Menu Close
Teneloluku Page Title

ఎంతో విశిష్ఠత కలిగి, పురాతనమైన ‘శతక’ ప్రక్రియ వలననే మన తెలుగు భాష జన ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ శతక ప్రక్రియ ప్రాకృత మరియు సంస్కృత భాషల శైలిలో మొదట రూపొందిననూ, తరువాతి కాలంలో అచ్చతెనుగు, అమ్మనుడికారంతో జనంలోకి చొచ్చుకొని పోయి జానపద ప్రక్రియ గా కూడా రూపొందింది. అందుకు కారణం ఈ శతకాలను రచించిన తెలుగు కవులు, నాటి సామాజిక జీవన పరిస్థితులను ప్రతిబింబిస్తూ రచించారు. అంతే కాదు ఆ శతకాల ద్వారా ఎంతో విలువైన సమాచారాన్ని, సందేశాన్ని సామాన్యునికి కూడా అర్థమయ్యే రీతిలో వివరించారు. అందుకే నేటికీ మనకు శతకాలు అంటే ఏదో తెలియని ఆసక్తి, అభిమానం.

యధావిధిగా, మన తెలుగును స్తుతిస్తూ రాఘవ మాష్టారు గారి తెలుగు పద్య మాల:

మానిని:

చక్కని పల్కులు జక్కని కుల్కులు జాణత సోకులు సంపదగా
చుక్కల సొంపులు సుందర తూపుల జూపుల కన్నియ సుందరిగా
అక్కజమందుచు నందరి మెప్పుల నద్భుత భాషగా ఆలతిగా
మక్కువ మీరగ మానుడి తెల్గును మాగుడి గొల్తుము మాతగమౌ

చంపకమాల:

సలలిత తెల్గు పల్కుల రసాల వికాస వివేక భాషరా
కిల కిల వన్నె చిన్నెల సుగీత సునీత పునీత భాషరా
జిలిబిలి జిన్నెలున్న నవజీవ సజీవ అపూర్వ భాషరా
చెలువము మీర సన్నుత విజేత విధాతగ వెల్గు తెల్గురా

తేటగీతి:

శ్రీకరంబగు తెలుగిల సిరుల భాష
అమ్మ లాలిపాటలవోలె హాయి గొల్పి
తేట తేనీయ పలుకుల తీపినిల్పి
అమర భావాలు చిలికించు అమృత భాష
కమ్మనైన తెలుగు మన అమ్మనుడిర

Posted in September 2018, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!