Menu Close
Page Title

3 వ యుగం - కాకతీయ యుగం
(సమగ్ర ఆంధ్ర సాహిత్యం -ఆరుద్ర)

కాకతీయ యుగ కర్తలు – కాకతీయ యుగ కవులు – వారి గ్రంథాలు

‘సమగ్ర ఆంధ్ర సాహిత్యం´లో మూడవ యుగం కాకతీయ యుగం. ఈ యుగంలోని కాకతీయ వంశాన్ని గూర్చి సుప్రసిద్ధులైన రాజులను గూర్చి క్లుప్తంగా తెలుపడం జరుగుతుంది. అటుపై కాకతీయ యుగం లోని కవులు, వారి కావ్యాలను గూర్చి చర్చించడం జరుగుతుంది.

“ఏకచక్రాధిపత్యంగా ఇంచుమించు నేటి తెలుగుదేశమంతటినీ పాలించిన వారు కాకతీయులే. వీరి రాజ్యం క్రీ.శ. 900 – 912 కు మూడు తరాల ముందే ప్రారంభమైనది. అయితే ఇది మహాసామ్రాజ్యంగా ఏర్పడింది క్రీ.శ. 1200 తరువాతనే. అందుచేత ఈ యుగాన్ని మనం ఆ తారీఖు నుండే లెక్కించుకుందాం. క్రీ.శ.1323 లో ఈ వంశం లోని ఆఖరి రాజు ప్రతాపరుద్రుడు ఢిల్లీ సైన్యాలకు పట్టుబడడంతో ఈ మహా సామ్రాజ్యం అంతరించింది. అందువల్ల కాకతీయ యుగం క్రీ.శ. 1200 నుండి 1323 దాకా అని ఉజ్జాయింపుగా పరిగణిద్దాం” అని ఆరుద్ర తెల్పారు.

కాకతీయ వంశం లోని రాజుల పేర్లు ఒక పట్టికగా ఇచ్చారు ఆరుద్ర. ఇందులో పద్నాలుగు మంది మంది రాజుల పేర్లు వారి పరిపాలనా కాలాలు ఉన్నాయి. (స.ఆం.సా. పుట 255).

ఈ పట్టికలో మొదటిరాజు ముమ్మడి గుండన (క్రీ.శ. 90౦-912). ఇతని యొక్క ముత్తాత వెన్నరాజు. కాకతీయ సామ్రాజ్యాన్ని స్థాపించింది ఇతడే అని చెప్పుకోవచ్చు అని ఆరుద్ర మాట. ఈ వెన్నరాజు కాలం తెలియదు. ఈ రాజు కాకతి అనే చోటునుండి రాజ్యం చేయడం వలన ఈ వంశానికి కాకతీయ వంశం అనే పేరు వచ్చింది. జగ్గయ్య పేట ప్రాంతంలో కాకతమ్మ బీడు అని ఉందట. ఈ వంశం వారికి కాకతమ్మ అనే గ్రామదేవత ఆరాధ్య దైవం. ఏకవీర అనే దేవత కూడా ఉన్నది.

ఈ ఏకవీరా దేవిని నాందేడ్ జిల్లాలోని కందహారపురంలో నేటికీ ఆరాధిస్తున్నారు. అందువల్ల కాకతీయ రాజ్యస్థాపకుడు వెన్నరాజు నాందేడ్ నుండి వచ్చాడని, వస్తూ తన ఆరాధ్య దైవాన్ని తెచ్చాడని చరిత్రకారుల భావన. “ఎక్కడనుండి వచ్చినా దుర్జయ సంతతికి, సామంత విష్ఠి వంశానికి చెందిన కాకతీయులు తెలుగు నాట స్థిరపడ్డారు.” అని అన్నారు ఆరుద్ర. (స.ఆం.సా. పుట 257).

కాకతీయ వంశపు ఆదిపురుషులు నేటి వరంగల్లు జిల్లాలోని గూడూరు ప్రాంతాలను పాలించారు. వీరు వేంగీ చాళుక్యులకు సామంతులు. తర్వాత స్వాతంత్రం ప్రకటించుకొన్నారు. ఈ రాజులలో రెండవ బేతరాజు – ఇమ్మడి బేతన (క్రీ.శ. 950-1050) స్వతంత్రించి రాజైనాడు. అనుమడు-కొండడు అనే ఇద్దరిని నిర్జించి హనుమకొండను జయించాడు. ఇతనిది గరుడ ధ్వజం అందువల్ల గరుడ బేతరాజని పిలవబడ్డాడు.

రెండవ బేతరాజును శత్రువులు ఓడించడానికి ప్రయత్నించినపుడు మిరియాల ఎర్రన, అతని భార్య కామసాని మొదలైనవారు శ్రమించి రాజును రక్షించి రెండవ బేతరాజు ను తిరిగి కొరవి రాజ్యానికి రాజును చేశారు. కామసాని వేయించిన గూడూరు శాసనంలో మూడు చంపకమాలలు, రెండు ఉత్పలమాలలు ఉన్నాయి. ఈ పద్యాల వాళ్ళ బేతరాజుకు ఏ విధంగా కొరవి రాజ్యం దక్కిందో తెలుస్తున్నది.

ఈ కామసాని కోటి చేసి (ఇదొక ప్రక్రియ) కాకతి దేవతను నిల్పింది. ఈ రాజ్యాన్ని సుస్థిరం చేసిన వాడు మొదటి ప్రోలరాజు (క్రీ.శ.1055). క్రీ.శ.1075 లో రాజైనవాడు ముమ్మడి బేతరాజు. క్రీ.శ.1110 లో రెండవ బేతరాజు రాజుగా వచ్చి తన రాజ్యాన్ని విస్తరించాడు. ఇతని కుమారుడు రుద్రదేవ మహారాజు. యితడు తండ్రి వలె యుద్ధ ప్రియుడు. ఇతని కాలంలోనే వేంగీ, కళ్యాణీ చాళుక్యుల రాజ్యాలు అంతరించాయి. అదే అదనుగా తన రాజ్యాన్ని నాలుగువైపులా విస్తరింపజేశాడు. అనుమకొండ చాలక ప్రక్కన ఓరుగల్లు దుర్గాన్ని నిర్మించాడు. ఇతడు మహావీరుడు. క్రీ.శ. 1196 లో దేవగిరి యాదవులతో జరిగిన యుద్ధంలో మరణించాడు.

రుద్రదేవుని తర్వాత అతని తమ్ముడు మహాదేవరాజు రాజైనాడు. ఇతడు గజయుద్ధంలో నేర్పరి. ఇతను తన అన్నాను చంపిన యాదవులతో యుద్ధం చేసి మరణించాడు. మహాదేవరాజు కుమారుడు గణపతి దేవుడు. ఇతను కొంతకాలం యాదవుల బందీగా ఉంది విడుదలై తిరిగివచ్చి తన సర్వతోముఖ ప్రతిభతో మహా సామ్రాజ్యాన్ని స్థాపించాడు. చక్రవర్తి అయ్యాడు. దాదాపు నేటి ఆంధ్రదేశమంతా అతని ఏలుబడిలోకి వచ్చింది.

గణపతి దేవుని తర్వాత ఆయన కుమార్తె రుద్రమదేవి సింహాసనం అధిష్ఠించింది. కాకతీయుల రాజ్యంలో స్త్రీలకు ప్రాధాన్యత ఉంది. రుద్రమదేవి వీర వనిత.

నేటి పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలలో కొంత భాగం – ఆన్డాడు నిడదవోలు చాళుక్యులు పాలిస్తుండేవారు. వీరు కాకతీయులకు విధేయులైన సామంతులు. వీరిని గూర్చి ఆరుద్ర వివరంగా చర్చించారు (స.ఆం.సా, పుటలు 255-260).

అందుచేత గణపతి దేవుడు తన కుమార్తెను నిడదవోలు చాళుక్య రాజైన ఇందుశేఖరుని (క్రీ.శ 1238- 1255) రెండవ కుమారుడైన వీరభద్రునకిచ్చి వివాహం జరిపించాడు. రుద్రమదేవి తరువాత ఆమె మనవడు ప్రతాపరుద్రుడు రాజైనాడు. ఇతనిని ఢిల్లీ సుల్తాను మనుషులు పట్టుకుపోయారు. ఇంతటితో కాకతీయ సామ్రాజ్యం అంతరించింది. కాకతీయ సామ్రాజ్యంలో చివరి రాజు ప్రతాపరుద్రుడు. రుద్రమదేవికి ఇద్దరు కుమార్తెలు. ఒక కుమార్తె కొడుకు ఈ ప్రతాపరుద్రుడు.

కాకతీయ యుగ విశేషాలు

సురవరం ప్రతాపరెడ్డి గారు తాను రచించిన ‘ఆంధ్రుల సాంఘీక చరిత్ర’ లో (పుటలు 38 నుండి 100 వరకు) కాకతీయుల కాలం నాటి విశేషాలను వివరించారు. ఇది శృంగార యుగం ఆరుద్ర మాటల్లో..

“పూర్వ యుగాలలో జైనులు ఎంత శృంగార పురుషులయ్యారో, ఈ యుగంలో శైవులు అంతకు రెట్టింపుగా సకాములయ్యారు. పాల్కురికి సోమనాథుడు తన బసవ పురాణంలో, పండితారాధ్య చరిత్రలో మిండ జంగాల విచ్చలవిడి కామాన్ని ఉడ్డోలంగా వర్ణించాడు.”

ఈ యుగంలో సాహిత్యం వర్ధిల్లింది. శిల్పం పురివిప్పింది. రాళ్ళు రమణీయమైన శిల్పాలయ్యాయి. స్త్రీ, పురుషులు అలంకార ప్రియులు. సురవరం ప్రతాపరెడ్డి గారు విద్యావ్యాపకము, కళలు, చేతిపనులు మొ|| శీర్షికలతో 65 పుటలలో కాకతీయుల కాలం నాటి అన్ని విషయాలను గ్రంథస్తం చేశారు. వేశ్యలనుంచుకోవడం, జూదం ఈ కాలంలో ఉధృతంగా ఉండేది. బసవేశ్వరుని కాలంలో పన్నెండు వేలమంది మిండ జంగాలు ఉండేవారని, వీరి భోగాలకు భక్తులు దానం విరివిగా సమర్పించేవారని తెలుస్తున్నది. వార కాంతలు ఎటువంటి దుస్తులు ధరించాలో గూడా ‘కామందకం’ అనే నీతిశాస్త్ర గ్రంధం వివరిస్తున్నది. ఏ కాలంలోనైనా కొందరు స్త్రీలకు ఈ దుస్థితి నీడలా వెంటాడుతూనే ఉన్నది.

కాకతీయ యుగంలోని కవులు

౧. మంత్రి భాస్కరుడు : భారతానువాదం చేసిన తిక్కన మహాకవి తాతగారు ఈ మంత్రి భాస్కరుడు. ఇతడు భాస్కర రామాయణం వ్రాశాడా అన్న ప్రశ్నను ఆరుద్ర తగుమాత్రం చర్చించి చివరకు ఇలా తేల్చి చెప్పారు..

“హుళక్కి భాస్కరుడు వ్రాయించిన, వ్రాసిన రామాయణంలో మంత్రి భాస్కరునికి స్థానం కల్పించాలనుకుంటే వచ్చే చిక్కే ఇది. దేశంలో ఉన్న తాళపత్ర గ్రంథాలన్నింటినీ శోధించి గాని మంత్రి భాస్కరునికి పెద్ద పీట వెయ్యకూడదు. అంతవరకూ యితడు తిక్కనగారికి తాతగారు మాత్రమే” (స.ఆం.సా. పేజీ 273).

౨. హుళక్కి భాస్కరుడు: క్రీ.శ.1320 ప్రాంతంలో హుళక్కి భాస్కరుడు అనే కవి కాకతీయ రాజ్యంలో ఉండి రామాయణం వ్రాసినట్లు నిదర్శనాలు ఉన్నాయి. భాస్కర రామాయణంలో నలుగురు కర్తల పేర్లు ఉన్నాయి. మల్లికార్జున భట్టు, కుమార రుద్రదేవుడు, భాస్కరుడు మరియు యుద్ధకాండను హుళక్కి భాస్కరుడు, అయ్యలాచార్యుడు రచించారు. దీనిని గూర్చి ఆరుద్ర కొంత చర్చ చేశారు (స.ఆం.సా. పేజీ 275-276).

౩. యధావాక్కుల అన్నమయ్య: యధావాక్కుల అన్నమయ్య రచించింది సర్వేశ్వర శతకం. ఇది శార్దూల, మత్తేభ వృత్తాలతో చెప్పబడిన వృత్త శతకం.

 

**** సశేషం ****

Posted in August 2021, సమీక్షలు

2 Comments

  1. వసుంధర

    కోదండరామయ్యగారికి కోటి ప్రణామాలు
    మీవంటి వారి ప్రోత్సాహమే నా వంటి వారికి
    ఉత్సాహాన్ని ప్రసాదిస్తుంది.మీకు సర్వదా
    కృతజ్ఞతలు. సి వసుంధర

  2. కోదండ రామయ్య

    వసుంధర గారు ఎంతో కష్టపడి మనకు కావలసిన వివరాలను సేకరించి మనకు విస్తరలో వడ్డించారు.
    వారి పరిశ్రమను అందరు తెలుగు వారు మెచ్చుకొంటారు.

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!