Menu Close
సామెతలతో చక్కని కధలు
- ఆదూరి హైమావతి
త్రిశంకు స్వర్గం లాగా

అనగనగా అనంగ రాజ్యాన్ని అమరసేనుడనే రాజు పాలించేవాడు. ఆయన ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకునే వాడు, ఆయనకు ఒక కుమారుని తర్వాత చాలా కాలానికి ఒక కుమార్తె కలిగింది.

వీరసేనుడు, విమలావతి అని వారిపేర్లు. ఇద్దరూ చాలా తెలివైన వారూ, అందమైన వారే కాక, కరుణ, దయ, జాలి కల వారు. ఇరువురూ చాలా స్నేహంగా ఉండేవారు. ఒకరిపై ఒకరికి చాలా అనురాగం ఉండేది. ఒకరిని వదలి ఒకరు ఉండలేకపోయేవారు.

తల్లి కమలారాణి వారికి అనేక చారిత్రాత్మక కథలు చెప్పేది. ఇంటివద్ద కాస్త విద్య నేర్చుకున్నాక కుమారుని గురుకులానికి విద్యలకోసం పంపాడు అమరసేనుడు. కుమార్తె చిన్నదే కావటాన అంతఃపురంలోనే విద్య నేర్చుకునేది. యువరాజు విద్య పూర్తై అంతఃపురానికి వచ్చాడు.

ఆ రోజు ఒక సంఘటన జరిగింది. ఇరువురూ అంతఃపుర ఉద్యాన వనంలో పరుగులు తీస్తూ ఉండగా ఉన్నట్లుండి కుమారి విమలావతి పడిపోయి, కాళ్ళు మెలిపడ్డాయి. వెంటనే మహారాజు రాజ వైద్యుని పిలిపించి, వైద్యం చేయించారు. ఎన్ని మాసాలు వైద్యం చేసినా ఫలితం కనిపించ లేదు. కుమార్తె వైద్యం గురించిన ఆలోచన మహారాజును కుంగదీయసాగింది.

మహామంత్రితో ఆలోచించి ఎవరైనా మహిళా గురువు రాకుమారికి విద్య, వైద్యం చేయగలవారు లభ్యమైతే బావుంటుందని రాజ్యమంతా చాటింపు వేయించారు. ఆమెను అంతః పురంలోనే ఉంచుకుని విద్య బోధిస్తూ వైద్యం చేయవచ్చనీ మహారాణి కూడా భావించింది. పురుషులకు అంతఃపుర ప్రవేశం లేనందున మహిళలే అవసరమైనందున ఒకమాత్రానికి ఎవ్వరూ లభించ లేదు.

ఆ నగరంలో అడవికి సమీపాన ఉండే ఒక చిన్న గ్రామంలో ఒక వైద్య కుటుంబం ఉండేది. ఆ కుటుంబాన్ని అంతా ధన్వంతరీ కుటుంబం అని పిలిచేవారు. ఆ కుటుంబంలో అంతా విద్య, వైద్యం పేదలకు ఉచితంగా అందించేవారు. అడవి మూలికలతో మందులు తయారు చేయించేవారు. పేద వారంతా అక్కడే విద్య నేర్చుకుంటూ వైద్యం కూడా నేర్చుకునే వారు. మధ్యలో ఆ ధన్వంతరీ గృహం చుట్టూతా విద్యార్ధులు తమకు తామే నిర్మించుకున్న తాటాకుల పాకలూ ఉండేవి. రోజంతా అక్కడ హడావిడే. వేదోఛ్ఛారణ, మందులు నూరే శబ్దాలతో మహా పవిత్రంగా ఉండేది.

వైద్యంకోసం వచ్చి నడవలేని తన కుమార్తెకు కాలు నయమై నడుస్తున్న ఒక బాలిక తల్లి యువరాణి కాలి చికిత్స గురించి చెప్పగా విని, మహారాజు పరిపాలనలో తామంతా హాయిగా జీవిస్తున్నాం కనుక ఆమెకు ఎలాగైనా నయం చేయాలని ధన్వంతరి భావించి, తన వైద్యాలయాన్నీ, విద్యాలయాన్నీ కుమారులకూ, భార్యకూ అప్పగించి తన పద్దెనిదేళ్ళ కుమార్తెను తీసుకుని నగరానికి బయల్దేరాడు.

వెళ్ళి మహారాజు దర్శనం చేసుకుని విషయం చెప్పాడు. మహారాజు ముక్కు పచ్చలారని ఆ పద్దెనిమిదేళ్ళ యువతి రాజవైద్యులకు సైతం అసాధ్యమైన వైద్యం ఎలా చేయగలదని అనుమానించాడు.

ధన్వంతరి "మహారాజా! మేము ధనంకోసం కానీ కీర్తి కోసం కానీ ఆరాటపడుతూ రాలేదు. మా దేశాన్నేలే మహారాజు కుమార్తెకు వైద్యం చేసి నయం చేయాలని వచ్చాము. నా కుమార్తె నాలాగే వైద్యం చేయగల సమర్ధురాలు, సందేహించకండి. ప్రయత్నించనివ్వండి. కాకపోతే వెనక్కు తీసుకెళతాను." అన్నాడు.

మహారాజు అంగీకరించి అంతఃపురంలో ధన్వంతరి కుమార్తె మహేశ్వరికి వసతి కల్పించి వైద్యం చేయడానికి అనుమతించాడు. ధన్వంతరి సెలవు తీసుకుని తన గ్రామం వెళ్ళిపోయాడు.

మహేశ్వరి యువరాణి విమలావతి తో ముందు స్నేహం కలుపుకుంది, నవ్వుతూ, నవ్విస్తూ మాట్లాడుతూ మెల్లిగా తన మూలికలను నూరి ప్రత్యేకంగా తయారు చేయించి తెచ్చిన నూనెలో మూలికారసం కలిపి, తాను క్రింద కూర్చుని, విమలావతి అరికాళ్ళు తన ఒడిలోపెట్టుకుని మెల్లిగా మర్దన చేయస్తూ, ఆ సమయంలో ఆమెకు వేద మంత్రాలూ, గాయత్రీ మంత్రాలూ బోధిస్తూ ఆమెచేత పలికించి, పఠింపజేస్తూ ఆమె మనస్సును ఆమె కాలి బాధ నుంచి మరల్చసాగింది.

క్రమేపీ మహేశ్వరి తనకు వైద్యం చేస్తున్నట్లుకాక, విద్య బోధిస్తున్నదనే భావన విమలావతి కలిగించింది.

విమలావతి కూడా కొద్దిరోజులయ్యాక తానూ క్రింద కూర్చుని మోకాళ్ళవరకూ లేపనం రాస్తూ వైద్యం చేస్తూనే వేద వేదాంగాలూ, ఉపనిషత్తులూ శాస్త్రాలూ బోధిస్తూ, పలికిస్తూ అనేకానేక కష్టాలూ, బాధలూ వస్తే ఎలా ధైర్యంగా ఉండాలో కూడా చెప్పసాగింది. మహేశ్వరిపట్ల విమలావతికి స్నేహ భావమే కాక విడదీయలేని బంధం ఏర్పడింది. గాయత్రీ మంత్రాన్ని నిష్టగా పఠించిన విమలావతి అఖండ తెలివితో ఏక సంధాగ్రాహిగా అన్నీ వడివడిగా నేర్చుకోసాగింది.

అలా ఒక సంవ త్సరం అయ్యేసరికీ విమలావతి మెల్లిగా లేచి నిల్చోసాగింది. క్రమక్రమంగా అడుగులు వేస్తూ నడుస్తూ మరో ఆరునెలలకు బాగా ఉత్సాహంగా అంతకుముందున్న విచారం, చిరాకూ మరచి చిరునవ్వుతో అందరితో మాట్లాడుతూ రాజోద్యానంలో నడుస్తూ, పరుగులు తీస్తూ మహారాణికీ, రాజుకూ ఆనందం కలిగించింది. యువరాజు వీరసేనుడు తనకు అత్యంత ప్రియసోదరి అయిన విమలావతికి చాకచక్యంగా వైద్యంచేస్తూనే విద్య బోధించిన మహేశ్వరి పట్ల చాలా అభిమానం ఏర్పడింది. సోదరి ద్వారా మహేశ్వరిని తాను వివాహం చేసుకుంటానని అడిగించాడు. ఇంతకాలంగా నాతో స్నేహంగా వున్నావు. మా అన్నయ్యను వివాహం చేసుకుని శాశ్వతంగా నా వదినగా ఇక్కడే అంతఃపురంలో ఉండిపోండి గురుదేవీ!" అన్న విమలావతికి, పక్కనుంచి వీరసేనుడు వింటున్నాడని గమనించి మహేశ్వరి ఇలా చెప్పింది.

"యువరాణీ! నేను కేవలం ఒక పేద ఇంటి పిల్లనే కాక ఒక వైద్యమూ, విద్య పేదలకు అందించే కుటుంబానికి చెందినదాన్ని. నేను మీ అన్నగారిని వివాహం చేసుకుని ఇక్కడ అంతఃపురంలో నిల్చిపోతే, నాకు త్రిశంఖు స్వర్గంలా ఉంటుంది, నాస్థాయి వేరు, మీస్థాయి వేరు, రాచకుటుంబం నుంచి వచ్చిన యువతి మాత్రమే ఇక్కడ మీ నియమనిబంధనలుకు ఇమడగలదు. నేను సాధారణ కుటుంబానికి చెందిన దాన్ని. అంతేకాక పేదలకు విద్య వైద్యం అందించే అవకాశాన్ని పొగొట్టుకుంటాను. నాకు మానవ సేవచేయడమే ఇష్టం. అందువలన నన్ను వెళ్లనీయండి. మీకు నయమవడం నాకెంతో గర్వంగాను ఉంది అంతకు మించి చాలా తృప్తిగానూ ఉంది. మా రాజుగారికి మాకు చేతైనంత సేవ చేసుకున్నామనే ఆనందం. కనుక నన్ను మా గ్రామానికి పంపే ఏర్పాట్లు చేయించండి. నాకోసం ఎందరో రోగులు వైద్యంకోసం ఎదురుచూస్తుంటారు. మీ మాట కాదన్నందుకు మన్నించండి" అని చెప్పి నమస్కరించి, మహారాజు ఏర్పాటుచేసిన వాహనంలో తన గ్రామానికి పయనమై వెళ్ళిపోయింది మహేశ్వరి.

Posted in September 2021, బాల్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *