Menu Close
Page Title
చాళుక్య యుగం

౩. ఆంధ్ర మహాభారత రచన ప్రారంభం – భారత రచనకు గల కారణాలు

“ఆంధ్ర సాహితీ పరులంతా ఏటేటా పండుగ చేసుకోవాల్సిన రోజు తెలుగు భారతం పుట్టిన రోజు” ఆరుద్రకు గల ఆంధ్ర సాహిత్యాభిమాన కల్పవృక్షానికి పూచినా అక్షర కుసుమాలివి. మన పుట్టిన రోజులను ఘనంగా జరుపుకోవడమే గాని – భారతాన్ని గాని, అది పుట్టినరోజును గాని తలచుకోవడం ఎప్పుడో మరిచిపోయాము మనం.

వైదిక మతం – జైన, బౌద్ధమతాలు

శాస్త్రాలను, విద్యను తమ గుప్పిట్లో పెట్టుకొన్న మతం వైదిక మతం. సామాన్య మానవులకు జ్ఞానం అందుబాటులో లేని అట్టి పరిస్థితులలో ఉద్భవించాయి జైన, బౌద్ధమతాలు. సామాన్య ప్రజల కొరకు, స్త్రీల కొరకు ఇంకా రాణుల కొరకు కూడా జైన తీర్ధంకరులు, బౌద్ధ శ్రమణులు తమ మతాలను చక్కగా ప్రచారం చేశారు. అనుకొన్నట్టుగానీ ప్రజలంతా జైన, బౌద్ధ మతాలను అనుసరించి ఆరాధించడం ప్రారంభమయింది. వైదిక మతస్థుల గుండెల్లో దడ మొదలైంది. రాణులు ఆ యా మతాలకు విరాళాలు ఇచ్చారు. అపుడు కుమారభట్టు మొ||వారు వైదిక మతాన్ని కాపాడటం కోసం జైన, బౌద్ధమతాలను అధ్యయనం చేసి ఆ యా మతాలను ఖండించారు.

శంకరాచార్యులు విష్ణుమూర్తి యొక్క దశావతారాలలో 9వ అవతారంగా బుద్ధుని అవతారాన్ని ప్రకటించి ప్రజలను మంత్ర ముగ్దులను చేశాడు. నిజంలో రుద్రుడు అనార్యమతానికి చెందినవాడు. అనార్య దేవత, శంకరాచార్యుల పుణ్యమా అని త్రిమూర్తులలో ఒకడయ్యాడు. ఈ విధంగా జైన, బౌద్ధాలను బలహీనం చేయడం వల్ల వైదికమతం పుంజుకొంది. (పేజి 127).

రాజరాజ నరేంద్రుని తల్లిదండ్రులు జైన మతస్థులు. కానీ దక్షిణ భారతదేశంలో ఆనాడు విలసిల్లుతున్న శైవ మతాన్ని రాజరాజ నరేంద్రుడు స్వీకరించాడు. వైదిక మతాన్ని ఉద్ధరించడానికి రాజరాజు వర్ణాశ్రమ ధర్మాలను అనుసరించాడు. అందుకే సంస్కృత మహాభారతాన్ని నన్నయ చేత తెనిగించే ప్రయత్నం చేశాడు. దీనిని గురించి చెప్తూ “అగ్రవర్ణముల వారి అధికారము పదిల పరచుటకై ప్రాచీన మత గ్రంథములను దేశ భాషలలోకి పరివర్తింప జేసిరి. ఇదియే కాబోలు తొలుదొల్తున పంచమ వేదమును సృజించుటకు హేతువు” అన్నారు కట్టమంచి రామలింగా రెడ్డి గారు (ఆరుద్ర, పేజీ 127).

భారత రచనకు మరో కారణం (స.ఆం.సా పేజీ 128)

తెలుగు కవులు కన్నడంలో, సంస్కృతంలో వ్రాసిన కావ్యాలు దొరికాయి. కానీ తెలుగులో వ్రాసిన కావ్యాలు దొరకలేదు. కన్నడంలో ‘విక్రమార్జున విజయం’ అనే పేరుతో పంప భారతం, గదా యుద్ధం అనే మరో కావ్యం భారత కథను ప్రచారంలోని తెచ్చాయి. తమిళంలో “వెణ్బా” గీతాలలో భారత రచన జరిగింది.

సంస్కృత భారతాన్ని దేవాలయాల్లో పురాణంగా చెప్పేవారు. సంస్కృతంలో పంచరాత్రలు, మాట కావ్యం, కర్ణ భారం వంటి రచనలు – భాసుని నాటకాలు పాండవుల కథను రసవత్తరంగా చిత్రించాయి. ఇవన్నీ చూచిన రాజరాజు “బహు భాషల, బహు విధముల, బహు జనముల వలన వినుచు భారత బద్ధ స్ఫృహుడై నన్నయను భారత రచనకు పూనుకొమ్మని వేడుకొన్నాడు. భారత రచన ప్రారంభమైంది. ఈ విధంగా భారతానికి భారీ ప్రచారం జరిగింది (స.ఆం.సా పేజీ 128).

రాజ మహేంద్ర పురంలో సకల భువన లక్ష్మీ విలాస నివాసమైన కోటలో, విద్యా విలాస గోష్ఠిలో ఇష్ట కదా వినోదాలతో రాజరాజు ఆనందించేవాడు. ఆ గోష్ఠిలో గొప్ప పౌరాణికులు, వైయాకరణులు, మహా కవులు, వివిధ తర్క విగాహిత సమస్త శాస్త్ర సాగర ప్రతిభులైన తార్కీకులు ఉండేవారు.

అట్టి సభలో ఒకనాడు రాజరాజు తనకు అనురక్తుడు, లోకజ్ఞుడు, శబ్ద శాసనుడు, ఉభయ కావ్య రచనా శోభితుడు అయిన నన్నయ గారిని చూచి ఇలా అన్నాడు.

“విమలమతిలో అనేక పురాణాలు విన్నాను. అర్థ, ధర్మ శాస్త్రాల తెరగు తెలుసుకొన్నాను. ....అయినా నా మనసులో ఎప్పుడూ శ్రీ మహాభారతం లోని అంతరార్థం వినాలనే అభిలాష అధికంగా ఉంటూ ఉంది. అదీ కాక మా చంద్రవంశం లో ప్రసిద్ధులైన పాండవోత్తములను గూర్చి నిరంతరం వినాలను కొంటున్నాను....నా మనసెప్పుడూ భారత కథా శ్రవణ ప్రవణమే (ఆసక్తి) కాబట్టి కృష్ణద్వైపాయనుడు, మునిశ్రేష్టుడు రచించిన మహా భారతంలో నిరూపితార్థమేమిటో తెలిసేటట్లు మీ తెలివితేటలు, ప్రతిభ చూపించి తెలుగులో రచించండి” అని నన్నయను రాజరాజు కోరాడు. నన్నయ పద్యానికి ఆరుద్ర వచనానువాదమిది. నన్నయ పద్యం ఈ క్రింద ఇస్తున్నాను.

చం|| విమల మతింబురాణములు వింటి ననేకము, అర్థ ధర్మ శా
     స్త్రములు తెఱం గెఱింగితి, నుదాత్త రసాన్విత కావ్యనాటక
     క్రమంబు పెక్కుసూచితి జగత్పరి పూజ్యములైన యీశ్వరా
     గమముల యందు నిల్పితి బ్రకాశముగా హృదయంబు భక్తితోన్
     (శ్రీమదాంధ్ర -మహా-భా ; ఆది-1-పేజీ 10; పద్యం 10)

రాజ రాజు అడగగానే నన్నయ ఇలా ప్రత్యుత్తరమిచ్చాడు.

“ఆకాశంలో మసక మసకగా కాక స్పష్టంగా కనుపించే నక్షత్రాలను లెక్కపెట్టడం, సర్వ వేద శాస్త్రాల అశేష సారాన్ని ముదంతో పొందడం, అడుగు పెట్టడానికి వీల్లేని నిగూఢార్థ జలాలున్న భారత భారతీ సముద్రాన్ని, బుద్ధి బాహుబలంతో ఈదడం బ్రహ్మదేవునికైనా చేతనవునా? అయినా, దేవా! నీవు అనుమతించావు గనుక, విద్వజ్జనుల అనుగ్రహంతో నాకు తెలిసినట్లు ఈ కావ్యాన్ని రచిస్తాను. ముందుగానే విద్వాజ్జనాన్ని గూడా తన మాటల చేత శాంతపరుస్తూ నన్నయ తన భారత రచన ప్రారంభించాడు.

నన్నయ పద్యానికి ఆరుద్ర వచనానువాదం, పై విషయం. నన్నయ పద్యాన్ని ఇక్కడ పొందుపరుస్తున్నాను.

అమలిన తారకా సముదయంబుల నెన్నను సర్వవేద శా
స్త్రముల యశేషసారము ముదంబున బొందను బుద్ధి బాహు వి
క్రమమున దుర్గమార్థ జలగౌరవ భారత భారతీ సము
ద్రము దఱియంగ నీవను విధాతృకైనను నేరం బోఱనే!!!
(శ్రీమదాంధ్ర -మహా-భా ; ఆది-1-పేజీ 14; పద్యం 19)

రాజ రాజ నరేంద్రుని తండ్రి విమలాదిత్యుడు. ఇతడు సూర్య వంశపు రాజులైన చోళుల ఇంటికి అల్లుడయినాడు. అందువల్ల విమలాదిత్యుడు తన వంశం కూడా గొప్పదని చెప్పుకోవడానికి తాము చంద్రవంశపు రాజులమని ప్రకటించుకొన్నాడు. తండ్రిలాగే రాజ రాజ నరేంద్రుడు కూడా తమ వంశం చంద్రవంశమని చెప్తూ “మా చంద్రవంశం లో ప్రసిద్ధులైన పాండవోత్తముల గురించి నిరంతరం వినాలనుకొంటున్నాను....” అని భారత రచనకు నాంది పలికాడు. అయితే వీరిద్దరికి పూర్వమున్న చాళుక్యరాజులెవరూ తాము చంద్రవంశపు రాజులమని చెప్పలేదు. దీనిని గూర్చి ఆరుద్ర మాటలు“ వారితో (చోళులతో) సాపత్యం కోసం వేంగీ చాళుక్యులు ముఖ్యంగా విమలాదిత్యుడు గొప్పలు చెప్పుకోవడం ప్రారంభించాడు”. అదే విధంగా రాజ రాజ నరేంద్రుడు గూడా భారతానువాద సందర్భంగా తాము చంద్ర వంశీయులమని చెప్పుకోవడం జరిగింది (స.ఆం.సా. పేజీ 152).

**** సశేషం ****

Posted in March 2021, సమీక్షలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!