Menu Close

వీక్షణం సాహితీ గవాక్షం - 74

- విద్యార్థి

Vikshanam

వీక్షణం 74వ సమావేశం శా.శ. ౧౯౪0 ఆశ్వీయుజ పంచమి నాడు, (అక్టోబరు 14, 2018) నాడు, శ్రీ పెద్దిభొట్ల ఇందు శేఖర్, లావణ్య గార్ల గృహము నందు జరిగినది.

ఈ సభకు అధ్యక్షత వహించిన ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారు  ప్రసంగిస్తూ “Myth అనే మాటకు తెలుగులో మిథ్య అనే మాటకు సరి పోలికలున్నవి. హిందీలో మిథిక అనే వాడుక ఉంది. ప్రపంచములోని ఎక్కడి మిథాలజీ కథలు అయినా, మనిషి ఎక్కడ ఉన్నా ఆలోచనలు ఒక్కటే అనేటట్లు ఋజువు చేస్తాయి. గ్రీకు మిథాలజీ కథలు కూడా అటువంటివే" అని చెప్పి, ప్రాచీన గ్రీకు కావ్యాలను సభకు పరిచయం చేయటానికి ఆసూరి వేణు గారిని ఆహ్వానించారు.

వేణు గారి ప్రసంగ విశేషాలు - "ప్రాచీన గ్రీకు కావ్యాలు, ఇలియడ్, ఒడిస్సేలు మన రామాయణ మహాభారతాలని పోలి ఉంటాయి. వీటి రచయిత హోమర్. సుమారు సామాన్య శక పూర్వం 6వ శతాబ్ది కి చెందినవాడు. హోమర్ అనాథ, పైగా అంధుడు. వాల్మీకిలాగా ఆనాటి కుల వ్యవస్థలో ఉన్న కష్టాలను అధిగమించి, ఉన్నతమైన సాహిత్య రచన చేసిన మహనీయుడు. ఇలియడ్‌లో ఉన్న పంక్తుల సంఖ్య 24,000. రామాయణ భారతాలు లక్షకు పైగా శ్లోకాలు కలవి. ఆ రకముగా చేస్తే ఈ గ్రీకు గ్రంథాల విస్తీర్ణం తక్కువే. కాని అవి చెప్పే కథకు మన రామాయణ భారతాలకు పోలిక ఉన్నది. ఉదాహరణకు, సీతాపహరణం వలన రామాయణం కథ నడిస్తే, హెలెన్‌ని అపహరిస్తే సాగిన కథ ఇలియాడ్. ఈ కథలోని ఎఖిలీస్, యుద్ధము చేయనని అలగటం, భీష్ముడు ఉండగా తాను యుద్దము చేయనని అలిగిన కర్ణుడిని తలపిస్తుంది. అలాగే, ట్రాయ్ రాజు ప్రియాం దృతరాష్ట్రుడిని పోలి ఉంటాడు." అని విశ్లేషించారు.

తరువాత, శ్రీ అక్కిరాజు రమాపతి రావు గారు తెలుగు భాషకు తగ్గుతున్న ప్రాశస్త్యం గురించి ఉపసన్యసిస్తూ  ఎల్లాప్రగడ సుబ్బారావు వంటి గొప్పవారు అమెరికా వచ్చినా, తెలుగులో పలు రచనలు చేసేవారు. అలాగే ఇక్కడి తెలుగువారు, తెలుగు రచనలు చేయాలని, సమావేశంలోని సభికులకు బోధించారు.

కథా పఠనం కార్యక్రమంలో నెల్లూరు జిల్లా రచయితల సంఘం కార్యదర్శి, ప్రముఖ రచయిత్రి శ్రీమతి పాతూరి అన్నపూర్ణ గారు కాలమహిమ, బహుమతి అనే కథలు చదివారు. కాలమహిమ అనే కథ సైన్స్ ఫిక్షన్ కథ, 2080 సంవత్సరములో జరిగే పరిణామాలు గురించి చర్చించారు.

శ్రీమతి దమయంతి గారు కె.వి. రమణ గారి కథలని పరిచయం చేస్తూ, "రమణ గారు 2016 చా.సో.అవార్డు గ్రహీత. రమణ గారి కథలు దృశ్యాత్మకమైనవి. మనిషి నుంచి మనిషి ఏమి నేర్చుకుంటున్నాడు అనే విషయ ప్రస్తావన చక్కగా ఉంటుంది అని విశ్లేషించి, పుట్టిల్లు, ఆడదరి మొదలైన కథలని క్లుప్తంగా వివరించారు. ఒక చారిత్రక ఘట్టాన్ని జానపదులు మౌఖికంగా కొనసాగిస్తే వీరు "ఆడదరి" కథ రూపంలో పొందు పరిచారు. ఒక రాజు ఇంకొక రాజును ఓడించాడు అనేది మాత్రమే చరిత్ర కాదు. ఇటువంటి కథలు చాలా ముఖ్యం. అమెరికాలో ఇటువంటి జానపద ఘట్టాలు నాకు వెదికినా అంతగా దొరకలేదు. తెల్లవాళ్లు ఇక్కడి ఆదిమ జాతులను చంపి వేయటం, మత ప్రచారమంటూ వాళ్ల సాంస్కృతిని అపహరించటం వంటి వాటితో ఈ జానపద ఘట్టాలు అంతరించి పోయాయేమో. ఉదాహరణకి నయాగరా ఫాల్స్, గ్రాండ్ కాన్యన్ వంటి వాటి చుట్టూ కథలు లేకుండా ఉండవు. కానీ ఎక్కడా వినపడవు.” అని వివరించారు.

కిరణ్ ప్రభ గారి క్విజ్ కార్యక్రమం ఎప్పటివలనే ఉత్సాహముగా జరిగినది.

ఆఖరుగా, ఆసక్తిగా జరిగిన కార్యక్రమం లలిత సంగీతం. ఇందులో పాల్గొన్న వారు - పాడిన పాటలు

  1. శ్రీమతి సుభద్ర - పాలగుమ్మి విశ్వనాథం గారి "అమ్మదొంగా, ఎంత బెంగ ..."
  2. శ్రీ పాతూరి తారక రాం - దసరా సందర్భముగా, "శృతి నీవు, గతి నీవు ..."
  3. డా|| కె.గీత - కృష్ణశాస్త్రి "అలికిడయితే చాలు ..."
  4. శ్రీమతి దమయంతి - "మానస సంచరరే ...."
  5. శ్రీమతి లావణ్య, వారి పిల్లలతో కలసి - "దక్షిణా మూర్తి.."

ఆద్యంతం అత్యంత ఆసక్తికరంగా జరిగిన ఈ సమావేశంలో సాహిత్యాభిలాష కలిగిన స్థానిక ప్రముఖులతో కలిసి సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డా|| కాత్యాయని విద్మహే కూడా పాల్గొన్నారు.

Posted in November 2018, వీక్షణం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!