Menu Close
తపస్సు
-- శ్రీ శేష కళ్యాణి గుండమరాజు --

వేదవేదాంగములను అభ్యసించిన మహాతపుడు, మహాజ్ఞాన సంపన్నుడు. ఆధ్యాత్మిక పరంగా ఉన్నత శిఖరాలకు చేరిన ఆయనకు తెలియని పురాణాలు కానీ, ఇతిహాసాలు కానీ లేవు. అనేక విద్యలలో ప్రావీణ్యతను కలిగిన మహాతపుడు, జనావాసాలకు దూరంగా ఉన్న ఒక అరణ్యంలో తన ఆశ్రమాన్ని నిర్మించుకుని, తన వద్దకు విద్యను అభ్యసించేందుకు వచ్చే వారిలో అర్హులైన అతి కొద్దిమందిని మాత్రమే తన శిష్యులుగా స్వీకరించేవారు. తన వద్ద శిష్యులుగా ఉన్న వారికి అనేక నియమనిబంధనలు ఉండేవి. విద్య పూర్తయ్యే వరకూ ఆయన వద్దనున్న శిష్యులు ఆ అరణ్యమును విడిచి ఎక్కడికీ వెళ్లకూడదనేది అటువంటి నియమాలలో ఒకటి!

ద్యుతిధరుడు, ప్రసన్నాత్ముడు మహాతపుడి ప్రియ శిష్యులు. వారిరువురూ తమ బాల్యంలోనే మహాతపుడివద్ద శిష్యులుగా చేరి సకల విద్యలలో ప్రావీణ్యాన్ని సాధించారు. వారి విద్య పూర్తి అయిన తరువాత మహాతపుడు నిర్విహించిన పరీక్షలలో ఇద్దరూ సమఉజ్జీలుగా నిలబడ్డారు!

వారి తెలివితేటలకూ, జ్ఞానానికి సంతోషించిన మహాతపుడు వారితో, "శిష్యులారా! మీరు నా వద్ద విద్యను అభ్యసించి సంపాదించినటువంటి జ్ఞానం మీరు సరైన మార్గంలో ఉపయోగించుకోవాలన్నది నా కోరిక. మానవజన్మ దుర్లభమయినది. ఈ మానవజన్మను సార్ధకం చేసుకోవాలంటే ఆ పరమాత్మను సేవించడమొక్కటే మార్గం! మీరు ఆ మార్గంలో పరమాత్మను చేరే ప్రయత్నం చెయ్యండి! సర్వాంతర్యామి అయిన ఆ పరమాత్ముడు సర్వ చైతన్య స్వరూపుడు! ఆయనను మీ మదిలో నిలుపుకుని నిరంతరం సేవించండి. ఆయన కృపకు మీరు పడే తపన ఒక తపస్సు కావాలి!! మీ ఇరువురిలో ఎవరి తపస్సయితే ఆ పరమాత్మను మెప్పిస్తుందో వారికి ఇప్పటికి సరిగ్గా ఇరవైయ్యేళ్ల తర్వాత, ఈ అరణ్యంలో ఉత్తర దిశగా వెడితే వచ్చేటటువంటి ఒక గుహలో వెలిసిన శ్రీ మహావిష్ణువు యొక్క చరణకమలాల వద్ద 'జ్ఞానప్రకాశిని' అన్న నామముతో గల ఒక గ్రంధం దొరుకుతుంది! అందులో ఉన్న శ్లోకాలలో ముక్తి మార్గ రహస్యం నిక్షిప్తమై ఉంది! వారు ఆ శ్లోకాలను పఠించి మోక్షాన్ని పొందగలుగుతారు. ఇక రెండవవారు సత్యాన్ని గ్రహించిన పిదప నా ఈ ఆశ్రమ నిర్వహణ బాధ్యతలను చేపట్టి, వారు తెలుసుకున్న సత్యాన్ని లోకానికి తెలిపే జగద్గురువు అవుతారు! నేను ఇక హిమాలయాలకు వెళ్ళవలసిన సమయం ఆసన్నమయింది. నా అజ్ఞాతవాసం అక్కడ ప్రారంభమవుతుంది. మరికొంత కాలం తపస్సును ఆచరించి సమాధిని పొందుతాను!", అని చెప్పారు.

"ధన్యులము స్వామీ!", అని ద్యుతిధరుడు, ప్రసన్నాత్ముడు తమ గురువుకు నమస్కరించారు. తన శిష్యులను ఆశీర్వదించి మహాతపుడు తన కమండలాన్నీ, జపమాలనూ తీసుకుని హిమాలయాలకు వెళ్ళిపోయాడు.

మర్నాడు ఉదయం మహాతపుడి ఆశ్రమంలో ద్యుతిధరుడు, ప్రసన్నాత్ముడు, చెరొక చెట్టుకింద కూర్చుని తపస్సును ప్రారంభించారు. ద్యుతిధరుడికి ఎంత ప్రయత్నించినా మనసు ధ్యానంపై నిలువలేదు. ప్రసన్నాత్ముడికి మాత్రం అతి కొద్దిసమయంలోనే ఏకాగ్రత కుదిరి ధ్యానంలో సమాధి స్థితిని చేరుకున్నాడు! దాంతో ద్యుతిధరుడికి ప్రసన్నాత్ముడిపై కొద్దిపాటి అసూయ కలిగింది. తమ గురువు చెప్పిన ఆ గ్రంథం తనకు ఎక్కడ దక్కదోనని భయం కూడా కలిగింది. క్రమేణా ఆ అసూయ ప్రసన్నాత్ముడి పట్ల అయిష్టంగా మారింది!

ద్యుతిధరుడు, తను చేసే ప్రతి పనిలో ప్రసన్నాత్ముడిపై తనకున్న అయిష్టాన్ని ప్రదర్శించడం గమనించిన ప్రసన్నాత్ముడు ఒకనాడు, "ద్యుతిధరా! నేనిక్కడ ఉండటం నీకు ఇబ్బంది కలిగిస్తున్నట్లుంది. నేను వేరొక చోటికి వెళ్లి నా తపస్సును ఆచరిస్తాను. మన గురువు చెప్పిన గడువు ముగిసిన తర్వాత ఈ అరణ్యములోని గుహ వద్ద మనం మళ్ళీ కలుద్దాం!", అని చెప్పి ఆశ్రమాన్ని విడిచి వెళ్ళిపోయాడు.

ద్యుతిధరుడు మనసులో చాలా సంతోషించాడు. ఇక తపస్సులో తనదే పైచేయి అవుతుందని భావించి ఘోర తపస్సును చెయ్యడానికి ఏర్పాట్లు చేసుకున్నాడు.

ప్రసన్నాత్ముడు తన తపస్సుకు అనువైన చోటును వెదుకుతూ అరణ్యంలో వెడుతూ ఉండగా, అతడికి మార్గంలో ఒక మైదానమువంటి స్థలంలో కొన్ని వన్యప్రాణులు గుమిగూడి ఏదో విషయంపై చర్చించుకోవడం కనపడింది. రకరకాల సాధుజంతువులూ, పక్షులూ, కీటకాలు సైతం ఆ గుంపులో ఉండటం గమనించిన ప్రసన్నాత్ముడికి అవి ఏ విషయం గురించి మాట్లాడుకుంటున్నాయో తెలుసుకోవాలన్న కుతూహలం కలిగింది. తనకు వచ్చిన విద్యతో వాటి సంభాషణను అర్ధం చేసుకుంటూ ఒక చెట్టు వెనుక నిలబడ్డాడు ప్రసన్నాత్ముడు. అప్పుడు అతడికి వాటి మాటలు అర్ధం కాసాగాయి.

ఆ గుంపులోని ఒక తేనెటీగ, "మా మనుగడకు ఈ అరణ్యంలో పూలమొక్కలు కరవైపోయాయి!", అంది దీనంగా.

అప్పుడు అక్కడున్న ఒక చిలుక, "మా విషయానికొస్తే ఈ అరణ్యంలో మాకు తినేందుకు గింజలు లేవు! ఉండేందుకు గూడు లేదు! వాలేందుకు చెట్లు లేవు!!”, అంటూ ఏడ్చింది.

అంతలో ఒక జింక ముందుకొచ్చి, "మా పరిస్థితి ఏమి చెప్పమంటారూ? మేము జీవించి ఉండేందుకు కావలసిన మొక్కలు ఈ అరణ్యంలో లేవు! ఎవ్వరికీ అపకారం చెయ్యని మా జీవితం అనుక్షణం భయభ్రాంతులతో నిండిపోయింది! ఒకప్పుడు కేవలం క్రూర మృగాలను చూసి భయపడే మేము ఇప్పుడు మానవులను చూసి కూడా పారిపోవాల్సివస్తోంది! కొందరు మనుషులకు మమ్మల్ని వేటాడి చంపడం ఒక క్రీడ!!", అంది దుఃఖపడుతూ.

అప్పుడు ఒక ఏనుగు మిగతా జంతువులను ఓదారుస్తూ, "కొందరు స్వార్ధపరులైన మానవులు ఇందుకు కారణం! మనము కూడా వారిలాగే ఆ ప్రకృతిమాత బిడ్డలమని వారు మరిచారు!! పరిస్థితులు ఇలాగే కొనసాగితే క్రమంగా మనమంతా అంతరించిపోక తప్పదు! అలా జరిగిననాడు ఆ దుష్ప్రభావం ఈ అవనిని మనతో పంచుకుని జీవిస్తున్న అన్ని ప్రాణులపైనా పడక మానదు! ఆ ప్రాణులలో మనుషులు కూడా ఉన్నారు మరి! మానవులకు సద్బుద్ధి కలగాలనీ, మనకు మంచిరోజులు రావాలని ఆ భగవంతుడిని ప్రార్ధించడం తప్ప చేసేదేమీ లేదు!", అంది.

అన్ని జంతువులూ ఏనుగు చెప్పిన దాంతో సమ్మతించి అరణ్యంలోకి వెళ్లిపోయాయి.

ఆ జంతువుల సంభాషణను విన్న ప్రసన్నాత్ముడు దీర్ఘాలోచనలో పడ్డాడు. అప్పటివరకూ రకరకాల ప్రాణులు వెలిబుచ్చిన ఆవేదనను అర్ధం చేసుకుంటూ వెడుతున్న ప్రసన్నాత్ముడికి బక్కచిక్కి నేలపై పడి ఉన్న ఒక సింహం 'దాహం! దాహం!' అంటూ కనపడింది.

ప్రసన్నాత్ముడు గబగబా తన కమండలంలో ఉన్న నీటిని ఆ సింహం నోట్లో పోశాడు. అప్పుడది, "స్వామీ! ఈ అరణ్యంలో మృగరాజుగా బతికిన నాకే ఆహరం కరువైపోయింది!! ఆకలితో నా జాతి అంతరించిపోకముందే మానవులు స్వార్ధాన్ని వదిలిపెట్టాలి!", అంటూ ప్రసన్నాత్ముడి చేతిలో మరణించింది!

ప్రసన్నాత్ముడికి విపరీతమైన బాధ కలిగింది. మెల్లిగా అడుగులో అడుగు వేసుకుంటూ, అరణ్యప్రాణులు ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారాన్ని ఆలోచిస్తూ ముందుకు నడుస్తున్న ప్రసన్నాత్ముడికి, ఆ అరణ్యంలో ఉన్న కొన్ని చెట్లు నరికివేసి ఉండటం, పచ్చదనం క్రమంగా తగ్గుతూ రావడం కనపడింది. పచ్చగా ఉండవలసిన అరణ్యం, నీళ్లు లేక ఎండిపోయిన చెట్లతో పగుళ్లిచ్చిన బీడు భూములతో ఉండటం గమనించిన ప్రసన్నాత్ముడు నీళ్లు మిగలని తన కమండలం వంక చూస్తూ ముందుకు సాగి ఎండిపోయి ఉన్న ఒక నది దగ్గర ఆగాడు. ఆ నదిని చూసి చలించిపోయిన ప్రసన్నాత్ముడు, ఆ నది యొక్క జన్మస్థలాన్ని వెతుక్కుంటూ తన ప్రయాణం కొనసాగించాడు. మార్గంలో కళను కొరవడిన ప్రకృతినీ, ఆకలి దప్పికలతో అలమటిస్తున్న అనేక ప్రాణులనూ, ప్రకృతి వనరులు సరిపోక అల్లాడిపోతున్న ప్రజలనూ చూసిన ప్రసన్నాత్ముడు చలించిపోయాడు. కొంత దూరం ప్రయాణించి తను వెతుకుతున్న నది యొక్క జన్మస్థలాన్ని ఒక పర్వత శ్రేణియందు కనుక్కున్నాడు ప్రసన్నాత్ముడు. అక్కడ ఒక సన్నటి పాయలా ప్రవహిస్తూ ఉన్నది ఆ నది!

ప్రసన్నాత్ముడు భక్తిగా నదికి నమస్కరించి, "నదీమతల్లీ! నువ్వు ఇలా క్షీణించిపోవడానికి గల కారణమేమిటీ?", అని అడిగాడు.

అందుకు నది, "కొందరు స్వార్ధపరులైన మానవులు ఇందుకు కారణం నాయనా!!", అని అంది.

"తల్లీ! మరికాస్త వివరంగా చెప్పగలవా?", అని అడిగాడు ప్రసన్నాత్ముడు.

"చెబుతాను విను! ఈ ప్రకృతి అంతా ఆ పరమాత్ముడి స్వరూపం! సకల జీవులకు తల్లి అయిన ఈ ప్రకృతి, మానవాళికి కూడా తల్లివంటిదే. మానవుల మనుగడకు అవసరమయ్యే నీరూ, ఆహారమూ, గాలీ ఆ ప్రకృతి ఇచ్చే సంపదలు! కానీ కొందరు మానవులు ఆ విషయాన్ని విస్మరించి చెట్లను నరికి, పక్షుల ఆవాసాలను కూల్చి, మృగాలను వేటాడి చంపి, నదులపట్ల ప్రవర్తించవలసిన తీరును మరచి, కేవలం తమ స్వార్ధాన్ని చూసుకుంటూ ప్రకృతికి హాని కలిగే పనులు చేస్తున్నారు. అటువంటివారివల్ల నా వంటి నదులు కనుమరుగవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. నాలో ఉండే చేపలవంటి జీవాలు అంతరించిపోయే ప్రమాదం పొంచి ఉంది! ప్రాణికోటి మనుగడకు అవసరమైన జలము, వాయువు, కాలుష్య పూరితం అయిపోయాయి! వాటివల్ల ఉద్భవిస్తున్న భయంకరమైన భూ తాపాన్ని భూమాత ఎంతకని భరిస్తుంది? ప్రకృతికి ఇంతటి అపకారం చేసిన మానవులు అందుకు తగ్గ ప్రతిఫలాన్ని అనుభవించక తప్పదు!", అంది నది గంభీరమైన స్వరంతో.

అది విన్న ప్రసన్నాత్ముడు, "తల్లీ! బాధపడకు! మానవాళి ప్రవర్తనలో మార్పు తీసుకుని వచ్చే ఉపాయమేదన్నా ఉంటే సెలవివ్వమని నా మనవి!", అన్నాడు.

"నాయనా! నువ్వు విద్యావంతుడవు! సకలశాస్త్ర ప్రవీణుడవు! నువ్వు తలుచుకుంటే మార్గం దొరక్క పోదు! ప్రకృతి శ్రేయస్సును కోరి నువ్వు తలపెట్టే ఏ కార్యమైనా తప్పక ఫలిస్తుంది! నీకు జయం కలగాలని నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను!", అంది నది.

"ధన్యురాలిని తల్లీ! ప్రకృతిని కాపాడేందుకు నాకున్న జ్ఞానాన్ని ఉపయోగించి నావంతు కృషిని వంచన లేకుండా చేస్తాను తల్లీ!", అంటూ అక్కడినుండీ బయలుదేరాడు ప్రసన్నాత్ముడు.

పాయగా ప్రవహిస్తున్న నది పక్కన నడుస్తూ మానవాళిలో మార్పు ఎలా తీసుకుని రావాలా అని ఆలోచిస్తున్న  ప్రసన్నాత్ముడికి ఆ నది పక్కనున్న ఒక ఫల వృక్షమునుండీ అప్పుడే కింద పడిన ఫలమొకటి కనపడింది. దాని నిండా బోలెడు గింజలు ఉన్నాయి. వెంటనే ప్రసన్నాత్ముడికి ఒక ఉపాయం తట్టింది. అటువంటి ఫలాలను మరికొన్ని సేకరించి ఆ గింజలను నదికి ఇరువైపులా నాటడం ప్రారంభించాడు ప్రసన్నాత్ముడు. అలా నాటుతూ నాటుతూ ఒక గ్రామ పొలిమేరకు చేరుకున్నాడు. అక్కడేవో పనులనిమిత్తం వచ్చి కబుర్లు చెప్పుకుంటున్న గ్రామస్థులు ప్రసన్నాత్ముడిని చూసి," ఏం స్వామీ? ఏం చేస్తున్నారూ?", అని అడిగారు.

"జీవకోటికి సేవ! ఈ ప్రకృతిని కాపాడే ప్రయత్నం చేస్తున్నాను!", అన్నాడు ప్రసన్నాత్ముడు.

ప్రసన్నాత్ముడి మాట తీరునూ, ఆహార్యమును, ముఖవర్ఛస్సును చూసి గొప్పవాడని గ్రహించిన గ్రామస్థులు ప్రసన్నాత్ముడిని తమ గ్రామానికి ఆహ్వానించారు. ప్రసన్నాత్ముడు ఆ గ్రామానికి వెళ్లి అక్కడివారందరికీ ప్రకృతిని కాపాడవలసిన ఆవశ్యకతను గురించి చెప్పి, వారి చేత మొక్కలను నాటించడమేకాక ప్రకృతికి పరమాత్ముడికి ఉన్న సంబంధాన్ని సరళమైన మాటలతో వారికర్ధమయ్యేలా చెప్పి, తాను తలపెట్టిన పనిలో వారిని భాగస్వాములను చేశాడు. గ్రామస్థులు ప్రసన్నాత్ముడిని తమ గురువుగా భావించి నదిని కాపాడేందుకు కలిసికట్టుగా పని చేశారు. రెండేళ్లలో ఆ గ్రామం పక్కన ప్రవహిస్తున్న నది యొక్క ప్రవాహం నాలుగింతలయ్యింది. గ్రామస్థులు, తాము గతంలో నీళ్లు లేక విడిచిపెట్టిన వ్యవసాయం తిరిగి ప్రారంభించారు! ప్రసన్నాత్ముడి గురించి పొరుగు గ్రామాల వారికి కూడా తెలిసి వారుకూడా ప్రకృతిని పరిరక్షించే కార్యక్రమాలు మొదలుపెట్టారు. అలా ఒక గ్రామం నుండీ మరొక గ్రామానికి విషయం చేరడంతో ఆ నది కొద్ది సంవత్సరాలలో తన పూర్వ శోభను పొందగలిగి, గలగలమని ప్రవహిస్తూ అనేక జలచరాలు మళ్ళీ ఆవాసమయ్యింది!

ప్రసన్నాత్ముడు దేశమంతా పర్యటిస్తూ సకల జీవరాసుల పట్ల దయతో మెలగాలన్న విషయాన్ని జనులకు బోధిస్తూ, ప్రకృతిని పరిరక్షించడం యొక్క ప్రాముఖ్యతను తెలిపే ఉపన్యాసాలను ఇస్తూ, ప్రపంచంలో ఆధునికత, సాంకేతికతలు అభివృద్ధి చెందినప్పటికీ ప్రకృతికి ప్రాధాన్యత తగ్గించకూడదన్న సందేశాలను పలువురికి అందిస్తూ, ప్రకృతిలోని వనరుల పట్ల, సృష్టిలోని జీవరాసుల పట్ల ప్రవర్తించవలసిన తీరును ప్రజలకు తెలుపుతూ, నదులను కాపాడుకోవలసిన బాధ్యతనూ, కాలుష్యాన్ని అరికట్టవలసిన కర్తవ్యాన్ని వారికి తెలుపుతూ, ప్రకృతంటే ఆ పరమాత్ముడేననీ, ప్రకృతి లేకపోతే మానవాళి మనుగడ దుర్లభమనీ జనులకు బోధిస్తూ కాలం గడపసాగాడు.

ఏళ్ళు గడుస్తున్నాయి. ద్యుతిధరుడికి తపస్సు చేస్తున్నప్పుడు మొదట్లో ఏకాగ్రత కుదరడం చాలా కష్టమని అనిపించినా మెల్లిగా నిరంతర అభ్యాసం ద్వారా తన మనసును పరమాత్మపై కొంత నిలపగలిగాడు. అప్పుడప్పుడూ కుతూహలంకొద్దీ తనకు తెలిసిన విద్యతో అంజనం వేసి ప్రసన్నాత్ముడు ఏమి చేస్తున్నాడన్నది చూస్తూ ఉండేవాడు ద్యుతిధరుడు. ప్రసన్నాత్ముడు తపస్విలా కాక సాధారణ జీవితం గడుపుతూ ఎప్పుడూ ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉండేవాడు. అది చూసిన ద్యుతిధరుడు ఇక విజయం తనదేనని, ‘జ్ఞానప్రకాశిని' గ్రంథం తనకి దొరకడం ఖాయమని భావించి మనసులో చాలా సంతోషించేవాడు.

మహాతపుడు పెట్టిన ఇరవయ్యేళ్ళ కాలపరిమితి పూర్తయ్యింది. ద్యుతిధరుడు ఆత్రంగా తమ గురువు చెప్పిన గుహ వద్దకు చేరుకొని ప్రసన్నాత్ముడి కోసం ఎదురు చూడటం ప్రారంభించాడు. కొద్దిసేపటి తర్వాత ప్రసన్నాత్ముడు కూడా ఆ గుహ వద్దకు చేరుకున్నాడు. ఎన్నో సంవత్సరాలు అకుంఠిత దీక్షతో చేసిన తపస్సు వల్ల కలిగేటటువంటి తేజస్సుతో వెలిగిపోతున్న ప్రసన్నాత్ముడి ముఖమును చూసి ఆశ్చర్యపోయాడు ద్యుతిధరుడు!

"మిత్రమా! గుహ లోపలికి వెడదాం రా!", అంటూ గుహలోకి ప్రవేశించాడు ప్రసన్నాత్ముడు. అతడిని అనుసరించాడు ద్యుతిధరుడు.

ఆ గుహలోని గోడపై చతుర్భుజములతో శంఖ, చక్ర, గదా, పద్మాలను ధరించిన శ్రీ మహావిష్ణువు యొక్క దివ్య మంగళస్వరూపం ప్రసన్నాత్మ, ద్యుతిధరులిద్దరికీ కనపడింది. ఇద్దరూ ఆ మూర్తికి భక్తితో నమస్కరించారు.

అంతలో ప్రసన్నాత్ముడు, "ఆహా! అద్భుతం!! సందేహం లేదు! దివ్య కాంతులతో ప్రకాశిస్తున్న ఈ గ్రంథమే 'జ్ఞానప్రకాశిని'!!", అంటూ శ్రీమహావిష్ణువు పాదపద్మాల దగ్గర ఉన్న ఒక గ్రంథాన్ని తన చేతుల్లోకి తీసుకుని కళ్ళకద్దుకున్నాడు.

అయితే ప్రసన్నాత్ముడు ఆ గ్రంథాన్ని తెరిచిన వెంటనే ఆ గుహ నిండా కళ్ళు మిరుమిట్లు గొలిపే దివ్యకాంతులు వచ్చి ఆ గ్రంథంతో సహా ప్రసన్నాత్ముడు అదృశ్యమైపోయాడు! ద్యుతిధరుడికి ఎక్కడలేని దుఃఖం పొంగుకొచ్చింది. తన మిత్రుడిని ఆశ్రమంనుండీ వెళ్లగొట్టినందుకు పశ్చాత్తాపం కూడా కలిగింది.

శ్రీ మహావిష్ణువు పాదాలపై పడి, "స్వామీ! నేను చేసిన తప్పేంటి?", అంటూ రోదించడం మొదలుపెట్టాడు ద్యుతిధరుడు.

అంతలో తనకు ఒక దివ్య స్వరం వినపడింది. అది తన గురువు మహాతపుడిదని గ్రహించడానికి ద్యుతిధరుడికి ఎక్కువసేపు పట్టలేదు.

"స్వామీ! గురుదేవా! మీరు చెప్పినట్టుగానే నేను ఈ అరణ్యంలోనే ఉండిపోయి నా జీవితమంతా తపస్సు చేస్తూ, ఆ పరమాత్ముడి కృప కోసమని నా సర్వస్వం అంకితం చేశాను! కానీ నేను ఆయన కరుణను పొందలేక పోయాను! ఏ తపమూ చెయ్యని ప్రసన్నాత్ముడికి ఆ దివ్యగ్రంథాన్ని పొందగలిగే భాగ్యం కలిగింది. ఇది అన్యాయం కాదా స్వామీ? మీరే నాకు జ్ఞాన బోధను చెయ్యాలి!", అని మహాతపుడిని వేడుకున్నాడు ద్యుతిధరుడు.

"నాయనా ద్యుతిధరా! నువ్వు చేసిన తపస్సు గొప్పది! అందులో సందేహము లేదు! కానీ ప్రసన్నాత్ముడు చేసిన తపస్సు మరింత గొప్పది! నువ్వు బయటి ప్రపంచాన్ని వదిలి ఈ అరణ్యములోని ఆశ్రమంలో ఏకాంతంలో ఆ పరమాత్మను నీ మదిలో నిలుపుకునే ప్రయత్నం చేశావు. మనోనిగ్రహం మహాతపస్వులకు సైతం దుర్లభమైనది. దానిని నువ్వు సాధించాలని అనుకున్నావు.  అందువల్ల నువ్వు ఎంచుకున్న మార్గంలో ఆ పరమాత్ముడిపై నీ మనసును కొంతవరకూ నిలపడానికి నీకు చాలా కాలమే పట్టింది. నువ్వు ఆచరించినదానికి భిన్నంగా ప్రసన్నాత్ముడు ఈ అరణ్యాన్ని విడిచి జనారణ్యంలోకి వెళ్ళాడు. ఈ సృష్టిలో ప్రకృతిగానున్నది సాక్షాత్తూ ఆ పరమాత్ముడేనన్న సత్యాన్ని గ్రహించాడు. అన్ని రకాల ప్రాణులను అనుక్షణం సేవిస్తూ అది  సకల ప్రాణులలో ఉన్న ఆ పరమాత్ముడికి తాను చేస్తున్న ఆరాధనగా భావించాడు. సత్సంకల్పంతో, నిస్వార్ధంగా అతడు చేసిన కర్మలు ‘మహా తపస్సు’ అయి, ఆ పరామాత్ముడి మన్ననలు అతడు పొందేలా చేసింది. మనసును ఎల్లవేళలా పరమాత్మపై నిలపడమన్నది సామాన్య మానవులకు కష్టతరం కావచ్చు. కానీ, వారు తమచుట్టూ ఉన్న ప్రాణులలో ఆ పరమాత్మను చూసే ప్రయత్నం చేస్తూ, ప్రకృతిని గౌరవిస్తూ, అందులోని ప్రాణుల మనుగడకు ఆటంకం కలిగించకుండా ప్రవర్తిస్తూ, వాటిని ప్రేమతో సేవించినట్లైతే ఆ పరమాత్ముడి మెప్పును త్వరగా పొందవచ్చు! చైతన్య స్వరూపుడై, అణువణువునా వ్యాపించి ఉన్న ఆ పరమాత్మ కృపను పొందుటకు అదే సులువైన మార్గం!", అన్నాడు మహాతపుడు.

"సత్యం నాకు ఇప్పుడు బోధపడింది స్వామీ! నా అజ్ఞానపు చీకట్లు తొలగిపోయి నా కళ్ళు తెరుచుకున్నాయి! మీ ఆజ్ఞానుసారం నేను ఆశ్రమ బాధ్యతలను స్వీకరించి, నేను తెలుసుకున్న ఈ సత్యాన్ని లోకానికి తెలియజెప్పే ప్రయత్నం చేస్తాను!", అంటూ తన గురువుకు నమస్కరించి ఆశ్రమానికి చేరుకున్నాడు ద్యుతిధరుడు.

అప్పటికి అక్కడ తన రాక కోసం 'జ్ఞానప్రకాశిని'ని చేత్తో పట్టుకుని ఎదురు చూస్తున్నాడు ప్రసన్నాత్ముడు.

"మిత్రమా! నువ్వా! ఇక్కడా? ఏమిటీ విషయం?", అని ఆశ్చర్యంగానూ, ఆప్యాయంగానూ అడిగాడు ద్యుతిధరుడు.

"నేను ‘జ్ఞానప్రకాశిని’ని పూర్తిగా చదివాను. మోక్షమార్గ రహస్యమున్న విశిష్టమైన గ్రంథమిది! నీ ద్వారా లోకానికి ఈ గ్రంథసారమును అందించడంవల్ల అందరికీ మేలు కలుగుతుందని భావించి, ఈ గ్రంథమును నీకు ఇవ్వడానికి మన గురువు వద్ద అనుమతిని పొందాను!”, అంటూ ‘జ్ఞానప్రకాశిని’ని ద్యుతిధరుడి చేతుల్లో పెట్టి, “నేను ఇక హిమాలయాలకు వెడుతున్నాను మిత్రమా!", అన్నాడు ప్రసన్నాత్ముడు.

ద్యుతిధరుడు ‘జ్ఞానప్రకాశిని’ని తన కళ్ళకు అద్దుకుని, "నువ్వు ఆచరించినదే నిజమైన తపస్సు మిత్రమా!", అంటూ ప్రసన్నాత్ముడిని అభినందించి, ఆనందభాష్పాలు నిండిన కళ్ళతో తన మిత్రుడిని ఆప్యాయంగా కౌగలించుకున్నాడు!

o00o00o00o00o

Posted in March 2021, కథలు

2 Comments

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!