Menu Close
సామెతలతో చక్కని కధలు
- ఆదూరి హైమావతి
ఉన్నలోభి కన్నా లేనిదాత మేలు

"బామ్మా! బామ్మా! నేనూ నీతోపాటు ఆలయానికి రానా?" అంటూ వచ్చింది వసంత. ఆలయానికి పూల సెజ్జతో బయల్దేరిన బామ్మ దగ్గరకు వచ్చి.

"అలాగే రా వసూ! ఐతే నేను ముందుగా మా స్నేహితురాలి మనవరాలి పుట్టినరోజు పండుగకు వెళ్ళి ఆ తర్వాత ఆలయానికి వెళ్ళి వస్తాను. వచ్చేసరికి మధ్యాహ్నం అవుతుంది. నీకు ఓపిక ఉంటే రా! వెళదామని తొందరచేయకు. అలా ఐతేనే రా, లేకపోతే మీ తాతగారితో కలసి కూర్చుని పుస్తకాలు చదువుకో." అంది బామ్మ.

మూడు రోజులక్రితమే బామ్మ గారి ఊరికి సెలవులకు వచ్చిన వసంతకు ఊరంతా చూసి ఫోటోలు తీసుకుని తన స్నేహితులకంతా చూపాలనే కోరిక.

"అలాగే బామ్మా! నేనేమీ తొందరపెట్టను. చుట్టూ కనిపించే వంతా ఫోటోలు తీసుకుంటాను. సరేమరి" అంటూ బయల్దేరింది బామ్మతో కలసి వసంత.

వసంతకు పల్లెలన్నా, అక్కడి వాతావరణమన్నా చాల ఇష్టం. నగరాల్లో ఉండి ఉండీ వాటిమీద విరక్తి కలిగింది వసంతకు.

పల్లెల్లో పశువులూ, వాటి అరుపులూ, బండ్ల శబ్దాలూ, ఉదయాన్నే పాలు పితికే శబ్దమూ, బానల్లో కవ్వంతో వెన్న చిలికే సంగీత నాదం లాంటి శబ్దం వసంత కెంతో ఇష్టం. సెలవు లివ్వగానే గువ్వలాగా వచ్చి బామ్మ ఇంట్లో వాలిపోతుంది. వంటామె అడిగిన వన్నీ చేసిపెడుతుంది. భలే ఉంటుంది వసంతకు బామ్మ ఇంట్లో. అంతా గారాబం చేస్తారు.

అది చిన్న టౌన్ లా ఉంటుంది కానీ నగరం కాదు. పెద్ద పల్లె మాత్రమే. బంగారం పండే పొలాలున్న పల్లె. చాలావరకూ ధనికులైన రైతులుంటారు. వ్యాపారులూ ఉంటారు.

చుట్టూ కనిపించే దృశ్యాలను ఫోటోలు తీసుకుంటూ బామ్మతో కలసి వెళ్ళసాగింది వసంత.

బామ్మ స్నేహితురాలి ఇంటి ముందు నగరం నుంచీ తెచ్చిన షామియానాలు, కుర్చీలు వేసి ఉన్నాయి. అంతా హడావిడిగా ఉంది, లోపల నుంచీ మంత్రాలు వినిపిస్తున్నాయి, ముక్కు అదిరేలా వంటల వాసనలూ  వస్తున్నాయి.

దూరంగా చెట్టుక్రింద బట్టలున్నాయా లేవా అన్నట్లు ముఖ్య మైన అవయవాలను మాత్రం కప్పుకున్న వృధ్ధ మహిళలూ, ముసలి పురుషులూ, అన్నంతిని ఎన్నాళ్ళైందో అన్నట్లున్న పసి పిల్లలూ ఉన్నారు. అంతా ఆ ఇంటికేసే చూస్తున్నారు. వారినంతా ఫోటోలు తీసుకుంది వసంత.

బామ్మతో లోపలికెళ్ళి చుట్టూ పరిసరాలన్నీ ఫోటోలు తీసుకుంటున్న వసంత, బామ్మ పిలవడంతో దగ్గరకెళ్ళి వారిచ్చిన ప్రసాదం సంచి తీసుకుని బామ్మతో బయటి కొచ్చింది.

బామ్మ ఎవ్వరి ఇళ్ళలోనూ భోజనం చేయదు. తాంబులం మాత్రం పుచ్చుకుని వచ్చింది. ఇంతలో లోపల భోజనాలు వడ్డిస్తున్న హడావిడి మొదలైంది. బయట బిచ్చగాళ్ళు కూడా కాస్త ఉన్న చోటునుంచి కదిలారు.

బామ్మతో ఆవీధి చివర ఉన్న ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్ళి బామ్మ పూజ చేయిస్తుంటే తాను ఫోటోలు తీసుకుంటూ స్వామికి మొక్కుకుని, ప్రసాదం తీసుకుని బయటికి వచ్చారు ఇరువురూ. ప్రతి వారం గుడి మెట్లమీద ఉండే బిచ్చగాళ్ళు ఒక్కరూ కనపడక పోవటాన, బామ్మను అడిగింది వసంత. "అంతా అక్కడ ఫంక్షన్ జరుగుతున్నది కదా! ఇంతన్నం దొరుకుతుందని వెళ్ళినట్లున్నారు వసంతా!." అంది బామ్మ. ఇద్దరూ నడుచుకుంటూ ఆ ఫంక్షన్ జరుగుతున్న ఇంటి ముందునుంచి నడవసాగారు.

వసంత మాత్రం ఫోటోలు తీస్తూనే ఉంది, కనిపించిన దృశ్యాన్నంతా. ఇంతలో లోపలినుంచి ఒక తట్టలో అంతా తిన్నాక ఎత్తేసిన ఎంగిలి విస్తరాకులు తెచ్చి గుట్టపోసారు. బిచ్చగాళ్ళంతా ఎగబడి ఎవరికి అందిన ఆకులు వారు తెచ్చుకుని వాటిలో లోపల పొట్టనిండా తిని ఎక్కువై పారేసిన పదార్ధాలను గీరి పోగు చేసుకుని తినసాగారు. ఆ దృశ్యాలన్నీ ఫోటోలు తీస్తున్న వసంత కు ఒక దృశ్యం వింతగా అనిపించి బామ్మను అడిగింది.

"బామ్మా! అంతా కడుపుకాలే బిచ్చగాళ్ళే, ఐతే అటుచూడు ఆ పదేళ్ళ పిల్ల తాను సంపాదించిన ఎంగిలి భోజనం దూరంగా నడవలేని ఆ కుంటి ముసలామెకు పెడుతున్నది. ఇంత ధనికులై ఇంత పెద్ద ఎత్తున పుట్టినరోజు పండుగ చేసుకుంటూ ఈ పేదలకు ముందుగా కాస్త అన్నం, పులుసు పోసినా ఆనందంగా తినేవారు కదా! బామ్మా! లోపలవారికి ఇంత ఎక్కువ వడ్డించి వారు పారేసిన అన్నం ఇలా బయట పడేయకపోతే వీరికి పెట్టవచ్చుకదా! చాలా బాధగా ఉంది బామ్మా!" అంటూ వసంత, ఇందాక వారు ఇచ్చిన ప్రసాదం సంచి, గుళ్ళో ఇచ్చిన ప్రసాదం అక్కడ, అందరితో పోరాడి తిండి సంపాదించలేని ఒక ఐదేళ్ళ పిల్లవాడికి ఇచ్చింది. వాడు రివ్వున పరుగెట్టి వెళ్ళి అక్కడ దూరంగా ఉన్న ఒక పండు ముసలితాతకు పెట్టడం చూసి వసంత కళ్ళు చెమ్మగిల్లాయి.

"మంచి పనిచేశావు వసూ! అందుకే నేను తిరగతిప్పి అంటున్నాను 'ఉన్న లోభి కన్నా, లేని పేద మేలని'. తనకు దొరికిన పదార్ధం తాను తినకుండా నడువలేని ఆ ముసలామెకు, నీవిచ్చిన ప్రసాదం ఆ ఐదేళ్ళ పిల్లాడు ఆ పండు ముసలికి పెట్టడం ఆ పసివారి గొప్పదనం కాదంటావా వసూ! ధనం కాదు కావలసింది, మంచి మనసు వసూ!."

"బామ్మా! వచ్చేవారం వచ్చే తాతగారి పుట్టినరోజుకు మనం కేవలం ఈ బిచ్చగాళ్లకే భోజనం కడుపునిండా లడ్డూ, వడా, పాయసం, పులిహోరతో పెడదాం. బామ్మా!" అంది వసంత.

"తప్పకుండా! వసూ! నీవు చె ప్పడం చేయకపోడమూనా!" అంటూ మనవరాలిని ముద్దాడింది బామ్మ .

తిన్నంత తిని పారేయడం ఎంత ద్రోహం. అన్నం పర బ్రహ్మ స్వరూపం అంటామే! మరి ఇలా ఫంక్షన్ లో అంతంత పారేయడం దైవాన్ని చిన్న చూపు చూసినట్లేకదా! మరో జన్మంటూ ఉంటే వీరికి అన్నం పుడుతుందా!' అని మనస్సులో అనుకుంది వసంత.

Posted in March 2021, బాల్యం

1 Comment

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!