Menu Close
Page Title

కాకతీయ యుగం

తిక్కన సోమయాజి – సంస్కృత కవులతో పోలిక

కేతన తన దశకుమార చరిత్రలో తిక్కనను ముగ్గురు సంస్కృత కవులతో పోల్చాడు. ౧. మయూరసన్నిభ మహాకవి, ౨. ఆర్య భోజుడు మరియు ౩. భారవి కల్పుడు.

మయూరుని సూర్య వర్ణనను మనసులో ఉంచుకొని కేతన, తిక్కనను ‘మయూర సన్నిభుడ’ని పేర్కొని ఉండవచ్చు. ‘ఆర్య భోజుడు’ అనేది ఒక పద్యం చివర ఉంది కాని ఇది ఆంధ్ర భోజుడై ఉండవచ్చు. అయినా తిక్కనకు ‘కవి బ్రహ్మ’ ‘ఉభయ కవిమిత్రుడు’ అనే బిరుదులు మాత్రమే ఉన్నాయి. (స.ఆం.సా పేజీలు – 308-309).

భారవి కిరాతార్జునీయం వ్రాసిన గొప్ప సంస్కృత కవి. ఇతని రచనలలో అర్థగాంభీర్యం ప్రధానం.

‘భారవేరర్థగౌరవం’ అని పండితోక్తి. తిక్కనలో కూడా అర్థగాంభీర్యం ముఖ్యలక్షణం. అందుకే భారవి కల్పుడు అని కేతన కీర్తించాడు.

తిక్కన రచనా విధానం – పాత్ర చిత్రణ, సామెతలు, జాతీయాలు

తిక్కన గారి రచనలను గూర్చి చెప్పాలంటే అదొక ప్రత్యేక గ్రంథమే అవుతుంది. అందునా ఆరుద్ర వంటి విమర్శకుని చేతిలో పడితే మరింత పెరుగుతుంది. కానీ ఆరుద్ర తిక్కనను గూర్చి చాలా సంగ్రహంగానే చెప్పాడని మనం చెప్పుకోవాలి. ఆరుద్ర “ఇష్టమైన పద్యాలు – సరదా” అనే శీర్షిక పెట్టి తిక్కన రచనలోని ఒక ప్రత్యేకతను ముందు పాఠకులకు పరిచయం చేశాడు. ఇది ఆరుద్ర మాటల్లోని సారాశం.

“తిక్కన గారికి తమకు ఇష్టమైన పద్యాలను మళ్ళీ మళ్ళీ వాడుకోవడం సరదా. కథా సందర్భాన్ని అందుకు వీలుగా తిప్పుకుంటారు....” అని ద్రౌపది కీచకునితో తన భర్తల యొక్క శౌర్యాన్ని గూర్చి చెప్పే పద్యాన్ని గూర్చి ఆరుద్ర తెలిపారు. ఆ పద్యం

‘దుర్వారోద్యమ బాహు విక్రమ రసాస్తోక ప్రతాపస్ఫుర, ద్గర్వాంధ...’ అనే పద్యం. కీచకుని బారి నుండి తాత్కాలికంగా తప్పించుకొన్న ద్రౌపది, భీముణ్ణి పాకశాలలో కలుసుకొని తనకు కీచకుని వల్ల జరిగిన కష్ట నష్టాలన్నీ భీమునితో చెప్పే సందర్భంలో తిక్కన, ద్రౌపది నోట తిరిగి ‘దుర్వారోద్యమ బాహు విక్రమ’ అనే పద్యాన్ని ఒక్క అక్షరం కూడా విడిచి పెట్టకుండా పలికించాడు. (విరాట. 2-172)

దీనిని గూర్చి చెప్తూ ఆరుద్ర “ఈ పద్యమంటే చాలా ఇష్టం కాబట్టి తిక్కన గారు దీనిని కథా సందర్భంలో చక్కగా ఇమిడిపోయేటట్లు మళ్ళీ వాడుకొన్నాడు. ఇంకొక రెండు పద్యాలూ ఇలాగే వాడారు. ఆయనకే గాక, ఒక పద్యం – ఆంధ్రులందరికీ చాలా ఇష్టం” అని మనందరికీ ఇష్టమైన ఆ పద్యాన్ని గుర్తుచేశారు. అది

‘వచ్చినవాడు ఫల్గును డవశ్యము గేటు మనంగ రాదు రా...’ (విరాట – 4-234)

ఈ పద్యం విరాట పర్వంలో భీష్ముడు దుర్యోధనునికి చెప్తాడు. దుర్యోధనుడు తిరిగి భీష్మునికి, ‘మనకు పాండురాజ తనయ వర్గమునకు...’  అంటూ బదులు చెప్తాడు. ఈ రెండు పద్యాలను గూర్చి చెప్తూ ఆరుద్ర “భీష్ముడు చెప్పిన పద్యం దానికి దుర్యోధనుని జవాబు యథాతథంగా మళ్ళీ ఉద్యోగ పర్వంలో తిక్కన గారు వాడుకొన్నారు.” అని ఆ పద్యాలను ఉటంకించారు. అవి కృష్ణుడు అర్జునునితో పల్కిన పద్యాలు. రాయబారం వెళ్ళే సందర్భంగా, అలనాటి భీష్ముని మాటలను దానికి దుర్యోధనుని ప్రత్యుత్తరము కృష్ణుడు గుర్తు చేసే సందర్భంలో (విరాట పర్వం లోని పద్యాలే) ఉద్యోగ పర్వంలో తిక్కన తిరిగి వాడాడు. (స.ఆం.సా పేజీలు – 310-311)

పాత్ర చిత్రణ, వర్ణనలు

తిక్కన గారు చేసిన వర్ణనలు తక్కిన కవులకు దక్కని ఫలాలని చెప్పవచ్చు. “భారతంలో వారు (తిక్కన) చేసిన మొదటి స్త్రీ వర్ణన కూడా ఉత్తర అందమే” అని అన్నారు ఆరుద్ర.

“అల్లదనంబున యనువుమైకొన జూచు నడుపు కాంతికి వింత తొడవుగాక...”

తిక్కన గారి స్త్రీ వర్ణనలను గూర్చి శిష్టా రామకృష్ణ శాస్త్రి గారు ఇలా అన్నారు. “నిశ్చల స్త్రీల నెప్పుడును తిక్కన వర్ణింపడు. వారు నడుచునపుడు, నవ్వినపుడు, పలికినప్పుడు కలుగు సౌందర్యమును ద్యోతనము సేయును” దీనికి ఉదాహరణములుగా “లలితంబులగు మట్టియల చప్పుడింపాద...” ఇత్యాది పద్యాలను చూపిన రామకృష్ణ శాస్త్రి గారు “ఈ రీతిగా తిక్కన వర్ణనలు దాగుడుమూతలాడుచు నితని పూర్వకవులు లేక తరువాతి కవులు గూడా ననుకరింపజాలని యొక విశిష్టత గలిగియున్నవి” అని అన్నారు. “తిక్కన గారి స్త్రీలు చైతన్య సంపుటాలు” అని అన్నారు ఆరుద్ర. ((స.ఆం.సా పేజీలు – 313).

“స్త్రీ పర్వం నిజంగా గాంధారిది” అని అన్నారు ఆరుద్ర. నిజమే నూర్గురు కొడుకులను కోల్పోయిన మాతృమూర్తి గాంధారి. తిక్కన గారి రచనకు నిర్వచనం చెప్పిన ఆరుద్ర మాటలు – “...ఆమె ఆదినుంచి కళ్ళకు గంతలు కట్టుకొన్నదే. ఆ కట్టు సందులోంచి ఆమె చూపులు ధర్మరాజు గోళ్ళ మీద పడ్డాయట. వాటికే ఆయన గోళ్ళు కందిపోయాయట. అర్జునుడు కృష్ణుని వెనక దాక్కొన్నాడు (స్త్రీ -1-176). ఆమె కృష్ణునికి యుద్ధ దృశ్యాలు చూపించింది. మాట మాటకు కోటి నిప్పుల కోలలు హృదయాన్ని తొలుస్తూ ఉండగా వ్యాఖ్యానం చేసింది.....గాంధారివి ఒక రకంగా ఎక్స్ రే కళ్ళు. అవి జీవిత సత్యాన్ని చూస్తాయి. వాటిలోనుండి కారే కన్నీళ్ళలో బడబాగ్ని ఉంటుంది. కవుల గంటంలు ఉంటాయి. శిల్పుల కుంచెలు ఉంటాయి. వీణ లుంటాయి. వేణువు లుంటాయి. అవి వాస్తవ తత్వాన్ని రచిస్తాయి. వినిపిస్తాయి. మానవుణ్ణి మానవునికి జ్ఞాపకం చేస్తాయి” గాంధారి వేదనను ఇంతకన్నా ఆ, రుద్రుడు కూడా తెల్పలేడేమో! అందుకే ఆరుద్ర సల్పిన విహార కేళి ఈ సమగ్ర ఆంధ్ర సాహిత్యం అనడం అతిశయోక్తి గాదు.

భారతంలో దాదాపు మూడువేల పాత్రలు ఉంటాయని కళాప్రపూర్ణ డా. మరుపూరు కోదండరామిరెడ్డి గారి వంటి పెద్దల మాట. ఆరుద్ర కుంతి, గాంధారి పాత్రలను ముందు పరిచయం చేశారు.

ద్రౌపదిని గూర్చి, భీముని గూర్చి తెల్పారు. గాంధారి, కుంతి, కౌరవ పాండవ వంశ వృక్షాలకు వారిద్దరే గదా మూలాధారాలు. గాంధారిలోని ఉత్తమగుణాలను ఆరుద్ర తన విమర్శనాత్మకమైన దృష్టితో నిర్వచించారు. గాంధారి చెడ్డ వాళ్ళను గన్న మంచి తల్లి. ధర్మం ఎటువుంటే జయం అటు ఉంటుందని దీవించి కొడుకును యుద్ధానికి పంపిన ఉత్తమురాలు. మగవాడు స్వార్థపరుడు. దూరదృష్టి లేనివాడని, అంతేగాక తన అర్థాంగికి కూడా పరమార్థాన్ని చూడనివ్వడు...ఇలా సాగిన ఆరుద్ర విమర్శ మగవాడి స్వార్థానికి బలైపోయిన ఒక స్త్రీగా గాంధారిని గూర్చి విశ్లేషించాడు. అందుకే, భగవంతుడు అని చెప్పబడే శ్రీ కృష్ణునికీ, అతనిలోని వేదనా భరితమైన సత్యాన్ని గాంధారి కళ్ళు దర్శించి వర్ణించి శ్రీకృష్ణునికి చెప్పగలిగాయి. అని అంటారు ఆరుద్ర. “భారతంలో స్త్రీ పర్వం ఒక శిఖరాగ్రం. ఆ తర్వాత మిగతా పర్వాలన్నీ పల్లాలే” అని తీర్పు చెప్పారు ఆరుద్ర.

కుంతి పాత్ర గురించి ఆరుద్ర వివరణ

కుంతి పరుల పంచన విధిలేక పడివున్న పరాధీనురాలు. పరిభవ దుఃఖిత. పదమూడు సంవత్సరాలు బావకొడుకు చేతి ఆదాయమగు కూడు తిన్నది. కృష్ణుని చూసి బావురుమన్నది. అతడు ఆమెకు మేనల్లుడు. కృష్ణుని జూచి కుంతి ‘బావ యొప్పండను పలుకుల నేమగు... ఇట్టి క్రూరుల ఇంటికిచ్చిన మన వారి నందుగాకట్లు...’ అంటూ పుట్టింటి తరపు బంధువైన కృష్ణునితో అచ్చంగా తెలుగుదనంతో శోకాలు తీసింది. తనకు వచ్చిన న్యూనత, ద్రౌపది కి జరిగిన పరాభవం కుంతి ఎప్పుడూ మరిచిపోలేదు అని అన్నారు ఆరుద్ర. ఎవరైనా ఎలా మరువగలరు?

భారత విమర్శకులలో పండితులు, విమర్శకులు రెండు వర్గాలుగా ఏర్పడటం తెలిసినదే. కౌరవ పక్షం వారు, పాండవ పక్షం వారు. ఒక్కమాట మనం చెప్పుకోవాలి. గాంధారి ఉత్తమురాలు కావచ్చు. మంచి మనసున్నది కావచ్చు. కాని ఆమె తీసుకొన్న నిర్ణయాలు సముచితమైనవి మాత్రం కావు. వేయికళ్లతో పిల్లలను తల్లిదండ్రులు పెంచాలన్నది లోక సత్యం. ఉన్న రెండు కళ్ళను కూడా గంతలు కట్టుకొని తన నూర్గురు పిల్లలను గాలికి ఒదిలిన గాంధారి నిర్ణయం ఎంతమటుకు సబబు? రెండవది ద్రౌపది వస్త్రాపహరణ సమయంలో ఆమె తీసుకొన్న నిర్ణయం స్త్రీ జాతికే కళంకం. సాటి స్త్రీ కి మానరక్షణ కల్పించకపోవడం ఆమెలో ఉన్న మంచి గుణాలన్నింటికీ ఒక మాయని మచ్చ. ప్రతి మనిషిలో మంచి చెడ్డలు రెండూ ఉంటాయి. కాని సమాజానికి, సాటి వ్యక్తులకు ఎవరి వల్ల ఎక్కువ హాని జరుగుతుందో వారిని చెడ్డ వానిగా పరిగణిస్తారు. ఎవరివల్ల మంచి ఎక్కువగా జరుగుతుందో వారిని మంచివారిగా పరిగణిస్తారు. అందుకే రామాయణంలో రావణుడు, భారతంలో కౌరవులు తమ తమ ఆహంకారాదుల చేత దుష్టులుగా శాశ్వతమైన ముద్ర వేయించుకొన్నారు. అలాంటి పాత్రలను మనం ఎంత సమర్ధించినా అది కన్నీటితుడుపే. అలాగే బాధలను భరించేవాళ్ళు బలహీనులనుకోవడం కూడా భ్రమ అవుతుంది. ఆరుద్ర గారి గాంధారి, కుంతి పాత్రల వివరణ చూచిన తరువాత నాలో గల్గిన కొన్ని భావాలను వెలిబుచ్చడం జరిగింది. ఇది భారత రచనకు సంబంధించిన దానికి అనే దానికన్నా ‘ఒక స్త్రీ ప్రవర్తన గాంధారిలా ఉండటం ఎంతమటుకు మంచిది’ అన్న భావనకు సంబంధించినదనడం సబబుగా ఉంటుంది.

**** సశేషం ****

Posted in October 2021, సమీక్షలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!