Menu Close
Teneloluku Page title

ఈ మధ్య దివికుమార్ గారు గతంలో ప్రజాసాహితీ సంపాదకీయంగా ప్రచురించిన రెండు వ్యాసాలను అందరికీ పంపించారు. అందులో మన అణుపితామహుడు అబ్దుల్ కలాం గారు మాతృభాష గురించిన పలికిన కొన్ని మధురవాక్యాలను యధావిధిగా ఇక్కడ వ్రాస్తున్నాను.

“ఏ మనిషైనా తన ఊహలను, కలలను ఏ భాషలో కంటారు? మనిషిలో ఆలోచనాశక్తినీ, వివేచనా స్థాయినీ పెంపొందించ గలిగేది, ఊహలను పెంచేది, కలలను కల్పించేది ఏది? మాతృభాష తప్ప! మానవుని సృజనాత్మక కార్యకలాపానికి తొలిమెట్టు హేతుబద్ధ చింతనదైతే మలిమెట్టు మాతృభాషది. విద్యార్థులకు మాతృభాషల్లో విద్యను బోధిస్తే, అది తేలికగా అర్థమవడమే కాకుండా ఆ విషయంపై అవగాహన పెంచుకునే అవకాశమున్నది. భవిష్యత్తులో విజయానికి సృజనాత్మకతే కీలకం. ప్రాధమిక స్థాయిలోనే విద్యార్ధుల్లోని సృజనాత్మకతను ఉపాధ్యాయులు వెలికి తీయాలి. శాస్త్రవిద్యలను మాతృభాషల్లోనే బోధించాలి.”

ఈ సంపాదకీయంలోనే మాతృభాష యొక్క ప్రాధాన్యత గురించి చెప్పిన మరొక విశ్లేషణ నన్ను ఎంతగానో ఆకట్టుకొంది.

“ఒక వ్యక్తి మైక్రోస్కోపు, టెలిస్కోపుల్ని వినియోగించాలన్నా మొదామొదలు అతనికి కంటిచూపు ఉండి తీరాలి. అలాగే పరాయి భాష ద్వారా పరిజ్ఞానం సంపాదించాలన్నా మాతృభాష ద్వారా మాత్రమే సాధించగలిగిన విస్తృతమైన మౌలిక విజ్ఞానం అంటే ప్రకృతి, పరిసరాల గురించి, కుటుంబము, సమాజాల గురించి మౌఖికంగా తెలుసుకునే వెసులుబాటు కల్పించాలి. అందుకు మాతృభాషే సరైన సాధకం. భవిష్యత్తరాల సాంస్కృతిక వ్యక్తిత్వ నిర్మాణానికి కూడా మాతృభాషలో విద్యాబోధన కీలకమైన పాత్రను నిర్వహిస్తుంది.”

పైన చెప్పిన మాటలు ఎంతో ఉత్తేజపూరితంగా ఉండి మన తెలుగుభాషలో (ఇక్కడ మన మాతృభాష తెలుగు కదా అందుకని) విద్యాబోధన యొక్క అవశ్యము ఎంత ఉందో చెబుతున్నాయి. కాకుంటే అందుకు ముందుగా మార్పు రావలిసింది నేటి తరంలో కాదు వారి తల్లి తండ్రులలో. అమ్మమ్మ-తాతయ్య, నానమ్మ-తాతయ్య లకు తెలుగు ఔన్నత్యాన్ని వివరించనవసరం లేదు. ఈ మధ్యతరం వారే ఒక విధమైన మిధ్యలో కొట్టుమిట్టాడుతూ పక్కవాడితో తెలుగు మాట్లాడితే తమను చిన్నచూపు చూస్తారనే భావనలో ఉన్నారు. తెలుగు పత్రికలు అంటే కేవలం కథల కొఱకే అనే సంస్కృతినుండి బయటకు వచ్చి సాహిత్యం యొక్క నిజమైన సారాన్ని ఆస్వాదించడం అలవాటు చేసుకోవాలి. అప్పుడు సహజంగానే వారి పిల్లలకు కూడా ‘మన తెలుగు మనదైన తెలుగు’ అనే భావన కలుగుతుంది. ఈ అక్షర సత్యాన్ని మేము ప్రత్యక్షంగా ఆచరించి అనుభూతి చెందుతున్నాం కనుకనే అంత ధైర్యంగా ఇక్కడ వ్రాయగలుగుతున్నాను.

ఇంకొక విషయం: మన ప్రతినిధులు, వివిధరంగాలలో ప్రసిద్ధిగాంచిన వ్యక్తులు మన ప్రసంగాలలో తెలుగు పదాలను ఎక్కువగా వాడాలి. సామాన్యులమైన మనం ఎంతగా వివరించినను అది సుత్తి కొట్టినట్టు భావిస్తారు. అదే కొంచెం నాయకులైన వాళ్ళు చెబితేనే అది సాధ్యమౌతుంది. శంఖంలో పోస్తేనే కదా తీర్థమయ్యేది. ఈ మధ్య ఇక్కడ జరిగిన ఒక సాంస్కృతిక కార్యక్రమానికి తమిళ చిత్రసీమలో ప్రసిద్ధిగాంచిన ఒక ఆవిడను, మన తెలుగు ఆవిడను ముఖ్య అతిథులుగా పిలిస్తే, మొదటి ఆవిడ స్పష్టమైన తెలుగులో ఎంతో చక్కగా ప్రసంగించింది. మన తెలుగు ఆవిడ మాత్రం అంతా ఆంగ్లంలోనే ప్రసంగించింది. కారణం ఆవిడకు తెలుగు రాక కాదు. మాట్లాడితే తన హోదా తగ్గుతుందనే ఒక చిన్న సంశయం. ముందు ఇటువంటి అనవసరమైన అపోహలను ప్రతినిధులు, ప్రఖ్యాతిగాంచిన వారు మానుకొని తెలుగులోనే ప్రసంగించాలి. అది వ్యావహారికమా, గ్రాంధికమా అనేది అప్రస్తుతం. వ్యాకరణ దోషాలను చర్చించే అవసరం కూడా లేదు.

మాతృభాషలో మాట్లాడడం లేదా అన్యభాషలలో మొదలుపెట్టినా సదుపాయం కోసం మాతృభాషలోకి మారిపోవడం చాలా సహజం. నేను ఒక గుజరాతీ సంస్థలో పనిచేసి నప్పుడు సమావేశాలమధ్యలో గుజరాతీలోకి సంభాషణలు మారిపోవడం చాలాసార్లు జరిగేది. అలాగే హిందీ, పంజాబీ, బెంగాలీ, మరాఠీ, తమిళం, మళయాళం, మొదలగు భాషలలో జరగడం గమనించాను. తప్పులు వచ్చినా అక్కడివారి మాతృభాషలో మాట్లాడితే వారు ఎంతో సంతోషపడి ప్రోత్సహించేవారు. ఇలాకాకుండా పరభాషాపాండిత్యప్రదర్శన గొప్పగా భావించి,  మాతృభాషలో మాట్లాడడం చేతకానితనంగా, చిన్నతనంగా చూడడం కేవలం తెలుగువారిలోనే చూసేను. ఎంత దౌర్భాగ్యం?

పల్లెపదాలలో కూడా అందచందాలు చిందులువేసే తేటతెలుగు తియ్యదనాన్ని కాలరాసి, తెలుగువారి మధ్యలో వేరేభాషను ఉపయోగించడం తనని తను మోసగించుకోవడం కాదా? దీనివల్ల సాధించేది ఏమిటో? కొన్నాళ్ళకు ఇది ఉభయభ్రష్టుత్వానికి దారితీసే  ప్రమాదం కూడా ఉంది. ఎవరు మెచ్చుకుంటారో కాని అసలు సిసలు తెలుగువారు తప్పకుండా నొచ్చుకుంటారు. అయినదేదో అయినది. కనీసం ముందుతరాలలోనైనా భాషాపరంగా ఆత్మన్యూనతాభావాన్ని అరికట్టి, తెలుగుతల్లి మంగళగళస్వరాలను సగర్వంగా విని, దిగంతాల దంతుల (ఏనుగుల) దొంతరలవరకు వినిపించే ప్రయత్నం చేసేవారందరికీ నా హృదయపూర్వక అభినందన వందన చందన మందారాలు.

అయ్యగారి సూర్యనారాయణమూర్తి

Posted in April 2018, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!