Menu Close
Page Title

6. నన్నెచోడుడు – కుమారసంభవము

ఆంద్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ వారు పోటీపెట్టి నన్నెచోడుని మీద పుస్తకాలను వ్రాయించారు. వేదం వెంకటరాయ శాస్త్రి గారు “నన్నెచోడుని కవిత్వము” అనే పేరున వ్రాసిన గ్రంథానికి అకాడెమీ బహుమతి లభించింది. ఇంకా ఇతర రచనలు-

౧) భాషా ప్రవీణ – అమరేశం రాజేశ్వర శర్మ గారు – “నన్నెచోడుని కవిత్వము”
౨) శ్రీపాద లక్ష్మీపతి శాస్త్రి గారు – 1937 లో ప్రచురించిన “నన్నెచోడుని కుమారసంభవ విమర్శనము”
౩) దేవరపల్లి వెంకటకృష్ణా రెడ్డి గారు ప్రచురించిన “నన్నెచోడ కవి చరిత్ర”

చెప్పుకోదగ్గ గ్రంథాలు.

ఈ గ్రంథాలను చూసి ఆరుద్ర గారు ఇలా అన్నారు, “ఈ పుస్తకాలన్నీ కవిరాజ శిఖామణి యొక్క సర్వతోముఖ ప్రతిభను సమగ్రంగా చూపెడతాయి. ఆదికవి అన్న బిరుదు లేకపోతే పోయింది గాని నన్నెచోడుడు నిజంగా చాలా విషయాలలో ఆద్యుడు.”

ఆ విషయాలు ఒక పట్టికగా వ్రాసి నప్పుడు నన్నెచోడుని ఆ యా విషయాలు నిర్ణయించడంలో ప్రథముడని అందరూ తప్పక అంగీకరించాలి. ఆ ప్రత్యేక విషయాలు; ౧) ఇష్టదేవతా ప్రార్థన, ౨) పూర్వ కవిస్తుతి, ౩)కుకవినింద, ౪) గ్రంథకర్త స్వవిషయం, ౫)కృతిపతి వర్ణన మరియు షష్ఠ్యంతాలు (స.ఆం.సా. పేజీలు 162-163).

ఇవికాక అష్టాదాశ వర్ణనలు గూడా నన్నెచోడుడే మొదట చేయడం జరిగింది. ఈ విషయాన్ని గూర్చి చెప్తూ, “కవిరాజ శిఖామణి పనిగట్టుకొని అష్టాదశ వర్ణనలు చేయడమే అతని ఆర్వాచీనతకు నిదర్శనము” అని వేదం వెంకటరాయ శాస్త్రి గారు అభిప్రాయపడ్డారు. నన్నెచోడుని తర్వాత అష్టాదశ వర్ణనలను పేర్కొన్నవాడు పాల్కురికి సోమనాథుడు.

దేవతా స్తుతి – పెద్దలకు నమస్కృతి

నన్నెచోడునికి పూర్వం మల్లియ రేచన తన కవిజనాశ్రయములో ఒక కంద పద్యంలోని సగభాగంలో దేవతా స్తుతి చేశాడు. నన్నయ ఒకే పద్యంలో ‘హరిహరాజ – గజాననార్క’ అని వ్యాసవాల్మీకులకు, దేవతాతతికి నమస్కృతి చేశాడు. కానీ నన్నెచోడుడు వరసపెట్టి వాల్మీకిని, వ్యాసుని, కాళిదాసును, వస్తు కవితలో జనారాధితుడైన భారవిని, వస్తు కవిత చెప్పి హరునే మెప్పించిన ఉద్ధటుణ్ణి, తెగిన చేతులను తెచ్చుకొన్న బాణుణ్ణి, అందర్నీ, ఒక్కొక్కర్నీ ఒక్కొక్క పద్యంలో స్తుతించాడు. “నన్నెచోడుడు చెప్పిన దానిని బట్టి ఆనాడు విస్తర, మార్గ, దేశి, వస్తు కవితలనే భేదంతో చతుర్విద కవిత్వ పద్దతులు ఉన్నట్లున్నాయి” అని అన్నారు ఆరుద్ర.

గురువు ఘనత – గురు భక్తి

గురువును, విద్య నేర్పినందుకు గుర్తు పెట్టుకోవడం శిష్యుని ధర్మం.

నన్నెచోడునికి గురువును తలచుకొంటే మైమరచి పోయేటంత భక్తి. నన్నెచోడుని గురువు పేరు మల్లికార్జున యోగి. శ్రీశైల నివాసి. అపార విద్యా పారంగతుడు. పరవాది భయంకరుడుగా ప్రఖ్యాతిగాంచిన మల్లికార్జున పండితారాధ్యుడు, ఈ మల్లికార్జున యోగి ఒకటి కాదు. ఇద్దరు వేర్వేరు వ్యక్తులు.

నన్నెచోడుడు తన గురుభక్తితో తానే మైమరచి ఎలా వర్ణించాడో గమనించాలి. పార్వతి, శివుని కోసం తపస్సు చేయబోయేటపుడు ఆమెకు విప్రముని పుంగవుడైన జంగమ మల్లికార్జునుడు కనబడ్డాడు. అతడు వృక్షమూల నివాసుడు. అతనిని చూసి పార్వతి “భూరిప్రీతింబ్రణమిల్లి గురుస్థానంబుగా స్వీకరించి పార్వతి పరమ భక్తి యుక్తి నారాధించి తత్ప్రసాధంబున పడయు నిజాభిమతంబు త్యజించి శైవాగమవిధి దీక్షగైకొని పరమేశ్వరుండుదయంబయిన బ్రసన్నుండగునట్టి మంత్రధ్యాన వ్రతాచారంబు ఉపదేశంబు గొని తన్నియోగంబున” తపస్సు ప్రారంభించినట్లు నన్నెచోడుడు రచించాడు. దీనిని గూర్చి చెబుతూ “తన గురువును, పార్వతికి గురువును చేశాడు. ఇంతకన్నా గురుభక్తి ఇంకేం కావాలి” అన్నాడు ఆరుద్ర. నిజమే గదా పార్వతీ దేవికే గురువును చూపించాడు నన్నెచోడుడు. పార్వతి నిజాభిమతంబు త్యజించి శైవాగమవిధి దీక్షగైకొన్నట్లు చెప్పిన నన్నెచోడుని భక్తి పరాకాష్ఠనందింది.

నన్నెచోడుడు “తన గురువు తనకు ప్రసాదించిన కవిత్వాన్ని ‘రవికి దీపమున నర్చన లిచ్చు పగది అర్పిస్తున్నా’ నని చెప్పాడు. (స.ఆం.సా. 170).

స్వవిషయం

నన్నెచోడుడు తనను గూర్చి సూర్యవంశంలో పుట్టినట్లు చెప్పుకొన్నాడు. తన తండ్రి పాకనాడు ఇరువది యొక్క వేయికి అధీశుడైన చోడబల్లి అనీ, తన తల్లి హైహయాన్వయాంబర శశిరేఖయైన శ్రీసతి అని చెప్పాడు. తానూ రాతి పొన్నలు, రాతి కోడి, ఉన్న ఒరయూరి కధిపతిననీ, తనకు టెంకణాదిత్యుడనే బిరుదున్నదని చెప్పుకొన్నాడు.

తమిళదేశంలో ఉన్న ఒరయూరు, నన్నెచోడుడు చెప్పిన ఒరయూరు ఒకటి కాదు అని నిడదవోలు వెంకటరావు గారు తెల్పారు (తెలుగు కవుల చరిత్ర, పుట 199). ఈ ఒరయూరు ఆంధ్రదేశంలో ఉన్నదని చెప్పిన వెంకట రావు గారు ఆంధ్రలో ఎక్కడ ఉన్నదో తెల్పలేదు. వాస్తవానికి ‘ఒరయూరు పురవరాధీశ్వరా’ అనేది ఒక బిరుదు. మరి కొంతమంది కూడా ఇలానే – కోడూరు చోడులు తాము ఊరు విడిచిపెట్టినా కోడూరు పురవరాధీశ్వరులమని చెప్పుకోవడం జరిగింది.

నన్నెచోడుని గూర్చి తెల్పే శాసనం పెద చెరుకూరి శాసనం ఒక్కటే దొరికింది. ఈ శాసనంలో మాత్రమే చోడబల్లి, నన్నెచోడులనే తండ్రీకొడుకుల పేర్లు ఉన్నాయి. నన్నెచోడుడు శ్రీశైలంలో వేయించిన శాసనాలను వీర శైవుల కాలంలో ధ్వంసం చేసి ఉండవచ్చు. నన్నెచోడుడు కాలాముఖ శివుడు. ఆదిలో శ్రీశైలం జైనుల స్థావరం. కాలాముఖాది శైవుల తర్వాత వీర శైవులు వచ్చి అక్కడ ఉన్న శాసనాలను ధ్వంసం చేశారు.

ప్రతిభ, ప్రతిన, కావ్యకవిత్వ లక్షణాలు, విషయసూచిక షష్ఠ్యంతాలు – అంకితం

నన్నెచోడుడు తనది అనూన ప్రతిభ అన్నాడు. అంటే సంపూర్ణమైన ప్రతిభ. అందుకే తన కృతిని “సకలావయములు సంపూర్ణంబైన కావ్యాంగన’ అని చెప్పుకొన్నాడు. మొత్తం 2008 గద్య, పద్యాలతో రచింపబడిన నన్నెచోడుని కుమారసంభవంలో సంస్కృత వృత్తాలు 454 మాత్రమే. కందపద్యాలు ఎక్కువ. ప్రతి ఆశ్వాసం కందపద్యం తోనే మొదలవుతుంది. అటు తర్వాత ఎనిమిది పద్యాలు షష్ఠీ విభక్తి ఉన్న పదాలతోనే వ్రాశాడు. వీటినే షష్ఠ్యంతాలు అంటారు. ఇలా షష్ఠ్యంతాలతో అంకింతమిచ్చిన మొదటి తెలుగు కవి నన్నెచోడుడే.

‘రవికుల శేఖరుండు కవిరాజ శిఖామణి...’ అని తను తన గురువుకు కావ్యాన్ని అంకితమిచ్చే విషయం చెప్తూ, తన ‘ప్రతిభాసముద్రంలోని ఉదీర్ణ రుచిర వస్తు విస్తారితోత్తమ కావ్య రత్న విభూషణాన్ని ఆ కల్పాంత స్థాయిగా తన గురువు శ్రీ పాదాలకు విభూషణ చేస్తానని’ ఎంతో ఆనందంతో చెప్పుకొన్నాడు.

తన కావ్య రచనకు ముందు విషయసూచిక ఏర్పరిచాడు. ‘సతి జన్మం, గణపతి జన్మం, దక్షయజ్ఞ ధ్వంసం....కుమార జననం, తారకాసుర సంహారం ఇలా 12 విషయాలుగా కథను విభజించాడు. ఇది 12 ఆశ్వాసాల గ్రంథం. ఇందులో నవరసాలు, అష్టాదశ వర్ణనలు, ముప్పైరెండు అలంకారాలు, చిత్ర కవిత్వం, బంధ కవిత్వం ఉన్నాయి.

ఆరుద్ర నన్నెచోడుని కుమారసంభవం నుండి ఆశ్వాసాల మొదటి విభక్తులను గూర్చి ఒక పట్టిక తయారు చేశారు. (స.ఆం.సా. 171 – 173).

వస్తుకవిత

నన్నెచోడుడు తనది వస్తుకవిత అని చెప్పుకొన్నాడు. అసలు వస్తుకవిత అంటే ఏమిటి? అన్న ప్రశ్నకు రకరకాల అభిప్రాయాలను పెద్దలు వెలిబుచ్చారు. అమరేశం రాజేశ్వర శర్మ గారు ‘వస్తుకవిత యనగా బ్రకృతిని వాస్తవముగా వర్ణించు కవిత’ అని తెల్పారు. వేదం వెంకటరాయ శాస్త్రి గారు ‘ప్రబంధములు పలువిధములనియు, అందు మహా కావ్యము వస్తువు, అనగా కధా వస్తువు ప్రాధాన్యము గలదనియు, అట్టి వస్తువును ఆశ్రయించినదే వస్తు కవిత...’ అని చెప్పారు.

కవిజనాశ్రయ కర్త మల్లియ రేచన తానూ వస్తుకవి జనాశ్రయుణ్ణ ని చెప్పుకొన్నాడు. కన్నడంలో చంపూ రచనలో ‘వెర్తాణ’ ‘బెదండె’ అనే కావ్య ప్రక్రియలు ‘నిరతి శయ వస్తు విస్తర పద్య మహా కావ్యాలే’ అని నన్నెచోడుడు కన్నడకవి పంపన కవిత్వం చదివే ఉంటాడు అన్నారు ఆరుద్ర. పంపన వస్తువిద్య, వస్తుకృతి అనే పదాలు వాడాడు.

కుకవినింద

నన్నెచోడుని కాలంలో ఉత్తమ గ్రంధపఠనం తక్కువ కాబోలు. అందుకే నన్నెచోడుడు,

“....చెరకు విడిచిన రసమున కెరగిరాక
పిప్పి కరిగెడు నీగల పెల్లువోలె”

అని చెరుకు రసానికి గాకుండా రసం తీసేసిన పిప్పిమీద ఈగలు వాలినట్లు కుకవుల రచనలకు అల్పులు ఎగబడతారు అని నిరసించాడు. కుకవినింద చేశాడు.

కుమారసంభవం

ఉగ్ర తపస్సు చేస్తున్న శివుని దృష్టి పార్వతివైపు తిప్పమని మహేంద్రుడు, మన్మథుని పిలిపించి అడిగాడు. ‘నాకిది ఏమి గగనం’ అని దేవేంద్రుడిచ్చిన తాంబూలం తీసుకొంటాడు మన్మథుడు.

**** సశేషం ****

Posted in June 2021, సమీక్షలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!