Menu Close
Teneloluku Page Title

ఈ సంచిక మన తేనెలొలుకు శీర్షికలో శ్రీమతి వసుంధర గారు సేకరించి పంపిన ఒక గమ్మత్తైన ప్రక్రియను మీకందిస్తున్నాను. పలికేటప్పుడు పెదవులు తగిలే విధంగా, తగలని విధంగా, నాలుక కదిలేటట్లు, నాలుక కదలకుండా పలికేటట్లు ఇలా ఎన్నో విధాలుగా పదాలను చేర్చి మన తెలుగు పద్యాలను వ్రాయవచ్చు. అదియునూ పద్యం మొత్తం మంచి అర్థోక్తంగా ఉండి మంచి అనుభూతిని కూడా కలిగిస్తుంది. పరికించండి మరి.

చదివే సమయంలో పెదవి మాత్రమే తగిలే పద్యం

భూమీ భామాంబు భవా
వామాపా వైభవ భువి భావావాపా
వేమమ్మోముము భూభవ
భీమ భవాభావ భావ విభువామావిభా

చదివే సమయంలో పెదవులు తగలని పద్యం

శ్రీశా సతత యశః కవి
తాశా ధాత్రీశ ఖండితాశా నిస్సం
కాశా నిరతారాధిత
కీశేశా హృష్ణ గగనకేశా యీశా

ఒక అక్షరం పెదవికి తగలనిది తరువాతి అక్షరం తగిలే పద్యం

దేవా శ్రీమాధవ శివ
దా వేగాభిజ్ఞ మురభిదా మాధామా
జ్యావగ వంద్యా వాసవ
సేవితపద పగవిరామ శివ జపనామా

కేవలం నాలుక కదిలేది

సారసనేత్రా శ్రీధర
రారా నన్నేల నిందు రాక్షసనాశా
నారద సన్నుత చరణా
సారతరానందచిత్త సజ్జనరక్షా

నాలుక కదలని(తగలని) పద్యాలు

కాయముగేహము  వమ్మగు
మాయకు మోహింపబోకు మక్కువగ మహో
పాయం బూహింపుము వే
బాయగ పాపంబు మంకుభావమవేగా

నాలుక కదిలీ కదలని పద్యం

ఓ తాపస పరిపాలా
పాతక సంహారా వీర భాసాహేశా
భూతపతిమిత్ర హరి ముర
ఘాతా కాలాంబుదవిధ గాత్రవరాహ్వా

ఇలా ఎన్నో రకాలైన ప్రక్రియలకు ఆలవాలమైన మన తెలుగు భాషను మనం మరిచిపోవడం ఎంతవరకు భావ్యం.

Posted in June 2018, వ్యాసాలు

1 Comment

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!