Menu Close
balyam_main

సామెతలతో చక్కని కధలు

- ఆదూరి హైమావతి

వినాయకుని పెళ్ళికి  అన్నీ విఘ్నాలే

"తాతగారండీ! వినాయకునికి పెళ్ళికాలేదని నేనూ, అయిందని అక్కా వాదించుకుంటున్నాం. ఎవరి వాదన కరెక్ట్! ప్లీజ్ చెప్పరా!" అంటూ వచ్చాడు మనవడు.

తాతగారు నవ్వారు "ఓరిమనవడా! నీకేదైనా కావలిస్తే మహా మహా మర్యాదగా 'తాతగారండీ!' అంటూ వస్తావ్! సరే గానీ నీకు వినాయకుని పెళ్ళిగురించి కావాలి అంతేగా? పిలువు మీ అక్కనీ లేకపోతే ఆమె వచ్చిమళ్ళా చెప్పమంటుంది." అన్నారు. ఈలోగా మనవరాలు వచ్చి, తాతపక్కనే చేరింది.

"పిల్లలూ! మనం సీతారామకళ్యాణం మన శ్రీరాములవారి గుళ్ళో చూస్తాంకదా!, రుక్మిణీకళ్యాణం, సుభద్రా కళ్యాణం, అంటూ కొందరు గుళ్ళలోనూ, ఇళ్ళలోనూ చేస్తుంటారు. ఇలా కొన్ని చోట్ల హరికధలు వింటాం, ఐతే ఎన్నడైనా ‘వినాయకుని పెళ్ళి’ అనే మాట విన్నారా?, నేను ఒక రోజు నా చిన్నప్పుడు ఇదే ప్రశ్న మా బాబాయ్ నడిగాను. మా బాబాయ్ ఈ కధ నాకు చెప్పాడు, అదే కథ నేడు నేను మీకు చెబుతున్నాను. వినండిమరి!

వినాయకుడు తన తమ్ముడైన మురుగన్ అంటే సుభ్రహ్మణ్య స్వామి పెళ్ళి చూశాడు. మహా అందంగా అలంకరించిన తమ్ముని చూశాడు. అసలే అందగాడు మురుగ, పెళ్ళికొడుకు అలంకారంలో ఇంకా అందంగా ఉన్నాడు. అంగ రంగ వైభవంగా జరిగిన ఆ పెళ్ళి చూసి వినాయకునికి ‘తనకూ పెళ్ళైతే ఎంత బావుంటుందో కదా! ఇలా తననూ అలంకరిస్తే తానూ ఎంత బావుంటాడో కదా!’ అనిపించి, వెంటనే అమ్మైన పార్వతమ్మ దగ్గరికెళ్ళాడు. దగ్గరకు వస్తున్న పెద్దకొడుకును చూసి ఇతను ఏదో అడగనే వస్తున్నాడని అనుకుంది పార్వతమ్మ.

“అమ్మా! తమ్ముడి పెళ్ళి చేశావ్! మరి నా పెళ్ళెప్పుడు చేస్తావ్?” అని నిలదీశాడు.

పాపం పార్వతమ్మ దిగాలుగా తన ముద్దుల కొడుకు వైపు చూసింది. లోలోపల బాధ పడింది. 'వాడైతే ఎంతో అందంగా ఉండటాన పిలిచి పిల్లనిచ్చారాయె! మరి నీవేమో ఏనుగు తలతో, పొడవాటి తొండంతో, చెప్పినా వినక భక్తులు అందరూ పెట్టిన కుడుములూ ఉండ్రాళ్ళు, వడపప్పు తిని, తిని, పానకం తాగి తాగి బొజ్జపెంచావాయె! నీకు పిల్ల నివ్వను ఎవరూ ముందుకు రారు నాన్నా!' అని మనస్సులో బాధపడింది. ఆమాట చెప్తే కొడుకు బాధపడతాడని మెల్లిగా దగ్గరకు తీసుకుని ఇలా చెప్పింది.

"మరే! నీ పెళ్ళి ఎంతలో చేస్తాను నాన్నా! నీ వెళ్ళి పెళ్ళి కూతురికి ఒక కొత్తకోక, మంగళ సూత్రాలూ పట్టుకురా! నేనీలోగా పిల్లను చూస్తాను. నిముషంలో నీ పెళ్ళి జరిగిపోతుంది" అని బుజ్జగించి పంపింది.

వినాయకుడు వెంటనే ఆనందంగా తన ఎలుక వాహనమెక్కి భూలోకానికి వచ్చి, తిరిగి తిరిగి అలసిపోయి, ఒక చెట్టు క్రిందున్న అరుగు మీద కూర్చున్నాడు. ఇంతలో అక్కడ పడి ఉన్న గింజలు ఏరుకు తినను ఒక కోడి పుంజు అక్కడికి వచ్చింది. వినాయకుడు దాన్ని చూసి ‘దొరికింది బంటు’ అనుకుని ఆనందించాడు.

"ఓ కోడిపుంజూ, ఓమారిలారా" అని పిలవ గానే, తనను ఇలా పేరుపెట్టి పిలుస్తున్నదెవరాని చూడగా, అక్కడ వినాయకుడు ఉండటంతో గభాల్న దగ్గర కొచ్చి చేతులు ముడిచి, నమస్కరించి,

"చెప్పండి స్వామీ! నన్ను పిలిచారెందుకూ? ఇలా నా పేరుపెట్టి తొలి సారిగా పిలిచింది మీరే! ధన్యవాదాలు" అని అడిగింది కోడిపుంజు.

"ఓహో! కోడిపుంజూ! నీ రెక్కలెంత అందంగా ఉన్నాయ్! ఎన్ని రంగులు న్నాయి. నీ జుట్టు నా కిరీటంలా ఎంత బావుంది? నీ ముందు నెమలి బలాదూర్! నీవు చాలా చక్కగా చెప్పిన పనిచేస్తావనీ, సమయపాలన చేస్తావనీ అందరూ అంటుంటారు కదా!! నీవు కూయందే తెల్లవారదుకూడానూ! నాకో కొత్తకోక తెచ్చిపెట్టు, మా అమ్మనాకు పెళ్ళి చేస్తుందిట!" అనగానే, తనను పొగిడినందుకు సంతోషించినదై కోడిపుంజు, "దాందేముంది స్వామీ! ఒక్కనిముషంలో పెద్దబజారు కెళ్ళి వినాయకుని పెళ్ళికి కొత్తకోక కావాలని తెచ్చేస్తాగా స్వామీ! మీరేం కంగారు పడకండి, మీ పేరు చెప్తే కాని పనేముందీ!” అని వేగంగా వెళ్ళిపోయింది.

వినాయకుడు ఒక పనౌతున్నందుకు సంతోషించాడు.

ఇంతలో అక్కడ మొలిచి ఉన్న పచ్చగడ్డిని తినడానికి ఒక గొర్రె పోతు అక్కడికి వచ్చింది. దాన్నిచూసిన వినాయకుడు, 'ఈ రోజు అన్నీ మంచి శకునాలే! నేను తిరగ కుండా అన్నిపనులూ పూర్తవుతున్నాయని సంతోషించాడు.

“ఓ గొర్రెపోతా! నీవు తలవంచుకుని గడ్డి మేస్తుంటె ఎంతో అందంగా ఉన్నావు. నీవు మహా బుధ్ధిమంతురాలివి కదా! ఎప్పుడూ తలవంచుకుని ఎంతో వినయంతో వుంటావు. నాకో పనిచేసి పెడతావా? మా అమ్మ నా పెళ్ళి చేస్తున్నది! దాని కోసం నీవు కంసాలి దగ్గర కెళ్ళి మంగళ సూత్రాలు తీసుకు రావాలి" అని చెప్పగానే,

గొర్రెపోతు "ఓహో! మాకు పప్పన్నం దొరుకుతుందన్నమాట! అదెంతపని! ఇదిగో ఇప్పుడే వెళ్ళి తెస్తాను స్వామీ! మీరడిగారని చెప్పి బంగారు బజార్లోని కంసాలి వద్ద కెళ్ళి పట్టుకురానూ. మీ పేరు చెప్తే కానిదేముంది?" అంటూ వెళ్ళింది!.

సాయంకాలమైంది, కానీ, కోడిపుంజు, గొర్రెపోతు రెంటి జాడా కనపడలేదు. వినాయకుడు మెల్లిగా ఎలుక వాహనమెక్కి వాటిని వెతుక్కుంటూ బయల్దేరాడు.

కొంత దూరంలో కోడిపుంజు కనిపించింది! "ఏమే! కోడిపుంజూ! నా కొత్త కోకెక్కడ!" అని అడిగాడు కాస్త చిరాగ్గా.

"స్వామీ! మీ కొత్తకోక తీసుకు వస్తుండగా నాకు జొన్నకంకి కనిపించగా ఆకలేసి తిని తెద్దామని కొత్త కోకను పక్కన పెట్టి కంకి తిని చూస్తును గదా! కోకలేదు. దాన్ని వెతుకుతూ మధ్యాహ్నం నుండీ తిరుగుతూనే ఉన్నానయ్యా!" అని చెప్పింది.

"చూడూ! కోడిపుంజూ, నీవు కొత్తకోక తీసుకువస్తేనే నా పెళ్ళి. పెళ్ళికూతురికి పెట్టాలి కదా! అమ్మ చెప్పింది. త్వరగా వెళ్ళి వెతుక్కురా! లేకపోతే నా వాహనమైన ఎలుక చేత నిన్ను కొరికిస్తా? జాగ్రత్త!" అని బెదిరించాడు.

కోడిపుంజు 'కొత్తకోకో--కొత్తకోకో' అని అరుచుకుంటూ, ఈనాటికీ కొత్తకోక కోసం వెతుకుతూనే ఉంది! ఆ అరుపు మనకు 'కొక్కొరోకో' అన్నట్లు వినపడుతుంది.

ఇహ వినాయకుడు ఆ బజారూ ఈ బజారూ తిరగ్గా, గొర్రెపోతు కనిపించింది. వెంటనే వినాయకుడు కోపంగా "ఏయ్ గొర్రె పోతూ! నా తాళి బొట్టెక్కడ?” అనగానే "స్వామీ! మీరడిగినట్లు చెప్పగానే కంసాలి కనకయ్య తాళి బొట్టు ఇచ్చాడయ్యా! ఆకలేసి ఆ సజ్జ చేలో గడ్డి తింటుండగా ఎవరో ఆ తాళి బొట్టు కాజేశారయ్యా!" అని భయపడుతూ చెప్పింది గొర్రెపోతు.

వినాయకునికి మహా కోపంవచ్చి "నీవు తాళి త్వరగా వెతికి తెచ్చివ్వు, నా పెళ్ళి జరగాలంటే ఆ తాళి కావాలి, లేకపోతే నిన్ను నా ఎలుక చేత కరిపిస్తాను జాగ్రత్త!" అని హుంకరించాడు.

"అట్టాగే స్వామీ ! వెతుక్కుని వేగంగా తెస్తాగా!" అని గొర్రెపోతు వెళ్ళిపోయింది. ఆనాటి నుండీ ఈనాటి వరకూ తాళి కోసం, వంచిన తలెత్తకుండా వెతుకుతూనే ఉంది, కానీ, ఈ రోజు వరకూ అటు తాళి కాని, ఇటు కొత్త కోక గానీ రానందున వినాయకుని పెళ్ళి జరగనే లేదు! అందుకే ఎవరైనా ఏదైనా పని మొదలుపెట్టి విఘ్నాలు కలిగి ఆగిపోతుంటే 'వినాయకుని పెళ్ళికి అన్నీ విఘ్నాలే' అన్నట్లు మీ పనులు కావడమే లేదు’ అని అంటుంటారు. అలా ఈ సామెత పుట్టింది.

పిల్లలూ! మీకేమైనా ‘కొత్తకోక ’ కానీ ‘తాళిబొట్టూ’ కానీ కనిపిస్తే వాటి కివ్వండి! వినాయకుని పెళ్ళికి మనమూ వెళదాం, కావల్సినన్ని కుడుములూ, ఉండ్రాళ్ళూ తెగతిందాం. పాపం అప్పటి నుండీ వినాయకుని పెళ్ళి జరగనే లేదు ‘వినాయకుని పెళ్ళికి అన్నీ విఘ్నాలే’ అని అంటున్న తాతగారి మాట పూర్తవ్వగానే అక్కా తమ్ముడూ ఒకరిని ఒకరు వెక్కిరించుకుంటూ చివ్వునలేచి పరుగెత్తారు.

1 Comment

  1. Anupama Dasam

    Very Cute Story and came to know the meaning of that quotation ‘‘వినాయకుని పెళ్ళికి అన్నీ విఘ్నాలే’,thanks for publishing in this website.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *