Menu Close
వీక్షణం సాహితీ గవాక్షం -106 వ సమావేశం
వరూధిని
vikshanam-106

వీక్షణం-106 వ సమావేశం ఆన్ లైన్ సమావేశంగా ఆసక్తిదాయకంగా జూన్ 13, 2021 న జరిగింది. ఈ సమావేశంలో కా.రా. మాస్టారికి నివాళి గా "కాళీపట్నం రామారావు గారి కథలు" అనే అంశమ్మీద శ్రీమతి కొండపల్లి నీహారిణి గారి ప్రసంగం,  కవిసమ్మేళనం జరిగింది.

ముందుగా నీహారిణి గారు మాట్లాడుతూ కథానిలయం రూపకర్త, కథలకు చిరునామా కారా మాస్టారు గారి గురించి వీక్షణం లో మాట్లాడే అవకాశం కలగడం సంతోషదాయకమైన విషయం అని పేర్కొంటూ "ఎప్పుడో చదివిన కారా గారి కథలను మళ్ళీ ఇప్పుడు చదివి మరింత లోతుగా వారిని అర్థం చేసుకున్నాను" అన్నారు.

కాళీపట్నం రామారావుగారి కథల గురించి వివరిస్తూ "కవి క్రాంతదర్శి అనడం బహుశా: ఇటువంటి గొప్ప రచయితలు ఉంటారనే నిర్వచించి ఉంటారు మన పూర్వీకులు. ఇంతలా మనసుపెట్టి సమాజాన్ని పరిశీలించి, మంచి చెడులను కథలుగా మలిచిన కథా రచయితలు బహుతక్కువగా ఉన్నారు.

కాళీపట్నం రామారావుగారు కథలను అల్లలేదు. కథలలో జీవితాలను చూపించారు. మనుషుల అసలు నైజం ఎట్లా ఉంటుందో, అది ఎదుటి వారిపై ఏ విధంగా ప్రభావితం చేస్తుందో భూతద్దంలో చూపించారు. ఇది ఒక జాగరూకతను, ఒక తెలివిడి తనాన్ని నేర్పిస్తుంది. అందుకే వీరి కథలు చదవాలి. స్వార్థం, సంకుచితత్వం, దగాకోరుతనం, తొందరపాటుతనం కల మనుషులు ఎట్లా మనచుట్టూ ఉంటారో వీరి కథలు చెబుతాయి. ఇది హెచ్చరిక! ఇంతకన్న గొప్ప విధానమేమి ఉంటుంది బ్రతుకును సవరించుకో అని చెప్పడానికి? ఏఏ కాలానికి తగినట్టు ఆయా కథలున్నాయి. 40 వ దశకం లో అశిక్ష - అవిద్య, పెంపకపు మమకారం వంటి కుటుంబ సంబంధాల నేపథ్యం తో రాసిన కథలు గొప్ప కథలు. చిన్న చిన్న విషయాలనే పెద్దగా చేసి కుటుంబ కలహాలకు ఎట్లా దారి తీస్తారో చూపారు. అట్లే బయట ఎంగిలికి కక్కుర్తి పడితే ఎలా రోగాలపాలైతారో చూపారు. అరవైలలో ‘ఆదివారం’ కథ ఆలోచనాత్మకమైన కథ! తర్వాత కాలంలో రాసిన కథలు ఉన్నవారికి లేనివారికి మధ్యనున్న సన్నని గీత ఏదో పాఠకులకు చూపే కథలు. పీడితుల పక్షాన పిడికిలెత్తే కథకులౌతారు. తీర్పు, జీవధార, కుట్ర, చావు, ఆర్తి, చావు, యజ్ఞం వంటి కథలు ఈ కథలు. ఈ కథలలో సత్యాన్ని పేదల పక్షాన నిలబెట్టారు. ఈ సత్య నిరూపణ చేసే బాధ్యత మేధావులదే అన్నట్టు కొత్తదనంతో రాసారు. ఇదే తర్వాత తరం వారికి ఒక దిక్సూచి అనేంతగా గొప్ప భావనా బలంగా అయ్యింది.” అంటూ "కారా గారి కథలలో భౌగోళిక, విషయ విజ్ఞాన విశేషాలు ఉంటాయి. అట్లాగే రాజకీయ చారిత్రక ఆధారాలు ఉంటాయి. ప్రభుత్వాల పథకాలు, ఉద్యోగుల పనితీరు ఉంటుంది. గొప్పవాళ్ళ లో చాలా గొప్పవారు ఎలా ఉంటారో కడు పేదలు, నిరుపేదలు అట్లే ఉంటారు అని అంటారు. పూరి గుడిసెల, మాల వాడల వెలి జీవితాలను అత్యంత సహజంగా చిత్రించారు. ఆ ఇండ్లల్లోనే పుట్టి పెరిగిన వారేమో ఈ కథా రచయిత అని అనుకునేలా భాషను ప్రయోగించారు. ఎంతో ప్రేమ ఉండాలి ఆ బడుగు జీవులమీద. అప్పుడే అంత స్వచ్ఛందంగా రాయగలుగుతారు. పలుకుబళ్ళు, నుడికారపు సొగసుల పదాలు, సామెతలు కథలలో కనిపిస్తుంటాయి. పాత్ర చిత్రణ ఎంత హృద్యంగా ఉంటుందో సన్నివేశ కల్పనలు, సంభాషణా చాతుర్యమూ అంత హృద్యంగా ఉంటాయి. కథకు తగిన ముగింపు ఇవ్వడం తో కారా గారు మనసున్న పాఠకులను ఆలోచనల్లో పడవేస్తారు. “జీవితంలో సమస్యలను, ఆ సమస్యలకు కారణాలను తెలియజేసేదే మంచి కథ” అని గొప్ప నిర్వచనాన్ని ఇచ్చిన కాళీపట్నం రామారావు గారికి ఇది అక్షర నివాళులు." అని ముగించారు.

ఆ తర్వాత జరిగిన కవి సమ్మేళనం లో డా|| కె.గీత "అబ్బాయి ఇల్లు" కవితను, శ్రీమతి భవాని "మనవడా", శ్రీమతి నీహారిణి "సందేహ జీవనం" అనే కవితను,  శ్రీమతి గునుపూడి అపర్ణ "సద్గుణ సంపద" అనే కవితల్ని చదివి వినిపించారు.

ఆద్యంతం ఎంతో ఆసక్తిదాయకంగా జరిగిన ఈ సభలో ఆసక్తి కలిగిన స్థానిక ప్రముఖులు పాల్గొని సభను జయప్రదం చేశారు.

వీక్షణం-106 వ సమావేశాన్ని "వీక్షణం" యూట్యూబు ఛానలులో ఇక్కడ చూడవచ్చు. https://youtu.be/TkFKjoWP8T4

Posted in July 2021, వీక్షణం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *