Menu Close

page title

గిజిగాడు (The Weaver Bird)

weaver bird

గిజిగాడు అంటే ఒక రకం పిచ్చుకే!. తల మీద పసిడి కిరీటం లాంటి పసుపు రంగు, గడ్డమూ, ముక్కూ, రంగేమో నలుపు, రెక్కలేమో గోధుమ, నలుపు చారలతో మగ గిజిగాళ్ళు చాలా అందంగా ఉంటాయి. గిజిగాడు కట్టే గూడు ఎంతో నేర్పరితనంతో ఉంటుంది, ఒక పెద్ద ఇంజనీరు దాని పనితనంలో కనిపిస్తాడు.

గడ్డిపోచలు పోగుచేసి ముక్కున కరుచుకుని వచ్చి గిజిగాడు గూడు నిర్మించి ఆడ పక్షితో కలిశాక గుడ్ల జాగ్రత్త, పిల్లల జాగ్రత్త ఆడపక్షి బాధ్యతే! కాపురానికి ఇల్లు సిద్ధం చేయడం మాత్రమే దాని బాధ్యత! గుడ్లుపెట్టాక ఆడ పక్షులు, గూటిని, పిల్లల బాధ్యతను తీసుకుంటాయి. మగపక్షులు ఈ విషయంలో మనుషులకేం తీసిపోవు, మగ మహారాజు హోదా వెలగబెడతాయి.

గిజిగాళ్ళు బంకమన్నుతెచ్చిగూటిలోపలి వైపు అతికించడం ఆశ్చర్యంగా ఉంటుంది. శత్రువుల నుండి గూడునూ పిల్లల్ని కాపాడుకోవడం, పిల్లలకు ఆహారం తెచ్చేపట్టే బాధ్యత మాత్రం ఆడ పక్షి స్వీకరిస్తుంది. మనం పక్షుల నుండి ఎంతో నేర్చుకోవాల్సి ఉంది. మగ గిజిగాడు కట్టే గూడు ఎంతో నేర్పరితనంతో ఉంటుంది. గూళ్ళు అల్లడమూ, పిల్లలకి ఆహారం నోటికి అందించడమూ, శత్రువులను ఎదుర్కోవడమూ, ఆటలూ పాటలూ వాటికి నేర్పించడమూ అంతా మానవుల పోలికే!. పాములూ, ఇతర శత్రువుల బారినుండి గుడ్లనూ, పిల్లల్నీ కాపాడుకోవడానికి గూళ్ళను చెట్లపైనా, కరెంటు తీగలపైనా కట్టుకోవడం వాటి తెలివికి నిదర్శనం.

weaver bird

మానవులమైన మనం గొప్పవాళ్ళమని భావిస్తాం, కానీ పశుపక్ష్యాదులు మనకేం తీసిపోవు. వాటికీ సమాజంతో కల్సిఉండటం చాలా ఇష్టం. అందుకే అన్నీ ఒకేచోట వీలైనంత వరకూ దాదాపుగా యాభైకి పైగా ఒక చిన్న కాలనీలా గూళ్ళు ఒకే చెట్టుమీదో, తీగలమీదో కట్టుకోవడం చిత్రంగా ఉంటుంది. ఆడ గిజిగాడికి పసుపు కిరీటమూ, ముఖం మీద నలుపూ ఉండవు. కొంచెం ఊరపిచ్చుకలను పోలి ఉంటాయి.

మగ గిజిగాడు గూడు సగం అల్లేక, రెక్కలు ఆడిస్తూ ఆడపక్షుల వద్దకు వచ్చి తాను తయారు చేస్తున్న గూడు చూడమన్నట్లు సంకేతం చేస్తుంది. మనం ఐటీ ఉద్యోగం, కారు, స్వంత ఇల్లు ఉన్నట్లు పెళ్ళి ప్రొఫైల్లో పెట్టినట్లు. గుంపులో ఉన్న ఒక్క ఆడపక్షైనా మెచ్చక పోతే దాన్నలాగే వదిలేసి, మరో గూడు అల్లడం మొదలు పెడుతుందట మగపక్షి. గూడు నచ్చితే ఆడపక్షి గొట్టం లాంటి ప్రవేశ ద్వారం పూర్తి చేయడంలో సహకరిస్తుంది. కాపురానికి వచ్చి గూట్లో జతకడుతుంది.  ఆడపక్షి 'ప్రేమ’ కోసం ఎన్నిపాట్లు పాపం ! వచ్చే సంచికలో మరో పక్షికి సంబంధించిన సమాచారంతో కలుద్దాం.

Posted in June 2018, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!