అన్నాను. ఆవిడ నన్ను ముందు నమ్మ లేదు. కానీ ఆ తరువాతి వారం సంభాషణలో కొంత నమ్మకం ఏర్పడింది. ఆవిడ రాసుకున్న మూడు పేజీలు నాకిచ్చారు. అలా ఏర్పడిన పరిచయం ఒక రెండు సంవత్సరాల పాటు రోజూ ఫోనులో కనీసం ఒక అరగంట  మాట్లాడుకోవటం, వారాంతంలో కలసి చర్చ, మొత్తానికి ఆవిడ ఆత్మ కథ తయారయ్యి ఒక పుస్తకంగా వెలువడింది. ఆ సందర్భంలోనూ, ఆ తరువాతా, "ఈ విషయం నేను ఏ ఇంటర్వ్యూలలో కానీ, ఇంకెవరితోనూ చెప్పలేదయ్యా, మరి ఇప్పుడు చెబితే బాగుంటుందా" అనేవారు. ఈ వయసులో ఇంకా ఆలోచించవలసిందేముంది అనేవాడిని. ఆవిడ ఆత్మ కథ వెలువడిన తరువాత మా సాన్నిహిత్యం పెరిగింది. నేను ఆవిడకు మనవడి వయసో, ముని మనవడి వయస్సో! కానీ నిన్న మొన్నటి దాకా మా సంభాషణలన్నీ స్నేహితులుగా సాగేవి. 99 ఏళ్ల వయసులో కూడా ఎన్నో విషయాలు చెప్పేవారు, కృష్ణ శాస్త్రి, బసవరాజు అప్పారావు, బాపి రాజు మొదలైనవారి కవితలు సందర్భోచితముగా చెప్పి, పాడి, వివరించే వారు. ఎన్ని కబుర్లు!? వారి ఆత్మకథ వ్రాయటానికి సహాయ పడటం, నాకు వంద సంవత్సరాల సాహిత్య సంగీత చరిత్రకు ఒక గవాక్ష వీక్షణం. నాటి విషయాలు ఎన్నో కళ్లకు కట్టినట్టు చెప్పేవారు.

గత రెండు సంవత్సరాలుగా చెప్పాలని తోచినప్పుడు "ఈ విషయం నీకైతే ఆసక్తిగా ఉంటుంది” అని  ఫోన్ చేసి చెప్పేవారు. నేను అప్పుడప్పుడూ ఫోన్ చేసి పలకరించేవాడిని. ఫిబ్రవరి ఆఖరి వారంలో, "హాస్పటలునుండి  వచ్చామయ్యా, ఆరోగ్యం అంతా బాగానె ఉంది" అంటూ ఫోన్ మెస్సేజ్ పెట్టారు. కాలానికి ఎవరూ అతీతులు కాదు. కానీ, అనసూయగారి వంటి వారు ఇంకా కొన్ని నాళ్లు వుంటే బాగుండు అని అనిపిస్తుంది.

శాస్త్రీయ సంగీతం

అనసూయమ్మ గారి శాస్త్రీయ సంగీతాభ్యాసం ఐదు సంవత్సారల వయసు నుండే సాగింది. శొంఠి లచ్చయ్య గారు మొదటి గురువు. ఆయన త్యాగరాజ శిష్య పరంపరలోని వారట. తను శిష్యురాలిగా చేరిన కొన్ని నెలల్లోనే లచ్చయ్య గారు మరణించగా వారి కుమారులు శొంఠి సీతారామయ్య గారి దగ్గర ఇంకొక సంవత్సరం సంగీతాభ్యాసం చేసారు. 9, 10 ఏళ్ల వయస్సు నుండి రాజమండ్రిలోని మునుగంటి వెంకట్రావు గారి శిష్యరికములో శాస్త్రీయ సంగీత పరిపూర్ణత పొందారు.

శాస్త్రీయ సంగీతం స్వచ్ఛ గంగా ప్రవాహం. అనసూయమ్మకు శాస్త్రీయ సంగీతం నేర్చుకున్న తరువాత సభలలోనూ, కచ్చేరీలలోనూ చాలా సార్లే పాడారు. అయితే ఆవిడ పొందుపరిచిన అరుదైన శాస్త్రీయ సంగీతం కూడా ఉంది. ఉదాహరణకు పెండ్యాల సత్యభామ ఆనాటి దేవ నర్తకి. నవజనార్ధనంలో రాత్రుళ్లంతా ఆడేవారట. నటరాజ రామకృష్ణ గారు, ఆ తరువాత కళా కృష్ణ గారు ఆవిడ నృత్య పరంపరను కొనసాగించారు. పెండ్యాల సత్యభామ నృత్య మేళాలని స్వయముగా చూసిన అనసూయమ్మ, నృత్యానికి సహకరించిన ఆనాటి శాస్త్రీయ సంగీతాన్ని పొందుపరిచారు.

ఉదాహరణకు ఈ పాట వినగలరు.

"ఈ నాడు ఈ పాటను మార్చి పాడుతున్నారుగాని, ఆనాటి బాణీ, స్వరాలు, మేళ తాళాలు" ఇవే అని అన్నారు. ఇటువంటి అపురూపమైన శాస్త్రీయ సంగీతాన్ని సమీకరించి, భద్రపరిచారు.

లలిత సంగీతం, భావ గీతాలు

1920ల కాలంలో ప్రపంచంలోనే పలు అంశాలలో నూతన అధ్యాయాలు మొదలయినవి. రసాయన, భౌతిక, వైద్య శాస్త్రాలలో విప్లవాత్మకమైన మార్పులు వస్తున్న రోజులు. ప్రపంచ సాహిత్య రంగంలోనూ విప్లవాత్మకమైన మార్పులు వస్తున్న రోజులు. అలానే వివిధ కళా రంగాలలో కూడా విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. ఉదాహరణకు Jazz, Blues, Samba, Calypso వంటివి. చిత్రలేఖనంలో “Surrealism”, “Dadism" మొదలైనవి. పశ్చిమ దేశాలలో కూడా మొదటి ప్రపంచం యుద్ధం తరువాత “Modernism”, “Expressionism”, “American Renaissance” తదితర నవ్య సాహిత్య రీతులు మొదలయినవి.

1920 దశకం భారతీయ కళా రంగం కూడా పలు మార్పులు చెందుతున్న కాలం. తెలుగునాట ప్రభంద, పద్య కవితా సాంప్రదాయపు గోడలు బ్రద్దలు చేసుకుని భావ కవిత్వం వెలువడటం మొదలయ్యింది. భావ కవిత్వపు ప్రముఖలలో పద్మభూషణ్ దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు అగ్రగణ్యులు. వారికి ముద్దుల మేనకోడలు అవ్వటం అనసూయ గారి అదృష్టం. అభ్యుదయ భావాలు గల తల్లి  వింజమూరి వెంకటరత్నమ్మ గారు స్వతహాగా కవయిత్రి. "అనసూయ" అనే తొలి తెలుగు మాసపత్రిక నడిపి ఆనాటి నవ్య కవితలను ప్రచురించారు. ఆ మాస పత్రిక పేరే అనసూయమ్మకు పెట్టుకున్నారు. ఆనాటి నాటక రంగంలో నవీన అంశాలను చేర్చిన పద్మశ్రీ వింజమూరి లక్ష్మీనరసింహం గారు వీరి తండ్రి గారు. ఆ పైన వీరి ఇంటికి వచ్చే నాట్య, సంగీత సాహిత్య కళాకారులు, కృష్ణ శాస్త్రిగారి భావ కవితా మిత్ర మండలి. ఇదీ, అనసూయమ్మ పెరిగిన సాహితీ క్షేత్రం. ఐదారేళ్ల పిల్లలు ఎదో చిన్న పాట పాడితే ఎంతో మురిపెంగా ఉంటుంది. అటువంటిది అనసూయమ్మ ఆరేడేళ్ల వయసుల్లో మేనమామ కవితను రాగం తీయటంలో వింత లేదు. ఇంటిలో తండ్రి నరసింహం గారి నాటక బృందం అభ్యాసం చేస్తున్నప్పుడు రాగాలు తీయటంలోనూ, హార్మనీ మీద రాగాలు తీయటంలోనూ వింతలేదు. ఆ క్షేత్రంలో బాల అనసూయమ్మ ఉత్సాహం చూసి ప్రోత్సహించి, ఆ తీగకు ఊతమ్మిచ్చి, పరిమళింప చేయటంలో ఆ ఇంటి పెద్దవారి పాత్ర కూడా ప్రముఖమే.

భావ కవిత్వం హాయిగే తీరికగే పాడుకునే కవితలు. భావ కవులకు కూడా తమ కవితలు పాడితే వినాలనే కోరిక. కృష్ణ శాస్త్రి ఒళ్లో కూర్చుని అనసూయమ్మ ఆయన రాసిన పంక్తి పంక్తికీ రాగం కట్టి పాడుతుండేదట. ఒక్కొక్కసారి ఆవిడ పాడిన తీరునుబట్టి ఆయన పంక్తులను సవరించేవారు  కూడానట. ఆయన మిత్ర బృందానికి కూడా తమ కవితలని పాడించుకోవాలనే కోరిక. దీనితో చిట్టి అనసూయకు బోలెడు నవ్య భావ కవితా సంపద ఎల్లప్పుడూ అందుబాటులోనే ఉండేది. దానికి తోడు పిఠాపురం రాజావారి ప్రాపకంలో గ్రామఫోను ద్వారా “Waltz", "Samba", "Foxtrot" మొదలైన సంగీత నృత్యాలు కూడా పరిచయమయ్యాయి. అప్పటికి భావ కవిత్వము క్రొత్తది కాబట్టి, ఆ కవితలకు సంగీత సాంప్రాదాయపు ప్రహరీ గోడలు ఇంకా ఏర్పడలేదు. ప్రోత్సాహుకులే కానీ విమర్శకులు ఇంకా ఏర్పడలేదు. సహజ సంగీత ప్రజ్ఞకు, శాస్త్రీయ సంగీత జ్ఞానం, పాశ్చాత్య శాస్త్రీయ సంగీత వాసనలు తోడయ్యి లలిత సంగీతం గుభాళించింది. దీనికి తోడు బ్రహ్మ సమాజం కోసం రాసిన గీతాలకి బాణి కట్టడం,  పిఠాపురం రాజా వారి పిల్లల పెళ్లిళ్లకు కృష్ణ శాస్త్రి కొత్త కవితలు వ్రాస్తే, వాటిని పెళ్ళిళ్ళలో పాడటం, అందుకు తనకు ఘనంగా లభించిన కానుకలు ‘అనసూయమ్మ లలిత సంగీతం’ అనే నూతన అధ్యాయనికి తోడ్పడి వృద్ధి చేసిన కారణాలు.

దేవుల్లపల్లి వారు తర తరాలుగా పిఠాపురం ఆస్థాన కవులు. వారి శుభకార్యాలకు కవిత్వం వ్రాసి వినిపిస్తూ వుండేవారు. అనసూయమ్మ గారు చెప్పిన ప్రకారం, 1929లో పిఠాపురం యువరాజా గారి పెళ్లికి, కృష్ణ శాస్త్రి కొన్ని పెళ్లి పాటలూ, కొన్ని భావగీతాలూ, అప్పగింతల పాటలూ వ్రాశారు. "పువు బంతులాడెను నేడు మన యువరాజు తన ప్రియురాలితో .." వంటి పాటలు వ్రాసి ఒక సంగీతాచార్యుడిని పిలిచారట. ఆయన కూర్చిన సంగీతం కృష్ణ శాస్త్రికి నచ్చలేదు. బాల అనసూయ ఊరికనే తనకు తాను ఆ పాటను తోచినట్లు  పాడిందట. కృష్ణ శాస్త్రి విస్తుపోయి, ఉత్సాహంగా తన స్నేహితులనందరినీ పిలిచి వినిపించమన్నాడట. ఆ తరువాత యువరాజా వారి పెళ్లిలో అన్ని పాటలు అనసూయమ్మే పాడి అందరి మెప్పు పొంది, మహారాణీ వారితో 100 కాసుల బంగారం, పరికిణీలు, పట్టు తానులూ మొదలైన బహుమతులు సంపాదించుకుంది. ఆవిడ మాటలలో "నా భావ గీతాల సంగీత ప్రవేశం, అసలు భావ సంగీతం అనే నూతన సంగీతానికి, లలిత సంగీతాల ప్రదర్శనకు మొదలు యువరాజా గారి పెళ్లి రోజే. లలిత సంగీతం పుట్టుక అదే. ఆ తరువాత భావ సంగీతాన్ని ‘లలిత సంగీతం’ అని మన వాళ్లు అంటే, హిందీ వాళ్లు ‘సుగమ సంగీత్’ అన్నారు."

ఒక సందర్భంలో కృష్ణ శాస్త్రి కవితలు లేకపోతే ఆవిడకు లలిత సంగీతం కూర్చే అవకాశం ఉండేది కాదేమో అని అన్నాను. వెంటనే "నేను పాడక పోతే, మామయ్య కవితలు పుస్తకాలకే పరిమితి అయ్యేవి" అని అనసూయమ్మ గారు అన్నారు. 1920ల నుండి 1960ల దాకా కృష్ణ శాస్త్రి కవితలకూ, గేయ నాటకాలకూ 90% పైగా సంగీతం కూర్చింది అనసూయమ్మే. అలాగే బాపి రాజు, నండూరి, కొనకళ్ల మొదలైనవారి గేయాలెన్నింటికో ఈవిడ సంగీతం కూర్చారు.

1934లో కాకినాడ పిఠాపురం కళాశాల సాంస్కృతికోత్సవాలలో అనేక భావగీతాలకు అనసూయమ్మ గారు సంగీతం సమకూర్చటం ఆవిడ జీవితంలో ఒక మైలు రాయి. అప్పటికి ఆవిడకు పదునాలుగేళ్లు. అంతకు క్రితమే చాలా కచ్చేరీలలో భావగీతాలు పాడారు. అయితే, ఆవిడ మాటలలో, "ఉద్యోగం చేసే ప్రవృత్తి లేని మామయ్యకు (కృష్ణ శాస్త్రి) ప్రిన్సిపాల్ పెద్దాడ రామస్వామి గారు ఉద్యోగం ఇచ్చారు. ఆంధ్ర దేశంలో కళాశాల సాంస్కృతికోత్సవాలు  (నేటి Annual Day, Cultrual Festival) మొదటిసారిగా జరిపారు. వాటి కార్యక్రమ బాధ్యతలు కృష్ణ శాస్త్రికి అప్పగించారు. సభకు విచ్చేసినవారందరూ మహామహులే. సర్వేపల్లి రాధాకృష్ణ , కట్టమంచి రామలింగా రెడ్డి ముఖ్య అతిధులయితే, విశ్వనాధ, మల్లవరపు, అబ్బూరి, ఇంకా ఆనాటి ప్రముఖ కవులు సభాసదులు. కృష్ణ శాస్త్రి ఆనాటి యువ కవులను కూడా పిలిచారు. వారందరి కవితలకీ సంగీతం కూర్చే భాధ్యత పడుచు అనసూయది.  చాలా పెద్ద వేదిక, చాలా పెద్ద అవకాశం. ఈ సభ కోసమే కృష్ణ శాస్త్రి "జయ జయ ప్రియ భారత .." వ్రాస్తే, అనసూయమ్మ సభను ఆవిష్కరిస్తూ  పాడారట. (సభకు ముగింపు పాట, "తెలుగు తల్లికి మంగళం .."). ఆ పాటను ఇక్కడ వినగలరు.

ఆ సాంస్కృతికోత్సవాలలో చాలావరకు భావగీతాలు అనసూయమ్మ గారే పాడారు లేకపొతే ఆవిడ నాయకత్వంలోని బృందగానం. కొన్ని పాటలు వేరే వారితో పాడించారు. కొన్ని పాటలను ఆవిడ పాడకూడదు, సంగీతం సమకూర్చి, నేర్పించి వేరే వాళ్లతో పాడించాలని కృష్ణ శాస్త్రి నియంత్రించారు. అటువంటి వాటిలోది ఒకటి "మరో ప్రపంచం, మరో ప్రపంచం ...". అప్పటికి శ్రీ శ్రీ కవితలు ప్రాచుర్యంలో లేవు. కుర్ర కవి ఒకడు వచ్చాడు, అతని కవితలు కొత్త రకంగా ఉంటాయి, ఇప్పటికిప్పుడు స్వరకల్పన చెయ్యాలి అని కృష్ణ శాస్త్రి రెండు కాగితాలు ఇచ్చారట. అనసూయమ్మకు కూడా కొత్తదనం కనిపించి, సంగీతపు బాణీలలో కాక లయ బద్దంగా చదువుతూ సంగీతం కూర్చారు. వేదిక మీద పాడబోతే కృష్ణ శాస్త్రి ఇది యువకులు పాడాలి, ఆడవాళ్లు పాడకూడదు ఎవరికన్నా నేర్పించు అని అడ్డుపడ్డారు. ఆ సమయానికి ఎవరో యువకుడికి నేర్పించి పాడించారు. “ఆ రోజులలో దానిని ‘Musical Prose’ అని అనే వాళ్లం. ఈ రోజులలో అది ‘Rap music’ అయ్యింది.” అన్నారు అనసూయమ్మ నాతో. ఆ రోజు ఈ కొత్త రకం కవితను కొత్త సంగీతంతో తనను పాడనివ్వలేదని 94 ఏళ్ల వయసులో ఆనసూయమ్మకు మేనమామ మీద కినుక. ఆ తరువాత సంవత్సరం (1935) విడుదలయిన భావగీతాల గ్రామఫోను రికార్డులో ఆవిడే పాడారు. ఆ తరువాత ప్రతి కచ్చేరీలోనూ తప్పకుండా "మరో ప్రపంచం, మరో ప్రపంచం ..." పాడేదాన్నని చెప్పారు.

ఆనసూయమ్మ చాల మంది కవితలే పాడారు. ఈ నాడు రేడియో, టీవీలలో వస్తున్న లలిత సంగీతం చాలా వాటికి సంగీతం కూర్చింది ఆవిడే. కాకపోతే, ఆవిడ పేరు మాత్రం మరుగయ్యింది. ఒక ఉదాహరణ, కొనకళ్ల వెంకటరత్నం గీతం ఆనసూయమ్మ గొంతులోనే వినగలరు.

ఆనాటి మద్రాసు డైరెక్టర్ ఆచంట జానకిరాం గారు సంగీతంలో ప్రయోగాత్మకను (Experimentation) ప్రవేశపెట్టారు. ఆయన ప్రోత్సాహంకూడా భావ సంగీతం శాస్త్రీయ సంగీత సాంప్రదాయాన్ని గౌరవిస్తూన్నే, కట్టు గోడలను దాటుకుని జన సమూహాన్ని సమ్మోహింప చేసింది. మద్రాసు AIR కేంద్రంలో మొట్ట మొదటి తెలుగు పాట అనసూయమ్మదే. ఆ తరువాత ఎన్నో వందల పాటలకు సంగీతం కూర్చారు. ఆనాటి రేడియో నాటికలకు అనసూయమ్మ కూర్చిన సంగీతం భావ సంగీతం, ఆ తరువాత లలిత సంగీతం పేరుతో పరిపూర్ణత చెందాయి. ఈ రేడియో నాటికల సంగీతం నేడు అలభ్యం. సేకరించి ప్రచురించగలిగితే బాగుంటుంది. 1947, ఆగస్టు 15న రేడియోలో "ప్రాభాత సమయాన .." అంటూ స్వాతంత్ర్య గీతాన్ని వినిపించింది అనసూయమ్మ. 1930, 40ల కాలంలో వచ్చిన మద్రాసు కేంద్రం రేడియో విద్యాపతి, అరుణ రథం వంటి సంగీత నాటికలకు ఆనసూయమ్మ కూర్చిన సంగీతం ఆవిడ భావగీత సంగీతాన్ని ఒక పరిపూర్ణ స్థాయికి చేర్చినవి. ఎక్కువగా కృష్ణ శాస్త్రి నాటికలు. విశ్వనాథ మొదలయినవారి నాటికలకు కూడా సంగీతం కూర్చారు.

-- వచ్చే సంచికలో అనసూయమ్మ జానపద సంగీతం వివరాలతో ముగింపు --

Posted in May 2019, వ్యాసాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *