Menu Close
తెలుగు పద్య రత్నాలు
-- ఆర్. శర్మ దంతుర్తి

తెలుగులో పద్యాలు, కావ్యాలు, రాసినవాళ్ళలో కవిత్రయం, పోతన, కంచెర్ల గోపన్న, వేమన, బద్దెన లాంటి వారు ఎప్పటికీ సాహిత్యంలో చిరస్మరణీయులు. ఆ పద్యాలు పరిచయం చేయడానికిదో చిన్న ప్రయత్నం. ఇందులో మొదటి పద్యం కవిసామ్రాట్ శ్రీ విశ్వనాధ సత్యన్నారాయణగారు చెప్పినట్టూ ‘తెలుగువారి పుణ్యపేటి’ అయిన పోతనది.

శా. శ్రీ కైవల్య పదంబుఁ జేరుటకునై చింతించెదన్ లోక ర
    క్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకున్ దానవో
    ద్రేకస్తంభకుఁ గేళి లోల విలసదృగ్జాల సంభూత నా
    నా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింభకున్.

శ్రీ మదాంధ్ర మహాభాగవతం మొదలుపెడుతూ పోతన మొదట రాసిన పద్యం ఇది. ఇది భాగవతానికే కాదు మొత్తం తెలుగు సాహిత్యానికే మకుటాయమానమైన పద్యం అని కరుణశ్రీ గారు అంటారు. కావ్యాలు రాసేటపుడు అందరూ మొదలుపెట్టినట్టే పోతన కూడా శుభకరం అని చెప్పడానికి “శ్రీ” తో మొదలుపెట్టాడు. కరుణశ్రీగారు అనడం ప్రకారం ఈ పద్యంలో ఆరు దళాలు ఉన్నాయి. మొదటి దళం, “శ్రీ కైవల్య పదంబుఁ జేరుటకునై చింతించెదన్.” ఇది భాగవతం శుకమహర్షి దగ్గిరనుంచి వినే పరీక్షిత్తుకీ, “భాగవతం రాస్తే నీ భవబంధాలు తెగుతాయి, అని రామభద్రుడు చెప్పి రాయమంటే నేను రాస్తున్నాను, కైవల్యపదం అందుకోవడానికి” అనే పోతనకీ, భాగవతం ఎందుకు చదవడం అని అడిగేవారికీ సమాధానం. మరి రెండో దళం ఆ కైవల్యపదంలో ఉండేవాడి గురించి, “లోక రక్షైకారంభకు.” ఆయన మొదట లోకాలని రక్షించేవాడు. మూడోది, “భక్త పాలన కళా సంరంభకున్.” ఎప్పుడు ఎలా రక్షిద్దామా తన భక్తులని అని కంగారు పడుతూ (సంరంభంతో) చూస్తూ ఉంటాడుట భగవంతుడు. నాలుగు, “దానవోద్రేకస్తంభకు.” మనలో ఉండే దానవ, రాక్షస గుణాలని అణిచేవాడు. గమనించారా? మొదట మన దానవ గుణాలు అణిచేది లేదు. ముందు లోక రక్షణ, భక్తపాలన అప్పుడు ఇంకా కావాలిస్తే దానవోద్రేక స్తంభన. ఆ క్రమంలో ఎప్పుడూ కూడా మంచి గుణాలు ముందు, చెడ్డవి తర్వాత.  భగవంతుడు మన తల్లో తండ్రో అనుకుంటే, మనకి సహాయం చేయడానికి మన తల్లీ తండ్రీ ఎంత తయారుగా ఉంటారో, భగవంతుడు దానికి పదిరెట్లు ఎక్కువగా సిద్ధంగా ఉంటాడన్నమాట.

మనని ఎల్లవేళలా రక్షించే, మన దానవోద్రేక స్తంభకుడెలాంటివాడు? అది అయిదో దళం నుంచి చెప్తున్నాడు, “గేళి లోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు.” విలాసంగా కళ్ళు తిప్పుతూ ఈ బ్రహ్మాండాలని ఆడించే మహావిష్ణువు. భగవంతుడెటువంటివాడు? తన ఆటల కోసం (కేళి లోల) విలాసంగా బ్రహ్మాండాలు సృష్టిస్తూ, లయం చేస్తూ ఉంటాడుట ఆయన. “నానాకంజాత భవాండ కుంభకు” అంటే అనేకానేక (పద్మంలోంచి పుట్టిన బ్రహ్మకి ఆధారమైన అండము- బ్రహ్మాండము) లోకాలకి నాయకుడు. ఈ దళంలో చెప్పే మరో విషయం ఏమిటంటే, ఆయన కళ్ళు సూర్య చంద్రులవంటివి, లోకాలకి కారణమైనటువంటివనీ, ఆ సూర్య చంద్ర వంశాల గురించి బాగవతంలో చెప్పడానికి మున్నుడి.

ఇంక ఆఖరి దళం “మహానందాంగనా డింభకున్,” అనేది లీలామానుషుడైన శ్రీహరి మన మధ్యే వినోదంగా నందుడి కొడుకై చక్రం తిప్పడం. ఇది భాగవతంలో వచ్చే కృష్ణావతారానికి ప్రతీక. ఈ పద్యానికి పోతన ఎన్నుకున్న వృత్తం శార్దూలం, వీర రసం సరిపోవడానికీ, భగవంతుడి గుణాలు అన్నీ గొప్పగా విశదీకరించడానికీను.

మరోలా చదివితే ఇది పోతన మనఃస్థితిని కూడా తెలియచెప్తుంది. రామభద్రుడు ధ్యానంలో కనిపించి భాగవతాన్ని తెనిగించమన్నాడు. “ఎందుకు, ఏమిటి, నేను చేయగలనా?” అనేవి అనవసరం. ఆయన చేయమన్నాడంటే ఆయనే చేయిస్తాడనే ధైర్యం, ఆ చేయించేది, భవబంధాలు తెగడానికి, అంటే ఈ జనన మరణ చట్రంలోంచి తప్పుకుని అఖండానందం స్వంతం చేసుకోవడానికి. దానికి తాను రాయడం మొదలుపెడుతున్నాడు. అందువల్ల మొదటి దళంలోనే చెప్తున్నాడు, ఈ రాయడం ఎందుకో “శ్రీ కైవల్య పదంబుఁ జేరుటకునై చింతించెదన్.” మిగతా దళాలు ఆ రాయమన్న భగవంతుడి గురించి.

భాగవతంలో పోతన చూపించిన కవితా పటిమ అనన్యసామాన్యం. ఏదో పండిత విద్వత్తుతో పోతన అనే మానవుడితో సహా ఎవరూరాయలేరు. భాగవతంలో పద్యాలు పోతన చెప్పుకున్నట్టూ, “పలికించెడువాడు రామభద్రుడట.” భాగవతం పుస్తకాలకి ముందుమాట రాస్తూ నండూరి కృష్ణమాచార్య గారు (తిరుమల తిరుపతి దేవస్థానం పుస్తక సంపాదకులు) చెప్పిన మాటలు ఇక్కడ గుర్తు చేసుకోవడం చాలా ఆనందకరమైన విషయం.

“పోతన కవితాపటిమ ఇంద్రజాల మహేంద్రజాలాలను మించి కవితాకళ ప్రయోగించగల భువన సమ్మోహనాస్త్రం. ఈ కవితాకళ ప్రయోగించే పోతన అక్షయ సమ్మోహానాస్త్ర తూణీరుడు.” ఈ సమ్మోహనాస్త్రం వల్లే, అక్షర జ్ఞానం లేకపోయినా తెలుగువాళ్లలో కొంతమంది పోతన పద్యాలు నోటికి కంఠతా పట్టి చెప్పగలరు. ద్రాక్షా, కదళీ, నారికేళాపాకంగా విభజించబడిన తెలుగు పద్యాలలో పోతనది అత్యంత సులువైన ద్రాక్షా పాకం. ఆ పద్యాలు చదువుతూంటే తీయని ద్రాక్షపండు నోట్లో వేసుకోగానే ఒళ్ళు పులకరించినట్టూ మనసు ఆనంద తరంగాలలో తేలుతుంది. పోతన తెలుగువాడిగా పుట్టి భాగవతం రచించడం, అది చదవడానికి మనకి కలిగిన అవకాశం మనందరం చేసుకున్న పూర్వజన్మ సుకృతం.

****సశేషం****

Posted in July 2021, వ్యాసాలు

1 Comment

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!