Menu Close
Page Title

నన్నెచోడుని కుమారసంభవం ముగింపు – బద్దెన, అమృతనాథుడు, పావులూరి మల్లన

మన్మథుడు ఇంటికి వస్తాడు. రతి తనకు గల్గిన దుష్ట శకునాలు మొదలైన వాటివల్ల భయపడి

“అతని శరాసనంబు గనకాచలమిక్షు శరాసనంబు నీ
కతనిది నమ్ము పాశుపత, నుంటినగందెడు దృశ్యాలమ్ములు నీకు...”

అంటూ శివునితో వైరం పెట్టుకోవద్దని చెప్తుంది. ఎన్ని రకాలు చెప్పినా వినని మన్మథుడు శివుని కామకేళికి ఉసిగొల్పుతున్నప్పుడు, శివపార్వతులు వెండికొండ సానువులందు ఒక కొలనులో ఏనుగుల గుంపు విహరిస్తుండడం చూచిన పార్వతికి కౌతుకరతైకకాలీన భావాభిలాష కలిగింది. ఆమె ఉద్దేశం శివుడు గ్రహించాడు. అయితే వారి కలయిక ఎలా జరిగిందంటే,

“సతి గరణి యగుడు ద్రిగజ
త్పతి గరియై కూడి సతులు భవించిన యా
కృతి గూడ నేర్పకాదే
యతిశయముగ నింగితజ్నులకు ఫలమెందున్!”

అని నన్నెచోడుడు శివుని యొక్క ఇంగితజ్ఞానాన్ని ముందు చెప్పాడు. తర్వాత వాళ్ళలా ఏనుగుల రూపం ఎత్తడం ఎందుకు అంటే,

“ఆదిమూర్తుల శివశక్తుల చలమతులు
హరుడు, సతియును సురతార్దులై విహీన
తరములగు మృగరూపమున్ దాల్చిరనిన
గాము మాయల నెవ్వారు నేమిగారు”

(స.ఆం.సా. పేజీ 175-176). కుమారసంభవం -1-103.

శివునిపై కాముడు తన శరాలను వేస్తే, శివుడు తన నేత్రాగ్నితో మన్మథుణ్ణి భస్మం చేశాడు. ఇక్కడ  నన్నెచోడుడు వ్రాసిన ఒక పద్యం గూర్చి చెప్తూ ఆరుద్ర “ఈ పద్యం ‘ఆహా’ అనిపిస్తుంది.” అని మెచ్చుకోవడం జరిగింది.

ఆ పద్యం ఇలా ఉంది.

గిరిసుతమై గామాగ్నియు
హరు మై గోపాగ్ని యుం దదంగజుమై ను
ద్దుర కాలాగ్నియు రతి మై
నురు శోకాగ్నియును దగిలి యొక్కట నెగసెన్

ఇలాంటివి కుమారసంభవంలో కోకొల్లలుగా ఉన్నాయన్నారు ఆరుద్ర.

గ్రీష్మ వర్ణనలో చమత్కారం:

“ఆతప భీతి నీడలు రయంబున మ్రాకులక్రింద దూరెనో
ఆ తరులుం ద్రుషాభివంతులై తను నీడలు తార త్రాగెనో”

ఎండవేడికి భయపడి చెట్ల నీడలే చెట్ల క్రింద దూరాయట. కొంతసేపటికి ఆ చెట్లకు దాహం వేసి తమ నీడలను తామే తాగేసాయట. ఇక్కడ సూర్యుని గమనాన్ని బట్టి మన పూర్వీకులు గంట ఎంతైందో చెప్పేవారు. సూర్యుడు నడినెత్తి మీదికి వస్తే చెట్ల నీడలు కనపడవు. అపుడు సమయం పన్నెండు దాటిందని గుర్తు. నన్నెచోడుని పద్యం ఎండ తీవ్రతను తెల్పుతున్నాదన్నారు ఆరుద్ర.

ఆంధ్రా యూనివర్సిటీలో తెలుగు శాఖలో ఆచార్యులు, ఆచార్య కొర్లపాటి శ్రీరామ మూర్తి గారు ఇలా ఒక కొత్త వాదం లేవదీశారు. కుమారసంభవ కావ్యం నన్నెచోడుడు వ్రాయలేదని, మానవల్లి రామకృష్ణ కవి ఒక తాళపత్ర ప్రతిని సృష్టించి తంజావూరు గ్రంధాలయంలో ఉంచారని చెబుతూ “నన్నెచోడుని కుమారసంభవం ప్రాచీన గ్రంథమా?” (స.ఆం.సా. 181) అని పేరు పెట్టారు. దీనికి ఆరుద్ర చాలా బలమైన సాక్ష్యాలతో విపులంగా సమాధానం ఇచ్చారు. చివరగా ఇలా అన్నారు.

“.....కుమారసంభవమనే తెలుగు కావ్యం కూట సృష్టి అనే ఇటీవలి నీలాపనిందను ఎవరూ సీరియస్ గా పట్టించుకున్నట్లు లేదు. అయితే నన్నెచోడుని కావ్యాన్ని మాత్రం సాహితీపరులు సీరియస్ గా అధ్యయనం చేయాలి. అది మన ప్రప్రథమ సద్రస బంధుర ప్రభంధం.”

నన్నెచోడునికి రావాల్సిన ‘ప్రబంధ పరమేశ్వరుడు’ అనే బిరుదును కూడా ఎఱ్ఱన ఎత్తుకుపోయాడు.

నన్నెచోడుడు ....సమస్త వస్తు కవీశ్వర నూత్న రుచిరా కావ్య రత్నవీధి” అని వస్తు కవిత్వ పద్ధతిని మెచ్చుకొని, వస్తుకవితా మార్గాన్ని చేపట్టి ఒక కావ్యం, ఒక ప్రబంధం ఎలా ఉండాలో తెల్పుతూ, అంకితం, విషయ సూచిక, షష్ఠ్యంతాలు, అష్టాదశ వర్ణనలు, పూర్వ కవిస్తుతి మొదలైన అనేక క్రొత్త విషయాలను తన కుమారసంభవ కావ్యం ద్వారా తెలుగు ప్రజలకు మనోల్లాసాన్ని కల్గించిన మహాకవి. కోరాడ రామకృష్ణయ్య గారు నన్నెచోడుని గూర్చి “వాస్తవానికి ఆంధ్రసాహిత్యంలో ప్రప్రథమ ప్రబంధ పరమేశ్వరుడు కవిరాజ శిఖామణి నన్నెచోడుడే.” అని అన్నారు.

ఆరుద్ర “నన్నెచోడునికి పాత బిరుదులు ఇవ్వడానికి ప్రయత్నించక వేరే కొత్తపీట వేసి కొలుచు కోవడం మంచిది. నన్నెచోడుడు ప్రబంధ ప్రజాపతి” అని సరికొత్త బిరుదునిచ్చారు. (స.ఆం.సా. 18౦-181)

బద్దెన

“సుమతి శతకంలోని ఒక పద్యమైనా రాని ఆంధ్రుడుండడు. కాని దీని కర్త ఎవరో ఇప్పటికీ తేలలేదు. బద్దెన వ్రాశాడా లేదా అనేది అనుమానం.

బద్దెన ‘నీతిశాస్త్రముక్తావళి’ అనే గ్రంథాన్ని వ్రాశాడు. అందులో తనను తానూ రకరకాలుగా సంబోధించుకొన్నాడు. ఆ పేర్లు బిరుదులు – కావ్య చతుర్ముఖుడు, నన్నెచోడ నరేంద్రుడు, నన్నన గంధవారణుడు. ‘నన్నన అనే వ్యక్తి గంధవారణము వంటి వాడు’ అని వేదం వెంకటరాయ శాస్త్రి గారు వివరించారు. (స.ఆం.సా. 187). ఇది కన్నడ బిరుదము. ఈ బిరుదు కన్నడ కావ్యాలలో ఉంది. పశ్చిమ చాళుక్యుల శాసనాలలో లెక్కలేనన్ని ఉదాహరణముల నియ్యవచ్చును అని వేదం వారి మాట. కుమారసంభవ గ్రంథ కర్త నన్నెచోడుడు, బద్దెన వీరి మధ్య సంబంధం గూర్చి వెంకటరాయ శాస్త్రి ‘....అతనికి (నన్నెచోడునికి) సామంతుడో, కుమారునికి సమానమైన భృత్యుడో లేక సాక్షాత్ కుమారుడో...అయి ఉండి, అందుచే నన్నన గంధ వారణుడని కూడా సంబోధించుకొన్నాడు. అందుకే నన్నెచోడ, బద్దె చోడు లిరువురును ఒకరి వెనువెంటనొకరు రాజ్యమేలియో, జీవించియో యుండవలెను’ అని తను వ్రాసిన ‘నన్నెచోడుని కవిత్వము’ అనే గ్రంథంలో (పుటలు 84-86) వివరించారు.

బద్దెన తన ‘నీతిశాస్త్రముక్తావళి’ లో బద్దెభూపతి, బద్దెనృపా, బద్దెనరేంద్రు అన్నవిగాక మరో 19 బిరుదులూ తనకు ఉన్నట్లు చెప్పుకొన్నాడు. క్రీ.శ.1347 ప్రాంతం వాడైన మడిక సింగన తన సకల నీతి సమ్మతంలో ముప్పై పద్యాలు బద్దెనవి ఉదహరించాడని ఆరుద్ర తెల్పారు ((స.ఆం.సా. 188).

‘మొత్తం మీద సుమతి శతకానికి బద్దెన వ్రాసిన నీతిశాస్త్రముక్తావళికి బేధం ఉందని, అయితే సుమతి శతకపు ధోరణి పద్యాలు అక్కడక్కడా లేకపోలేదు’ అని అన్నారు ఆరుద్ర. ఇంతకూ సుమతి శతక కర్త ఎవరో ఖచ్చితంగా తెలియలేదు.

%%%

అమృతనాధుడు

ఈ శీర్షిక క్రింద అమృతనాధుని గూర్చి చెప్తూ ఆరుద్ర ‘వీరమరణం పొందిన వీరులపై వ్రాసిన స్మృతి పద్యాలు (ఎలిజీ) ఒక 15 పద్యాలు దొరికాయి. అవి వీరమరణం పొందిన (క్రీ.శ. 1124) మైలన భీముని మరణం గూర్చి ఒక్క కవి, లేక పలువురు కవులు వ్రాసిన పద్యాలు.’ (ఈ పద్యాలన్నీ ఆరుద్ర తన గ్రంథంలో ప్రచురించారు).

నల్గొండ జిల్లా ఏరువ సింహాసనాన్ని ఎక్కిన వారిలో ఒక మైలమదేవి ఉంది. వీరపత్ని, వీరమాత అయిన ఈమెకున్న ముగ్గురు కొడుకులలో మధ్యవాడు భీమన. పాండవ మధ్యముడైన భీమునితో సమానమైన తన కుమారుని క్షేమం కోరి మిలమ క్రీ.శ.1124 లో సూర్యగ్రహణ కాలంలో నూరుమంది బ్రాహ్మణులకు చోడనారాయణ పురము అనే అగ్రహారాన్ని దానం చేసింది.

మైలన భీముని మరణాన్ని పురస్కరించుకొని వ్రాయబడిన పదిహేను పద్యాలలో చివరి పద్యాన్ని బాచిరాజు బసవన్న అనే లాక్షిణికుడు తన సర్పగారుడము అనే గ్రంధంలో ఉదహరించాడు. ఈ పద్యాలన్నింటినీ వేటూరి ప్రభాకర శాస్త్రి సేకరించారు. శాస్త్రిగారు రచించిన చాటుపద్య మణిమంజరిలో 1వ భాగంలో తొలిపద్యం, మిగతావి 2వ భాగంలో అచ్చువేశారు. అయితే ఈ పద్యాలు వేములవాడ భీమకవివి అని శాస్త్రి గారు అభిప్రాయపడ్డారు. కాని చివరి పద్యాన్ని బట్టి ఇవి అమృతనాథుని పద్యాలని చెప్పవచ్చు.’ అని ఆరుద్ర అభిప్రాయపడ్డారు. ఇందులో నాల్గవ పద్యం తాళ్ళ పొద్దుటూరు శాసనంలో చెక్కి ఉన్నట్లు ఈ శాసనాన్ని గూర్చి నేలటూరు వెంకట రమణయ్య, ముట్లూరు వెంకటరామయ్య ‘భారతి’ (1930 ఫిబ్రవరి) లో ప్రచురించారు.

తర్వాత ఖడ్గతిక్కన వీరమరణాన్ని గూర్చి, ఇంకా ఎన్నో వీరగాథలను గూర్చి కవులు చాటువులుగా గొప్ప పద్యాలు రచించారని, వారు పేరు కోసం గాక జాతి కోసం మహా వీరులవడం కోసం వ్రాసే మహాకవులని, వారి కోవకు చెందినవాడే ఈ అమృతనాధుడని ఆరుద్ర కీర్తించారు.

పావులూరి మల్లన

నన్నయ ప్రారంభించిన అనువాద విధానం మొదట కొంత పండితులకు పట్టకపోయినా, తర్వాత తర్వాత శాస్త్రీయ గ్రంథాలు కూడా సంస్కృతం నుండి తెనిగించాలన్న ఆలోచన రేకెత్తింది. తత్ఫలితంగా పావులూరి మల్లన వ్రాసిన గణిత శాస్త్ర గ్రంథం, సంస్కృతం నుండి అనువదింప బడింది. సంస్కృతంలో ‘గణిత సార సంగ్రహం’ రచించిన వాడు మహావీరా చార్యులు. ఇతడు రాష్ట్రకూట రాజగు అమోఘవర్ణుని కాలం (క్రీ.శ. 814-817) వాడు. ఇతను జైనుడు.

**** సశేషం ****

Posted in July 2021, సమీక్షలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!